నిరుడు
నవంబరు ఎనిమిదో తేదీన ప్రధానమంత్రి మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అత్యంత
నాటకీయంగా ప్రకటించారు. నిర్ణయం జరిగి ఏడాది కాలం గడిచి పోతున్న తరుణంలో కూడా ఈ
నిర్ణయం మంచి చెడులను గురించి దేశ వ్యాప్త చర్చలు జరుగుతూ వుండడం విశేషం.
పెద్ద
నోట్ల రద్దు దరిమిలా, ‘సూటిగా...సుతిమెత్తగా....’ అనే శీర్షికతో నేను మొదటి రెండు నెలల్లోనే సుమారు పది వ్యాసాలు
రాసి ప్రచురించాను. వాటిని ఒకపరి సింహావలోకనం చేసుకోవడమే ఈ రచన పరమార్ధం.
మోడీ ప్రయోగించిన బ్రహ్మ శిరోనామకాస్త్రం (13-11-2016)
1978 వ సంవత్సరం. జనవరి నెల. 14 వ తేదీ ఉదయం.
ముంబై (అప్పుడు బొంబాయి) లో వున్న
రిజర్వ్ బ్యాంకు చీఫ్ అక్కౌంట్స్ కార్యాలయంలో సీనియర్ అధికారి ఆర్. జానకి
రామన్ ఇంట్లో ఫోను మోగింది. వెంటనే ఢిల్లీ రావలసిందని ఒక ప్రభుత్వ అధికారి ఆదేశం.
జానకి రామన్ బొంబాయి నుంచి బయలుదేరి
ఢిల్లీ వెళ్ళీ వెళ్ళగానే అక్కడి ఉన్నతాధికారులు ఒక ఆర్డినెన్స్ ముసాయిదాను ఒకే ఒక్క రోజులో తయారు
చేయాలని ఆయన్ని కోరారు. పెద్ద విలువకలిగిన కరెన్సీ నోట్లని చెలామణి నుంచి
తప్పించాలని ప్రభుత్వం సంకల్పించిందని, అందుకు తగిన ఆర్డినెన్స్ సిద్ధం
చేయాలని, ఇదంతా చాలా
గోప్యంగా జరగాలని రామన్ ను ఆదేశించారు.
ఇప్పట్లా ఆరోజుల్లో సెల్ ఫోన్ వంటి
కమ్యూనికేషన్ సదుపాయాలు లేవు. అయినా ఆర్బీఐ కేంద్ర కార్యాలయం నుంచి ఎటువంటి
సమాచారం బయటకి పొక్కకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
అనుకున్న పద్దతిలోనే ఆర్డినెన్స్
ముసాయిదా తయారయింది. జనవరి 16 తెల్లవారుఝాముకల్లా రాష్ట్రపతి
నీలం సంజీవరెడ్డి సంతకం కోసం పంపారు. అదే రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆకాశవాణి
ద్వారా పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ
ప్రజలకు తెలిసిపోయింది. ముందు జాగ్రత్తగా జనవరి
పదిహేడునాడు దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకులు, ప్రభుత్వ ట్రెజరీలు మూసివేశారు.
అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఐ.జీ. పటేల్ కు ఈ
పెద్ద నోట్ల రద్దు వ్యవహారం నచ్చలేదు. సంకీర్ణ జనతా ప్రభుత్వంలోని కొందరు నాయకులు
పెద్ద నోట్ల రద్దుకు పట్టుబట్టడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం
తీసుకోవాల్సివచ్చిందన్నది ఆయన అభిప్రాయం. అంతకు పూర్వం దేశాన్ని పాలించిన నాయకుల
అవినీతి పనులను లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుందని పటేల్
చెప్పారు.
భారతీయ ఆర్ధిక విధానాలు అనే అంశంపై
పటేల్ రాసిన పుస్తకంలో ఇంకా ఇలా పేర్కొన్నారు.
“పెద్ద విలువ కలిగిన కరెన్సీ
నోట్లను రద్దు చేయాలనే నిర్ణయం గురించి ఆర్ధిక మంత్రి హెచ్.ఎం.పటేల్ నాతొ
ప్రస్తావించారు. అటువంటి సంచలన నిర్ణయాలతో అద్భుత ఫలితాలు రాబట్టడం చాలా అరుదుగా
జరుగుతుందని నేను మంత్రితో స్పష్టంగా చెప్పాను.
“సాధారణంగా అవినీతి, అక్రమ పద్ధతుల్లో భారీఎత్తున డబ్బు పోగేసుకునేవాళ్ళలో
అత్యధికులు ఆ సంపదను కరెన్సీ రూపంలో ఎక్కువ కాలం దాచిపెట్టుకోరు” అన్నది నాటి రిజర్వ్ బ్యాంక్
గవర్నర్ పటేల్ అభిప్రాయం.
“నల్ల డబ్బును సూట్ కేసుల్లో, దిండ్ల కవర్లలో కుక్కి దాస్తారని
అనుకోవడం అజ్ఞానమే అవుతుంది” అని కూడా పటేల్ మహాశయులు అభిప్రాయపడ్డారు.
ఇది జరిగి 38 ఏళ్ళు
అవుతోంది.
నాడు 1978లో
ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ శకం ముగిసిన తరువాత ప్రజల తీర్పుతో కేంద్రంలో
అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి కాంగ్రెసేతర జనత ప్రభుత్వం వెయ్యి, అయిదు
వేలు, పదివేల రూపాయల నోట్లను రద్దు చేయాలని సంకల్పించి, ఆ
నిర్ణయాన్ని వెంటనే అమలు చేసింది. అప్పుడు జనత ప్రభుత్వానికి నేతృత్వం వహించింది
గుజరాత్ కు చెందిన మొరార్జీ దేశాయ్. మళ్ళీ ఇన్నాళ్ళ
తరువాత అయిదువందలు, వెయ్యి రూపాయల కరెన్సీ నోట్లని రద్దు చేయాలని నిర్ణయించింది కూడా
అదే రాష్ట్రానికి చెందిన నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇది కాకతాళీయం కావచ్చు.
అలాగే ఈ రెండు నిర్ణయాలు కాంగ్రెసేతర ప్రభుత్వాలు కేంద్రంలో కొలువు తీరి
వున్నప్పుడు తీసుకోవడం కొట్టవచ్చినట్టు కానవచ్చే మరో పోలిక.
కాకపొతే అప్పటికన్నా
ఈసారి మోడీ ప్రభుత్వం గోప్యతను మరింత
పకడ్బందీగా పాటించినట్టు కనబడుతుంది.
గత మంగళవారం
సాయంత్రం ఢిల్లీలో కేంద్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. అంతకు ముందు
ప్రధాని త్రివిధ సైనిక దళాల అధిపతులతో సమావేశం అయ్యారు. సరిహద్దుల్లో ఇప్పటికే
యుద్ధ వాతావరణం ఏర్పడి వుండడం చేత ప్రధాని అనుకు సంబంధించి ఏదో కీలక నిర్ణయం
తీసుకోబోతున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. క్యాబినెట్ ఎజెండాలో ఈ
నిర్ణయానికి సంబంధించి కానీ, సరిహద్దులలో తీవ్రత
గురించిన అంశం కానీ ఏదీ
లేదు. సమావేశం ముగిసే సమయంలో ప్రధానమంత్రి మోడీ పెద్ద నోట్ల చెలామణి రద్దు
నిర్ణయాన్ని క్లుప్తంగా తెలియచేసి మంత్రులనందరినీ సమావేశ మందిరంలోనే కూర్చోబెట్టి
ప్రభుత్వ సంకల్పాన్ని రాష్ట్రపతికి తెలియచేడానికి
వెళ్ళారు. ఆ తరువాత నేరుగా దేశ ప్రజల నుద్దేశించి రేడియో, దూరదర్సన్
లలో ప్రసంగించారు. ఆ సంస్థల అధికారులకికూడా ముందస్తు సమాచారం ఇవ్వలేదు. మంత్రులు
కూడా సమావేశ మందిరం నుంచే ప్రధాని ప్రసంగం విన్నారు. ఆ
తరువాతనే వారు బయటకు వెళ్ళారు.
పెద్ద నోట్ల రద్దు
నిర్ణయాన్ని మోడీ ఆరుమాసాల క్రితమే తీసుకున్నారని, అప్పటినుంచి
దాన్ని అమలు చేయడానికి దశలవారీ ప్రణాళిక రూపొందించుకున్నారని భోగట్టా. అందులో
భాగమే మొన్నీ మధ్య అమలు చేసిన స్వచ్చంద ఆదాయ వెల్లడి పధకం. గోప్యత చాలా కీలకం అని
భావించిన నరేంద్ర మోడీ, చాలా కాలంనుంచే మంత్రివర్గ సమావేశాలకు మంత్రులుఎవరూ తమవెంట సెల్
ఫోన్లు తెచ్చుకోకుండా కట్టడి చేసారు.
నోట్ల రద్దు నిర్ణయం
గురించి మొత్తం దేశంలో తెలిసిన వాళ్ళు పది మంది మాత్రమే అని,
రిజర్వ్ బ్యాక్ గవర్నర్ పదవి నుంచి తప్పుకున్న రఘురాం రాజన్ అందులో
ఒకరని తెలుసుకుని ఆశ్చర్యపోవడం మీడియా వంతయింది. మొత్తం వ్యవహారాన్ని అత్యంత
రహస్యంగా ఉంచినా ఇలాంటిది ఏదో జరగబోతోందన్న సంకేతాలు మాత్రం గత కొద్ది కాలంగా
వెలువడుతూనే వున్నాయి. కొత్త రెండువేల రూపాయల నోటు నమూనా తయారుచేయడం, ఆమోదించడం, ఆ
నోట్లను పెద్ద మొత్తంలో ముద్రించడం జరిగిపోయాయి. అయితే ఆ విషయం తెలిసిన వాళ్ళు ఇది
షరా మామూలుగా జరిగే నోట్ల ముద్రణగా భావించారు కానీ దీని వెనుక ఇంత భారీ నిర్ణయం
వుందని అంచనా వేయలేకపోయారు.
ప్రధాని ప్రసంగం
ముగించిన వెంటనే దాన్ని విన్న ఆసేతుహిమాచలం ప్రజలందరికీ దేశాన్ని భ్రష్టు
పట్టిస్తున్న నల్ల ధనం పిశాచి భరతం పట్టడానికి మోడీ ఎంతో సాహసోపేత నిర్ణయం
తీసుకున్నారన్న ఒకే అభిప్రాయం కలిగింది. మొనగాడంటే మోడీ అనే రీతిలో సాంఘిక
మాధ్యమాల్లో మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. “కొద్ది
రోజులు కటకటపడితే పడదాము, కష్టాలు శాస్వితంగా తీరిపోతున్నప్పుడు తాత్కాలిక ఇబ్బందులను
పట్టించుకోవద్దు” అనే భావన సర్వత్రా కనబడింది.
రాత్రంతా సాగిన ఆ
భావనలు మర్నాడు కూడా కొనసాగి, నిర్ణయ ప్రభావం
కొద్దికొద్దిగా అనుభవంలోకి రావడం మొదలుకాగానే అవి మనస్సులో నుంచి వైదొలగడం
మొదలయింది. సంపన్నులపై ముఖ్యంగా నల్ల కుబేరులపై ప్రధాని మోడీ
ప్రయోగించిన ఈ సర్జికల్ స్ట్రైక్ గురి తప్పి సామాన్యులను తాకిందేమో అనే
సంశయం సన్నగా మొదలయింది. మీడియా వార్తలు దానికి ఆజ్యం పోసి మరింత పెంచాయి. మోడీ ఈ
అస్త్రాన్ని యూపీ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని వాడారనే ఆరోపణలు అనుమానాలను
రగిలించాయి. బీజేపీ సహజంగా సంపన్న వర్గాల కొమ్ము కాస్తుందనే అపప్రధను ప్రత్యర్ధులు
మరోసారి తెరపైకి తీసుకువచ్చారు. ఏటీఎం లలో డబ్బు లేకపోవడం, బ్యాంకులకు
సెలవు ప్రకటించడం, నోట్ల మార్పిడికి వ్యవధానం అతి తక్కువగా వుండడం వెరసి ఇవన్నీ మోడీ
నిర్ణయాన్ని తప్పుపట్టే దిశగా సాగాయి. అయితే ప్రభుత్వం ముందే చెప్పినట్టు గంటలు
గడుస్తున్న కొద్దీ పరిస్తితుల్లో ముందు కానవచ్చిన తీవ్రత కొద్దికొద్దిగా
తగ్గడం మొదలయింది. అనుకున్నంత కాకపోయినా కొద్ది కొద్ది మొత్తాలలో చెలామణీలో వున్న
కరెన్సీ చేతుల్లో పడడంతో జనం ఊపిరి పీల్చుకోవడం మొదలెట్టారు. అయినా శంకలు పూర్తిగా
తొలగిపోలేదు. జవాబు దొరకని ప్రశ్నలు కొన్ని జనం మెదళ్ళలో మెసులుతూనే వున్నాయి. ఒక
చేత్తో వెయ్యి నోటు రద్దు చేసిన ప్రభుత్వం ఆ ఉత్తర్వుపై చేసిన సంతకం తడి
ఆరకముందే మరో చేత్తో రెండువేల రూపాయల నోటును చెలామణీ లోకి ఎందుకు తెచ్చినట్టు? అయిదు
వందల పాత నోటును తీసేసి, కొత్త అయిదు వందల కరెన్సీ నోటు తేబోతున్నట్టు ప్రకటించడం ఎందుకు? జనాలను
ఇంత లాయలాసకు గురిచేసి, దేశంలో నల్లధనం మళ్ళీ రాశులుగా పోగుపడడానికి ఉపకరించే
రెండు వేల నోటు తేవడం ఎందుకు?
ఇవన్నీ జవాబు
తెలియని ప్రశ్నలే కానీ నిజానికి సమాధానం లేనివి కావు. సమాధానం చెప్పేవాళ్ళు
లేకపోతే అది సందేహంగా మారుతుంది. క్రమంగా అనుమానం రూపం సంతరించుకుంటుంది. ఆ
క్రమాన్ని అడ్డుకోకపోతే ఆగ్రహంగా పరిణమిస్తుంది.
ప్రస్తుతానికి అయితే
జనాల మనస్సులో ప్రశ్నలు మాత్రమే వున్నాయి.
బంతి ప్రభుత్వం
కోర్టులోనే వుంది.
ఉపశృతి:
మహా
భారత యుద్ధ పరిసమాప్తి కాలంలో అశ్వద్ధామ ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రం, అభిమన్యుడి
అర్ధాంగి ఉత్తర గర్భంలో పెరుగుతున్న పాండవ వంశాంకురాన్ని తుదముట్టించబోయేటప్పుడు
కృష్ణుడు సుదర్శన చక్రం అడ్డువేసి తల్లీకొడుకులను కాపాడతాడు. అసలీ అస్త్ర మహత్యమే
అద్భుతం. ప్రయోగించిన వీరుడు మంత్రశక్తితో ఆవాహన చేసి నిర్దేశించిన లక్ష్యానికి
మినహా మరెవరికీ హాని కలిగించక పోవడం ఈ బ్రహ్మ శిరోనామకాస్త్రం ప్రత్యేకత. ఒకరకంగా
చెప్పాలంటే, మోడీ
పుణ్యమా అని ఈనాడు బహుళ ప్రాచుర్యంలో వున్న’సర్జికల్
స్ట్రైక్’ లాంటిదని
చెప్పుకోవచ్చు.
(11-11-2016)
NOTE: మరో వ్యాసం మరో సారి