3, ఫిబ్రవరి 2022, గురువారం

2, ఫిబ్రవరి 2022, బుధవారం

మా భారతి అక్కయ్య - భండారు శ్రీనివాసరావు

 

మా అమ్మానాన్నల పదకొండు మంది సంతానంలో ఆడపిల్లల్లో ఆమె చిన్నది. మగపిల్లల్లో నేను చిన్న వాడిని. అంతే అంతవరకే పోలిక. ఆమె వ్యక్తిత్వం ముందు నేనో పిపీలికాన్ని.

రేడియో డ్యూటీ మీద హైదరాబాద్ నుంచి బెజవాడ వెళ్ళినప్పుడు, గాంధీ నగరంలోని వాళ్ళింట్లోనే వారాల తరబడి నా ఆల్ మకాం.

పొద్దున్నే రేడియో స్టేషన్ కారు వచ్చేది. నేను తలుపులు తీసుకుని బాత్ రూమ్ కి వెడుతుంటే బయట బండెడు అంట్ల గిన్నెలు, ఎంగిలి కంచాలు. అంటే అంతమంది జనం ఆ రాత్రి ఆ ఇంట్లో భోజనాలు చేశారన్న మాట.

పక్కనే మా బావగారి పూజ గది. అప్పటికే ఆమె లేచి ఆ గది శుభ్రం చేసి పూజకు కావాల్సిన సంభారాలన్నీ సిద్ధం చేసిపెట్టి నాకు కాఫీ కలిపి ఇచ్చేది. ఇంత పనీ తాను ఒంటి చేత్తో సంభాలించేది.

బక్కపలచటి ఈ మనిషిలో అంతటి శక్తి ఎక్కడిది ? ఈ ప్రశ్నకి నాకు తెలిసి ఒకటే జవాబు.

కుటుంబం పట్ల ఆమెకున్న కమిట్ మెంట్. ఈ పదానికి ఆమెకు అర్ధం తెలుసని నేను అనుకోను.

భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్టు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఒక గృహిణిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా ఇన్నేళ్ళుగా శరీరం సహకరించినా లేకపోయినా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చింది. అయినా కర్మ ఫలం తప్పదు.

విరిగిన కాలుకే మళ్ళీ ఆపరేషన్. ఆపరేషన్ చేసిన ఆ కాలుకే మళ్ళీ ఫ్రాక్చర్. అదీ ఎప్పుడు? డెబ్బయి అయిదేళ్లు దాటిన వయసులో.

ఆ పిడికెడు గుండె అన్ని ఆపరేషన్లను తట్టుకుంది. ఎలా తట్టుకుందో ఆ గుండెకే తెలుసు.

మా బావగారు పోయినప్పటి నుంచి ఆయన ఆలోచనలతోనే రోజులు గడిపింది. భార్యాభర్తల  అనుబంధం అర్ధం కావాలి అంటే వారిలో ఎవరో ఒకరు పోవాల్సిందేనా!

ఎవరికీ లేని అదృష్టం ఆమెది. అందరూ మగపిల్లలే. కోడళ్ళు అందరూ మంచివాళ్ళు. మంచాన పడిన రోజులు తక్కువే అయినా, కంటికి రెప్పలా కాచుకున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు, పిల్లలూ, కోడళ్ళూ, వాళ్ళ పిల్లలూ అందరూ ఆమె దగ్గర వాలిపోవాల్సిందే.  ఏ తల్లికి దక్కుతుంది ఇంత అదృష్టం. ఏ అత్తకు దొరుకుతుంది ఈ భాగ్యం. తన అమ్మ భారతి గురించి నా మేనల్లుడు తుర్లపాటి పరేష్  ఫేస్ బుక్ లో రాసిన రాతలు ఇందుకు దృష్టాంతాలు.  

ఇంతటి  అదృష్టాన్ని హరాయించుకోలేక ఆ చిన్ని గుండె అలసిపోయింది. కీ అయిపోయిన గడియారంలా ఈ మధ్యాన్నం  ఆగిపోయింది.

మా ఏడో అక్కయ్య తుర్లపాటి భారతికి నా కన్నీళ్ళ శ్రద్ధాంజలి.

(02-02-2022)

కింది ఫోటో: మా అమ్మతో ఆమె కన్న సంతానం ఏడుగురు ఆడపిల్లలు. ఇప్పుడు మా అమ్మతో సహా ఎవ్వరూ లేరు. 


    

ఎక్కడ వున్నా, ఓ కన్ను ఇటే! - భండారు శ్రీనివాసరావు

 

ఏకాంబరం భార్యతో కలిసి ఎగ్జిబిషన్ కు వెళ్ళాడు. ఆవిడ షాపింగ్ చేసే హడావిడిలో మొగుడ్ని ఒదిలిపెట్టి చాలా ముందుకు వెళ్ళిపోయింది. జనంలో కలిసిపోయిన భార్యను వెతకడానికి ఏకాంబరం విశ్వప్రయత్నం చేసాడు. ఫలితం లేదు. ఇంతలో ఒంటరిగావున్న ఓ అందమైన యువతి కనిపించింది. ఏకాంబరం భార్యను వెతికే పనికి స్వస్తి చెప్పి ఆమెతో అన్నాడు.
“చూడండి మీరు చాలా అందంగా వున్నారు. మా ఆవిడ ఈ జనంలో తప్పిపోయింది. దయచేసి మనమిద్దరం కాసేపు సరదాగా మాట్లాడుకుందాం! ఏమంటారు?’
ఏకాంబరం మాటలు ఆమెకు ముందు కోపం తెప్పించినా ఆశ్చర్యం కూడా కలిగించాయి.
‘మీ భార్య తప్పిపోవడానికి, నాతో సరదాగా గడపడానికి సంబంధం ఏమిటి’ అని అడిగింది.
‘చాలా సింపుల్. నేను పరాయి ఆడదానితో మాట్లాడుతున్నానని తెలిస్తే చాలు, ఇట్టే పసికట్టి ఇంత జనంలో ఎక్కడున్నా సరే నా దగ్గర వాలిపోతుంది. ఆమె సంగతి నాకు బాగా తెలుసు’ అన్నాడు ఏకాంబరం.

హల్వా లేని బడ్జెట్ – భండారు శ్రీనివాసరావు

 

ఢిల్లీ నార్త్ బ్లాక్ లో బడ్జెట్ తయారీ కార్యక్రమం పూర్తయిన రోజున అక్కడ పనిచేసిన సిబ్బందికి ఆర్ధిక మంత్రి హల్వా తినిపించడం సాంప్రదాయం. కోవిడ్ కారణంగా నిరుడు, ఈ ఏడాది హల్వా తయారీకి స్వస్తి చెప్పారు. మిఠాయిలతోనే సరిపుచ్చారు.
బడ్జెట్ అంటే ఆదాయ వ్యయాల పట్టిక అనేది సార్వత్రికంగా ఉన్న అభిప్రాయం. అసలీ పదానికి అర్ధం తోలు సంచీ. బడ్జెట్ ప్రతిని ఓతోలు సంచీ (లెదర్ బ్యాగ్) లో పెట్టుకుని ఆర్ధిక మంత్రి సభకు వస్తారు. డిజిటల్ శకం మొదలయిన తర్వాత దీని సైజు, స్వరూపం పూర్తిగా మారి పోయింది.



బడ్జెట్ తయారీ, ముద్రణలో పాల్గొనే సిబ్బంది అందరూ, కొన్ని రోజుల పాటు తమ కుటుంబాలకు దూరంగా నార్త్ బ్లాకులో వుండిపోతారు. తిండీ నిద్రా అంతా ఆఫీసులోనే. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తారు.
బడ్జెట్ ప్రతులు ముద్రించడానికి ప్రత్యేకంగా ఒక ప్రింటింగ్ మిషిన్ కూడా నార్త్ బ్లాకులోనే వుంటుంది.
మరి ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఆ యంత్రాలను వాడుతున్నారో లేదో తెలియదు.
(02-02-2022)

1, ఫిబ్రవరి 2022, మంగళవారం

కేంద్ర బడ్జెట్

కేంద్ర బడ్జెట్ మీద నా వ్యాఖ్య కోరుతూ టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్ ఛానల్ 'సమయం' తరపున సంపత్, రత్నం మా ఇంటికి వచ్చారు. ఇద్దరూ పాత మిత్రులే. సంతోషం అనిపించింది.



కేంద్ర బడ్జెట్ - టైమ్స్ ఆఫ్ ఇండియా వారి తెలుగు ఛానల్ సమయం కు ఇచ్చిన ఇంటర్వ్యూ.

CLICK THE LINK BELOW TO WATCH THE VIDEO

(11) Watch | Facebook

పాలకుడి అర్హతకు పరీక్ష

 

అనగనగా ఓ రాజు. ఆ రాజుగారికో కొడుకు.  యుక్తవయస్సు రాగానే అతడికి పట్టాభిషేకం చేసి తాను వానప్రస్తాశ్రమం స్వీకరించాలన్న తలంపు మహారాజుకు కలిగింది.  అయితే రాజ్యభారాన్ని కొడుకు భుజస్కంధాలపై పెట్టేముందు అందుకు తగిన శిక్షణ ఇప్పించేందుకు కుల గురువులవద్దకు పంపాడు.

గురువు గారి ఆశ్రమంలో రాజూ పేదా అన్న తేడాలేదు. అక్కడ  అందరూ సమానమే.

ఆశ్రమజీవితంలో కొంత కాలం గడిపిన తరువాత యువరాజు  ఓ రోజు వెళ్లి  గురువును కలిశాడు. కలిసి తన మనసులోని మాట బయట పెట్టాడు.

స్వామీ! ఇన్నాళ్ళబట్టి  నేను కప్పుకుంటున్న  గొంగడి బాగా చిరుగులు పడిపోయింది. దాని స్తానంలో కొత్తది ఇప్పిస్తే కృతజ్ఞుడిని

గురువు పాత గొంగడిని పరీక్షించి చూశాడు. యువరాజు చెప్పింది నిజమే. అది బాగా జీర్ణించి పోయి కప్పుకోవడానికి పనికిరాకుండా వుంది.

గురువు కొత్త గొంగడి తెప్పించి శిష్యుడికి ఇచ్చాడు. యువరాజు సంతోషంగా వెళ్ళిపోయాడు.

ఆ తరువాత గురువు గారికి ఓ సందేహం వచ్చింది. ‘కొత్త గొంగడి  తీసుకువెళ్ళాడు   సరే పాత గొంగడి మాటేమిటి?’

శిష్యుడిని మళ్ళీ పిలిపించాడు. ‘పాత  దుప్పటి  ఏం చేశావని ప్రశ్నించాడు.

పక్క బట్ట బాగా మాసిపోయింది. అందుకని పాత గొంగడిని పక్కబట్టగా వాడుతున్నానని బదులుచెప్పాడు.

కానీగురువు గారు అంతటితో వొదిలిపెట్టలేదు.

పాడయిపోయిన పాత పక్కబట్టని ఏం చేశావని ప్రశ్నించాడు.

కుటీరం కిటికీకి దాన్ని పరదాగా కట్టానని శిష్యుడి జవాబు.

బాగుంది. మరి పాత పరదా సంగతేమిటిదాన్నేం చేశావ్?’ గురువుగారు మరో ప్రశ్న సంధించాడు.

ఇల్లు కడిగిన తరువాత తుడవడానికి దాన్ని వాడుతున్నానని శిష్యుడు చెప్పాడు.

గురువుగారి సందేహాలు ఇంకా తీరినట్టులేదు.

అంతకుముందు ఈ పనులకు వాడిన బట్టలు ఏమయ్యాయి?’

వాటిని దారాలుగా విడదీసి ఆ దారాలతో వొత్తులు తయారు చేసి రాత్రి వేళల్లో ఆముదపు దీపాలు వెలిగించి చదువుకుంటున్నాను

అడగడానికి గురువుదగ్గర ఏమీ మిగలలేదు. అలాగే శిష్యుడికి నేర్పడానికి కూడా ఆయన దగ్గర ఏమీ లేదు.

పనికిరానిదేమీ లేదు ఈ లోకంలో’ అన్న నీతిని బాగా  వొంటబట్టించుకున్న  యువరాజు చేతుల్లో ఈ రాజ్యం భద్రంగా వుంటుందన్న గట్టి నమ్మకం గురువుకు కలిగింది.

అంతే!  పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేసుకోవలసిందని

మహారాజుకు కబురు పంపారు. 

 

అలా ఉండేవి ఆ రోజులు – భండారు శ్రీనివాసరావు

 ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులు.

