19, అక్టోబర్ 2021, మంగళవారం

రేడియో ప్రాంగణంలో సమాధి చేయాలి – రావూరి భరధ్వాజ కడపటి కోరిక

 

జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ గారి రెండో వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాల్ని మననం చేసుకుంటూ రాసిన దానికి ఇది జోడింపు." భరద్వాజ గారికి జ్ఞానపీఠ అవార్డు ప్రకటించినప్పుడు ప్రముఖ జర్నలిష్టు రెంటాల జయదేవ్ గారు ఆయన్ని ఇంటర్వ్యూ చేసారు. అది ప్రజాశక్తిలో వచ్చింది. మనసు ఆర్ద్రం అయ్యే ఒక జవాబు చెప్పారు అందులో భరద్వాజ గారు. నేను రేడియో మనిషిని కనుక దాన్ని అందరితో పంచుకోవాలని సహజంగా అనిపించింది. అదే ఇది.



(రావూరి భరధ్వాజ)


"ఆకాశవాణిలో ఉద్యోగానికి మీ జీవితంలో ఎలాంటి పాత్ర ఉంది? రెంటాల గారి ప్రశ్న. భరద్వాజ గారు ఉద్వేగానికి గురవుతూ ఇచ్చిన సమాధానం : "కడుపు నిండా తినడానికి పట్టెడన్నం కోసం కష్టపడిన రోజులు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి నేను, నా భార్య, నా బిడ్డలు కడుపు నిండా ఇంత తినడానికి జీతభత్యాలతో కూడిన ఉద్యోగమిచ్చిన సంస్థ – ఆకాశవాణి. అప్పట్లో 185 రూపాయల జీతమంటే చాలా ఎక్కువ. హైదరాబాద్‌ ఆకాశవాణిలో నాకు ఉద్యోగం రావడానికి కారణమైన రచయిత త్రిపురనేని గోపీచంద్‌ను మర్చిపోలేను. నాకు ఎన్నో పుస్తకాలు చదువుకొనే అవకాశం, ఆలోచించే తీరిక, రాసే అవకాశకం ఇచ్చింది ఆకాశవాణే. నాకున్న పరిధిని విస్తృతీకరించిన మహౌన్నత కళాసంస్థ అది. ఆ జీవితాన్ని నేను ఎన్నడూ మర్చిపోలేను. (గొంతు గద్గదికం అవుతుండగా…) నాకు ఒకే ఒక్క కోరిక ఉంది. అది తీరుతుందో, లేదో కానీ… నేను చనిపోయాక, నా పార్థివ శరీరాన్ని ఆకాశవాణి ప్రాంగణంలో భూస్థాపితం చేయాలి. ఆకాశవాణిలోకి వచ్చే కళాకారులు, సాహితీవేత్తలందరూ దాని మీద నుంచే నడుచుకుంటూ పోవాలి. అవకాశం ఉంటే, వచ్చే జన్మలో ఆకాశవాణిలో ఓ చిన్న గరికపోచగా పుట్టాలని కోరిక!" (రెంటాల గారికి కృతజ్ఞతలు)

 

3 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

చివరకు ఏమైంది? రావూరి వారి కోర్కెను తీర్చారా “ఆకాశవాణి” వారు?
అయినా అదేం కోరికండీ తను ఉద్యోగం చేసిన సంస్ధను ఎంతగా అభిమానిస్తే మాత్రం 😳!

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@విన్నకోట నరసింహా రావు గారు : తన మాతృ సంస్తపట్ల భరద్వాజ గారికి వున్న ప్రగాఢమైన మమకారానికి అదొక అభివ్యక్తి మాత్రమే. అది ప్రాక్టికల్ గా సాధ్యమయ్యే పని కాదని వారికీ తెలుసు.

అజ్ఞాత చెప్పారు...

రావూరి భరద్వాజ ఒక ప్రశ్నోత్తరాల కార్యక్రమం విన్నాను. ఎందుకో మాటిమాటికీ ఉద్వేగం చెందుతున్నాడు. సెల్ఫ్ పిటీ, అటాచ్మెంట్ ఎక్కువ అనిపించింది. ఎంతో అనుభవం కలిగిన రచయిత అంత అటాచ్ మెంట్ తో ఉండటం ఆశ్చర్యం గా అనిపిస్తుంది.