23, డిసెంబర్ 2011, శుక్రవారం

నాటకాలు ఆడొద్దురా........ ఆర్వీవీ కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు


నాటకాలు ఆడొద్దురా........ ఆర్వీవీ కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు

చింతామణి  నాటకాన్నినిషేధించాలి లేకపోతే మేమంతా పెద్ద ఉద్యమం చేస్తాము. ఎంతకయినా తెగిస్తాము.అంటూ ఈ మధ్య జరిగిన ఆర్య వైశ్య మహాసభలో కొందరు వక్తలు సింహ గర్జన చేశారు. ఛానళ్ళు అన్నీ వివరంగా కవర్ చేశాయి. ప్రతిగా నాటక సమాజాలకు చెందిన మరికొందరు  ఆర్టిస్టులు ‘నాటకం నిషేధిస్తే ఉద్యమం చేస్తాం’ అంటూ ఎదురు దాడి ప్రారంభించారు. ఇప్పటికే ఆదరణ కరువై  కళాకారులు వీధిన పడ్డారు. ఇప్పుడీ ఆందోళనల పుణ్యమా అని నిజంగానే వీధికెక్కే పరిస్తితి.  కొద్దో గొప్పో ఉపాధి కల్పిస్తున్న నాటకాన్ని నిషేధిస్తే ఎలా’ అన్నది వారి బాధ. ‘చింతామణి నాటకంలో మా కులం వారిని హేళన చేస్తున్నారు. ఇన్నాళ్ళు ఎలాగో ఓపికపట్టి  భరించాము. ఇక వూరుకోమ’న్నది ఆర్య వైశ్య ప్రతినిధుల ఆవేదన. ఉభయులదీ కరక్టే. ఇరుపక్షాల వాదంలో సహేతుకత లేకపోలేదు.

ఇదిలా వుంటే మరోపక్క హైదరాబాదు చిక్కడపల్లి త్యాగరాజ గానసభలో దాదాపు వారానికి ఒక రోజయినా ఏదో ఒక నాటకం వేస్తుంటారు. ఈవిధంగా  రంగ స్తల రంగానికి గానసభ చేస్తున్న సేవ మెచ్చుకోతగ్గదే. కాకపొతే నాటకానికి ముందు ఏదో ఒక సభ పెట్టి వక్తల ప్రసంగాలతో, ముఖ్య అతిధుల అభిభాషణలతో ప్రేక్షకుల ఓర్పును పరీక్షిస్తుంటారన్న అపప్రధ వుంది. ఓ పక్క  నాటకం ఎప్పుడు మొదలవుతుందా’ అని ప్రేక్షకుల ఎదురు చూపులు చూస్తుంటే, మరోపక్క  ఇవేమీ పట్టించుకోకుండా సుదీర్ఘంగా సాగే సభలో పాల్గొనే వక్తలు  ‘నాటకానికి పూర్వ వైభవం తేవాలంటూ’ అంటూ  దీర్ఘోపన్యాసాలు దంచుతుంటారు. వారు కోరుకునే  పూర్వవైభవం ఎప్పుడూ వస్తుందో తెలియని నాటకాభిమానులు అప్పటికే చాలా పొద్దుపోయిందనుకుని నిట్టూర్పులు విడుస్తూ బయటకు జారుకుంటూ వుంటారు. ఇక ఆడిటోరియంలో మిగిలేవారు పల్చబడుతుంటారు.


శ్రీ కె.వి.రమణాచారి 

‘ఈ నాటకాలు చాలు. వాటిని కట్టిపెట్టు’ అని చాలా సార్లు నిజజీవితంలో అనుకుంటూ వుండడం కద్దు. నిజంగా జరుగుతున్నది కూడా  అదే.  నాటకానికి పూర్వ వైభవం మాటలతో రాదు.  అలాగని చేతలు కూడా పని చెయ్యడం లేదు.  పదేళ్ళ క్రితం కే.వీ. రమణాచారి గారు ( (సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి, రెవెన్యూశాఖ ప్రిన్సిపల్  కార్యదర్శిగా మొన్నీమధ్యనే స్వచ్చందంగా పదవీ విరమణ చేశారు) ‘రసరంజని’ సంస్త  ద్వారా ‘నాటకానికి ప్రాణం పొయ్యాలి’  అని నానా తంటాలు పడ్డారు. బోల్డంత ఖర్చు పెట్టారు. విసుగెత్తి మానేశారు.

‘కావ్యేషు నాటకం రమ్యం’ అన్నాడు కాళిదాసు. తెలుగు వారికి పద్య నాటకాలు ఎంతో ఇష్టం.  ఎనభయ్యో  దశకంలో కూడా నాటకాలు బాగా చూసే వారు. ఉద్యోగ విజయాలు’ నాటకంలో ‘చెల్లియో చెల్లకో’, ‘జెండాపై కపిరాజు’ ‘అలుగుటయే యెరుంగని’  పద్యాలు కంఠతా   రానివారు, అవి  తెలియని వారు తెలుగునాట అరుదు. పొద్దున్నే  చద్దన్నం తిని,  గొడ్లను మేపు కోవడానికి వెళ్ళిన పాలేర్లు,  పశువులు మేస్తూ వుంటే చెట్టుకింద పడుకొని ఈ పద్యాలు పాడుకొంటూ, రాగాలు తీస్తూ  రోజంతా హుషారుగా గడిపేవారు. అలా గాలివాటంగా పద్యాలు  పాడేవారే తదనంతర కాలంలో రంగస్థల నటులుగా మారిన దృష్ట్యాంతాలు కూడా వున్నాయి.




పాత రోజుల్లో నాటకం పోష్టరు

‘పౌరాణిక నాటకాలు అంటే చెవి కోసుకొంటాము’ అనేవాళ్ళు ఇరవయి ఏళ్ళ క్రితం దాకా. ఇది పూర్తిగా నిజం. ఆ నాటకాల్లో  పాత్రధారి ఎలా వున్నా పద్యం  పాడడానికే ప్రాధాన్యం.  ఎంత రాగం తీస్తే అంతగా   తలలూపేవాళ్ళు. ‘ఒన్స్ మోర్’ అనే ఇంగ్లీష్ మాట నిరక్షరాస్యులకు కూడా  తెలుసు.  పద్యం పాడగానే ‘ఒన్స్ మోర్’ అని అరిచే వారు.  ఆ పద్యం మళ్ళీ పాడే వరకు నాటకాన్ని ముందుకు సాగనిచ్చేవారు కాదు. ఓ  సీన్లో పద్యం పాడిన  తర్వాత ఆ పాత్రధారి  పాత్రోచితంగా కింద పడిపోవాల్సిన సందర్భంలో కూడా ప్రేక్షకులు ఎవరయినా ‘ఒన్స్ మోర్’   అంటే చాలు అతగాడు మళ్ళీ లేచి నిలబడి పద్యం పాడి రాగం తీసి  మళ్ళీ పడిపోయేవాడు. ఔచిత్యమా కాదా అనేది అక్కడ అనవసరం.  అలా సాగేవి నాటకాలు. జనం విరగబడి చూసే వారు.  ఊళ్ళల్లో,  ఉత్సవాలు అవీ జరిగినప్పుడు ‘టికెట్ నాటకాలు’ ఆడేవారు. ‘ఫలానా హాలులోనో లేక ఫలానా వారి దొడ్లోనో’ అని కర పత్రాలు వేసే వారు. ఒకళ్ళవో ఇద్దరివో  నటుల ఫోటోలు కూడా ఉండేవిపాంఫ్లెట్ చివర్లో   రేట్లు ఉండేవి. రిజర్వుడు, కుర్చీ,  బెంచీ, నేల ఇలా విడివిడిగా టిక్కెట్లు వుండేవి.  మహా అయితే టికెట్ ఖరీదు  రూపాయి, అర్ధ, పావలా అలా వుండేది. ‘ప్యాట్రన్ టిక్కెట్లు కలవు’ అని రాసే వారు. ‘స్త్రీలకు ప్రత్యేక స్థలం. ఆలసించిన ఆశాభంగం, షరా మామూలే! త్వరపడండి. ముందుగా టిక్కెట్లు రిజర్వ్ చేసుకోండి! ఏ కారణం చేతనయినా ప్రదర్శన నిలిపివేసినయెడల టికెట్ డబ్బు వాపసు ఇవ్వబడదు’ ఇలా  ఏవేవో రాసేవారు. (23-12-2011)



22, డిసెంబర్ 2011, గురువారం

ఎన్టీఆర్ కి ఫైళ్ళు చూడడం అంటే ఇష్టం వుండేది కాదు


ఎన్టీఆర్ కి  ఫైళ్ళు చూడడం అంటే ఇష్టం వుండేది కాదు


(మాజీ డీజీపీ హెచ్.జె.దొర రాసిన ‘ఎన్టీఆర్ తో నేను అనే పుస్తకం నుంచి)
 
స్పెషల్ టీ పట్రా !

