మరపురాని
మరికొందరు మహానటులు
-ఆర్వీవీ కృష్ణారావు, భండారు
శ్రీనివాసరావు
నాటకాలు ఆడేవారిలో సూరిబాబు,రాజేశ్వరి నిజజీవితంలో భార్యాభర్తలు.
సూరిబాబు కంఠం అదోరకంగా వుంటుంది. కంచు కంఠం అనేవారు.
చాలా సినిమాల్లో వేషాలు వేసారు. ఎక్కువగా నారదుడిగా.
స్టేజి మీద ఆయన ధర్మరాజు వేసేవారు.
పాచికలు ఆడే సీనులో తమ్ములను, ద్రౌపదిని
వొక్కొక్కరినీ పణంగా పెట్టి వోడిపోతున్న ఘట్టంలో పద్యాలు
గొప్పగా ఉండేవి. రాజేశ్వరితో కలసి ‘తారాశశాంకం’ ఆడేవారు.
బెజవాడలో శరభయ్య గుళ్ళకు ఎదురుగా రైలు పట్టాలకు ఆవతలి
వయిపు ‘రాజేశ్వరి మేడ’ వుండేది. కందుకూరి
చిరంజీవి రావు మరో ధర్మరాజు. రేడియోలో స్టాఫ్
ఆర్టిస్ట్ గా వుండేవారు. పద్యంతో పాటు నటనకు ప్రాధాన్యం ఇచ్చేవారు.
సి.డి. కృష్ణమూర్తి అనే ఆయన కూడా ధర్మరాజు, కృష్ణుడు వేషాలు వేస్తూ వుండేవారు. జైహింద్ టాకీసు లక్ష్మీ టాకీసుల మధ్య సోమిదేవమ్మ గారింట్లో
వెనుక పోర్షన్ లో అద్దెకు వుండేవారు. పుట్టుకతో అరవ వాడు అయినా తెలుగులో
సుస్వరంతో రాగయుక్తంగా పద్యాలు పాడేవారు. కిరీటం వెనుక గుండ్రటి వెలుగు
ప్రసరిసున్నట్టుగా కృష్ణుడి వేషంలో ట్రిక్ ఫోతోగ్రఫీతో తీయించుకున్న అనేక ఫోటోలు సీడీ కృష్ణమూర్తి గారింట్లో గోడలమీద దర్శనమిచ్చేవి.
దుర్యోధనుడుగా ధూళిపాళ సీతారామ శాస్త్రి గారి పేరు అందరికీ తెలిసిందే. నాటకాల్లో
ప్రారంభించి సినిమాలకు వెళ్లి అడపా తడపా మళ్ళీ నాటకాలు వేస్తూ వుండేవారు. చివరగా అవసాన దశలో గుంటూరులో వో పెద్ద ఆంజనేయ స్వామి గుడి కట్టించి హనుమాన్ చాలీసా పారాయణ
చేస్తూ రాముల వారిలో ఐక్యం పొందారు.
ఎన్. వి. ఎల్. నరసింహాచార్యులు, తుర్లపాటి
రాధాకృష్ణమూర్తి , వెంట్రప్రగడ నారాయణరావు, దుర్యోధన వేషాలకు
ఖ్యాతి గడించారు. కురుక్షేత్రంలో భీముడిదో మంచి పాత్ర. వేమవరపు శ్రీధరరావు
గారు భీముడి పాత్రకి మరోపేరుగా నిలిచారు.
ఈయనకూడా రేడియో స్టేషన్ లో స్టాఫ్ ఆర్టిస్ట్ గా
వుండేవారు. టి. శేషా రావు, విన్నకోట సాంబయ్య భీముడిగా గుర్తుండిపోయే పేర్లు. అబ్బూరి ఆదినారాయణ శర్మ, అబ్బూరి వర ప్రసాద
రావు తమ్ముడు. ఈయన కర్ణుడిగా వేసేవారు. అలాగే అబ్బూరి
వెంకటప్పయ్య. హెచ్. ఎం. వి. వారి గ్రామఫోను రికార్డుల్లో అబ్బూరితో కలసి పాడారు.
వల్లూరు వెంకట్రామయ్య చౌదరి ‘బాలనాగమ్మ’ నాటకం
ఆయన పోయే వరకు బాగా నడిచింది. మాయల ఫకీరుగా ఆయన నటన
గొప్పగా వుండేది అనే వారు. ఓ నాటకంలో నటిస్తూనే స్టేజీ మీదే చనిపోయారు. అలాగే ‘రామాంజనేయ యుద్ధం’ లో ఆంజనేయుడి పాత్ర
ధరించే బేతా వెంకటరావు గారు కూడా వేషం మీదే
చనిపోయారు. మహానుభావులు. కళామతల్లి సేవచేస్తూనే కన్నుమూశారు. వెంకటరావు గారి అబ్బాయి బేతా రామచంద్రరావు తండ్రి కళను పుణికిపుచ్చుకున్నాడు. అతడు కూడా ఆంజనేయుడి
వేషం వేసేవాడు.
కుందేరు కృష్ణ శర్మ అని విజయవాడలో కనక దుర్గ కళాసమితి
గుమస్తాగా వుండే వారు. చాలా నాటకాల్లో వేసేవారు. కృష్ణుడు దగ్గర్నుంచి
సహదేవుడి దాకా. ప్రతి
నాటకంలోను ఆయన తప్పని సరిగా కనపడే వారు. ఎంతో సహృదయులు. చాలా మంది నటులు అవసాన
దశలో కష్టాలు పడుతుంటే చూడలేక వాళ్ళకోసం
వో నాటకం పెట్టి ఇంటింటికీ వెళ్లి
టికెట్లు అమ్మి డబ్బు పోగు చేసి ఇచ్చేవారు. కర్రి అబ్బులు, ద్వారపూడి
సూర్యారావు, కే. హరి ప్రసాద రావు, అయ్యదేవర
పురుషోత్తమరావు కూడా కృష్ణుడి వేషం వేసి పేరు తెచ్చుకున్నవారే.
హరిశ్చంద్ర పాత్రకు డి. వి. సుబ్బారావు గారని బందరు వాస్తవ్యులు వుండే వారు. ‘వింధ్యారాణి ఫేం’ అని చెప్పుకొనేవారు. మల్లాది సూర్యనారాయణ గారు కూడా హరిశ్చంద్ర వేసే వారు. తర్వాత వేటపాలెం నుంచి మరో డి. వి. సుబ్బారావు వచ్చారు. హరిశ్చంద్ర వొకటి ఆడేవారు. ఐదో తరగతి కూడా చదివి వుండరు కానీ ఆయన వేసిన టికెట్ డ్రామా అంటే చాలు డబ్బులు బాగా వచ్చేవి. నెల్లూరుకు చెందిన పొన్నాల రామసుబ్బారెడ్డి మరో ప్రసిద్ధి చెందిన నటుడు. హరిశ్చంద్ర పాత్రకు పెట్టింది పేరు. గూడూరి సావిత్రి అనే ఆవిడ ఈయన టీంలో చంద్రమతి గా పేరు పొందారు. మందపాటి రామలింగేశ్వర రావు విశ్వామిత్రుడుగా వేసేవారు.
హరిశ్చంద్ర పాత్రకు డి. వి. సుబ్బారావు గారని బందరు వాస్తవ్యులు వుండే వారు. ‘వింధ్యారాణి ఫేం’ అని చెప్పుకొనేవారు. మల్లాది సూర్యనారాయణ గారు కూడా హరిశ్చంద్ర వేసే వారు. తర్వాత వేటపాలెం నుంచి మరో డి. వి. సుబ్బారావు వచ్చారు. హరిశ్చంద్ర వొకటి ఆడేవారు. ఐదో తరగతి కూడా చదివి వుండరు కానీ ఆయన వేసిన టికెట్ డ్రామా అంటే చాలు డబ్బులు బాగా వచ్చేవి. నెల్లూరుకు చెందిన పొన్నాల రామసుబ్బారెడ్డి మరో ప్రసిద్ధి చెందిన నటుడు. హరిశ్చంద్ర పాత్రకు పెట్టింది పేరు. గూడూరి సావిత్రి అనే ఆవిడ ఈయన టీంలో చంద్రమతి గా పేరు పొందారు. మందపాటి రామలింగేశ్వర రావు విశ్వామిత్రుడుగా వేసేవారు.
(29-12-2011)
3 కామెంట్‌లు:
ఈ తరం వారికి తెలియని ఎందరో నటీ నటులను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. రాజేశ్వరి మేడ విజయవాడ సత్యనారాయణపురంలో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు హైస్కూలు ఎదురుగా ఉన్నది (AKTPMH SCHOOL గా పిలువబడుతున్నది, భవదీయుడు చదువుకున్న స్కూలు). ఆవిడ సూరిబాబు గారి భార్యా! ఈ ఆశ్చర్యం గుర్తు ఎందుకో మీకు తెలుసు అనుకుంటాను. ఆయన పోయినప్పుడు ఆయన భౌతిక దేహాన్ని ఆ మేడలోనే ఉంచారు, 1968-1969 ప్రాంతాల్లో అనుకుంటాను.
దయచేసి, (మీకు తప్పకుండా తెలిసి ఉంటారు) రేడియో నటీ నటుల గురించి, ముఖ్యంగా ఆకాసవాని విజయవాడ కేద్రం లో అన్నో చక్కని నాటక నాటికలను ప్రసారం చేసిన వారిని వీలయితే వారి వారి ఫొటోలతో పరిచయం చేస్తే రేడియో అభిమానులు ఎంతయినా కృతజ్ఞులం
@శివరామప్రసాద్ కప్పగంతు - రేడియో పట్లా రేడియో కళాకారుల పట్లా మీకున్న అభిమానానికి ధన్యవాదాలు. వంశీ గారి బ్లాగు చూస్తే మీ కృషి కూడా అసామాన్యం అని అర్ధం అవుతుంది. నాటకాలు, నాటక కళాకారుల వివరాల సేకరణలో ఆర్వీవీ కృష్ణారావు గారి పాత్ర ప్రధానం.నాది గారెకు చిల్లు పెట్టే వేలు పాత్ర మాత్రమే.మిగిలిన సంబారాలన్నీ ఆయనే సమకూర్చారు. వారికి మీ ఈ అభిప్రాయం తెలియచేస్తున్నాను.నూతన సంవత్సర శుభాకాంక్షలతో - భండారు శ్రీనివాసరావు
శ్రీనివాస రావు గారు,వీలైతే మీరు ప్రస్తావిస్తున్న నటుల నటించిన క్లిప్పింగులు ఏవైనా లభిస్తే వాటిని కూడా మీ వ్యాసాల్లో లింకులు పెట్టి వినిపించగలరు.
Prasad Sarma
కామెంట్‌ను పోస్ట్ చేయండి