28, సెప్టెంబర్ 2025, ఆదివారం
అయాం ఎ బిగ్ జీరో (223) : భండారు శ్రీనివాసరావు
23, సెప్టెంబర్ 2025, మంగళవారం
అయాం ఎ బిగ్ జీరో (222): భండారు శ్రీనివాసరావు
20, సెప్టెంబర్ 2025, శనివారం
అయాం ఎ బిగ్ జీరో (221): భండారు శ్రీనివాసరావు
‘నిన్ను కలుసుకోవాల్సింది అక్కడ కాదు, ఇక్కడ’ అన్నారు మా న్యూస్ యూనిట్ లో నా బల్లకు ఎదురుగా వున్న ఒక మామూలు ఫేమ్ కుర్చీలో కూర్చొంటూ మా సమాచార శాఖ జాయింట్ సెక్రెటరీ, మొత్తం ఆలిండియా రేడియో, దూరదర్సన్ లతో కూడిన ప్రసార భారతి సీ ఈ ఓ కె.ఎస్. శర్మ గారు. అంతవరకూ ఆయన మీద గొంతు వరకూ కోపం పెంచుకున్న నేను, ఆయన మాటలతో ఒక్కసారిగా చల్లబడిపోయాను.
అప్పటికి ఒక పదేళ్లు వెనక్కి వెడదాం.
కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం నుంచి మా డైరెక్టర్
కు ఫోన్ వచ్చింది.
‘మీ దగ్గర భండారు శ్రీనివాసరావు అనే పేరుగల
వాళ్ళు పనిచేస్తున్నారా అని కలెక్టర్ గారు కనుక్కోమన్నారు’ అని
వాకబు. అప్పుడు అక్కడ కలెక్టర్ గా పనిచేస్తున్నది ఐ ఎ ఎస్ అధికారి శ్రీ కంభంపాటి
సుబ్రమణ్య శర్మ. ఆయన బెజవాడలో చదువుకునే రోజుల్లో ఒక శ్రీనివాసరావు ఆయనకు స్కూల్లో
క్లాసుమేటో, జూనియరో అట. ఆ రోజు ఉదయం రేడియోలో నా జీవన స్రవంతి ప్రోగ్రాం
విన్న తరువాత కలెక్టర్ గారికి నా గురించి తెలుసుకోవాలని అనిపించిందట. సాయంత్రం
ఆఫీసుకు వెళ్ళిన తరువాత ఈ విషయం నా చెవిన వేశారు. ఆ తరువాత ఆ సంగతి ఆయనా
మరచిపోయారు, నేనూ
మరచిపోయాను.
కరీంనగర్ కలెక్టర్ గా ఆయన మంచి పేరు
తెచ్చుకున్నారు. కొన్ని వివాదాస్పద నిర్ణయాలు కూడా. అక్కడ ఒక పాడుపడ్డ చెరువును
పూడ్పించో , లేదా ఆ జాగాను వేలం వేయించో ప్రజలకు
అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ ఒకే గొడుగు కింద వుండేలా విశాలమైన పరిపాలనా
విభాగాల సముదాయాన్ని నిర్మించారు. ఇటువంటి నిర్ణయాలను ప్రజలు హర్షించారు, ప్రజాప్రతినిధులు వ్యతిరేకించారు. ఏమైతేనేం
సమర్ధుడు అయిన కలెక్టర్ గా పేరొచ్చింది. తరువాత ఆయన్ని హైదరాబాదుకు బదిలీ చేశారు, విద్యుత్ బోర్డు కార్యదర్శిగా. ఒకటి రెండు
సార్లు వెళ్లి కలిశాను వార్తల పనిమీద. ఒక క్లాసు మేటుగా ఆయన నన్ను గుర్తుపట్టలేదు.
పట్టినా పైకి ఆ మాట అనలేదు. నా సంగతి సరే!
చిన్నప్పుడు స్కూలుకు సరిగానే వెళ్ళే వాడిని కానీ
అందరితో స్నేహం చేసే అవకాశం లేదు. మా బావగారు ఈ విషయంలో చాలా స్ట్రిక్టు.
ఆ తరువాత నా మకాం, చదువు ఖమ్మానికి మారాయి. ఆ తరువాత
మళ్ళీ కాలేజి చదువుకు బెజవాడ. మధ్యలో ఎమ్మెసెం బండి (మార్చి – సెప్టెంబరు-
మార్చి). ఈ లోగా క్లాస్ మేట్స్ సీనియర్లు, జూనియర్లు క్లాస్ మేట్స్, ఆ
క్లాస్ మేట్స్ సీనియర్లు అయ్యారు. నా లాంటి వాళ్లకు క్లాస్ మేట్స్ ఏం గుర్తుంటారు?
ఖమ్మంలో చదివేటప్పుడు వెంకటేశ్వర రావు అనే
తెలివికల విద్యార్థి నా క్లాసు మేట్. ఎంత తెలివి కలవాడు అంటే, నేను రేడియోలో
ఉద్యోగం చేసేటప్పుడు నన్ను వెతుక్కుంటూ హైదరాబాదు వచ్చాడు. భోజనం చేసేటప్పుడు
విషయం చెప్పాడు. ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగం. బదిలీ అయింది. ‘నీకు శర్మగారు
తెలుసు కదా! ఒక మాట చెప్పవా’ అన్నాడు. అదెంత భాగ్యం అని వెంటబెట్టుకుని తీసుకుని వెళ్లాను. అతడిని బయట
కూర్చోమని, నన్ను అడిగారు శర్మగారు, ‘మీ ఫ్రెండ్ ఎక్కడికి అంటే ఏ విభాగానికి బదిలీ
కోరుతున్నాడో నీకేమైనా తెలుసా’ అని. ‘తెలియదు, శర్మగారు నీకు తెలుసా అంటే తెలుసు అని
తీసుకువచ్చాను’ అన్నాను. ‘అది నాకు ముందే అర్ధం అయింది. ఈ బదిలీ చేయడం నాకు
చిటికెలో పని. కానీ అతడు కోరుతున్నది నాలుగు రాళ్లు అదనంగా వచ్చే పోస్టు. తరువాత
నీకూ నాకూ చెడ్డపేరు రాదని నువ్వు హామీ ఇవ్వగలవా!’ అన్నారు. ‘నాకు ఇవన్నీ తెలియదు, ఏమైనా
ఇబ్బంది అనిపిస్తే వదిలేయండి, నేను అతడికి సర్ది చెబుతాను’ అని వచ్చేశాను.
తరువాత కొన్నాళ్ళకు మా వాడికి కోరిన చోటుకు కోరిన
పోస్టులో బదిలీ అయింది. థాంక్స్ చెబుదాము
అనుకుంటే శర్మగారు బదిలీపై కేంద్ర సర్వీసులకు ఢిల్లీ వెళ్ళారు.
ఇదొక కధ.
ఆ తరువాత నేను కుటుంబంతో సహా మాస్కో వెళ్లాను,
రేడియో మాస్కోలో పనిచేయడానికి.
అక్కడ ఒక చిక్కొచ్చిపడింది.
రష్యన్ స్కూళ్ళలో విద్య పూర్తిగా ఉచితం. ప్రతి
ఏరియాలో ఇంటి నుంచి నడిచిపోయే దూరంలో వుంటాయి ఆ స్కూళ్ళు. ఎక్కడైనా కొంచెం దూరంగా
వుంటే, ఉచితంగా
తీసుకువెళ్ళే స్కూలు బస్సులు
వుంటాయి. మధ్యాన్న భోజనం, స్కూలు
యూనిఫారాలు, పుస్తకాలతో
సహా అన్నీ ఉచితం. పోతే, మేము
వెళ్ళిన సంవత్సరమే ఇండియన్ ఎంబసీ సిబ్బంది పిల్లకోసం మాస్కోలో కేంద్రీయ విద్యాలయ్
సంఘటన్ వారు ఇండియన్
స్కూల్ ప్రారంభించారు. అయితే ఫీజులు
వుంటాయి. రష్యన్
స్కూళ్ళలో చేర్పిస్తే ఇండియాకు తిరిగి వెళ్ళిన తరవాత చదువులకు ఇబ్బంది అవుతుందని
ఇండియన్ స్కూల్ నే ఎంచుకోవాల్సి వచ్చింది.
అక్కడా
ఎడ్మిషన్లు అంత సులభంగా రాలేదు. మేము రష్యన్ ప్రభుత్వం పనుపున వచ్చాము
కాబట్టి హార్డ్ కరెన్సీ లో అంటే డాలర్లలో ఫీజు కట్టాలని ప్రిన్సిపాల్ గంగల్
కండిషన్ పెట్టారు. మాకిచ్చే జీతం మీలాగా డాలర్లలో కాదు, రూబుళ్ళలో
ఇస్తారని యెంత మొత్తుకున్నా ఆ బెంగాలీ బాబు గారు వినిపించుకోలేదు. ఇక గత్యంతరం లేక, ఆ
రోజుల్లో ఢిల్లీలో కేంద్రీయ
విద్యాలయ్ సంఘటన్ కు డైరెక్టర్ జనరల్ గా పని చేస్తున్న కె యస్ శర్మ గారికి మాస్కోనుంచి
ఫోన్ చేసి విషయం వివరించాను.
ఆయన
కూల్ గా విని, రేపు
ఉదయం పోయి ప్రిన్సిపాల్ ని కలవమని తాపీగా చెప్పారు. మర్నాడు నేను వెళ్లేసరికి
స్కూలంతా చాలా హడావిడిగా కానవచ్చింది. మాస్కో రేడియో శ్రీనివాసరావు వచ్చాడా అని
ప్రిన్సిపాల్ అప్పటికే వాకబు చేయడం మొదలు పెట్టారు. నిబంధనలు ఏ గాలికి పోయాయో
తెలియదు కాని, మా
ఇద్దరు పిల్లలకు మేము అనుకున్న పద్దతిలో ఎడ్మిషన్ లభించింది.
శర్మగారి మీద గొంతు వరకూ కోపం వచ్చిందన్నాను కదా!
ఎందుకో ఇప్పుడు చెబుతాను.
కేంద్ర సమాచార శాఖ జాయింట్ సెక్రెటరీగా
వున్నప్పుడు ఒకసారి రేడియో స్టేషన్ కు వచ్చారు. డైరెక్టర్ గదిలో ఉన్నతాధికారుల
సమావేశం. శర్మగారు వచ్చిన సంగతి తెలిసి చూడడానికి వెళ్లాను. తలుపు తెరుచుకుని
లోపలకు వస్తున్న నన్ను చూసి తర్వాత కలుద్దాం అన్నారు శర్మగారు. నాకు
తలకొట్టేసినట్టు అయింది. చెప్పలేని ఉక్రోషంతో మా గదికి వచ్చి కుర్చీలో కూలబడ్డాను.
ఇదేమిటి! ఎందుకిలా జరిగింది? ముళ్ళపూడి వారి భాషలో చెప్పాలి అంటే బల్లపై
పెట్టి ఉన్న నీళ్ళ గ్లాసులో దూకి ఆత్మహత్య చేసుకోవాలనిపించింది.
మీటింగు అయిన తర్వాత ఆయనే నా దగ్గరకు వచ్చి
అన్నారు, ‘నిన్ను
కలుసుకోవాల్సింది ఇక్కడ, అక్కడ
కాదు’ అని. మనసు తేలికపడింది. కృష్ణుడు, కుచేలుడు గుర్తుకు వచ్చారు.
ఇంతకీ నేను వారికి స్కూల్లో క్లాసు మేటునా కాదా!
అవునో కాదో కానీ ఒక బాదరాయణ సంబంధం వుంది. మా స్వగ్రామం పేరు కంభంపాడు. శర్మగారి
ఇంటిపేరు కంభంపాటి.
అలాంటి వ్యక్తి, అడగకుండానే వరాలిచ్చే దేవుడు అని
ప్రసార భారతి సిబ్బంది చెప్పుకుని మురిసిన ఒక ఉత్తమ ఐ.ఎ.ఎస్. అధికారి శ్రీ
కంభంపాటి సుబ్రమణ్య శర్మ గారు ఈరోజు హైదరాబాదు లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారనే విషాద వార్త నుంచి తేరుకోవడానికి,
వారికి నివాళిగా ఈ నాలుగు ముక్కలు
రాస్తున్నాను.
(20-09-2025)
కింది ఫోటో: అప్పటి తమిళనాడు గవర్నర్ రోశయ్య గారు, కే. ఎస్.శర్మగారితో నేను
(ఇంకా వుంది)
19, సెప్టెంబర్ 2025, శుక్రవారం
అయాం ఎ బిగ్ జీరో (220): భండారు శ్రీనివాసరావు
రాత్రి ఏదో ఛానల్ లో పాత చిత్రం ఈడూ జోడు వచ్చింది.
18, సెప్టెంబర్ 2025, గురువారం
అయాం ఎ బిగ్ జీరో (219): భండారు శ్రీనివాసరావు
1975 లో పుట్టి 1985 లో చనిపోయాను.
17, సెప్టెంబర్ 2025, బుధవారం
అయాం ఎ బిగ్ జీరో (218): భండారు శ్రీనివాసరావు
ఇల్లాలి ముచ్చట్లు
చిన్న
స్థాయి జర్నలిస్టులకు కొత్త ఏడాది రావడానికి కాస్త ముందుగానే డైరీలు, కాలెండర్లు గిఫ్టులుగా ఇచ్చేవాళ్ళు. వాటిల్లో అట్ట
మందంగా వున్న డైరీలో మా ఆవిడ ఇంటి పద్దులు
రాసేది. బోడి మూడు వందలు,
అందులో కోతలు పోను చేతికి వచ్చేది
రెండువందలకంటే తక్కువ. ఇంతమాత్రం దానికి జమాఖర్చులు రాయడం ఎందుకు అనేది నా వాదన.
ఆఫీసులోనే ఒక జీవితానికి సరిపడా రాసి ఇంటికి వచ్చే వాళ్లకు ఇక డైరీల్లో రాసుకునే
విషయాలు ఏముంటాయి కనుక.
అయితే డైరీల్లో ఇంటి ఖర్చుల లెక్కలతో పాటు తన మనోభావాలు కూడా కొన్ని రాసుకునేది అనే విషయం నాకు మొన్న మొన్నటి వరకూ
తెలియదు. ఇతరుల డైరీలు చదవడం మర్యాద కాదని తెలుసు. కానీ ఆ రాసిన మనిషే ఇప్పుడు
లేదు.
అక్కడక్కడా
కనిపించిన కొన్ని ముచ్చట్లు. నాతో చెప్పినవి కాదు, బహుశా నాతొ చెప్పాలనుకున్న సంగతులు కావచ్చు. పెళ్ళికి
ముందు గలగలా మాట్లాడుతుందని మా ఆవిడకు పేరు. ఘలఘలా మాట్లాడుతాడని నాకో పేరు.
ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటే పొరుగు వాళ్లకు కాలక్షేపం అనుకుందో ఏమో తాను మాట్లాడడం
బాగా తగ్గించింది.
మా
ఆవిడ రాసుకున్న ఆ డైరీల్లో కొన్ని పేజీలు :
“1968 ప్రాంతాల్లో నేను (అంటే మా ఆవిడ
నిర్మల) బెజవాడ మాంటిసోరి స్కూల్లో చదివేదాన్ని. (అప్పటికి మా పెళ్ళికాలేదు) సరస్వతి
వొదినె గారి పిల్లలు సత్యవతి, విజయ అంతా ఆ స్కూలే. ఆ స్కూల్లో
పిల్లల్ని చదివించడం అనేది ఆ రోజుల్లో చాలా గొప్పగా వుండేది. దానికి కారణం
ప్రిన్సిపాల్ కోటేశ్వరమ్మగారు. బెజవాడ
కనకదుర్గమ్మ మాదిరిగానే కోటేశ్వరమ్మ పేరు
కూడా అంతే ప్రసిద్ధి.
“తుర్లపాటి హనుమంతరావు అన్నగారి మనుమడు, విజయ కుమారుడు (కార్తీక్) పుట్టినప్పుడు బారసాలకు కోటేశ్వరమ్మగారు
కూడా వచ్చారు. మేమంతా ఆవిడ స్టూడెంట్లం
కాబట్టి భోజనాల సమయంలో (ఆ రోజుల్లో ఎవరొచ్చినా నేల మీదనే భోజనాలు, పీటలు వేసి వడ్డించేవారు) ఆమె చుట్టూ కూర్చున్నాం. చాలా ఏళ్ళ తరువాత
కలిసినా, ఆవిడ పేరు పేరునా అందర్నీ ఆప్యాయంగా
పలకరించారు.
‘ఏం చేస్తున్నావని’ నన్నడిగితే, ‘హైదరాబాదులో ‘అమ్మవొడి’ పేరుతొ
చిన్నపిల్లల కోసం కేర్ సెంటర్
నడుపుతున్నాను’ అని చెప్పా. బహుశా ఆమె దగ్గర చదువుకున్నవాళ్ళల్లో చదువులో ఎక్కిరానిదాన్ని నేనే అనుకుంటా. కానీ
ఆవిడ మాత్రం నన్ను అభినందించారు. ‘స్త్రీలు స్వతంత్రంగా ఏదో ఒకటి చేయడం చాలా
అవసరమ’ని చెప్పారు. నేను ఏదో మా అవసరాలకు కేర్ సెంటర్ పెట్టుకుంటే, ఆవిడ పెద్ద మనస్సుతో ఆశీర్వదించిన విధానం నేను మరిచిపోలేను.
"ఇంకో విషయం. తెలుగు సినిమా రంగంలో
హాస్య బ్రహ్మగా పేరు తెచ్చుకున్న ‘జంధ్యాల’ (జేవీడీఎస్ శాస్త్రి) కూడా మాంటిసోరి
స్కూల్లో నా క్లాసుమేటు. దీనికి
కొనసాగింపు లాంటి ముగింపు ఏమిటంటే జంధ్యాల తదనంతర కాలంలో బెజవాడ ఎస్సారార్
కాలేజీలో మూడేళ్ళు బీకాంలో మా వారికీ క్లాసుమేటు."
“అప్పుడు మేము చిక్కడపల్లి త్యాగరాయ
గానసభ దగ్గర్లో పర్చా కిషన్ రావు గారింట్లో అద్దెకు ఉంటున్నాము. మా వారికి రేడియోలో
ఉద్యోగం. ఇద్దరు పిల్లలు. దగ్గరలో ఉన్న సెంట్ ఆంథోని స్కూల్లో చేర్చాము. రానూ
పోనూ నెలవారీగా రిక్షా మాట్లాడాము.
“ఆ రోజుల్లో ఆదాయ వ్యయాలు ఎలా ఉండేవి
అంటే జీతానికి, జీవితానికీ పొంతన వుండేది కాదు. అంచేత కరెంటు బిల్లు (అప్పట్లో రెండు
నెలలకోమారు వచ్చేది) కడితే, ఆ నెల ఇంటి రెంటు బాకీ పడేది. పాపం ఆ పెద్దాయన ప్రతి నెలా మొదటివారంలో తను ఉంటున్న బర్కత్ పురా ఇంటి నుంచి
చేతికర్ర పొడుచుకుంటూ, జాగ్రత్తగా
నడుచుకుంటూ చిక్కడపల్లి వచ్చేవారు అద్దె వసూలు
కోసం. మళ్ళీ ఉసూరుమంటూ వెళ్ళిపోయేవారు, సమయానికి అద్దె కట్టలేని మా పరిస్థితి చూసి కొంత జాలిపడి, మరికొంత చీకాకు పడి.
“ఈ నేపధ్యంలో మరో దారి కనపడక, ఈ అమ్మఒడి దారి ఎంచుకున్నాను.
“ఉన్న రెండు గదుల్లో ఒకదాన్ని ఈ కేర్
సెంటర్ కోసం కేటాయించాము. బయట, రోడ్డు మీద వెళ్ళే వారికి కనబడేటట్టు ‘తల్లి ఒడి విడలేని చిన్నారుల
బడి’ అనే ట్యాగ్ లైన్ తో ‘అమ్మవొడి, చైల్డ్ కేర్ సెంటర్’ అనే బోర్డు రాయించాము.
“రెండు వారాలు గడుస్తున్నా అమ్మ ఒడిలో తమ పిల్లల్ని చేర్చడానికి ఎవరూ
ముందుకు రాలేదు. పిల్లలకు కావాల్సిన ఆట వస్తువులు కానీ, ఉయ్యాలలు కానీ లేవు. కనీసం ఆయా కూడా లేదు. అలాంటి సెంటర్ లో ఎవరు మాత్రం తమ
పిల్లల్ని వదిలి వెడతారు? కానీ అవన్నీ అమర్చడానికి ఆర్ధిక వనరులు లేవు.
“అలా ఎదురు చూస్తుంటే ఒక రోజు ఉదయం
ఇంకా ఎనిమిది కూడా కాలేదు ఒక జంట హడావిడిగా వచ్చి నా చేతిలో వాళ్ళ నెలల పిల్లవాడిని, ఓ పాలసీసాను పెట్టి,
‘ఇప్పుడు టైము లేదు, సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చినప్పుడు వివరాలు చెబుతామంటూ’ అంతే
హడావిడిగా వెళ్ళిపోయారు.
“వాళ్లెవరో తెలియదు. ఎక్కడ ఉద్యోగాలు
చేస్తున్నారో తెలియదు. ఆ పిల్లవాడి పేరేమిటో తెలియదు. గంటలు గడిచిపోతున్నాయి, సాయంత్రం అయింది. మా పిల్లలు స్కూలు నుంచి వచ్చారు. మా వారు కూడా
ఆఫీసు నుంచి వచ్చారు. ఏడుస్తున్న
పిల్లవాడిని ఒడిలో పెట్టుకుని
సముదాయిస్తూ ఒక్కత్తినీ అలా కూర్చుని వున్నాను. రాత్రి తొమ్మిది
దాటుతోంది. కానీ ఆ తలితండ్రుల జాడ తెలియదు. మా వారు నా పరిస్థితి చూసి ‘పోలీసులకు
చెప్పనా!’ అన్నారు. తల అడ్డంగా ఊపాను. ‘వద్దు.
వాళ్ళ మొహాలు చూస్తే మంచివాళ్ళుగానే అనిపించారు. ఏమి ఆటంకం వచ్చిందో తెలవదు కదా!
చూద్దాం. మీరు అన్నట్టు రేపటికి కూడా రాకపోతే ముగ్గురు పిల్లలు అనుకుని వీడిని
కూడా మన పిల్లలతో పాటే పెంచుతాను’ అన్నాను స్థిరంగా, మరో మాట లేదన్నట్టు.
“అన్నట్టే వాళ్ళు చాలా మంచివాళ్ళు.
రాత్రి పదిన్నరకు వచ్చారు, బోలెడు క్షమాపణలు చెప్పుకుంటూ. ఆయనకి ఆఫీసు ఆరుకే అయిపోయిందట. కానీ ఆమెకు
పెండింగ్ ఫైల్స్ పని పడి పొద్దు పోయిందట. ఈ సంగతి చెబుదామంటే మా ఫోను నెంబరు
పొద్దున్న హడావిడిలో తీసుకోవడం కుదరలేదట.
“బాబు పేరు జేమ్స్. మా అమ్మఒడిలో చేరిన మొదటి పిల్లవాడు.
“తరువాత కొన్ని రోజులకి మరో పిల్లవాడు.
అలా రెండు నెలలు తిరిగేసరికి పనిపిల్లను పెట్టుకునే స్థాయిలో పిల్లల సంఖ్య
పెరిగింది. పని భారము పెరిగింది. పని మనిషి రాని రోజున చూడాలి అవస్థ. పదిమంది
తల్లుల పాత్రలతో ఏకపాత్రాభినయం చేయాలి. కావాలని కోరి ఎంచుకున్న మార్గం కాబట్టి
కష్ట నష్టాలు, లాభ నష్టాలు చూసుకోలేదు. ఎవరినీ ఇంత కావాలని అడిగింది లేదు. ఇచ్చినది
పుచ్చుకోవడమే. కొందరు పద్దతిగా ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఏమీ అనేదాన్ని కాదు.
“మేమూ అంతేగా! నెలనెలా అద్దె కట్టడానికి ఇబ్బంది పడడం లేదా. వాళ్ళూ అలాగే. ఖర్చులకు
సరిపోకనే కదా, ఇద్దరూ ఉద్యోగాలు చేసేది.
“అలా మొదలైన అమ్మఒడి క్రమంగా పేరు
పెంచుకుంటూ పెరుగుతూ వచ్చింది. చిక్కడపల్లిలో ఒక లాండ్ మార్కుగా మారింది. మేము
1987లో మాస్కో వెళ్ళిన తర్వాత అమ్మఒడి బాధ్యతలు మా వారి మేనకోడలు ఫణి కుమారి తన భుజాలకు ఎత్తుకుంది.
“అమ్మఒడిలో పెరిగిన పిల్లలు చాలా మంది
ఇప్పుడు విదేశాల్లో పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ తలితండ్రులు వచ్చి వాళ్ళ
పిల్లల పెళ్లిళ్లకు పిలుస్తుంటే చాలా
సంతోషంగా వుండేది.
“అలా మొత్తం మీద, అనాథాశ్రమంలో నర్స్
కావాలనుకున్న నా చిన్ననాటి కోరిక అమ్మఒడి ద్వారా కొంత తీరింది”
ఇలాంటివన్నీ చదువుతున్నప్పుడు నా కంట నీరు తిరగాలి. కానీ బండ రాతిలో నీటి ఊటని
ఎప్పుడైనా చూసామా!
నేనూ అంతే!
కింది ఫోటో:
(ఇంకా వుంది)