“ఎన్టీఆర్ ఆఫీసు ఫైళ్ళు చూస్తున్నారంటే అదొక అష్టావధానమే. రాఘవేంద్రరావు టూకీగా విషయం చెప్పి ఫైల్ ఆయన చేతికి ఇచ్చేవారు. ఆయన సంతకం పెట్టేవారు. ఇంతలో నేనో, మరొకరో వచ్చేవారు. ఆయన ‘ఈ పూటకి ఫైల్స్ చాలండీ!’ అంటూ వంటవాడిని పిలిచి ‘స్పెషల్ గా టీ చేసి పట్రా!’  అని పురమాయించేవారు. అంతే! ఫైళ్ళు చూసే 
కార్యక్రమం అర్ధాంతరంగా నిలిచిపోయేది. అసలు విషయం ఫైల్స్ చూడడం అంత ఇష్టం వుండేది కాదు....

“....బెజవాడలో టీడీపీ మహానాడు జరిగిన ప్రదేశంలోనే ‘కాపు నాడు’ నిర్వహించాలని కాపు సంఘం నేతలు నిర్ణయించారు. కాపునాడు జరిగే ప్రదేశానికి నేను ఒక సాధారణ పౌరుడిగా వెళ్లాను. జనం పెద్ద సంఖ్యలో వచ్చారు. వంగవీటి రంగా జైల్లో వున్నందున రాలేదు. ఆయన భార్య రత్నకుమారి వచ్చారు. కాపునాడు విశేషాలను, నాయకులు చేసిన హెచ్చరికలను హైదరాబాదు రాగానే ముఖ్యమంత్రికి వివరించాను....

.
“.....ఆ రోజుల్లో బెజవాడలో కమ్యూనిష్టుల ప్రాబల్యం ఎక్కువగా వుండేది. విశాలాంధ్ర పేపర్ కూడా ఇక్కడే, కమ్యూనిష్టులు చెప్పిందే ఇక్కడ వేదం. కమ్యూనిష్టుల్ని ఎదుర్కోవాలంటే బలమయిన ఓ ప్రత్యామ్నాయం కావాలి. అలా ఆలోచించేవారు వన్ టౌన్ వ్యాపారులు.....

“.....వంగవీటి మోహన రంగా అన్న రాధాకృష్ణ 
టాక్సీ డ్రైవర్ల అసోసియేషన్ లో వుండేవాడు. విజయవాడ నుంచి నలుగురయిదుగురు పాసింజర్లను ఎక్కించుకుని టాక్సీలు హైదరాబాదు పోతుండేవి. చొరవగలవాడు కావడంవల్ల త్వరలోనే అతను టాక్సీ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు కాగలిగాడు. నెహ్రూ అన్న గాంధీ కూడా అప్పట్లో రాదా దగ్గర పనిచేసేవాడు. యూనియన్ వ్యవహారాలే తప్ప కులాల గొడవలు లేవు.......

“.......’ రాధ ఒకసారి రాష్ట్ర మంత్రి మండలి వెంకట కృష్ణారావును కలుసుకుని రాజకీయాల్లో ఎంట్రీ ఇప్పించమని  అడిగాడు. విషయం తెలుసుకున్న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళ రావు గట్టిగా వ్యతిరేకించారు. సంఘ వ్యతిరేక శక్తుల్ని రాజకీయాల్లోకి రప్పిస్తే వాటిని కూడా కలుషితం చేస్తారని స్తానిక నాయకులను కోపడ్డారు.....

“ విజయవాడలో నిరాహార దీక్షలో వున్న వంగవీటి రంగా హత్యానంతరం కోస్తాలోని  చాలా  జిల్లాల్లో దాడులు, ప్రతి దాడులు మొదలయ్యాయి. అనేక  పట్టణాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. బాధితులను ఓదార్చేందుకు ఎన్టీఆర్ విజయవాడ పయనమయ్యారు. రంగా భార్య రత్నకుమారిని కలిసి పరామర్శించడానికి వెళ్లారు.  ఇంటి ముందు కారు ఆగింది.  రంగా అభిమానులు అడ్డుకున్నారు. ఇక లాభం  లేదనుకున్న ఎన్టీఆర్ కిందకు దిగి రంగా ఇంటి వైపు చూస్తూ నమస్కరింఛి తిరిగి వచ్చేశారు.........

1989,  ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ముఖ్యమంత్రి నివాసంలో మంత్రి మండలి సమావేశం జరిగింది. బడ్జెట్ లీక్ అయిందని, దీనికి బాధ్యత వహిస్తూ మంత్రులందరూ రాజీనామా చేయాలని ఎన్టీఆర్ బాంబు లాంటి ప్రకటన చేశారు. రాజీనామాలు స్వీకరించడం గవర్నర్ ఆమోదించడం జరిగిపోయాయి. అదే రోజు డీజీపీ పీ.ఎస్. రామ్మోహన్ రావును ఆ స్తానం నుంచి మార్చారు. ఈ పరిస్తితి ఎదురు కాకూడదనే ఆయన ముందుగానే సెలవులో వెళ్ళిపోయారు.....

“అంతా కొత్తవారితో ఆ తరువాత కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. వారెవరన్నది చివరి దాకా సస్పెన్స్. చివరికి పార్టీ ప్రధాన కార్యదర్శిగా, రెండవ స్తానంలో వున్న చంద్రబాబు నాయుడు దగ్గర కూడా విషయం దాచారు.
“.....ఎమ్మెల్యేలంతా విస్తు పోయారు. పార్టీ శ్రేణులన్నీ కలవరపడ్డాయి. (అయినా ఎన్టీఆర్ తొణకలేదు. ఎందుకంటె) ఆత్మ విశ్వాసానికి ప్రతీక ఎన్టీఆర్. తనపై రాళ్ళ వర్షం కురుస్తున్నా ఏరుకుని వాటితో దుర్గం నిర్మించుకోగల ధీశాలి ఆయన......
 (22-12-2011)

21, డిసెంబర్ 2011, బుధవారం

"ఎన్టీఆర్ కి దేవుడన్నా, పూజలన్నా నమ్మకం లేదు"



"ఎన్టీఆర్ కి దేవుడన్నా, పూజలన్నా నమ్మకం లేదు" 


(మాజీ డీజీపీ హెచ్.జె.దొర రాసిన ‘ఎన్టీఆర్ తో నేను’ అనే పుస్తకం నుంచి మరి కొన్ని భాగాలు)


“......ఎన్టీఆర్ కు అసలు దేవుడన్నా, పూజలన్నా పెద్దగా నమ్మకం లేదు. ఆయన ఇంట్లో ఎప్పుడూ  ఏ వ్రతం కానీ, పూజలు కానీ జరగ్గా నేను చూడలేదు. ఒక్క వేంకటేశ్వరస్వామి ఫోటో మినహా మరే దేవుడి ఫోటో ఆయన ఇంట్లో కనిపించేది కాదు. తిరుమలకు తప్ప రాష్ట్రం లోని మరే ఇతర దేవాలయానికి ఆయన వెళ్లగా చూడలేదు......

“.......పూజలు పునస్కారాల మీద పెద్దగా నమ్మకం లేకపోయినా, ఎన్టీఆర్ జ్యోతిష్యాన్ని, వాస్తుని మాత్రం బాగా నమ్మేవారు. ఎవరయినా జ్యోతిష్కుడు వచ్చి పలానా రాయి వున్న వుంగరం పెట్టుకొమ్మని చెబితే దాన్ని తు చ తప్పకుండా పాటించేవారు. అలా ఆయన చేతి వేళ్లకి ఏడెనిమిది ఉంగరాలు వచ్చి చేరాయి.......

“..... సినిమా షూటింగులకి బయట వూళ్ళకి వెళ్ళినప్పుడు పెద్ద హోటళ్ళలో బస చేసేవారు కాదు. హైదరాబాదు వస్తే , సారధీ స్టూడియోలో ఓ మూల చిన్న గదిలో సర్దుకునేవారు. చిన్నపాటి పరుపు, ఓ దిండు ఇస్తే చాలు, కింద వేసుకుని పడుకునేవారు.....

“.....ఎన్టీఆర్ కి బాగా దగ్గరగా మసలిన వ్యక్తి బీవీ మోహనరెడ్డి. ఒకసారి దైవ దర్శనం కోసం ఎన్టీఆర్- బీవీ తో కలసి తిరుపతి వెళ్లి వస్తున్నారు. వీళ్ళ కారు వెనకనే వస్తున్న వీఐపీ కారు ఒకటి సైరన్ చేసుకుంటూ ముందుకు వెళ్లిపోయిందట. ఆ వీఐపీ కారుకు  అటూ ఇటూ మరికొన్ని కార్లు. ఈ హంగామాను ఎన్టీఆర్ ఆసక్తిగా గమనిస్తున్నప్పుడు, బీవీ కలగచేసుకుని ‘మీ కారు కూడా ఎనభైలో ఇలాగే సైరన్, పైలట్ హంగామాలతో ముందుకు దూసుకుపోతుంది. ఇది తధ్యం అని జోస్యం చెప్పారట........

