13, ఏప్రిల్ 2022, బుధవారం

మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారి ఫోటో చూశారా? – భండారు శ్రీనివాసరావు

 

రెండేళ్ల క్రితం కాబోలు ఆయన అమెరికా నుంచి ఫోన్ చేశారు. అంత గొప్ప రచయిత తనకు తానుగా నాకు ఫోన్ చేయడం ఎంతో సంతోషం అనిపించింది. అయితే ఆ ఆనందం క్షణాల్లోనే ఆవిరై పోయింది.
“శ్రీనివాసరావు గారు మీరు చేసిన పని నాకు ఏమాత్రం బాగాలేదు. వెంటనే మీ బ్లాగు నుంచి నా ఫోటో తీసెయ్యండి”
మృదువుగా చెప్పినా ఆయన పలుకుల్లో దాగున్న కాఠిన్యం, తీవ్రత అర్ధం అవుతూనే వుంది.
“తప్పకుండా! యిప్పుడే మీ ఫోటో తీసేస్తాను” అన్నాను ఏం చెయ్యాలో, ఏం చెప్పాలో తెలియక.
అన్నట్టుగానే ఫోటో తొలగించాను. ఆ సంగతి ఎస్సెమ్మస్ ద్వారా ఎరుకపరిచాను. అంతే కాదు, ఆ విషయం ఫేస్ బుక్/ బ్లాగ్ మితృలకు కూడా తెలియచేశాను.
“మల్లాది వేంకట కృష్ణమూర్తి గారు ఇప్పుడే ఫోన్ చేసి తన ఫొటో తీసేయమని చాలా మృదువుగా రిక్వెస్ట్ చేశారు. అందుచేత ఆ పోస్టును, వారి ఫొటోను తీసేస్తున్నాను. వారి మనోభావాలను గౌరవించడం నా విధి. అలాగే ఇప్పటికే ఈ ఫొటోను, పోస్టును షేర్ చేసినవారు ఎవరైనా వుంటే దయచేసి వాటిని తొలగించి మీ అభిమాన రచయిత మనసు గాయపడకుండా చూడండి” అని కూడా విజ్ఞప్తి చేశాను.
రచయితగా ఆయన నాకు కొత్త కాదు. కానీ ఫోటో ఎక్కడా కనబడకూడదు అనే ఈ తరహానే నాకు కొత్తగానూ, వింతగాను అనిపించింది. మేము ఇద్దరం చదువుకున్న ఎస్సారార్ కాలేజి గ్రూపు ఫోటోలో కూడా ఆయన ఫోటో లేదు.
లెక్కలేనన్ని కధలు, నవలలు రాసిన మల్లాది, ఇప్పుడు ఆ వ్యాపకానికి దూరంగా ఆధ్యాత్మికతకు దగ్గరగా జీవితం సాగిస్తున్న సంగతి నాకు తెలుసు. కానీ తన ఫోటో ఎక్కడా ప్రచురించ కూడదు అని తనకు తానుగా తీసుకున్న నిర్ణయానికి, గీసుకున్న గిరికి ఇన్ని దశాబ్దాలుగా కట్టుబడి వుండడం అపూర్వం. ప్రసిద్ధ రచయితల ఫోటోలు పత్రికల్లో, వాళ్ళ పుస్తకాల కవర్ పేజీల్లో అందరం చూస్తూనే ఉంటాము. కానీ మల్లాది ఫోటో చూసిన వారు అరుదు. ప్రచురించిన వారు లేనేలేరు. ఎందుకంటే ఫోటోగ్రాఫర్లకు ఆయన చేసే విజ్ఞప్తి ఇదొక్కటే, దయచేసి నా ఫోటో మీ పత్రికలో వేయకండి అని.
మొన్న వాట్సప్ లో మల్లాది నాకో యు ట్యూబ్ వీడియో పంపించారు. అందులో ఈ ఫోటో కధ వుంది. ఆ విశేషాలు అన్నీ ఆయనే స్వయంగా చెప్పారు.
కింద ఆ వీడియో లింక్ ఇస్తున్నాను. ఇచ్చే ముందు ఆయన్ని అడిగాను దీన్ని గురించి రాయవచ్చా అని. సరే అన్న తర్వాతే ఈ పోస్టు.
(13-04-2022)
LINK:




3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ప్రసిధ్ధ రచయిత మల్లాది వేంకట కృష్ణమూర్తి గారికి తమ ఛాయాచిత్రాన్ని ఎక్కడా ప్రచురించకూడదని కోరిక. అయన ఆనియమాన్ని ఇంతవరకూ చక్కగా అనుసరించారు. అయన యిష్టం అది. అందులో జనం చర్చించుకోవలసినది కాని అసలు ఆసక్తి చూపవలసినది కాని ఏమీ లేదనే నా ఉద్దేశం. సుదీర్ఘమైన వీడియో ఒకటి ఆయన ఈవిషయంపైన చేసి వినిపించారు. వివటం వలన ప్రత్యేకమైన ప్రయోజనం ఏమీ లేదు. వినకపోయినా ఇబ్బందీ లేదు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

మల్లాది గారి స్పందన (వాట్సప్ ద్వారా)

🙏🏻🙏🏻🙏🏻
I do hope, Bhandaru garu, I didn’t hurt you. If I inadvertently did, I apologize.
I have been enjoying ur column. I enjoy it only when I read it on paper. When I travel abroad they wait for me back home.
Thanks for posting them here.
Mallaadi
NOTE:
(ఒక మంచి రచయిత నుంచి నాకు దొరికిన మంచి కితాబు)

నీహారిక చెప్పారు...

మీరు ఆయన ఫోటో ప్రచురించినపుడు నేను చూసాను. కానీ మీరు వెంటనే డిలీట్ చేశారు. ఇపుడు మీరు ఇచ్చిన వీడియో ని రాత్రి ఓపిక చేసుకుని (వీడియో షార్ట్స్ అలవాటు అయ్యాయి మరి) చూసాక నాకు ఒక విషయం బోధపడింది. మల్లాది వారి నానమ్మ(అమ్మ) ఎవరో గానీ లావుగా ఉండటం వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ప్రభావం మల్లాది వారి మీద పడింది.బాహ్య సౌందర్యం కంటే అంత:సౌందర్యం ముఖ్యం అని చెప్పదలుచుకున్నారనుకుంటున్నాను.

అయితే ఫలానా రచయత/త్రి ఎలా ఉంటారు చూడాలని చాలా మంది అడుగుతుంటారు. జిలేబి గారు, పద్మార్పిత గారు ఎవరికీ తెలియదు. వారి రచనలు ఉన్నంతవరకు వారు చిరాయువులే !

ఫోటో ఇవ్వవలసి వస్తుందన్న కారణంతో కథల పోటీలో పాల్గొనలేదు అన్నారు. జ్ఞాన్ పీఠ్ అవార్డు వస్తే ఏం చేసేవారో మరి 🤔