8, ఏప్రిల్ 2022, శుక్రవారం

స్టెత్ లెస్ డాక్టర్స్ – భండారు శ్రీనివాసరావు


పూర్వం వైద్యులు నాడి చూసి వైద్యం చేసేవారు. అదంతా పాత చింతకాయ తొక్క అంటారు కాబట్టి వదిలేద్దాము. తర్వాత కాలంలో డాక్టర్లు స్టెతస్కోప్ తో చూసి కానీ రోగనిర్ధారణ చేసేవాళ్ళు కాదు.
ఇప్పుడు కాలం మారింది. ప్రతి కార్పొరేట్ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు మెడలో స్టెతస్కోపులు వేసుకుని తిరుగుతూ కనిపిస్తారు. కానీ వాటిని వాడడం మాత్రం అరుదే అనిపిస్తుంది. రోగిని చూడడానికి ఇప్పుడు చేతిలో కలం కాగితం వుంటే చాలు. రోగి చెప్పేది పూర్తిగా వినకుండానే అరడజను టెస్టులు రాసి, వాటిని బయట కాకుండా ఆ ఆసుపత్రిలోనే చేయించి రిపోర్టులు పట్రమ్మని పంపేస్తుంటారు. రిపోర్టులు చూసి కాని వైద్యం మొదలు పెట్టరు. ఉత్ప్రేక్ష అనిపించవచ్చు కానీ చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఇది మామూలే. ఎన్ని పరీక్షలు రాస్తే యాజమాన్యం నుంచి అన్ని మంచి మార్కులు పడతాయేమో తెలియదు. ఎలాగూ డాక్టరు దగ్గరికి పోతున్నాము కదా మళ్ళీ టెక్స్టు చేయించమంటే ఇబ్బంది అనుకుని చేయించి తీసుకుపోతే వాటిని పట్టించుకోరు. మా ఆసుపత్రిలో చేయిస్తేనే మాకు నమ్మకం అంటారు. బయటకంటే అక్కడ డబుల్ ఛార్జీలు. అయినా తప్పేదేముంది. డాక్టర్ చెప్పిన తర్వాత తప్పుతుందా!
ఇలా మొదలైన దోపిడీ పేషెంటు స్థితిగతులను బట్టి కొనసాగుతుంది. ఇన్సూరెన్స్ వుంటే ట్రీట్ మెంట్ (చికిత్స కాదు, రోగిని కనుక్కునే పద్దతి) ఒక రకంగా లేని పక్షంలో మరో రకంగా. సరే! ఇదలా ఉంచుదాం.
చాలా ఏళ్ళ కిందట కోటీలో కాబోలు ఒక డాక్టరుగారు క్లినిక్ నడిపేవారు. ఆయన హస్తవాసి మంచిది. దాంతో రోగుల తాకిడి ఎక్కువ. ఆయన ఎంత మంచి డాక్టరో అంత కఠినుడు కూడా. ఆయన దగ్గర టైం అంటే టైం. ఆయన కూడా సమయ పాలన పాటించేవాడు. ఉదయం పది గంటలకు క్లినిక్ తెరిస్తే, అయన మాత్రం ఠంచనుగా ఓ పది నిమిషాలు ముందే వచ్చి కూర్చొనే వాడు. ఒక్కో రోగికి ఒక్కో టైము ఇచ్చేవాడు. ఇచ్చిన టైముకు రాని పేషెంటును మర్నాడు మరో టైం ఇచ్చి ఆ సమయానికి వేళ మించకుండా రమ్మని హెచ్చరించి పంపేవాడు. ఖచ్చితమైన సమయానికి వచ్చిన పేషెంటును మాత్రం ఏమాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా చెప్పిన టైముకు చూసేవాడు. ఆ రోజుల్లో కంప్యూటర్లు లేవు. కానీ ఏ రోగికి ఏ టైం ఇచ్చిందీ ఆయనకు కంఠోపాఠం. ఒక్క నిమిషం తేడా లేకుండా రోగిని చూసేవాడు. ఆయన దగ్గరకు పోవాలంటే కరెక్ట్ సమయం చూపే వాచీ పెట్టుకు పోవాలనే వారు. అంచేత రోగులు కూడా ఆయన చెప్పిన టైముకు వెళ్ళే వాళ్ళు, ముందే వెళ్లి వెయిట్ చేయాల్సిన పని లేకుండా.
ఇదంతా ఎందుకు అంటే గత రెండు రోజులుగా ఒక కార్పొరేట్ ఆసుపత్రి అనుభవం కారణంగా. అక్కడ మంచి వైద్యులకు కొరత లేదు. లేనిదల్లా సమయ పాలన.
ఆపరేషన్ అని చెప్పి, ఏమీ తినకుండా, తాగకుండా పొద్దున్న ఎనిమిదిన్నరకల్లా రమ్మంటారు. వెళ్ళిన తర్వాత ఏవో షుగర్, బీపీ పరీక్షలు చేసి ఆపరేషన్ దుస్తులు వేసి ఓ గదిలో కూచోమంటారు. వెంటవచ్చిన వాళ్ళు గంటలో అయిపోతుంది కదా అని క్యాంటీనులో కాలక్షేపం చేసి మళ్ళీ వెళ్లి కనుక్కుంటే ఆపరేషన్ చేయాల్సిన డాక్టరు రాలేదు ఇంకా కొంత టైం పడుతుందని జవాబు. మరో గంట గడుస్తుంది. మళ్ళీ వాకబు. డాక్టరు వచ్చారు కానీ ఎమర్జెన్సీ కేసు చేస్తున్నారు, రెండు గంటలు పట్టొచ్చు అని జవాబు. ఇలా గంటగంటకు ప్రశ్నలు జవాబులతో అయిదారు గంటలు గడుస్తాయి. ఏమీ తినకుండా పరగడుపునవచ్చాడు పేషెంటు అంటే వున్నది ఆసుపత్రిలోనే కదా భయం దేనికని అర్థంలేని ఊరడింపు.
ఇంత టెక్నాలజీ వచ్చింది. ఏ ఆపరేషనుకు ఎంత సమయం పడుతుందో తెలుసు, ఎంతమంది పేషెంట్లు వున్నారో తెలుసు, ఇంత తెలిసినప్పుడు అందర్నీ కట్టగట్టుకుని ఒకే టైముకు రమ్మని చెప్పడం ఎందుకు, గంటలు గంటలు తాత్సారం చేయడం ఎందుకు? పలానా పేషెంటు పలానా టైముకు వస్తే చాలని చెబితే, అనవసరంగా వేచి వుండే సమయం గణనీయంగా తగ్గిపోతుంది కదా! పైగా ఇదేమీ కొత్త విషయం కాదు. పాసు పోర్టు, వీసా కార్యాలయాల్లో ఇప్పటికే ఈ పద్దతి వుంది.
అన్నింటికంటే భయంకరమైన అనుభవం బిల్లు చెల్లింపు. డిశ్చార్జ్ కాగితం చేతిలో పడేసరికి దేవుళ్ళు దిగివస్తారు. అన్ని డిపార్ట్మెంట్ల నుంచి నో డ్యూస్ సర్టిఫికేట్ రావాలి. ఒక్క మీట నొక్కితే అన్ని వివరాలు కంప్యూటర్ స్క్రీన్ పై ప్రత్యక్షం అయ్యే ఈ రోజుల్లో అంతంత సమయం ఎందుకు తీసుకోవాలో అర్ధం కాదు.
ఈ పరిస్థితి ఏ ఒక్క ఆసుపత్రికో పరిమితం కాదు. అన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో ఇదే తంతు.
(08-04-2022)

కామెంట్‌లు లేవు: