11, అక్టోబర్ 2021, సోమవారం

గుడ్డుగారికో రోజు - భండారు శ్రీనివాసరావు

 ఏ దేశమేగినా, ఎందుకాలిడినా పాలూ, నీళ్ళతో పాటు తప్పకుండా దొరికేది మరోటివుంది. అదే కోడి గుడ్డు.

అక్టోబర్ నెలలో రెండో శుక్రవారం అంతర్జాతీయ కోడిగుడ్డు దినం అంటున్నారు.
1975 వరకు ఎగ్గూ పెగ్గూ రెండూ మా ఇంటావంటా లేవు. వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా రెండోది ముందుగా వచ్చి చాలా కుటుంబాలలో తిష్ట వేసింది. మొదట్లో నిరసన ధ్వనులు వినపడ్డా మొత్తం మీద దానికి పసుపు నీళ్ళు చల్లి ఇళ్ళల్లోకి రానిచ్చారు. దాంతో పాటే మొదటిది కూడా తగుదునమ్మా అని గృహప్రవేశం చేసి ఓటరు కార్డు, ఆధార్ కార్డు లేకుండానే ఇంట్లో సభ్యురాలు అయిపోయింది. మంచి ఎండాకాలంలో కూడా చలి దుప్పటి కప్పుకుని ఫ్రిజ్ లో పడుకునేది ఆ కోడిగుడ్డే. మేము తిన్నా తినకపోయినా, ఇంటికి వచ్చిన నాన్ వెజ్ ఫ్రెండ్స్ ఎవరికయినా అవసరం పడుతుందో ఏమో అని మా ఆవిడ ముందు జాగ్రత్తగా వాటిని కొని ఫ్రిజ్ లో దాచి వుంచేది.
ఎప్పుడో మా చిన్నప్పుడు మా చుట్టాల అమ్మాయికి టైఫాయిడ్ వచ్చి నిమ్మలించిన తర్వాత త్వరగా కోలుకోవడానికి డాక్టర్ ఉడక పెట్టిన కోడి గుడ్డు రోజూ ఒకటి తినమన్నారు. అసలే నిప్పులు కడిగే ఆచారం. గుడ్డు తినమనగానే ఇంట్లో వాళ్లకి నిలువు గుడ్లు పడడం చూసిన డాక్టరు గారు, పేషెంటు ముక్కూ, కళ్ళూ మూసి, నోరు తెరిపించి పటేల్ మని గుడ్డు పగల గొట్టి తటాలున నోట్లో పోసి మింగించాడు. అటువంటి భీకర భీభత్స దృశ్యాలు చూసిన తరువాతే వ్యాధి కంటే చికిత్స ప్రమాదకరం అనే సామెత పుట్టి వుండాలి.
అసలు కోడి గుడ్డు అనగానే గుర్తుకు రావాల్సిన వ్యక్తి ఒకరు వున్నారు. ఆయనే బీ.వీ. రావు (బి.వాసుదేవరావు, ఇప్పుడు లేరనుకోండి). తెలంగాణాకు చెందిన ఈ పెద్దమనిషి వెంకటేశ్వరా హేచరీస్ అనే పరిశ్రమను స్థాపించి కోడిగుడ్డుకు ఎనలేని ప్రాముఖ్యాన్ని కట్టబెట్టారు. మేము మాస్కోలో ఉన్నరోజుల్లో నాటి ప్రభుత్వ అతిథి హోదాలో ఆయన రష్యా వచ్చారు. ఓరోజు మా ఇంటికి వచ్చి మా ఆవిడ చేతి భోజనం చేసి వెళ్ళారు. తర్వాత మేము ఇండియాకు తిరిగి వచ్చిన తరవాత కూడా గుర్తు పెట్టుకుని మా పిల్లలు ఇద్దర్నీ పూనాలో వున్న తమ స్టడ్ ఫాం కు తీసుకువెళ్ళారు. అదో సంగతి.
ఏది ఏమైనా పిడికెట్లో నాలుగోవంతు లేని కోడిగుడ్డుకు అంతర్జాతీయ ఖ్యాతి వచ్చి, దాని పేరిట ఒక దినం ఏర్పాటు కావడం, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని గుడ్డు ప్రాముఖ్యతను ప్రస్తుతిస్తూ రేడియో ప్రసంగాలు, టీవీ కార్యక్రమాలు జరగడం కోడిగుడ్డు చేసుకున్న పూర్వజన్మ సుకృతం.
గుడ్డుగా వున్నప్పుడూ, గుడ్డు నుంచి కోడిగా మారిన కొత్త అవతారంలో కూడా మానవులకు ఆహారంగా సేవలందిస్తూ త్యాగంలో బలి, శిబి చక్రవర్తులను మించిన ఆ త్యాగశీలికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం, ఆమ్లెట్ గా వేసుకుని నోరారా తినడం తప్ప అంటారు కొందరు ఎగ్గేరియన్లు.



NOTE: Courtesy Image Owner

1 కామెంట్‌:

Unknown చెప్పారు...

మేము మీ అవిడలాగే వెజ్. ఇది చదివిన తరువాత కామెంట్ పోస్ట్ చేయలేకుండా ఉండలేకపోయాను. నీ రచనలు అక్షరసత్యాలు వాటి విలువ అక్షరలక్షలు. ఇలాగే రాస్తూ ఉండాలని చదివే అదృష్టం అందరికి ఉండాలని. Dr కట్టా రామమోహన్