విజయవాడలో అల్లర్లు జరిగాయి. ఆ ప్రాంతంలో పర్యటించడానికి ముఖ్యమంత్రి పీ.వీ.నరసింహారావు బయలుదేరుతున్నారు. ఆయన అక్కడికి వెడితే, ప్రాంతీయ విద్వేషాలు పెరుగుతాయని, రావద్దని జిల్లా కలక్టర్, ఎస్పీ, పీవీని వారించారు. ముఖ్యమంత్రి హోదా, రాజకీయ ప్రయోజనాలు బేరీజు వేసుకున్న పీవీ వెళ్లడానికే నిర్ణయించుకున్నారు. ఇక లాభం లేదనుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వల్లూరి కామేశ్వరరావు (వీకే రావు) రంగంలోకి దిగారు. వెళ్ళవద్దని ముఖ్యమంత్రికి సూచించారు.

నువ్వు సెక్రెటరీవి. నా ఉద్యోగివి. నీ పని నువ్వు చూసుకో. నేను చెప్పింది చేయి. నేను పొలిటీషియన్ని. నా పని నేను చేస్తా’ అంటూ ఆఫీసు మెట్లు దిగి కారెక్కడానికి వచ్చారు పీవీ. కానీ అక్కడ కారు డ్రైవర్ లేడు. ఏడని అడిగితే... ‘సీఎస్ గారు కారు తీయవద్దన్నారని’ సమాధానం వచ్చింది. ‘డ్రైవర్ నా ఉద్యోగి. అతడు నేను చెప్పినట్టే వింటాడు. అతను రాడు.’ అని సీఎస్ కరాఖండిగా చెప్పారు. పీవీ పర్యటన ఆగిపోయింది. మరుసటి రోజు పీవీ వల్లూరిని పిలిచి, ’నిన్న నేను వెళ్ళివుంటే గొడవలు పెరిగేవి. నన్ను ఆపి మంచిపని చేసావు’ అని మెచ్చుకున్నారు.

విధులపట్ల అదీ ఆనాటి అధికారుల నిబద్ధత. అధికారుల మాట పట్ల రాజకీయ నాయకుల మర్యాద, మన్ననలు అలా ఉండేవి.

 

ఓసారి శ్రీశైలంలో ఒక జాతీయ పార్టీ సమావేశం జరుగుతోంది. దాన్ని కవర్ చేయడానికి హైదరాబాద్ నుంచి ఒక విలేకరి వెళ్లాడు. సమావేశం పూర్తయ్యాక ఫాక్స్ ద్వారా వార్త పంపడానికి కొండ కిందకు వెళ్ళబోతున్నాడు. అది గమనించిన ఆ పార్టీ ప్రముఖుడొకరు జీపు ఏర్పాటు చేస్తానన్నా అతగాడు వొద్దన్నాడు. పరవాలేదని నచ్చజెప్పి తన జీపు డ్రైవర్ ను పిలిచి కాఫీ, టీలు, భోజనం, ఫాక్స్ బిల్లు వగైరాలకు కొంత డబ్బు ఇచ్చి తగిన సూచనలు చేసి ఆ విలేకరిని కిందికి పంపాడు. విలేకరి పనులన్నీ పూర్తయి హైదరాబాద్ బస్సు ఎక్కేదాకా వుండి రాత్రికి జీపు డ్రయివర్ తిరిగి వచ్చాడు. రాగానే ఇచ్చిన మొత్తాన్ని యధాతధంగా డ్రైవరు వాపసు చేయడంతో ఆ నాయకుడు ఖంగు తిన్నాడు. ‘ఏమీ ఖర్చు కాలేదా’ అని అడిగితే ‘లేదు సార్ ! కాఫీక్కూడా నన్ను డబ్బులివ్వనివ్వలేదు. పైగా నేను వొద్దంటున్నా మన జీపులో పది లీటర్ల డీజిల్ కొట్టించి డబ్బులు ఆయనే ఇచ్చాడు సార్అని చెప్పేసరికి నివ్వెరపోవడం ఆ నాయకుడి వంతయింది.

ఒకనాటి విలేకరుల నిబద్దత అది.

ఆ డ్రైవర్ నిబద్ధత కూడా చాలా గొప్పది.