“......రామారావుది మొదటి నుంచి ఒకటే ఫిలాసఫీ. ఏదయినా వ్యాపారం అంటూ చేస్తే సొంత డబ్బు పెట్టాలి. ప్రభుత్వ రాయితీలు, ఉచిత స్తలాలు ఎందుకనే వారు. అక్కినేని నాగేశ్వరరావుకు స్టూడియో నిర్మాణానికి (ప్రభుత్వం) ఉచితంగా ఇచ్చిన స్తలంలో వేరే వ్యాపారాలు చేయడం ఎన్టీఆర్ కి నచ్చలేదు. ‘వారికి నోటీసులు పంపండి. ఏం పర్వాలేదు’ అని ఆదేశాలిచ్చారాయన......

“.......తన సినీ జీవితం తొలినాళ్ళలో ఆత్మాభిమానం మెండుగా వున్న ఈ నిండు మనిషి, ఒకసారి నడుచుకుంటూ షూటింగుకు వెళ్లడం చూసి ఆ సినిమా నిర్మాత ఆయనకు ఒక కొత్త కారు కొని ఇంటికి పంపారట. ఆ రోజుల్లో కొత్త కారు ఖరీదు పదిహేను వందల రూపాయలు. తరువాత తనకు డబ్బు సమకూరాక నందమూరి ఆ నిర్మాత ఇంటికి వెళ్లి కారు డబ్బులు తిరిగి ఇచ్చేశారట......

ఎమ్జీఆర్ (అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం జీ రామచంద్రన్ ) ఢిల్లీ వెళ్ళే సందర్భాలలో ఆయన విమానం హైదరాబాదులో నలభై అయిదు నిమిషాల పాటు ఆగేది. ఎన్టీఆర్  టిఫిన్ క్యారియర్ పట్టుకుని నేరుగా బేగం పేట ఎయిర్ పోర్ట్ కి తీసుకువెళ్ళేవారు. అక్కడ తన మద్రాసు మిత్రుడితో కాసేపు ఆప్యాయంగా కబుర్లు చెప్పేవారు. ఇలా చాలా సార్లు జరిగింది.......(21-12-2011)
         

పూతరేకుల దొరవారు



పూతరేకుల దొరవారు



శ్రీ హెచ్.జె.దొర 

దొర గారు ఎంత హుందాగా ఉంటారో ఆయన రాసిన  ‘ఎన్టీఆర్ తో నేను’ పుస్తకావిష్కరణ కూడా  అంత హుందాగా  ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది.  ఆదివారం (18-12-2011) కావడంతో  బుక్ ఎగ్జిబిషన్ కిటకిటలాడింది. అంత జనసందోహంలో కూడా ఆవిష్కరణ సభ చక్కగా  నిర్వహించారు.  వేదిక మీద గవర్నర్ నరసింహన్ తోపాటు  ప్రభుత్వ మాజీ  ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు,   సీనియర్ పాత్రికేయులు  పొత్తూరి వెంకటేశ్వర రావు, కే.రామచంద్రమూర్తి, మాజీ ఐజీ రావులపాటి సీతారామా రావు, ఎమెస్కో విజయ కుమార్ వుంటే  సభకు హాజరయిన వారిలో మాజీ  డీజీపీలు అరవింద రావు, ఆర్. ప్రభాకర రావు, మాజీ ఐపీఎస్ అధికారులు శివశంకర్, డాక్టర్ సుబ్రహ్మణ్యం, ఇంకా అనేకమంది  పోలీసు అధికారులు, జర్నలిస్టులు వున్నారు. 
గవర్నర్ నరసింహన్ గారి ప్రసంగం ఆత్మీయంగా సాగుతూ భేషజాలు లేని  మనసులోని మాటలతో సభికులను ఆసాంతం ఆకట్టుకుంది. ఆ ఉపన్యాసం విన్న ఆర్వీవీ కృష్ణారావు గారు దాన్నిలా అక్షరాల్లో పరిచారు.
“అనంతపురంలో దొర గారు ఎస్పీ గా పనిచేస్తున్నప్పుడు  నరసింహన్ గారు  ట్రైనీ  ఏఎస్పీ గా జాయిన్ అయ్యారట.  దొరగారి శ్రీమతి కూడా తనను ఎంతో బాగా చూసుకొనేవారని చెప్పారు.   ఓ సారి ఆయన తీవ్రంగా అస్వస్తులు అయినప్పుడు పుట్టపర్తి నుంచి సత్య సాయిబాబా విభూతి తీసుకువచ్చి పెట్టారుట. ఈ మాటలు చెబుతూ గవర్నర్ నరసింహన్ గారు సభలో వున్న దొరగారి శ్రీమతికి వేదికపై నుంచే ప్రత్యేకంగా అభివాదం చేసారు.  వాళ్ళ ఆత్మీయత  ఎప్పటికీ మర్చిపోలేననన్నారు.  ఇంటికి వెళ్తే పూత రేకులు పెట్టేవారని గుర్తు చేసుకొన్నారు.  దొర గారు ఎప్పుడు ‘అముల్ బేబీ’ మాదిరిగా చిరునవ్వులు నవ్వుతూ వుంటార’ని అంటూ సభలో నవ్వుల పువ్వులు పూయించారు. అయితే   అంత మాత్రాన  ఆయన దగ్గర చొరవ తీసుకోలేమమని అన్నారు.  పూత రేకులు పెట్టిన కొంత సేపటికే ‘నైట్ పెట్రోలింగుకు  ఎందుకు వెళ్ళలేద’ని  కేకలేసేవారని చెబుతూ,  డిపార్ట్ మెంట్ లో వున్న అప్పటి భయ భక్తులను సభికులకు ముఖ్యంగా సభలో వున్న  పోలీసు అధికారులకు జ్ఞాపకం చేసారు. రావులపాటి  సీతారామా రావు గారిని గురించి చెబుతూ ‘ఆయనతో పాటు పన్నెండు మంది ట్రెయినీ  డీఎస్పీలు అనంతపురం పోలీసు ట్రైనింగ్ కాలేజీలో వుండేవారని,  మద్రాస్  నుంచి తాను తెచ్చిన తినుబండారాలన్నీ వాళ్ళే   తీసేసుకునేవార’ని చురక వేసారు. తనకు తెలుగు రాకపోయినా పుస్తకం టైటిల్ ‘ఎన్టీఆర్ తో నేను’ అనే బదులు ‘ఎన్టీఆర్ నేనే’ అని పెడితే సరిపోయేదని చతురోక్తి విసిరారు.  గవర్నర్ స్థాయిలో వుండి కూడా  అనుబంధాలకు, ఆత్మీయతకు నిదర్శనంగా నిలిచారు నరసింహన్ గారు.
“పుస్తకావిష్కరణ కార్యక్రమం పూర్తయిన తర్వాత అందరికి ఆ పుస్తకం కావాలని అనిపించింది.    కొంత మందికి ఎమెస్కో విజయ్ కుమార్ గారు కాంప్లిమెంటరీగా ఇచ్చారు.  అందరికి ఇవ్వడం సాధ్యం కాదు కదా.  నాతో పాటే పుస్తక ప్రదర్శనకి వచ్చిన మా అల్లుడు వేణు గోపాల్ ‘అంకుల్!  మీరు పుస్తకం కొని దానిమీద దొర గారి ఆటో గ్రాఫ్ తీసుకోండి!’ అని సూచించాడు.  వెంటనే  బుక్ ఎగ్జిబిషన్ లో వున్న ఎమెస్కో స్టాల్ కి వెళితే ‘లేవు’ అని చెప్పారు.  అప్పటికే అందరూ వెళ్లిపోతున్నారు.  దొరగారితో ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ లు తీసుకుంటూ వుండడంతో ఆయన బిజీగా వున్నారు. ఈలోగా  ఎవరో చెప్పారు ‘నవోదయ స్టాల్ లో  ట్రై చెయ్యండి’ అని. అక్కడకి వెడితే  కొద్ది కాపీలే వున్నాయి.  రెండు కాపీలు కొని దొర గారి దగ్గకి వచ్చి సార్! మీ సంతకం  కావాలి” అంటే  వెంటనే గుర్తు పట్టి సంతకం చేసిచ్చారు. రెండో పుస్తకం మీద కూడా కావాలి సార్! ఇది  భండారు శ్రీనివాస రావుకి’  అంటే ‘శ్రీనివాసరావు ఎలా వున్నాడు?’ అని ఎంతో అభిమానంగా అడుగుతూ  ఆటోగ్రాఫ్  ఇచ్చారు.  నేను, శ్రీనివాసరావు ఇదివరలో రేడియోలో పనిచేసే రోజుల్లో దొరగారితో   చాలా సన్నిహితంగా వుండే వాళ్ళం.  నక్సలైట్  సమస్య ఉధృతంగా వున్న రోజుల్లో రేడియో ప్రభావం బాగా వుండేది.  ఢిల్లీ నుంచి వచ్చే స్పాట్ లైట్ వంటి ముఖ్యమయిన కార్యక్రమాల్లో సయితం ఈ సమస్యకు ఎక్కువ ప్రాధాన్యం వుండేది.  మా న్యూస్ విని మేము కలిసినప్పుడు,  ముఖ్యంగా  కొత్త సంవత్సరం ఆరంభంలో డీజీపీ సంప్రదాయంగా ఇచ్చే పార్టీల్లో మమ్మల్ని గుర్తుంచుకుని  అభినందించేవారు. ఇప్పుడు ఆయన జ్ఞాపకాలు పుస్తక రూపంలో  వచ్చిన సమయంలో నేను శ్రీనివాసరావు  కలిసి మా రేడియో రోజులను మరోమారు  నెమరు వేసుకోవడం కూడా ఓ  మధురానుభూతి.”
ఈ విధంగా దొరగారు రాసిన ‘ఎన్టీఆర్ తో నేను’ అనే పుస్తకం మా ఇంటికి చేరింది. వెంటనే దాన్ని ఆమూలాగ్రం చదవడం పూర్తిచేసాను. అందులో దొర గారు పేర్కొన్న కొన్ని ఆసక్తికరమయిన అంశాలను పేర్కొంటూ ‘బ్లాగు’ రాసి పోస్ట్ చేసాను. ఆ పుస్తకంలోని  మరికొన్ని అంశాలను బ్లాగులోకి ఎక్కించే పనిలో వున్నాను. (21-12-2011)

20, డిసెంబర్ 2011, మంగళవారం

"ఎన్టీఆర్ తో నేను" -హెచ్.జె. దొర




"ఎన్టీఆర్ తో నేను" -హెచ్.జె. దొర 


( సీనియర్ ఐ పీ ఎస్ అధికారి, మాజీ డీజీపీ హెచ్.జె.దొర గారు ‘ఎన్టీఆర్ తో నేను’ అనే పేరుతొ  
రాసిన పుస్తకంలో కొన్ని మచ్చుతునకలు.)




“....అమెరికా వెళ్లి ఆపరేషన్ చేయించుకుని తిరిగివచ్చిన ఎన్టీఆర్ కు వెన్నుపోటు తప్పలేదు.
“....నాదెండ్ల భాస్కరరావు ఎవరో అప్పటిదాకా నాకు (దొరకు) తెలియదు.
“ ....తన వ్యక్తిగత విషయాలు గురించి సైతం ఎన్టీఆర్ నా దగ్గర ఓపెన్ అయ్యేవారు.
“....కొంతమంది ఎన్టీఆర్ దగ్గర (నా గురించి) ప్రస్తావించి ఇతను (దొర) ‘అవతల వ్యక్తి’ అని చెప్పినా కూడా ఆయన నన్ను వొదులుకోలేదు.
“....మా మామయ్య బొడ్డేపల్లి రాజగోపాల రావు ఏడు పర్యాయాలు శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి (కాంగ్రెస్ అభ్యర్ధిగా) పోటీ చేసి ఎన్నికవుతూ వచ్చారు. మా ఇంట్లోనే కాంగ్రెస్ క్యాంప్ రాజకీయాలు నడిచేవి. మా మామయ్యకు కుడి భుజంగా వుంటూ ఈ క్యాంప్ నడిపేది స్వయంగా నా తమ్ముడు, ఆయన అల్లుడు హెచ్.ఏ.దొర. చూపరులకు ఇదంతా ఆశ్చర్యంగా వుండేది.
“....దేశ రాజకీయాల్లో ఎప్పుడయితే రాజకీయ పార్టీలకు, వాటి సిద్ధాంతాలకు ప్రాముఖ్యం  తగ్గి వ్యక్తుల ప్రాధాన్యాలు పెరిగాయో, గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయో అప్పుడే (పోలీసు శాఖలో అంతర్భాగంగా వున్న) ఇంటెలిజెన్స్ వ్యవస్త అవసరాలు పెరిగాయి.
“.....ఎన్టీఆర్ ఎక్కువగా ఇంటెలిజెన్స్ ఇన్ పుట్స్  మీదే డిపెండ్ అయ్యేవారు.
“....ఎన్టీఆర్ ఏజెన్సీ ప్రాంతాలలో (ముఖ్యమంత్రి హోదాలో)  టూర్ చేసేటప్పుడు .....అప్పుడు అక్కడున్న గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ, ఖాళీగా వున్న ఇళ్ళల్లో కానీ (ఆయనకు) బస ఏర్పాటు చేసేవారు. (సీఎం పేషీకి చెందిన సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారులు - రాఘవేంద్రరావు, టీ ఆర్ ప్రసాద్, బెనర్జీ లతో పాటు నేను (దొర) చాలా చిన్న గదుల్లో సరయిన వసతులు లేకపోయినా నైట్ హాల్ట్ చేసేవాళ్ళం.
“....ఆంధ్ర జ్యోతి అధినేత కే.ఎల్.ఎన్. ప్రసాద్ చనిపోయారని కబురందింది. ..వెళ్లి నివాళులు అర్పించాలని చంద్రబాబు అన్నారు. ‘ఏం! ఎందుకెళ్ళాలి? మేం వెళ్ళం!’ – ఇదీ ఎన్టీఆర్ సమాధానం.
“అక్టోబర్ 31,1984. ఉదయం పది గంటలు. యు.ఎన్.ఐ. విలేకరి నుంచి ఫోన్. ప్రధానమంత్రి  ఇందిరాగాంధీని ఎవరో షూట్ చేసారట....ఢిల్లీ యెలా వెళ్లాలనే దానిపై తర్జన భర్జన. ఆ రోజుల్లో హైదరాబాదు నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి రెండే ఫ్లయిట్లు. నావల్ చీఫ్ హైదరాబాదులో వున్న సంగతి తెలుసుకుని ఆయన వచ్చిన ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను తీసుకుని ఢిల్లీ వెళ్ళాము. అప్పుడు హైదరాబాదులో వున్న మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కూడా అదే విమానం ఎక్కారు.ఆ చిన్న విమానం, యావ్రో ఎయిర్ క్రాఫ్ట్, ఢిల్లీ చేరడానికి నాలుగు గంటలు పట్టింది.
“....  ఆగస్టు సంక్షోభం నుంచి ఎన్టీఆర్ కు తలనొప్పులు మొదలయ్యాయి. (సొంత) ఎమ్మెల్యేలు పలువురు ఇప్పుడు ఆయననుంచి ఏదో ఒకటి ఆశిస్తున్నారు. ఒకరకంగా బ్లాక్ మెయిల్. అందుకే ఆయన (ఎన్టీఆర్) శాసన సభను రద్దుచేసి తాజాగా ప్రజాతీర్పు కోరదామనుకుంటున్నారు.
“.....పెను తుపాను బాధితుల పరామర్శ కోసం మద్రాసు వచ్చిన ప్రధాని రాజీవ్ గాంధీని రాజభవన్ లో ఎన్టీఆర్ కలసి మాట్లాడారు. ఆ చర్చల తరువాత ఉభయుల మధ్య రాజకీయ అవగాహన కుదిరినట్టు మాకు కొన్ని రోజులయ్యాక తెలిసింది. దీని పర్యవసానమే ఎన్టీఆర్ అసెంబ్లీ రద్దు నిర్ణయం.
“....రాజీవ్ గాంధీతో ఎన్టీఆర్ చేసుకున్న ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ పార్టీలోని ముగ్గురు ముఖ్యులు (పీవీ నరసింహారావు, శివశంకర్, జలగం వెంగళరావు) వీరిపై  తెలుగుదేశం పార్టీ గట్టి అభ్యర్ధులను పోటీకి పెట్టకూడదు.
“....పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలకు రమ్మని కాంగ్రెసేతర పార్టీలకు చెందిన జాతీయ నాయకులనుంచి ఎన్టీఆర్ పై ఒకటే వొత్తిళ్ళు. అయినా రాజీవ్ గాంధీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎన్టీఆర్ వెళ్ళలేదు. రామకృష్ణ హెగ్డే మాట కాదన లేక కర్నాటకలోని ఒక్క కోలార్ కు మాత్రమే వెళ్లారు. అలా వెళ్లినందుకు అప్పటికే ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చేసింది – ఏమిటిదీ అని. అందుకు పార్టీ వివరణ ఇవ్వాల్సివచ్చింది.
“....ఎన్నికలకు ముందు ఒక అవగాహనకు వచ్చిన రాజీవ్, ఎన్టీఆర్ ఆ తరువాత ఆ సయోధ్యకు తిలోదకాలు ఇచ్చారు.
“....రాజీవ్ గాంధీ (రాష్ట్రాల) పర్యటనల్లో కొన్ని సాహసాలు చేస్తుండేవారు.ఒకసారి ఖమ్మం జిల్లా  వచ్చినప్పుడు భద్రాచలంలో దిగి ఒక జీపులో ఎక్కి అందరూ చూస్తుండగానే దాన్ని ముందుకు ఉరికించి అడవుల్లో మాయమయ్యారు.  ఎటు వెళ్ళారో తెలియక మాకు టెన్షన్ మొదలయింది........
“....మరోసారి విశాఖ ఎయిర్ పోర్ట్ లో జర్నలిష్టులతో గంటన్నర మాట్లాడుతూ వుండిపోయారు. ఇంతలో బాగా చీకటి పడింది. ఆయన ఫ్లయిట్ ఎక్కగానే మేం కూడా తిరిగొచ్చేశాము.  తర్వాత తెలిసిందేమిటంటే వాతావరణం అనుకూలించక ఫ్లయిట్ టేకాఫ్ కాలేదు. ప్రధాని ఆ రాత్రి నావల్ ఆఫీసర్స్ మెస్ లో విశ్రాంతి తీసుకుని మరునాడు ఢిల్లీ వెళ్ళిపోయారు........తన జీవితపు చివరి ప్రయాణం కూడా విశాఖ ఎయిర్ పోర్ట్  నుంచే సాగడం రాజీవ్ గాంధీకి సంబంధించి ఒక విషాదం. (మరికొన్ని విశేషాలు మరోసారి- భండారు శ్రీనివాసరావు, 20-12-2011)

19, డిసెంబర్ 2011, సోమవారం

భగవద్గీత మీద ప్రమాణం చేసి - భండారు శ్రీనివాసరావు


 భగవద్గీత మీద ప్రమాణం చేసి  - భండారు శ్రీనివాసరావు


ప్రపంచ అద్భుత సంఘటనల్లో ఒకదానిగా ప్రసిద్ధి చెందిన మొట్టమొదటి అణు బాంబు పరీక్ష జరిగి ఇప్పటికి దాదాపు అరవై ఏడేళ్ళు గడిచాయి. న్యూ మెక్సికోలోని సోకొర్రోకు ఆగ్నేయంగా 35 మైళ్ల దూరంలో 1945 జులై 16 వ తేదీన  ‘ట్రినిటీ’ అనే గుప్త నామంతో అమెరికా అణు పరీక్ష జయప్రదంగా నిర్వహించింది. అప్పటినుంచి లోకంలో  అణు శకం మొదలయిందని చెప్పుకోవచ్చు.
మళ్ళీ ఇన్నేళ్ళ తరవాత కమ్యూనిజానికి కాలం చెల్లిన రష్యాలో వ్యాస విరచితమయిన ‘భగవద్గీత ‘ను నిషేధించే ప్రయత్నాలు మొదలయ్యాయి.
అప్పట్లో అమెరికా జరిపిన అణు పరీక్షకూ, భగవద్గీతకూ సంబంధమేమిటన్న అనుమానం రావచ్చు.  దాన్ని నివృత్తి చేసుకోవాలంటే గతాన్ని కొంత నెమరు వేసుకోవాలి.
అమెరికా ఈ పరీక్షకు పెట్టిన పేరు ‘ట్రినిటీ’ అయితే పరీక్షించిన అణుబాంబు కు నిర్దేశించిన నామం ‘ది గాడ్జెట్’ . తొలి అణు పరీక్షను విజయవంతంగా  జరిపిన విజయోత్సాహంతో  అమెరికా కొద్ది వ్యవధిలోనే   రెండు అణు బాంబులను జపాను పై ప్రయోగించి అణు బాంబు శక్తిసామర్ధ్యాలను లోకానికి ఎత్తిచూపింది.
1945  ఆరోతేదీన తొలి బాంబు ప్రయోగం జపాను లోని హిరోషిమాపై జరిగింది. మరో మూడురోజులకే తొమ్మిదో తేదీన రెండో అణు బాంబును నాగాసాకీపై అమెరికా ప్రయోగించింది.
హిరోషిమాపై  జారవిడిచిన అణుబాంబు  గుప్తనామం ‘లిటిల్ బాయ్’  కాగా,  నాగాసాకీని మట్టుబెట్టిన  బాంబుకు పెట్టిన పేరు ‘ఫ్యాట్ మ్యాన్‘
నిజానికి హిరోషిమాపై  ప్రయోగించిన తొలి బాంబు  పరీక్ష చేసి ప్రయోగించినది కాదు. అయినా విజయవంతం అయింది. ఈ బాంబును  ముందుగా  పరీక్షిం చకపోవడానికి కూడా ఒక కారణం వుంది. ఒకే ఒక్క బాంబుకు కావాల్సిన  యురేనియం -235 నిల్వలు మాత్రమే అమెరికా వద్ద మిగిలివుండడంతో ఆ బాంబును  పరీక్షించడానికి వీలు లేకుండా పోయింది. పోతే నాగాసాకీపై ప్రయోగించిన బాంబు ట్రినిటీ మాదిరి తయారు చేసిన అణు  బాంబు.
ఈ రెండు బాంబులు కలసి సృష్టించిన మారణ హోమం ఇంతా అంతా కాదు. ప్రయోగించిన ఒకటి రెండు క్షణాల వ్యవధిలోనే లక్షా నలభై ఎనిమిది వేలమంది ప్రాణాలు గాలిలో కలసి పోయాయి. ఆ  బాంబులు కలిగించిన అణు ధార్మిక ప్రభావం కారణంగా ఆ తరువాత అయిదేళ్ళలోమరణించిన వారి సంఖ్య  లక్షలకు చేరింది. దీన్నిబట్టి అణ్వస్త్రాల వల్ల అవనికి పొంచివున్న ముప్పు యెంతటిదో   అర్ధం చేసుకోవచ్చు.

తొలి అణు పరీక్ష 

పోతే, ట్రినిటీ పరీక్షకు అంతా సిద్ధం చేసుకున్న  అమెరికా శాస్త్రవేత్తలకు వర్షం రూపంలో తొలి అడ్డంకి ఎదురయింది. అణు విస్పోటన  పరీక్షకు తెల్లవారుఝామున నాలుగు గంటలకు ముహూర్తం నిర్ణయించారు. కానీ వాతావరణం  ఉరుములు, మెరుపులు వర్షంతో అనుకూలించలేదు. ఆ పరిస్థితుల్లో పరీక్ష నిర్వహిస్తే పరిణామాలు దారుణంగా వుంటాయని అధికారులు భావించి కొద్ది సేపు వాయిదా వేసారు. ప్రెసిడెంట్ ట్రూమన్ తో సహా అంతా  ఎదురు చూస్తున్న వాతావరణ నివేదిక ఉదయం నాలుగు గంటల నలభై అయిదు నిమిషాలకు శాస్త్రవేత్తలకు  అందింది. పరీక్షకు అధికార్లు పచ్చ జెండా  చూపారు.  సరిగ్గా 5-10 కి  20 నిమిషాల కౌంట్ డౌన్ మొదలయింది. అక్కడికి  16 మైళ్ల దూరంలో  నిర్మించిన  ఎత్తయిన టవర్ నుంచి  ఉన్నతాధికారులు  ప్రయోగ ప్రక్రియని  పరిశీలిస్తున్నారు. స్తానిక కాల మానం ప్రకారం ఉదయం అయిదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నలభై అయిదు సెకన్లకు మానవాళి  భవిష్యత్తును  ప్రశ్నార్ధకం చేస్తూ తొలి  అణు విస్పోటనం తన భీషణ రూపాన్ని ప్రదర్శిస్తూ లోక భీకరంగా ఆవిష్క్రుతమయింది.   పేలుడుకు  ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దద్దరిల్లాయి.  క్షణంలో వందో వంతులో   20 కిలో టన్నుల టి.ఎం.టి. శక్తికి సరిసమానంయిన ‘ఎనర్జీ’ విడుదలయింది. ఒకటి రెండు క్షణాలపాటు ఆ ప్రదేశం,  చుట్టుపక్కల కొండలు పట్టపగలు వెలుతురును తలదన్నే విధంగా  వేయి సూర్యుల కాంతితో (దివి సూర్య సహస్రస్య – భగవద్గీత 11 వ అధ్యాయం 12 వ శ్లోకం ప్రధమ పాదం)  వెలిగిపోయాయి.  బాంబు పేలిన చోట పది అడుగుల లోటు  వంద అడుగుల వెడల్పు కలిగిన గొయ్యి   ఏర్పడింది.  ఆ ప్రదేశం యావత్తు నిప్పుల కొలిమిలా మారింది. నీలంనుంచి ఎరుపు, ఎరుపు  నుంచి పచ్చ, పచ్చ నుంచి తెలుపు -  ఇలా రకరకాలుగా రంగులు మారుతున్న దృశ్యాలు ఆకాశంలో దర్శనమిచ్చాయి. పెద్ద పుట్టగొడుగు మాదిరిగా  నల్లటి నలుపు రంగుతో మిశ్రితమయిన ఎర్రటి పొగ మేఘాలు  గగన తలంలో ఏడున్నర మైళ్ల ఎత్తు వరకు ఎగిసిపడ్డాయి.
ట్రినిటీ పరీక్ష డైరెక్టర్ కెన్నెత్ బ్రెయిన్ బ్రిడ్జ్  బాంబు పేలుడు సృష్టించిన ఉత్పాతానికి విభ్రమ చెందాడు. ప్రపంచ వినాశ నానికి దోహదం చేసే దారుణ  ప్రక్రియలో పాలుపంచుకున్న నిర్వేదం ఆయన తొలి పలుకుల్లో ధ్వనించింది. ‘చీ! జరగరానిది జరిగి పోయింది –‘Now we all sons of bitches’- అదీ ఆయన వ్యాఖ్య.
ట్రినిటీ పరీక్షకు సాక్షీభూతంగా నిలచిన మరో శాస్త్ర వేత్త , ఈ నాటి ఈ వ్యాసానికి ప్రేరకుడు అయిన జె.రాబర్ట్  ఓపెన్ హీమర్    (J.Robert Oppenheimer) ‘వేయి సూర్యుల కాంతి ‘ అన్న భగవద్గీత లోని సంస్కృతపాదం ఆధారంగా ఆనాటి దృశ్యాన్ని వర్ణించారు.   ఆ తరువాత  చాలా ఏళ్ళకు అణు పరీక్షను గురించి మాట్లాడుతూ మరో మాట చెప్పారు. ముందు అది ఎవరికీ అర్ధం కాలేదు  ఎందుకంటె అది సంస్కృతంలో వుంది.  భగవద్గీతలోని వాక్యం అది. ‘కాలోస్మి  లోకక్షయకృత్ ప్రవ్రుద్దో లోకాన్ సమాహర్తు మిహ ప్రవృత్తః’
("kālo'smi lokakṣayakṛtpravṛddho lokānsamāhartumiha pravṛttaḥ"  which he translated as "I am become Death, the destroyer of worlds)[
అంటే -
 ‘నేనే మృత్యువును. లోకాలను నాశనం చేసే సర్వంసహా శక్తిని’
ఇక మాస్కో  కోర్టు భగవద్గీత గురించి ఏ తీర్పు యెలా  ఇస్తే ఎవరికి కావాలి ?  (19-12-2011)

18, డిసెంబర్ 2011, ఆదివారం

మాయమై పోతున్నవమ్మా!


మాయమై పోతున్నవమ్మా!

ఎనభయ్యవ దశకం పూర్వార్ధంలో  స్నేహితుడొకడిచ్చాడని చెప్పి మా పిల్లలు  ఓ తెలుగు సినిమా క్యాసెట్ ఇంటికి పట్టుకొచ్చారు. కాసెట్ అయితే వుంది కానీ దాన్ని టీవీ (నలుపు తెలుపు) తెరపై చూడడానికి వీడియో క్యాసెట్ ప్లేయర్ (వీ సీ పీ ) లేదు. నాడా దొరికిందని ఘోడా కోసం వెదికినట్టు చిక్కడపల్లిలో ఓ షాపునుంచి దాన్ని గంటకు ఇంత అని రెంటుకు  తీసుకొచ్చి ఇంట్లో  ఆ సినిమా చూసాం. ఆ తరువాత అందరి  ఇళ్ళల్లో వీసీపీలు వీసీఆర్ లు గృహప్రవేశం చేశాయనుకోండి. అది వేరే కధ.
మళ్ళీ ఇన్నేళ్ళ తరవాత - మా బావగారి డెబ్బయ్యేడవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 1995 లో తీసిన  వీడియో క్యాసెట్ చూడాలనిపిస్తే వీసీఆర్ అనే పరికరం ఇళ్లల్లోనే కాదు షాపుల్లో కూడా మాయమై పోయింది. ఒకప్పుడు వీసీఆర్ ఇంట్లో వుంటే  ఘనంగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడా మాట చెబితే నమ్మేవాళ్ళు వుండరేమో. ఎందుకంటె ఈ నాటి పిల్లలకు ఆనాటి  వీడియో క్యాసెట్లు, వీడియో ప్లేయర్లు చూసివుండే అవకాశం లేదు కాబట్టి.
నిన్ననో మొన్ననో పేపర్లో ఓ వార్త చదివాను.
ఉత్తరాలు చదవడం దగ్గరనుంచి, టెలిఫోన్ డైరెక్టరీ  చూడడం వరకు అనేక పనుల అవసరం అందుబాటులోకి వచ్చిన  టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు జనాలకు లేకుండా పోయిందని ఓ సర్వే తేల్చిందట. ఇలాటివి దాదాపు  యాభయ్ దాకా వున్నాయని కూడా  ఆ సర్వే సారాంశం.
వెబ్ ప్రపంచం ఆవిష్క్రుతమైయిన దగ్గరనుంచి లోగడ ప్రజలు అలవాటు  పడిన అనేక పనుల  అవసరం నేటి  ప్రపంచంలో లేకుండాపోయింది. వెనుక ఏదయినా ఫోను నెంబరు కావాల్సివస్తే డైరెక్టరీ తో పనిపడేది. ఇప్పుడు వాటిని చూసేవారే లేరు. ఇంటర్ నెట్ వినియోగం  ఇంకా పూర్తిగా  వ్యాపించని కొన్ని దేశాల మాటేమో గాని ఇప్పుడు అనేకానేక దేశాల్లో ట్రావెల్ సంస్తల కార్యాలయాలకు వెళ్లి ప్రయాణాల టిక్కెట్లు కొనుక్కునే వారి సంఖ్య నామమాత్రం. పోస్ట్ కార్డులు, పబ్లిక్ టెలిఫోన్ బాక్సులు, ఫోటో ప్రింటింగ్, టెలిఫోన్ నెంబర్లను  గుర్తుగా రాసుకునే చిన్నిచిన్ని  పుస్తకాలు క్రమంగా కనుమరుగైపోతున్నాయి అని లండన్ కు చెందిన మొజి కంపెనీ చేసిన సర్వే తెలుపుతోంది. ఫిలిం షో టైమింగులు చెక్ చేసుకోవడానికి పేపర్లు తిరగేయడం కూడా బాగా తగ్గిపోతోంది.

మాయమై పోతున్న అంశాలు మననం చేసుకుంటున్నప్పుడు మిత్రులు ఆర్.వీ.వీ. కృష్ణారావు గారు హరికధను గుర్తుచేశారు. అదేమిటో ఆయన మాటల్లోనే విందాం.
మనకు ఇష్టం లేని కబుర్లు ఎవరయినా  చెపుతుంటే ఈ హరికధలు చాల్లేవోయి అంటూ ఉంటాము.
కానీ హరికధలంటే బోరు కొట్టే కధలు మాత్రం కాదు.హరికధలు, ఒకానొక కాలంలో జనాలను కట్టిపడేసిన భక్తిరస ధునులు. ప్రజలను సమ్మోహితులను చేసిన శ్రవణానందకర ధ్వనులు.
చాన్నాళ్ళుగా ఈ ఛానళ్ళ ప్రోగ్రాములు చూసి చూసి విసుగెత్తి పోయినప్పుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కాని భక్తీ ఛానల్ కాని చూడడం ఈ మధ్య తెలియకుండానే ఒక అలవాటుగా మారిపోయింది. నిజంగా పెద్ద రిలీఫ్.  ఈ మధ్య ఎస్.వి.బి.సి. ఛానల్ లో ఉమామహేశ్వరీ గారి హరికథ చూసాను. ఎంతో బాగా చెప్పారు.మరపున పడుతున్న మధుర జ్ఞాపకాలను తమ హరికధా గానంతో తట్టిలేపారు.
"ఈ నాటి పిల్లలకు కాని ఇంకా చాలామంది  పెద్ద వాళ్ళకు కాని హరికథ అనే ప్రసిద్ధ కళా రూపం వొకటి వుందని కూడా తెలియదేమో అనిపించే రోజుల్లో జీవిస్తున్నాము.   హరికథ ఎంత గొప్పదో నాకు తెలుసు.  నేను కాలేజీ చదువు పూర్తయిన తరువాత కూడా హరికథ అంటే ఎంతో ఇష్ట పడే వాడిని.   ఎనభయ్యో దశకములో కూడా హరికథకు ఎంతో కొంత ప్రభావము వుండేది.
"యాభయ్, అరవై దశకాల్లో కూడా హరికథ ఎంతో  ఉచ్చ స్థితిలో వుండేది. దేవాలయాల ఉత్సవాలలో, వినాయక చవితి, దేవి నవరాత్రుళ్ళు, శ్రీరామ నవమి పందిళ్ళలో, పెద్ద స్థితిమంతుల ఇళ్ళల్లో జరిగే  శుభకార్యాలలో హరికథా కాలక్షేపాలు ఉండేవి.  మధ్య మధ్యలో వేసవికాలంలో  కూడా గ్రామస్తులు అంతా కలసి రామాయణమో, మహా భారతమో సీరియల్ గా చెప్పించుకొనే వారు.    సాంస్కృతిక కార్యక్రమాలు నెలనెలా  నిర్వహించే గాన సభల్లో కూడా ఏడాదికి వోసారి అయినా హరికకధ  పెట్టించే వారు.

హరికధ అనేది  సర్వ కళాసమాహారం.  హరికథ చెప్పే దాసు గారికి సాహిత్యం, సంగీతం క్షుణ్ణంగా వచ్చి తీరాలి. రామాయణ,భారత,భాగవతాదులు కరతలామలకంగా వుండాలి.  కొద్దో గొప్పో నాట్యం తెలిసి వుండాలి.  వీటన్నితో పాటు సమయస్పూర్తి, చతురత, రక్తి కట్టించే సామర్ధ్యం అవసరం. అభినయ కళ తెలిసివుండడం కూడా ముఖ్యం.  ఇన్ని వుంటేనే  దాసుగారికి బంతిపూల దండలు  దండిగా పడేది.  హరి కథలు చెప్పే దాసుగారిని భాగవతార్ అని పిల్చేవారు.  అమ్ముల విశ్వనాథ భాగవతార్ అలా.  హరికథకి వయోలిన్, మృదంగం పక్క వాయిద్యాలు.  దాసుగారు కుడిచేతిలో చిడతలు పట్టుకొని కీర్తనలు పాడేటప్పుడు తాళం వేస్తూ వుండే వారు. కాళ్ళకు గజ్జెలు.  దాసు గారి ఆహార్యం పట్టు పంచె, పట్టు ఉత్తరీయం, నుదుట సింధూరం. అన్నట్టు దాసుగారు తనతో ఎప్పుడూ తీసుకు వెళ్ళేది శ్రుతి బాక్స్.

కథా ప్రారంభంలో దాసుగారు పక్క వాయిద్యాల సమేతంగా వేదిక మీద కూర్చునే గణపతి ప్రార్ధనతో మొదలుపెట్టి తాను  ఏ కధ  చెప్పదలచుకొన్నారన్నది  సూచన ప్రాయంగా తెలియచేస్తూ  రెండు మూడు కీర్తనలు పాడే వారు. తర్వాత లేచి నిలబడి, గజ్జెలు కళ్ళకు అద్దుకొని, వాటిని  కాళ్ళకు కట్టుకొని, శ్రీమద్రమారమణ గోవిందా అని తానంటూ, సభికులందరి చేతా గట్టిగా అనిపిస్తూ  కథలోకి ఉపక్రమించే వారు.  కీర్తనలు ఆలపించేటప్పుడు పక్క వాయిద్యాల సహకారం తీసుకొనే  వారు. సందర్భోచితంగా నాట్యం చేస్తూ కథను రక్తి కట్టించే వారు. నిద్రలో జోగే శ్రోతలను మేలు కొలిపెందుకు మధ్యమధ్యలో గోవిందలు కొట్టించేవారు.  సినిమాలో కూడా హరికథలు పెట్టేవారు.  పది పదిహేను నిమిషాలు వుండేవి.  విజయా వారి షాహుకారు సినిమా హరికథ తోనే ప్రారంభం అవుతుంది.  నాగేశ్వరరావు కృష్ణకుమారి నటించిన కవితా వారి వాగ్దానం సినిమాలో రేలంగి హరిదాసుగా ఘంటసాల పాడిన  సీతా కల్యాణం చాలా మంది ఇష్టపడే మరపు రాని హరికథ.
హరికథ అంటే ఆది భట్ల నారాయణ దాసు గారి పేరే అందరికి గుర్తుకు వస్తుంది.  విజయనగరం సంస్థానం ఆస్థాన విద్వాంసులు ఆయన. ఫిడేలు  ద్వారం వెంకట స్వామి నాయుడు గారికి ముందు విజయనగరం సంగీత కళా శాల ప్రిన్సిపాల్ గా పనిచేసారు కూడా. హరికధ  చెప్పే ప్రతివారు మేము నారాయణదాసు గారి శిష్యులమనో లేదా ఆయన కథలు చెపుతున్నామనో చెప్పుకొనేవారు.  ఇప్పటికి కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో నారాయణ దాసు గారి ఉత్సవాలు చేస్తూ వుంటారు.
ఆయన తర్వాత తరంలో నరసాపురం దీక్షిత్ దాసు గారు. మా అమ్మ గారు నారాయణ దాసు గారు దీక్షిత దాసు గారు ఇద్దరి కథలూ విన్నాను అని చెప్పారు.  నేను కూడా ఎందరో ప్రసిద్ధులయిన  విద్వాంసుల హరికథలు విన్నాను.  తోట్లవల్లూరులో మా నాన్నగారు రాయసం గంగన్న పంతులు గారు వేణు గోపాల  స్వామి దేవాలయం ఆఫీసర్ గా పనిచేసినప్పుడు  వైశాఖ పౌర్ణమి కల్యాణాలలోను,  శివాలయంలో శివరాత్రి, దసరా నవరత్రులలోను ఎంతో మంది పేరున్న వారు వచ్చి హరికథలు చెప్పే వారు. కూచిభొట్ల కోటేశ్వర రావు అనే ఆయన బక్క పలచగా పొడుగ్గా వుండేవారు.  భక్త పోతన హరికథ ఎంతో గొప్పగా చెప్పే వారు.  'లలిత సరస గాన కళానిధే' అంటూ ప్రార్ధన చేసేవారు.  లేచి నిల్చున్న  వెంటనే 'వాసుదేవ' అని కళ్యాణి రాగంలో త్యాగరాజ కీర్తన ఎంతో శ్రావ్యంగా పాడే వారు.  సందర్భానికి తగ్గట్టుగా  పిట్ట కథలు చెప్పే వారు. ఇరవయ్యేళ్ళ తర్వాత నేను బెజవాడ రేడియోలో పని చేస్తున్నప్పుడు కూడా వారిని కలిసే అవకాశం నాకు దక్కింది.  పోతన భాగవతాన్ని అమ్ముకోలేక ఎంత బాధ పడ్డాడో అందరికీ తెలిసిందే.  పోతన గారిలాగే  కూచిభొట్ల వారుకూడా తమకున్న అద్భుతమయిన హరికథా విద్యను  అమ్ముకోలేదు.  ఏమిస్తే అది పుచ్చుకొనే వారు. పేద వారయినా పెద్ద మనసు వున్నవారు.  మేము బెజవాడలో త్యాగరాజ సంగీత కళా సమితి అనే సంస్థను ప్రారంభిస్తే ఇంట్లో వున్న  వెండి త్యాగరాజు ఫోటో పట్టుకొచ్చి ఇచ్చి 'ఇదే మీ లోగో' అన్న గొప్ప హృదయం వున్నమనిషి ఆయన. ప్రాతఃస్మరణీయులు.




సొమ్ములు వాగ్దేవికి
సరసమ్ములు సంగీత సహజ సౌందర్య
విలాసమ్ములు, మధురమ్ములు, మా   
అమ్ముల తమ్ముల మనోహరాపముల్  –కరుణశ్రీ  



అమ్ముల విశ్వనాధం గారు మరో గొప్ప విద్వాంసులు.  చల్లపల్లి, అవని గడ్డ ప్రాంతం వారు.  స్ఫురద్రూపి. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి శిష్యులు.మండలి బుద్ధప్రసాద్ గారు ప్రచురించిన దివిసీమ రత్నాలలో అమ్ముల విశ్వనాధం గారి గురించి చాలా వివరంగా వుంది.  నారాయణదాసు గారి తర్వాత బహుశః శిలా విగ్రహం వేయించుకోగలిగిన గౌరవం పొందింది అమ్ముల వారే.  శివధనుర్భంగం కథ చాలా గొప్పగా చెప్పేవారు. నేను రేలంగి లో వున్నప్పుడు మావూళ్లో సుబ్రహ్మణ్య షష్టికి కధ చెప్పిన తరువాత మళ్ళీ వూళ్ళోవాళ్ళు పిలిపించి రామాయణం సీరియల్ గా వారం రోజులు చెప్పించారు.  ఆఖరి రోజున రామపట్టాభిషేకం నాడు దాసుగారిని ఘనంగా సత్కరించారు కూడా.అమ్ముల విశ్వనాధం గారి అమ్మాయి దుర్గాభవాని ప్రస్తుతం విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో వయోలిన్ ఆర్టిస్టుగా పనిచేస్తోంది.
సీరియల్ హరికథల గురించి కొంత చెప్పాలి. పొలం పనులు అయిపోయి అందరు తీరిగ్గా వున్నప్పుడు సీరియల్ హరికథలు పెట్టించుకునేవారు.  గుళ్ళో కళ్యాణ మండపం స్టేజిగా రామాయణమో, భారతమో పూర్తిగా చెప్పించే వారు.  రాత్రి ఏడు ఎనిమిది మధ్య ప్రారంభమయిన కథ పన్నెండు గంటల దాకా సాగేది.  మధ్యలో హారతి పళ్ళెం పట్టే వారు.  హరికధ వినడానికి వచ్చిన  హారతి పళ్ళెంలో  తమకు తోచిన విధంగా అణా, అర్ధణా, బేడా, పావలా కాసులు వేసేవాళ్ళు.  పళ్ళెం మధ్యలో చిన్న కుంది పెట్టి వొత్తి వెలిగించి  దీపం పెట్టే వాళ్ళు.  చీకట్లో కొంతమంది అణా వేసి పావలా కొట్టేసేవారని జోకులు కూడా ఉండేవి. చిల్లర లేక పోతే హారతి పళ్ళెం పట్టే వాడిని అడిగి తీసుకునే వెసులుబాటు వుండేది. నా దగ్గర పావలా వుంది నేను వో అణా వెయ్యాలి మిగతాది ఇచ్చెయ్యిఅని అడిగి తీసుకునే వారు.
"వీరగంధం వెంకట సుబ్బారావు, రాజశేఖరుని లక్ష్మీపతి రావుర్యాలి రామచంద్ర రావు, కంచిభొట్ల వీర రాఘవయ్య, నౌడూరి విశ్వనాధ శాస్త్రి , కడలి వీరదాసు, ముదపాక మల్లేశ్వర రావు, ప్రగడ వీర భద్ర రావు, ముదునూరు శంకర్ రావు, ఎల్లమంద రావు, చోరగుడి పాండురంగరావు గార్లు హరికధలు చెప్పడంలో దిట్టలుగా పేరుతెచ్చుకున్నారు.  ములుకోట్ల సదాశివ శాస్త్రి గారు అని తెనాలి అనుకొంటా.  హైస్కూల్ లో తెలుగు మాష్టారు గా వుండే వారు. త్యాగరాజ చరిత్రను  రామ భక్తి అంతా జోడించి చెప్పే వారు.   1996  ప్రాంతంలో నేను హైదరాబాద్ రేడియోలో పని చేస్తున్నప్పుడు తెనాలి నుంచి వాళ్ళ తాలూకు వాళ్ళు ఫోన్ చేసి ఆయన మరణించారు అని చెప్పి ఆయన్ను గురించి వివరిస్తూ ఉంటే ఆయన గొప్ప తనం నాకు తెలుసండీ  అని వార్తల్లో విపులంగా చెప్పాము. వార్తలు విన్న తర్వాత ఆయన మళ్ళీ ఫోన్ చేసి అంత బాధలో కూడా చాలా బాగా కవర్ చేసారు అని థాంక్స్ చెప్పాడు.  పాతూరి మధుసూదన్ రావు  గారు  మొత్తం సంస్కృతం లోనే హరికథ చెప్పే వారు. సంసృతం రాని వాళ్ళకు కూడా అర్ధం అయ్యేలా. ఇలా రాసుకొంటూపోతే  చాలా  వున్నాయి. రేడియోలో ప్రయాగ నరసింహ శాస్త్రి గారు. ఏ కధ అయినా చెప్పేవారు. షెడ్యూల్ చేసిన ప్రోగ్రాం లేక పోతే ప్రయాగ వారి హరికథ వుండేది.  గాంధీ, నెహ్రు, బోస్  చరిత్రలు కూడా ఆయన హరికధలుగా  చెప్పే వారు.
తర్వాత తరం లో మనకందరికీ తెలుసున్న వ్యక్తి కోట సచ్చిదానంద  శాస్త్రి గారు.  చాలా రమణీయం గా హాస్యోక్తులతో ఎన్ని గంటలు విన్నాఇంకా ఇంకా  వినాలనిపించేలా చెప్పేవారు. ఇప్పటికి కూడా చెప్తున్నారు.  2005 లో నల్లకుంట శంకర్ మఠంలోదర్శనం మాస పత్రికతో కలసి వారం రోజుల పాటు  హరికథా ఉత్సవాలు నిర్వహించారు,  మా ప్రసార భారతి సి.యి.వో. కే.ఎస్. శర్మ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి.
బుర్రా  శివరామకృష్ణ శాస్త్రి కూడా మంచి కథకులు.  ఆడ వారిలో కూడా మంచి విద్వాంసులు వున్నారు. తెనాలి ఉమా చౌదరి భాగవతారిణి  కొన్నేళ్ళపాటు ఆంధ్రదేశం తో పాటు ఇతర రాష్ట్రాలోని తెలుగు వారికి సయితం  అభిమాన పాత్రులయ్యారు.  నగరాజకుమారి, వజ్రాల విజయ శ్రీ , మంత్రిప్రగడ లలిత కుమారి హరికథలు అంటే జనం  చెవి కోసుకొనే వారు.
రాజమండ్రి  దగ్గర కపిలేశ్వరపురం జమీందార్  సత్యనారాయణరావు గారు సర్వారాయ హరికథ గురు కులం ప్రారంభించి, హరికధలపట్ల ఆసక్తివున్న వారికి   అక్కడే వసతి కల్పించి రెండు మూడు సంవత్సరాలు శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేసారు.  ఇప్పుడు హరికథ చెపుతున్నవారిలో  చాలా మంది కపిలేశ్వరపురం  గురుకులం  విద్యార్ధులే - మొదట్లో ప్రస్తావించిన ఉమా మహేశ్వరితో సహా.  ఉమా మహేశ్వరి  చాలా చిన్నతనంలోనే సంసృతంలో హరికధ  చెప్పి అందరిని మెప్పించారు.  మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు. నటరాజ రామకృష్ణ గారి ప్రియ శిష్యులు కళా కృష్ణ గారిని వివాహం చేసుకొని ఈ  దంపతులిద్దరూ  వొకరు పేరిణి నాట్యం ద్వారా  మరొకరు హరికథ ద్వారా కళాసేవ  చేస్తున్నారు.
"ఆచార్య తూమాటి దోణప్ప గారు హరికధా సర్వస్వం అనే గ్రంధం రాశారు.  తెలుగు యూనివర్సిటీ వారు నిరుడు తమ రజితోత్సవాల సందర్భంగా తక్కువ ధరకు అమ్మిన పుస్తకాల్లో ఇది కూడా వుంది. ఇంకా అవి వున్నాయో లేదో  కూడా తెలియదు. హరికధను అభిమానించే వారంతా కొని  దాచుకోవాల్సిన పుస్తకం.

రేడియోలో ప్రతి మంగళవారం రాత్రి తొమ్మిదిన్నరకు గంట సేపు హరికథ వచ్చేది. రేడియో సంగీత సమ్మేళనం, నాటక సప్తాహం లాగా హరికథా సప్తాహం కూడా నిర్వహించే వాళ్ళు. హరిదాసులు అందరు వారి లెటర్ హెడ్స్ పైనా, కర పత్రాల పైనా రేడియో ఆర్టిస్టుఅని వేసుకొనే వారు.  ఇప్పుడు కూడా హరికథలు ప్రసారం చేస్తున్నారో లేదో వోసారి చెక్ చెయ్యాలి.  వస్తే చాలా సంతోషం. మానేస్తే  అంత కంటే అన్యాయం మరోటి వుండదు.  తోలుబొమ్మలాటలు పోయాయి. పౌరాణిక నాటకాలు మరచి పోతున్నారు. హరికథని అలా కానివ్వకూడదు.  తమిళనాడులో ఇంకా హరికధ  ఆదరణకు నోచుకుంటూనే వుందన్న సంగతి మరచిపోకూడదు.

గతంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ కధా గాన కళా పరిషద్ ఏర్పాటు చేసింది. సంగీత,సాహిత్య, నాటక అకాడమీల్లాగానే అది కూడా కాలగర్భంలో కలసిపోయింది. అలాగే బుర్రకధలు. ఎన్నికలప్పుడే ప్రచారాలకోసం గుర్తుకొచ్చే విధంగా క్రమంగా మాయమయిపోతున్నాయి. (18-12-2011)