20, సెప్టెంబర్ 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (221): భండారు శ్రీనివాసరావు

 ‘నిన్ను కలుసుకోవాల్సింది అక్కడ కాదు, ఇక్కడ అన్నారు మా న్యూస్ యూనిట్ లో  నా బల్లకు ఎదురుగా వున్న ఒక మామూలు ఫేమ్ కుర్చీలో కూర్చొంటూ మా సమాచార శాఖ జాయింట్ సెక్రెటరీ, మొత్తం ఆలిండియా రేడియో, దూరదర్సన్ లతో కూడిన ప్రసార భారతి సీ ఈ ఓ  కె.ఎస్. శర్మ గారు. అంతవరకూ ఆయన మీద గొంతు వరకూ కోపం పెంచుకున్న నేను, ఆయన మాటలతో ఒక్కసారిగా చల్లబడిపోయాను.

అప్పటికి ఒక పదేళ్లు వెనక్కి వెడదాం.

కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం నుంచి మా డైరెక్టర్ కు ఫోన్ వచ్చింది.

‘మీ దగ్గర భండారు శ్రీనివాసరావు అనే పేరుగల వాళ్ళు పనిచేస్తున్నారా అని కలెక్టర్ గారు కనుక్కోమన్నారు అని వాకబు. అప్పుడు అక్కడ కలెక్టర్ గా పనిచేస్తున్నది ఐ ఎ ఎస్ అధికారి శ్రీ కంభంపాటి సుబ్రమణ్య శర్మ. ఆయన బెజవాడలో చదువుకునే రోజుల్లో ఒక శ్రీనివాసరావు ఆయనకు స్కూల్లో క్లాసుమేటో, జూనియరో అట.  ఆ రోజు ఉదయం  రేడియోలో నా జీవన స్రవంతి ప్రోగ్రాం విన్న తరువాత కలెక్టర్ గారికి నా గురించి తెలుసుకోవాలని అనిపించిందట. సాయంత్రం ఆఫీసుకు వెళ్ళిన తరువాత ఈ విషయం నా చెవిన వేశారు. ఆ తరువాత ఆ సంగతి ఆయనా మరచిపోయారు, నేనూ మరచిపోయాను.

కరీంనగర్ కలెక్టర్ గా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. కొన్ని వివాదాస్పద నిర్ణయాలు కూడా. అక్కడ ఒక పాడుపడ్డ చెరువును పూడ్పించో , లేదా  ఆ జాగాను వేలం వేయించో ప్రజలకు అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ ఒకే గొడుగు కింద వుండేలా విశాలమైన పరిపాలనా విభాగాల సముదాయాన్ని నిర్మించారు. ఇటువంటి నిర్ణయాలను ప్రజలు హర్షించారు,  ప్రజాప్రతినిధులు వ్యతిరేకించారు. ఏమైతేనేం సమర్ధుడు అయిన కలెక్టర్ గా పేరొచ్చింది. తరువాత ఆయన్ని హైదరాబాదుకు బదిలీ చేశారు,  విద్యుత్ బోర్డు కార్యదర్శిగా. ఒకటి రెండు సార్లు వెళ్లి కలిశాను వార్తల పనిమీద. ఒక క్లాసు మేటుగా ఆయన నన్ను గుర్తుపట్టలేదు. పట్టినా పైకి ఆ మాట అనలేదు. నా  సంగతి సరే!

చిన్నప్పుడు స్కూలుకు సరిగానే వెళ్ళే వాడిని కానీ అందరితో స్నేహం చేసే అవకాశం లేదు. మా బావగారు ఈ విషయంలో చాలా స్ట్రిక్టు.

ఆ తరువాత నా మకాం, చదువు ఖమ్మానికి మారాయి. ఆ తరువాత మళ్ళీ కాలేజి చదువుకు బెజవాడ. మధ్యలో ఎమ్మెసెం బండి (మార్చి – సెప్టెంబరు- మార్చి). ఈ లోగా క్లాస్ మేట్స్ సీనియర్లు, జూనియర్లు క్లాస్ మేట్స్, ఆ క్లాస్ మేట్స్ సీనియర్లు అయ్యారు. నా లాంటి వాళ్లకు క్లాస్ మేట్స్ ఏం గుర్తుంటారు?

ఖమ్మంలో చదివేటప్పుడు వెంకటేశ్వర రావు అనే తెలివికల విద్యార్థి నా క్లాసు మేట్. ఎంత తెలివి కలవాడు అంటే, నేను రేడియోలో ఉద్యోగం చేసేటప్పుడు నన్ను వెతుక్కుంటూ హైదరాబాదు వచ్చాడు. భోజనం చేసేటప్పుడు విషయం చెప్పాడు. ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగం. బదిలీ అయింది. ‘నీకు శర్మగారు తెలుసు కదా! ఒక మాట చెప్పవా’ అన్నాడు. అదెంత భాగ్యం అని  వెంటబెట్టుకుని తీసుకుని వెళ్లాను. అతడిని బయట కూర్చోమని, నన్ను అడిగారు శర్మగారు, ‘మీ ఫ్రెండ్ ఎక్కడికి అంటే ఏ విభాగానికి బదిలీ కోరుతున్నాడో నీకేమైనా తెలుసా’ అని. ‘తెలియదు, శర్మగారు నీకు తెలుసా అంటే తెలుసు అని తీసుకువచ్చాను’ అన్నాను. ‘అది నాకు ముందే అర్ధం అయింది. ఈ బదిలీ చేయడం నాకు చిటికెలో పని. కానీ అతడు కోరుతున్నది నాలుగు రాళ్లు అదనంగా వచ్చే పోస్టు. తరువాత నీకూ నాకూ చెడ్డపేరు రాదని నువ్వు హామీ ఇవ్వగలవా!’ అన్నారు. ‘నాకు ఇవన్నీ తెలియదు, ఏమైనా ఇబ్బంది అనిపిస్తే వదిలేయండి, నేను అతడికి సర్ది చెబుతాను’ అని వచ్చేశాను.

తరువాత కొన్నాళ్ళకు మా వాడికి కోరిన చోటుకు కోరిన పోస్టులో బదిలీ అయింది.  థాంక్స్ చెబుదాము అనుకుంటే శర్మగారు బదిలీపై కేంద్ర సర్వీసులకు ఢిల్లీ వెళ్ళారు.

ఇదొక కధ.

ఆ తరువాత నేను కుటుంబంతో సహా మాస్కో వెళ్లాను, రేడియో మాస్కోలో పనిచేయడానికి.

అక్కడ ఒక చిక్కొచ్చిపడింది.

రష్యన్ స్కూళ్ళలో విద్య పూర్తిగా ఉచితం. ప్రతి ఏరియాలో ఇంటి నుంచి నడిచిపోయే దూరంలో వుంటాయి ఆ స్కూళ్ళు. ఎక్కడైనా కొంచెం దూరంగా వుంటే, ఉచితంగా తీసుకువెళ్ళే స్కూలు  బస్సులు వుంటాయి. మధ్యాన్న భోజనంస్కూలు యూనిఫారాలు,  పుస్తకాలతో సహా అన్నీ ఉచితం. పోతే, మేము వెళ్ళిన సంవత్సరమే ఇండియన్ ఎంబసీ సిబ్బంది పిల్లకోసం మాస్కోలో కేంద్రీయ విద్యాలయ్ సంఘటన్ వారు  ఇండియన్ స్కూల్ ప్రారంభించారు.  అయితే ఫీజులు వుంటాయి.   రష్యన్ స్కూళ్ళలో చేర్పిస్తే ఇండియాకు తిరిగి వెళ్ళిన తరవాత చదువులకు ఇబ్బంది అవుతుందని ఇండియన్ స్కూల్ నే ఎంచుకోవాల్సి వచ్చింది.  

 అక్కడా ఎడ్మిషన్లు  అంత సులభంగా రాలేదు. మేము రష్యన్ ప్రభుత్వం పనుపున వచ్చాము కాబట్టి హార్డ్ కరెన్సీ లో అంటే డాలర్లలో ఫీజు కట్టాలని ప్రిన్సిపాల్  గంగల్  కండిషన్ పెట్టారు. మాకిచ్చే జీతం మీలాగా డాలర్లలో కాదు, రూబుళ్ళలో ఇస్తారని యెంత మొత్తుకున్నా ఆ బెంగాలీ బాబు గారు వినిపించుకోలేదు. ఇక గత్యంతరం లేక,  ఆ రోజుల్లో ఢిల్లీలో  కేంద్రీయ విద్యాలయ్ సంఘటన్ కు డైరెక్టర్ జనరల్ గా పని చేస్తున్న కె యస్ శర్మ గారికి మాస్కోనుంచి ఫోన్ చేసి విషయం వివరించాను.

 ఆయన కూల్ గా విని,  రేపు ఉదయం పోయి ప్రిన్సిపాల్ ని కలవమని తాపీగా చెప్పారు. మర్నాడు నేను వెళ్లేసరికి స్కూలంతా చాలా హడావిడిగా కానవచ్చింది. మాస్కో రేడియో శ్రీనివాసరావు వచ్చాడా అని ప్రిన్సిపాల్ అప్పటికే వాకబు చేయడం మొదలు పెట్టారు. నిబంధనలు ఏ గాలికి పోయాయో తెలియదు కానిమా ఇద్దరు పిల్లలకు మేము అనుకున్న పద్దతిలో ఎడ్మిషన్ లభించింది.

శర్మగారి మీద గొంతు వరకూ కోపం వచ్చిందన్నాను కదా! ఎందుకో ఇప్పుడు చెబుతాను.

కేంద్ర సమాచార శాఖ జాయింట్ సెక్రెటరీగా వున్నప్పుడు ఒకసారి రేడియో స్టేషన్ కు వచ్చారు. డైరెక్టర్ గదిలో ఉన్నతాధికారుల సమావేశం. శర్మగారు వచ్చిన సంగతి తెలిసి చూడడానికి వెళ్లాను. తలుపు తెరుచుకుని లోపలకు వస్తున్న నన్ను చూసి తర్వాత కలుద్దాం అన్నారు శర్మగారు. నాకు తలకొట్టేసినట్టు అయింది. చెప్పలేని ఉక్రోషంతో మా గదికి వచ్చి కుర్చీలో కూలబడ్డాను. ఇదేమిటి! ఎందుకిలా జరిగింది? ముళ్ళపూడి వారి భాషలో చెప్పాలి అంటే బల్లపై పెట్టి ఉన్న నీళ్ళ గ్లాసులో దూకి ఆత్మహత్య చేసుకోవాలనిపించింది.

మీటింగు అయిన తర్వాత ఆయనే నా దగ్గరకు వచ్చి అన్నారు, ‘నిన్ను కలుసుకోవాల్సింది ఇక్కడ, అక్కడ కాదు’ అని. మనసు తేలికపడింది. కృష్ణుడు, కుచేలుడు గుర్తుకు వచ్చారు.

ఇంతకీ నేను వారికి స్కూల్లో క్లాసు మేటునా కాదా! అవునో కాదో కానీ ఒక బాదరాయణ సంబంధం వుంది. మా స్వగ్రామం పేరు కంభంపాడు. శర్మగారి ఇంటిపేరు కంభంపాటి.

అలాంటి వ్యక్తి, అడగకుండానే వరాలిచ్చే దేవుడు అని ప్రసార భారతి సిబ్బంది చెప్పుకుని మురిసిన ఒక ఉత్తమ ఐ.ఎ.ఎస్. అధికారి శ్రీ కంభంపాటి సుబ్రమణ్య శర్మ గారు ఈరోజు  హైదరాబాదు లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో   మరణించారనే విషాద వార్త నుంచి తేరుకోవడానికి, వారికి నివాళిగా  ఈ నాలుగు ముక్కలు రాస్తున్నాను.

(20-09-2025)

కింది ఫోటో:  అప్పటి  తమిళనాడు గవర్నర్ రోశయ్య గారు,  కే. ఎస్.శర్మగారితో నేను




(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: