భగవద్గీత మీద
ప్రమాణం చేసి - భండారు శ్రీనివాసరావు
ప్రపంచ అద్భుత సంఘటనల్లో ఒకదానిగా ప్రసిద్ధి చెందిన
మొట్టమొదటి అణు బాంబు పరీక్ష జరిగి ఇప్పటికి దాదాపు అరవై ఏడేళ్ళు గడిచాయి. న్యూ
మెక్సికోలోని సోకొర్రోకు ఆగ్నేయంగా 35 మైళ్ల దూరంలో 1945 జులై 16 వ తేదీన ‘ట్రినిటీ’
అనే గుప్త నామంతో అమెరికా అణు పరీక్ష జయప్రదంగా నిర్వహించింది. అప్పటినుంచి లోకంలో
అణు శకం మొదలయిందని చెప్పుకోవచ్చు.
మళ్ళీ ఇన్నేళ్ళ తరవాత
కమ్యూనిజానికి కాలం చెల్లిన రష్యాలో వ్యాస విరచితమయిన ‘భగవద్గీత ‘ను నిషేధించే
ప్రయత్నాలు మొదలయ్యాయి.
అప్పట్లో అమెరికా జరిపిన అణు
పరీక్షకూ, భగవద్గీతకూ సంబంధమేమిటన్న అనుమానం రావచ్చు. దాన్ని నివృత్తి చేసుకోవాలంటే గతాన్ని కొంత
నెమరు వేసుకోవాలి.
అమెరికా ఈ పరీక్షకు పెట్టిన
పేరు ‘ట్రినిటీ’ అయితే పరీక్షించిన అణుబాంబు కు నిర్దేశించిన నామం ‘ది గాడ్జెట్’ .
తొలి అణు పరీక్షను విజయవంతంగా జరిపిన విజయోత్సాహంతో
అమెరికా కొద్ది వ్యవధిలోనే రెండు
అణు బాంబులను జపాను పై ప్రయోగించి అణు బాంబు శక్తిసామర్ధ్యాలను లోకానికి
ఎత్తిచూపింది.
1945 ఆరోతేదీన తొలి బాంబు ప్రయోగం
జపాను లోని హిరోషిమాపై జరిగింది. మరో మూడురోజులకే తొమ్మిదో తేదీన రెండో అణు
బాంబును నాగాసాకీపై అమెరికా ప్రయోగించింది.
హిరోషిమాపై జారవిడిచిన అణుబాంబు గుప్తనామం ‘లిటిల్ బాయ్’ కాగా, నాగాసాకీని
మట్టుబెట్టిన బాంబుకు పెట్టిన పేరు ‘ఫ్యాట్
మ్యాన్‘
నిజానికి హిరోషిమాపై ప్రయోగించిన తొలి బాంబు పరీక్ష చేసి ప్రయోగించినది కాదు. అయినా విజయవంతం
అయింది. ఈ బాంబును ముందుగా పరీక్షిం చకపోవడానికి కూడా ఒక కారణం వుంది. ఒకే
ఒక్క బాంబుకు కావాల్సిన యురేనియం -235 నిల్వలు మాత్రమే అమెరికా
వద్ద మిగిలివుండడంతో ఆ బాంబును పరీక్షించడానికి వీలు లేకుండా పోయింది. పోతే
నాగాసాకీపై ప్రయోగించిన బాంబు ట్రినిటీ మాదిరి తయారు చేసిన అణు బాంబు.
ఈ రెండు బాంబులు కలసి సృష్టించిన
మారణ హోమం ఇంతా అంతా కాదు. ప్రయోగించిన ఒకటి రెండు క్షణాల వ్యవధిలోనే లక్షా నలభై
ఎనిమిది వేలమంది ప్రాణాలు గాలిలో కలసి పోయాయి. ఆ బాంబులు కలిగించిన అణు ధార్మిక ప్రభావం కారణంగా ఆ
తరువాత అయిదేళ్ళలోమరణించిన వారి సంఖ్య లక్షలకు
చేరింది. దీన్నిబట్టి అణ్వస్త్రాల వల్ల అవనికి పొంచివున్న ముప్పు యెంతటిదో అర్ధం
చేసుకోవచ్చు.
తొలి అణు పరీక్ష
పోతే, ట్రినిటీ పరీక్షకు
అంతా సిద్ధం చేసుకున్న అమెరికా
శాస్త్రవేత్తలకు వర్షం రూపంలో తొలి అడ్డంకి ఎదురయింది. అణు విస్పోటన పరీక్షకు తెల్లవారుఝామున నాలుగు గంటలకు ముహూర్తం
నిర్ణయించారు. కానీ వాతావరణం ఉరుములు,
మెరుపులు వర్షంతో అనుకూలించలేదు. ఆ పరిస్థితుల్లో పరీక్ష నిర్వహిస్తే పరిణామాలు
దారుణంగా వుంటాయని అధికారులు భావించి కొద్ది సేపు వాయిదా వేసారు. ప్రెసిడెంట్
ట్రూమన్ తో సహా అంతా ఎదురు చూస్తున్న
వాతావరణ నివేదిక ఉదయం నాలుగు గంటల నలభై అయిదు నిమిషాలకు శాస్త్రవేత్తలకు అందింది. పరీక్షకు అధికార్లు పచ్చ జెండా చూపారు. సరిగ్గా 5-10 కి 20 నిమిషాల కౌంట్ డౌన్
మొదలయింది. అక్కడికి 16 మైళ్ల దూరంలో నిర్మించిన ఎత్తయిన టవర్ నుంచి ఉన్నతాధికారులు
ప్రయోగ ప్రక్రియని పరిశీలిస్తున్నారు. స్తానిక కాల మానం ప్రకారం
ఉదయం అయిదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నలభై అయిదు సెకన్లకు మానవాళి భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తూ తొలి అణు విస్పోటనం తన భీషణ రూపాన్ని ప్రదర్శిస్తూ
లోక భీకరంగా ఆవిష్క్రుతమయింది. పేలుడుకు ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దద్దరిల్లాయి. క్షణంలో వందో వంతులో 20 కిలో టన్నుల టి.ఎం.టి.
శక్తికి సరిసమానంయిన ‘ఎనర్జీ’ విడుదలయింది. ఒకటి రెండు క్షణాలపాటు ఆ ప్రదేశం, చుట్టుపక్కల కొండలు పట్టపగలు వెలుతురును తలదన్నే
విధంగా వేయి సూర్యుల కాంతితో (దివి సూర్య
సహస్రస్య – భగవద్గీత 11 వ అధ్యాయం 12 వ శ్లోకం ప్రధమ పాదం) వెలిగిపోయాయి. బాంబు పేలిన చోట పది అడుగుల లోటు వంద అడుగుల వెడల్పు కలిగిన గొయ్యి ఏర్పడింది.
ఆ ప్రదేశం యావత్తు నిప్పుల కొలిమిలా మారింది. నీలంనుంచి ఎరుపు, ఎరుపు నుంచి పచ్చ, పచ్చ నుంచి తెలుపు - ఇలా రకరకాలుగా రంగులు మారుతున్న దృశ్యాలు ఆకాశంలో
దర్శనమిచ్చాయి. పెద్ద పుట్టగొడుగు మాదిరిగా నల్లటి నలుపు రంగుతో మిశ్రితమయిన ఎర్రటి పొగ మేఘాలు గగన తలంలో ఏడున్నర మైళ్ల ఎత్తు వరకు
ఎగిసిపడ్డాయి.
ట్రినిటీ పరీక్ష డైరెక్టర్
కెన్నెత్ బ్రెయిన్ బ్రిడ్జ్ బాంబు పేలుడు
సృష్టించిన ఉత్పాతానికి విభ్రమ చెందాడు. ప్రపంచ వినాశ నానికి దోహదం చేసే దారుణ ప్రక్రియలో పాలుపంచుకున్న నిర్వేదం ఆయన తొలి
పలుకుల్లో ధ్వనించింది. ‘చీ! జరగరానిది జరిగి పోయింది –‘Now we all
sons of bitches’- అదీ ఆయన వ్యాఖ్య.
ట్రినిటీ పరీక్షకు సాక్షీభూతంగా నిలచిన మరో శాస్త్ర
వేత్త , ఈ నాటి ఈ వ్యాసానికి ప్రేరకుడు అయిన జె.రాబర్ట్ ఓపెన్ హీమర్ (J.Robert Oppenheimer) ‘వేయి సూర్యుల కాంతి ‘ అన్న భగవద్గీత లోని సంస్కృతపాదం
ఆధారంగా ఆనాటి దృశ్యాన్ని వర్ణించారు. ఆ తరువాత చాలా ఏళ్ళకు అణు పరీక్షను గురించి మాట్లాడుతూ
మరో మాట చెప్పారు. ముందు అది ఎవరికీ అర్ధం కాలేదు ఎందుకంటె అది సంస్కృతంలో వుంది. భగవద్గీతలోని వాక్యం అది. ‘కాలోస్మి లోకక్షయకృత్
ప్రవ్రుద్దో లోకాన్ సమాహర్తు మిహ ప్రవృత్తః’
("kālo'smi
lokakṣayakṛtpravṛddho lokānsamāhartumiha pravṛttaḥ" which
he translated as "I am become Death, the destroyer of worlds)[
అంటే
-
‘నేనే మృత్యువును. లోకాలను నాశనం చేసే సర్వంసహా శక్తిని’
ఇక మాస్కో కోర్టు భగవద్గీత గురించి ఏ తీర్పు యెలా ఇస్తే ఎవరికి కావాలి ? (19-12-2011)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి