28, సెప్టెంబర్ 2025, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (223) : భండారు శ్రీనివాసరావు

“పెళ్ళికి ముందు”
“ విధి! అదేమిటో ఎన్నడూ కలిసి రాదు,
“తాజ్ మహల్ కడదామని అనుకున్నాను, కానీ ముంతాజ్ దొరకలేదు”
“పెళ్లి తర్వాత”
“తాజ్ మహల్ కడదామని అనుకున్నాను,
కానీ ముంతాజ్ చనిపోలేదు”
ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు, అన్నమాచార్య భావనా వాహిని శోభారాజు గారు. ఈ మాటలు చెప్పింది ఎవరి గురించి? నా గురించే!
తరువాత ఆవిడగారు చెప్పిన మాటలు నన్ను మ్రాన్పడిపోయేలా చేసాయి.
“అయితే శ్రీనివాసరావు గారు ఇలాంటి మనిషి కాదు, భార్య బతికి వున్నప్పుడు ఆయన ప్రేమానురాగాలు ఆవిడ పట్ల ఎలా వున్నాయో, చనిపోయి ఇన్నేళ్ళు గడిచినా అవి చెక్కు చెదరకుండా అలాగే వున్నాయి. వారు రాసే ఆవిడ జ్ఞాపకాలే ఇందుకు సాక్ష్యం”
శోభారాజు గారు నాకు తెలిసినంతవరకూ అన్నమయ్య భావనలను జనంలోకి తీసుకువెళ్ళే నిర్విరామ కృషిలో తలమునకలుగా వుంటారు. అలాంటి వ్యక్తి దృష్టికి నా రాతలు ఎలా చేరాయి? అదే దైవ లీల.
నా చిన్నప్పుడు దత్తాత్రేయ శర్మ గారితో పరిచయం వుండి వుంటే, ఇప్పుడు మనిమాపు వయసులో మతిమరపుతో ఇబ్బంది పడాల్సిన అవసరం పడేది కాదేమో. శోభారాజ్ గారికి దత్తాత్రేయ శర్మ గారికి ఏమిటి లింకు అంటారా!
ఎప్పుడో చాలా కాలం క్రితం ఒక రోజు ఉదయం మిత్రుడు జ్వాలా పూనిక మీద ఇంటికి పాతిక కిలోమీటర్ల దూరంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నాను. జ్వాలా ముఖ్య అతిథి. నారుమంచి అనంత కృష్ణ శర్మగారు అధ్యక్షులు. ఈ రెండు పాత్రల్లో ఉభయులకీ అపార అనుభవం ఉంది. అంచేత చివరివరకూ సజావుగా ఆసక్తికరంగా సాగిపోయింది. ఇది చిన్న సైజు స్నాతకోత్సవం అని చెప్పాలి. అవధాన విద్యలో చక్కటి శిక్షణ పొందిన చిన్నారులు, యువతీ యువకులకు సర్టిఫికెట్ల ప్రదానం జరిగింది.
అవధానానికి కావాల్సింది ధారణ శక్తి. నిజానికి ప్రతి విద్యార్థికి ఇది ఎంతో అవసరం. అలాగే ఈ విద్యలో ప్రావీణ్యం సంపాదిస్తే ముసలితనంలో అల్జీమర్స్ వంటి వ్యాధులు దరిచేరవు అనే అభిప్రాయం నాకు ఆ క్షణంలో కలిగింది.
దత్తాత్రేయ శర్మగారు ఉపాధ్యాయుడిగా పనిచేసారు. పదవీ విమణ అనంతరం పిల్లలకు చిన్న నాటి నుంచే అవధాన ప్రక్రియలో శిక్షణ ఇచ్చే మేలుబంతి లాంటి కార్యక్రమాన్ని తమ భుజాలకు ఎత్తుకున్నారు. దర్శనం శర్మగా ప్రసిద్ధులైన మరుమాముల శర్మ గారికి వీరు స్వయానా సోదరులు. సంకల్ప శుద్ధి వుంటే ఏదైనా సిద్ధిస్తుంది, సాధ్యమవుతుంది అని త్రికరణ శుద్ధిగా నమ్మిన సోదరులు వీరు.
తూముకుంటలోని సీతా రామభద్ర ఆలయం నిర్వాహకులు తగిన తోడ్పాటు అందించారు. మధ్యలో జ్వాలాతో కలిసి దైవ దర్శనం చేసుకున్నాను.
మెట్ల దగ్గరే దేవుడు కనిపించాడు. పాల బుగ్గల పసివాడు ఒకరు ఉద్ధరిణ, పంచపాత్ర ముందు పెట్టుకుని అర్ధ నిమీలిత నేత్రాలతో ధ్యాన ముద్రలో కానవచ్చాడు. అంతటి సంరంభం పక్కనే జరుగుతున్నా అతడి ఏకాగ్రత చెదరలేదు. బహుశా అవధాన శిక్షణ పొందిన కారణంగా ఇది సిద్ధించి వుండవచ్చు. అప్రయత్నంగా ఆ చిన్నారికి చేతులు జోడించి నమస్కారం చేశాను. నేను వయో వృద్ధుడిని. ఆ బాలుడు జ్ఞాన వృద్ధుడు.
ఈ కార్యక్రమానికి వెంటబెట్టుకుని వెళ్లిన జ్వాలాకి మనసులోనే కృతఙ్ఞతలు చెప్పుకున్నాను.
ఇది ఒకనాటి మాట.
మళ్ళీ ఈరోజు (సెప్టెంబరు ఇరవై ఏడు, శనివారం) అలాంటి అనుభవమే. ఇంకా గొప్ప అనుభవం. ఇందులో ప్రధాన పాత్ర కూడా జ్వాలాదే. నేను నిమిత్త మాత్రుడిని.
మా మేనకోడలు శాంత కుమార్తె శ్యామల కుమారుడు తేజ పెళ్లి నిశ్చితార్థం. చివర వరకూ వెళ్ళాలా వద్దా అనే గుంజాటనే.
చివరికి వెళ్లాను. వధువు, వరుడు తరపు వాళ్ళు ఇద్దరూ నాకు దగ్గరి బంధువులు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని తేడా లేకుండా పడుగుపేకల్లా కలిసిపోయి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు అనివార్య కారణాల వల్ల రాలేకపోవడంతో వయసులో అక్కడ అందరికంటే పెద్ద అనే పెద్దరికం నన్ను కొంత ఇబ్బంది పెట్టింది. చిన్నాపెద్దా అందరు వంగి నమస్కారాలు పెట్టే వాళ్ళే.
చుట్టపక్కాలు అందరూ కలిసారు. చాలా సేపు చాలా రోజుల తర్వాత కాలక్షేపం. భోజనానికి ముందూ, భోజనం చేస్తూ,ఆ తర్వాతా ఒకటే నవ్వులు, ఒకటే కబుర్లు. కొన్ని గంటలు ఆహ్లాదంగా గడిచిపోయింది.
అందరిలో అలా వుంటూ కూడా ఏదో తెలియని ఒంటరితనం.
ఇది గమనించినట్టున్నాడు నా చిన్న నాటి మిత్రుడు, నా మేనకోడలు మొగుడు అయిన జ్వాలా నరసింహారావు, కార్యక్రమం తర్వాత నా మరో మేనల్లుడు, ఆధ్యాత్మిక భావాలు కలిగిన కొమరగిరి శ్రీ రామచంద్ర మూర్తి ఇంటికి తీసుకుపోయాడు.
వాడు వయసులో నాకంటే చాలా చిన్న. కానీ ఆధ్యాత్మిక విషయాల్లో చాలా పెద్ద. ఆధ్యాత్మిక అంశాలతో ఎప్పుడు ఏ పోస్టు పెట్టినా సింహభాగం నా ఈ మేనల్లుడితో నేను జరిపిన మాటామంతీలో భాగమే. రామచంద్రం ఉంటున్న కాంప్లెక్స్ లోనే చిన్న బాలాజీ దేవాలయం ఉంది. చాలా ప్రశాంతంగా, తొడతొక్కిడి లేకుండా వుంటుంది. మా దురదృష్టం ఆ గుడి తెరవడానికి చాలా వ్యవధి వుంది. బయట నుంచే దణ్ణం పెట్టుకుని బయట పడ్డాము.
తరువాయి అడంగు, మాదాపూర్ హైటెక్స్ దాపులో వున్న శోభారాజు గారి అన్నమాచార్య భావనా వాహిని. నేను తప్పు రాస్తే మన్నించాలి. నాకు ఇటువంటి వాటి పట్ల పెద్ద ఆసక్తి లేదు. ఎప్పుడయినా వెళ్ళినా జ్వాలాతో పాటే.
వెళ్ళడం వెళ్ళడం అక్కడ వున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి. అంతకు ముందు దర్శనం ఇవ్వని వాడు ఈ గుడిలో నిండు రూపంలో దర్శనం ఇచ్చాడు. వచ్చే డిసెంబరు పదహారో తేదీన మా పెళ్లి రోజు. 1971 లో మా పెళ్లి జరిగింది తిరుమల కొండపై. మళ్ళీ ఓసారి అదే రోజున అక్కడికి వెడితే ఎలా వుంటుంది అనిపించింది. సీనియర్ సిటిజన్స్ కోటాలో మా మరో మేనల్లుడు పింగిలి శ్రవణ్ కుమార్ చాలా ప్రయత్నం చేశాడు. కానీ ఫలించలేదు. నాహం కర్తా హరి కర్తా. స్వామి అనుమతి లేనిదే ఎవరికీ దర్శనం దొరకదు అని పూజ్యులు పీవీ ఆర్కే ప్రసాద్ గారి అనుభవాలే చెబుతున్నాయి. నేనెంత అని సరి పుచ్చుకున్నాను.
అయితే ఈరోజు స్వామి నా కోరిక మరో విధంగా తీర్చాడు. జ్వాలా వెంటబెట్టుకుని తీసుకువెళ్ళిన అన్నమయ్య క్షేత్రంలో బ్రహ్మాండమయిన వేంకటేశ్వరుని దేవాలయం వుంది. కన్నుల పండువుగా స్వామి దర్శనం జరిగింది. మా పిల్లల గోత్ర నామాలతో అర్చన చేయించుకునే మహత్తర భాగ్యం లభించింది. ఆ దేవదేవుని చెంత ఎంతసేపు ఉన్నామో నాకే తెలియదు. ఇలా అనుకోకుండా స్వామి దర్శనం అద్భుతంగా జరిగింది. అక్కడ వుండే పాండురంగడు ఇక్కడ వున్నాడు అన్నట్టుగా తిరుమలలో అయినా, అన్నమయ్య క్షేత్రంలో అయినా ఆయన వైభవం ఆయనదే.
అసలు అంకం అప్పుడే మొదలయింది.
గత కొద్ది రోజులుగా అక్కడ ప్రతి సాయంత్రం కూచిపూడి నృత్య ప్రదర్శనలు జరుగుతున్నాయి, శోభారాజు గారి ఆధ్వర్యంలో. ప్రతియేటా అక్కడ ఇది ఆనవాయితీ. ఈరోజు (అంటే నిన్న శనివారం సాయంత్రం) ప్రముఖ నాట్య కళాకారిణి ఉషా గాయత్రి బృందం చక్కటి ప్రదర్శన ఇచ్చింది. అనుకోకుండా నేత్ర పర్వంగా జరిగిన ఈ ప్రదర్శనను ఆసాంతం చూడడం జరిగింది. నా అభిరుచులు, ఆసక్తి కోణంలో చూస్తే ఇది అపూర్వమే అని చెప్పాలి. వేదిక మీద రాసి వున్న ఒక వాక్యం నన్ను ఆకర్షించింది.
“భక్తి సంగీతం ద్వారా భావకాలుష్య నివారణ”
“భావ దారిద్య్రం కన్నా భాషా దారిద్య్రం మేలు” అన్న ఒక కవి వాక్యం గుర్తుకు వచ్చింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మిత్రుడు జ్వాలా నరసింహారావు, ఆయన భార్య, నా మేనకోడలు శ్రీమతి విజయలక్ష్మి ప్రధాన ఆహ్వానితులు. నేను, మరో మిత్రుడు మావుడూరి ప్రసాద్. డాక్టర్ భరత్ ఒకరకంగా చెప్పాలంటే తోడుగా వెళ్ళిన తోడు పెళ్లి కొడుకులం. జ్వాలా మమ్మల్ని కూడా శోభారాజు గారికి పరిచయం చేశాడు.
ఇంతవరకు అతి కొద్ది సందర్భాలలోనే కలిసిన శోభారాజు గారితో నా పరోక్ష పరిచయం 38 ఏళ్ళ నాటిది. నేను నా కుటుంబంతో కలిసి మాస్కోలో ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఆ రోజుల్లో వ్యాపార పనుల నిమిత్తం మాస్కోకు తరచుగా వస్తుండే అప్పటి పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివరావు గారు, శోభారాజు గారు గానం చేసిన అన్నమయ్య కీర్తనల ఆడియో కేసెట్లు తెచ్చి ఇచ్చేవారు. అవి క్రమంగా మాస్కోలోని తెలుగు లోగిళ్ళకు వెళ్ళేవి. ఆ విధంగా ఆమె చక్కటి గాత్రం అందరి ఇళ్ళల్లో మారుమోగేది. అలాంటి మధుర స్వరం కలిగిన శోభారాజు గారు, పైన చెప్పిన మాటలు వింటూ నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను.
2019 లో నా భార్య నిర్మల చనిపోయినప్పటి నుంచి పుంఖానుపుంఖాలుగా నేను సోషల్ మీడియాలో రాస్తూ వస్తున్న అంశాలను శోభారాజు గారు ప్రస్తావించారు. స్వయంగా చదివారో, లేక చదివిన వారు చెప్పగా విన్నారో నాకు తెలియదు కానీ పెళ్ళికి ముందు భార్య పట్ల భర్త ప్రవర్తన, పెళ్ళికి తర్వాత మారిపోయే నడవడిక గురించి హిందీలో ప్రాచుర్యం పొందిన కొన్ని పై వాక్యాలను ప్రస్తావించి, శ్రీనివాసరావు గారు దీనికి విరుద్ధం అని, భార్య పట్ల ఆయన ప్రేమానురాగాలు ఇన్నేళ్ళు అయినా చెక్కుచెదరలేదని అని అర్ధం వచ్చేలా మాట్లాడారు. బహిరంగ సమావేశంలో ఆమె నా పట్ల ప్రదర్శించిన ఈ అభివ్యక్తి నా నోరు పూడుకుపోయేలా చేసింది. ఆవిడకు మౌనంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలపడం మినహా ఏమీ చేయలేని అశక్తత నాది. మన్నించండి శోభారాజు గారు.
నాకు సంతోషం కలిగించిన మరో విషయం ఏమిటంటే ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం మరణించిన మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారిని సంస్మరిస్తూ ఆవిడ గారు నాలుగు మంచి ముక్కలు చెప్పడం.
ఒక రోజు ఇలా చిరస్మరణీయ దినంగా మారడానికి కర్తా, కర్మా, క్రియ అయిన మిత్రుడు జ్వాలాకి కృతజ్ఞతలు అనే ఒకే ఒక్క చిన్న పదంతో సరిపుచ్చడం అంటే నాకే నచ్చడం లేదు. ఆయన అర్ధం చేసుకుంటాడని ఆశ వుంది.
కింది ఫోటో: నన్ను శాలువాతో సత్కరిస్తున్న శోభారాజు గారు.



(ఇంకావుంది)
(28-09-2025)

కామెంట్‌లు లేవు: