(Published
in ANDHRA PRABHA on 05-04-2022, SUNDAY)
ఐ.ఏ.ఎస్. అధికారుల విషయంలో ఈ నడుమ పత్రికల్లో,
సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. స్వతంత్రం వచ్చిన కొత్తల్లో ఆనాటి
బ్రిటిష్ సాంప్రదాయిక పరిపాలనా పద్ధతులకు విభిన్నంగా ఒక స్వతంత్ర అధికారిక
వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనే సదుద్దేశంతో ఈ అఖిల భారత సర్వీసు అధికారుల
వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. బ్రిటిష్ పాలనలో కొనసాగిన ఐ.సి.ఎస్. వ్యవస్థ
స్థానంలో ఐ.ఏ.ఎస్. పరిపాలనా వ్యవస్థ రూపుదిద్దుకుంది.
ఇన్నేళ్ళ
అనుభవంలో ఇది ఏమైనా సత్ఫలితాలు ఇచ్చిందా లేక ఇతర వ్యవస్థల మాదిరిగానే అవసరమైన
సచ్ఛీలతను కోల్పోయిందా అనేది ఈ చర్చల సారాంశం.
కాలం గడుస్తున్న కొద్దీ మారుతున్న పరిణామాలకు
అనుగుణంగా వ్యవస్థల్లో మంచి చెడులలో కూడా స్థాయీ బేధం తప్పదు. ఐ.ఏ.ఎస్. అంటే అయాం
ఎట్ యువర్ సర్వీసు అనే అర్ధం కాస్తా మారిపోయి,
అయాం ఎట్ మై బాస్ సర్వీసు అనే పెడర్ధం వ్యాప్తి చెందుతోంది. ప్రభుత్వ
పెద్దలకు తగిన సమయంలో తగిన సలహాలు ఇచ్చి పరిపాలనను గాడిలో పెట్టాల్సిన ఐ.ఏ.ఎస్.
అధికారులే దోవ తప్పుతున్నారనే అపార్థాలు ప్రబలుతున్నాయి. బహిరంగ వేదికలపై రాజకీయ
పెద్దలకు పాదాభివందనాలు చేయడం, విదూషకులను మించి పొగడ్తలతో ముంచెత్తడం ఐ.ఏ.ఎస్.
అధికారుల స్థాయికి తగ్గ పని కాదని విమర్శకుల అభిప్రాయంగా తోస్తోంది. అయితే ఎవరో కొందరిని బూచిగా చూపెట్టి మొత్తం వ్యవస్థను
తప్పుపట్టడం కూడా మంచి పనికాదు.
ఈ నేపధ్యంలో కొందరు మంచి అధికారులను
సంస్మరించుకోవడం ఈ వ్యాసకర్త ఉద్దేశ్యం.
అనేక సంవత్సరాల
క్రితం రెవెన్యూ బోర్డు సభ్యుడు, సీనియర్ ఐ.ఏ.ఎస్.
అధికారి అనంత రామన్ ఖమ్మం దౌరాకు వచ్చారు. రెవెన్యూ బోర్డు సభ్యుడు అందులోను మొదటి
సభ్యుడు అంటే చీఫ్ సెక్రెటరీ తరువాత అంతటి హోదా కలిగిన ఆఫీసరు. ఆ రోజుల్లో ఉన్నతాధికారులు
కూడా రైళ్ళల్లోనే ప్రయాణాలు చేసేవాళ్ళు. అలాగే రైల్లో ఖమ్మం చేరుకున్న అనంత రామన్
ని జిల్లా కలెక్టర్ సయ్యద్ హషీం ఆలీ రిసీవ్ చేసుకుని దగ్గరలోని ప్రభుత్వ అతిధి
గృహం హిల్ బంగ్లాలో దిగబెట్టారు. మర్నాడు అధికారిక సమావేశాలు, సమీక్షలు
ముగించుకున్న తర్వాత అనంత రామన్ గుట్ట మీద నరసింహస్వామి గుడి చూడాలని వుందన్న కోరిక వెలిబుచ్చారు. కలెక్టరు జీపులో అనంత రామన్ గుడికి వెళ్లి పూజలు అవీ
ముగించుకుని వచ్చారు. హైదరాబాదు
రైలెక్కేముందు అనంత రామన్ కలెక్టర్ చేతిలో కొన్ని నోట్లు పెట్టి చెప్పారు.
‘మీరు జీపు
ఇచ్చినన్ను గుడికి పంపారు, సంతోషం. కానీ అది ప్రభుత్వ వాహనం. కాబట్టి ఈ డబ్బు ప్రభుత్వ ట్రెజరీలో జమ
చేయించండి’.
ప్రభుత్వ ధనం అంటే పాముగా పరిగణించే రోజులవి.
ఖమ్మం జిల్లా కలెక్టర్
ఆర్. పార్ధసారధి ఓ రోజు ఉదయం జీపు
తీసుకుని ఏదో ప్రాంతానికి టూరుకు వెళ్లి తిరిగి వస్తుంటే, రెబ్బవరం అనే గ్రామానికి
దగ్గరలో టైరు పంక్చర్ అయింది. పంక్చర్ వేయించడానికి డ్రైవర్ కొన్ని మైళ్ళ దూరంలో
వున్న మరో పెద్ద వూరికి వెళ్ళాడు. అతడు రావడానికి బాగా వ్యవధి వుంది. అటూ ఇటూ చూస్తున్న కలెక్టర్ దృష్టికి దగ్గరలో ఓ వూరు జాడ కనిపించింది. కొందరు ఆడవాళ్ళు
బిందెలు చంకన పెట్టుకుని వస్తూ కానవచ్చారు. ఆయన
వారిని పలకరించి, 'నీళ్ళ కోసం ఇంత దూరం ఎందుకు పడుతూ లేస్తూ వస్తున్నారు, మీ వూళ్ళో మంచి
నీటి బావి లేదా?' అని ప్రశ్నించారు. 'వూళ్ళో బావులకేం చాలా వున్నాయి, కానీ మమ్మల్ని
అక్కడ నీళ్ళు తోడుకోనివ్వరు' అని బదులు
చెప్పారు. కలెక్టర్ సాలోచనగా తలపంకించి ఊరుకున్నారు. ఈలోగా టైరు పంక్చర్
వేయించుకుని డ్రైవర్ తిరిగివచ్చాడు.
కలెక్టర్ తన మానాన తాను పొతే కధే లేదు. ఏం చేయాలో వెంటనే ఆలోచించి పెట్టుకున్నారు.
డ్రైవర్ ని నేరుగా జిల్లా కేంద్రానికి పంపించి తాను రోడ్డు పక్కన ఓ మోరీ మీద కూర్చుండిపోయారు. ఈలోగా ఆయన మౌఖిక
ఆదేశాలు అందుకున్న కలెక్టర్ సిబ్బంది, స్థానిక తాసిల్దారు
టైప్ రైటర్లు, కలెక్టర్ అధికారిక
ముద్రిక తదితరాలతో సహా అక్కడికి వచ్చారు. ఊళ్ళోకి కబురు పంపి సర్పంచుని
రప్పించారు. ఈ హడావిడి అంతా చూసి ఊరిజనం అంతా అక్కడ పోగయ్యారు. వూరి వెలుపల నుంచి
మంచి నీళ్ళు తెచ్చుకునే వారికి వారి గూడెంలోనే ఒక మంచి నీటి బావి మంజూరు చేయాలని
కోరుతూ సర్పంచు నుంచి ఓ
అభ్యర్ధన పత్రం తీసుకున్నారు. దానికి అక్కడికక్కడే స్థానిక అధికారి నుంచి ఆమోద
ముద్ర వేయించారు. తనకున్న విశేష అధికారాలను ఉపయోగించుకుంటూ అందుకు అవసరమైన నిధులను
తక్షణమే మంజూరు చేస్తూ ఆ మోరీ మీదనే కూర్చుని సంతకం
చేసి, కింద స్టాంపు వేసారు. ఆ వెనువెంటనే కూలీలను పిలిపించారు. బావి తవ్వకానికి ఆయనే స్వయంగా గడ్డపారతో మొదటి పలుగు
వేసి స్వీకారం చుట్టారు. ఝాము పొద్దెక్కక ముందే ఝామ్మని బావి పని మొదలయింది.
అంతకుముందు ఆ ఊరిజనం ఇలాటి అధికారిని చూడలేదు సరికదా కనీసం వినికూడా వుండలేదు.
అందుకే అందరి మొహాల్లో నిండుకున్న నిబిడాశ్చర్యం. ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో
వారి వూరిలో ఓ అభివృద్ధి కార్యక్రమానికి శుభారంభం జరిగింది. పొద్దుగూకే సమయానికి
బావిలో సమృద్ధిగా జలపడింది. ఆ వూరి గూడెం జనానికి కొత్త పొద్దు పొడిచింది.
“నేను ఏది చెబితే అదే జీవో” అనే వారు 1978 లో తొలిసారి ముఖ్యమంత్రి అయిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి.
ఆయన వ్యవహారశైలి విలక్షణంగా వుండేది.
తను అనుకున్నది నిమిషాలమీద కాదు క్షణాలలో జరిగిపోవాలని పట్టుబట్టేవారు.
చెప్పినవెంటనే జరిగిపోవాలనే ఆయన నైజం
నిఖార్సయిన అధికారులకు ఒక పట్టాన మింగుడు పడేదికాదు.
సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి ఎస్. ఆర్.
రామ్మూర్తి ముఖ్యమంత్రి పేషీలో వుండేవారు.
ఆయనకేమో అంతా రూలు ప్రకారం నడవాలి. రూలు పేరెత్తితే రూళ్లకర్ర పట్టుకుని హుంకరించే
తత్వం చెన్నారెడ్డిది. ‘ఎవరయ్యా ఈ రూల్స్ పెట్టింది. మనం
పెట్టుకున్నవేగా, మార్చుకుంటే పోలా!’ అనే వారు.
‘అలా మార్చుకున్నప్పుడు మాకేమిటి అభ్యంతరం? కానీ, అప్పటిదాకా, ఇప్పుడున్న రూలే మాకు రూలు’
అన్నది రామ్మూర్తి గారి రూలు.
ఏమయితేనేం, కొన్నాళ్ళకి రామ్మూర్తి గారే సర్దుకున్నారు. అంటే రూల్స్ తో
సమాధాన పడ్డారని కాదు. అప్పటికి సరే అని, సంబంధిత ఫైలు మళ్లీ సీ ఏం పేషీకి వచ్చినప్పుడు నెమ్మదిగా
చెబితే సేఎమ్ వింటారులే అని ఒక
మధ్యేమార్గం కనుక్కున్నారు. అప్పటినినుంచి చెన్నారెడ్డి ఏదయినా అడగ్గానే రామ్మూర్తి వెంటనే ‘యస్ సర్’ (తప్పకుండా చేద్దాం సర్) అనేవారు. ఆ ఒక్క మాటతో
చెన్నారెడ్డి ఖుష్. ఫైల్ మళ్లీ పేషీకి
వచ్చిన తరవాత సీ ఏం గారికి చూపించేటప్పుడు మాత్రం రూలు ప్రకారం ఆ పని చేయడం ఎలా
కుదరదో వివరంగా చెప్పి, ‘నో సర్’ (కుదరదు సర్
) అనేవారు. ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో ఆ ఆనుపానులన్నీ తెలిసిన చెన్నారెడ్డి కూడా కిమ్మనకుండా
తలపంకించి వూరుకునేవారు.
ఇదంతా
తెలిసిన వారు, ఆయన ఇంటి పేరు ‘యస్ ఆర్’ తో ముడిపెట్టి, ‘ఫైలు రాకముందు యస్ సర్ రామ్మూర్తి, వచ్చిన తరవాత నో సర్
రామ్మూర్తి’ అని సరదాగా అనుకునే వారు.
సయ్యద్ హషీం ఆలీ ఖమ్మం జిల్లా కలెక్టర్ గా
పనిచేశారు.
ఆ రోజుల్లో ఖమ్మం కలెక్టర్ ఆఫీసు ట్రంకు రోడ్డులో
వుండేది. చాలా చిన్న భవంతి. మెట్లు ఎక్కగానే ఎదురుగా స్వింగ్ డోర్. దాని వెనుక ఒక
నీలంగుడ్డ పరచిన మేజా బల్ల. వెనుక కుర్చీలో కలెక్టర్. అదీ పరిస్తితి. అటాచ్డ్ బాత్
రూమ్ కూడా వుండేది కాదు. వెనక పెరట్లో ఎక్కడో దూరంగా వుండేది.
ఓ రోజు కలెక్టర్ ని కలవడానికి భద్రాచలం దగ్గర ఓ
పల్లెటూరు నుంచి ఓ రైతు వచ్చాడు. గుమ్మం ముందు హమేషా వుండే డవాలా బంట్రోతు ఆ
సమయంలో ఏదో పనిమీద వెళ్ళాడు. లోపల కలెక్టర్ గారు బాత్రూంకు పోవడానికి లేచి పెరటి
ద్వారం వైపు వెడుతున్నారు. సరిగ్గా ఆ టైంలో రైతు స్వింగ్ డోర్ తెరుచుకుని
‘కలెక్టర్ దొరగారెక్కడ?’ అని అడిగాడు. తాను అడుగుతున్నది సాక్షాత్తు కలెక్టర్ నే
అని అతడికి తెలియదు. హషీం ఆలీగారు ఏమాత్రం నొచ్చుకోకుండా, అతడిని కూర్చోబెట్టి
విషయం తెలుసుకుని సమస్యను పరిష్కరించే విషయంలో తన కింది సిబ్బందికి తగు సూచనలు
ఇచ్చి పంపేశారు.
సురేష్
చందా అనే ఓ ఐ.ఏ.ఎస్. అధికారి తెలంగాణా సచివాలయంలో ఒక ఉన్నత స్థానంలో పని చేసేవారు.
రాష్ట్రం మొత్తంలో ఆరోగ్య, వైద్య
సేవలు ఆయా ప్రభుత్వ ఆసుపత్రులలో ఎలా అందుతున్నాయో పర్యవేక్షించే బాధ్యత ఆయనది.
యువకుడు కావడం వల్ల కంప్యూటర్ పరిజ్ఞానం హెచ్చుగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. అంచేత తన
శాఖ పని తీరు మెరుగుపరుచుకోవడానికి ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవాలని
భావించి, తెలంగాణాలో
పేరొందిన గాంధి ఆసుపత్రితో మొదలు పెట్టి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని
అనుకున్నారు. గాంధీ ఆసుపత్రిలో ఏమూల ఏం జరుగుతున్నదో సచివాలయంలోని తన చాంబర్ నుంచే
కనిపెట్టి చూసే ఉద్దేశ్యంతో ఆ ఆసుపత్రిలో సుమారు రెండువందల నిఘా కెమెరాలను
అమర్చాలని తలపెట్టారు. కిందవాళ్ళు చేసే పనులను కనిపెట్టి చూడడం ఆయన బాధ్యతల్లో
ఒకటి. కానీ, తాను
ఎలా పనిచేస్తున్నది కూడా నలుగురికీ తెలియాలి కదా! అందుకని ఈ ప్రయోగాన్ని ఆయన
తనతోనే ప్రారంభించారు. చడీచప్పుడూ కాకుండా తన కార్యాలయంలో ఒక నిఘా కెమెరాను
ఏర్పాటు చేసుకున్నారు. తన గదిలో ఏం జరిగేది, తనను
కలుసుకోవడానికి ఎవరెవరు వచ్చేది, ఏం
మాట్లాడేది రికార్డు చేయడం కోసం ఈ కెమెరా. అయితే ఈ కెమెరా రికార్డు చేసేది తను
ఒక్కరే కాకుండా ఎవరయినా సరే చూడగలిగేలా ఇంటర్నెట్ తో దాన్ని అనుసంధానం చేయడం ఇందులోని ఒక ప్రత్యేకత.
వ్యవస్థకు
చీడలు పట్టకుండా చూడడానికి ఇలాంటి అధికారులు,, సంఖ్య స్వల్పమే అయినా ఇంకా
మరికొందరు వున్నారు. అదే ఊరట.
3 కామెంట్‌లు:
ఖమ్మం జిల్లా కలెక్టర్ గా పనిచేసిన శ్రీపార్దసారధి గారు ప్రభాత్ టాకీస్ కు మారువేషంలో వెళ్లి,అక్కడ మూత్రశాలలు,సీట్లు తదితర సౌకర్యాలు సరిగాలేవని గమనించారు. ఆ సదుపాయాలు,సౌకర్యాలు ఏర్పాటు చేసే వరకు ప్రదర్శనలను నిలిపివేయాలంటూ ఉత్తర్వులు ఇచ్చారు.అప్పట్లో ఈ విషయం జిల్లాలో పెద్ద చర్చనీయాంశం.అదేవిధంగా ఆయనమీద గౌరవంతో సారధినగర్ ఏర్పాటు చేసుకున్నారు. మామిళ్ళగూడెంకు, సారదినగర్ కు మధ్య రైల్వే లైన్ వుంటుంది. ఖమ్మం జిల్లాకు వచ్చిన మరో గొప్ప కలెక్టర్ P.V.R.K. ప్రసాద్ గారు.వారు కూడా ఎన్నో మంచి పనులు చేసి జిల్లా అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు.మరొక గొప్ప కలెక్టర్ లక్ష్మీ భాస్కర్ గారు.ఇలా ఖమ్మం జిల్లాకు అనేక మంది కలెక్టర్ లు వచ్చి జిల్లా అభివృద్ధికి ఎంతగానో కృషి చేసి,జిల్లా ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.
అప్పుడక్కడ "భీంలానాయక్" ఆడట్లేదనుకుంటా.
>>అప్పుడక్కడ "భీంలానాయక్" ఆడట్లేదనుకుంటా
LOL
కామెంట్‌ను పోస్ట్ చేయండి