9, ఆగస్టు 2021, సోమవారం

టైం మేనేజ్ మెంట్ లో మహిళలే నెంబర్ వన్

టైం మేనేజ్ మెంట్ (సమయ పాలన), మెన్ మేనేజ్ మెంట్ (ఇక్కడ మెన్ అంటే మగవాళ్ళని కాదు, నిజానికి ఉమెన్ మేనేజ్ మెంట్) కు ఏదయినా ప్రపంచస్థాయి పెద్ద పురస్కారానికి గ్రహీతలను నిర్ణయించే బాధ్యత నాకిస్తే నేను ఖచ్చితంగా ఆ బహుమతిని గంపగుత్తగా వరలక్ష్మీ వ్రతం నోముకునే ఆడవాళ్ళందరికి కలిపి ఇచ్చేస్తాను.

ఏటేటా ఈ వ్రతం నిర్వహించడంలో ఆడవాళ్ళు పడే శ్రమదమాదుల మాట అటుంచి, పేరంటాళ్ళను మేనేజ్ చేసే విధానం గమనించినప్పుడు నాకీ ఆలోచన కలిగింది. దాదాపు ఒకే రోజు ఒకే సమయంలో ఒకరింటికి తాము పేరంటానికి వెళ్ళాలి. మళ్ళీ తమ ఇంటికి వచ్చే పేరంటాళ్ళను కనుక్కుని వాయినాలు ఇవ్వాలి. సమయం ఎలా సర్దుబాటు చేసుకుంటారో ఎన్నిసార్లు బద్దలు కొట్టుకుంటున్నా నా చిన్న బుర్రకు ఎంతమాత్రం అర్ధం కాదు. కార్లూ డ్రైవర్లు వుండే మగ మహారాజులు కూడా అనుకున్న సమయానికి అనుకున్న చోటుకు వెళ్ళలేక సతమతమవుతారు.
అలాటిది, వానయినా వంగిడి అయినా, కార్లూ డ్రయివర్లూ లేకున్నా, ఆటోల్లో తిరుగుతూ అందరి ఇళ్ళను అనుకున్న సమయానికి అనుకున్న వ్యవధిలో చుట్టబెడుతూ, మళ్ళీ తమ ఇంట్లో కూడా ఏమాత్రం తభావతు రాకుండా చూసుకుంటున్న విధానాన్ని ఒకసారి గమనిస్తే నాతో మీరూ ఏకీభవిస్తారు.
ఇక పూజలూ వ్రతాలు అంటారా అది వాళ్ళ ఇష్టం. ప్రసాదాలు అంటారా అది మన ప్రాప్తం.

ఉపశృతి:

శనగల మంగళ వారం
'ప్రతి శ్రావణ బుధవారం ఉదయం
వేయించిన శనగలతో
తప్పనిసరి పలహారం'

8, ఆగస్టు 2021, ఆదివారం

అమరావతి ఓ జ్ఞాపకం

ఓ పాత జ్ఞాపకం. ఈ కొద్ది సెకన్ల వీడియో ఓ మిత్రుడి కానుక. చిత్రంలో వున్నది నేనే. మూడేళ్ళ క్రితం తిరుపతి వెళ్లి వచ్చిన కొత్తల్లో చేసిన ఈ ఇంటర్వ్యూ లో చంద్రబాబు నాయుడు గారి అమరావతి స్వప్నం గురించి నా అభిప్రాయం. చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికీ దొరకని సువర్ణావకాశం ఒక్క చంద్రబాబు నాయుడి గారికే దక్కింది. కానీ ఏం మిగిలింది?
నిర్ణయానికి రాకముందు ఆలోచనలు చేయాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆలోచనలు కూడదు.
ఒకడు ఇల్లు కట్టుకుందామని అనుకున్నాడు. బుద్ధి తక్కువై ఎవర్నో సలహా అడిగాడు.
‘మంచి సున్నం గానుగ ఆడించి దాంతో కట్టుకో, ఇల్లు చల్లగా వుంటుందన్నా’డు ఆ సలహాలరాయుడు. అది విని మనవాడు సున్నం గానుగా ఏర్పాటుచేసుకుని పని మొదలు పెట్టబోయే సమయానికి దారిన పోయే దానయ్య అటుగా వచ్చి, ‘సున్నం పని ఎప్పుడో సున్నా అయిపొయింది, ఎంచక్కా ఇటుకలతో ఇల్లు కట్టుకో’ అని ఓ ఉచిత సలహా పారేసి తన దారిన చక్కా పోయాడు.
మనవాడు, సున్నం గానుగ పక్కన బెట్టి ఇటుకలు పోగేసాడు. మరో దానయ్య వచ్చి ‘ఇటుకల ఇళ్లు బీసీ కాలం నాటివి, చక్కగా కాంక్రీటు దిమ్మెలు వేసి కట్టుకో నాలుగు కాలాల పాటు మన్నుతుంది’ అని చెప్పాడు.
మన వాడు ఇటుకలు ఆటక ఎక్కించి కాంక్రీటు వేటలో పడ్డాడు. చివరికి ఇల్లు కట్టాలన్న కోరిక అమరావతి కలగానే మిగిలి పోయింది.
ఇంటర్వూ చేసింది స్నేహ టీవీ లో నిర్మల్ (Nirmal Akkaraju)

మాట తప్పింది

 

రెండేళ్ళ క్రితం ఆగస్టు ఏడో తేదీ నా పుట్టిన రోజున, 'డెబ్భై మూడేళ్ళు వచ్చాయి, ఈ వయసులో మిమ్మల్ని వదిలేసి ఎక్కడికీ పోను' అన్నది.



6, ఆగస్టు 2021, శుక్రవారం

మరపున పడని రోజు

 2019 ఆగస్టు ఏడోతేదీ. ఆరోజు నా పుట్టిన రోజు. పొద్దున్నే టీవీ ఛానల్ డిబేట్ కి వెళ్లి వచ్చాను. తాను తయారుగా వుంది. జూబిలీ హిల్స్ లోని టీటీడీ బాలాజీ దేవాలయానికి వెడదాం అన్నది. నేనూ అంతవరకూ ఆ గుడి చూడలేదు. సరే పదమని బయలుదేరి వెళ్లాం. కొండ మీద గుడి. మంచి దర్శనం అయింది. అర్చన చేయించి, పులిహోర ప్రసాదం తీసుకుని తిరిగి కిందికి వస్తుంటే ఓ పూజారి గారు నన్ను గుర్తు పట్టి పక్కనే ఉన్న మరో గుడి, వినాయకుడి గుడికి తీసుకు వెళ్ళారు. ఈ గుడికీ, ఆ గుడికీ నడుమ ఓ ప్రహరీ గోడ వుండడం వల్ల కాస్త చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. పూజారి గారు ఏదో చెబుతున్నారు, ఒకరిది వైఖానస సాంప్రదాయం, మరొకరిది శ్రీ వైష్ణవ సాంప్రదాయం అనుకుంటా. ఒకదానికి మరొకటి చుక్కెదురుట. తమని వేరే శ్రీవైష్ణవుల నుండి విడిగా గుర్తించడానికి వైఖానసులు తిరుచూర్ణం స్థానంలో (నిలువు నామాలకు మధ్య వచ్చే నిలువు గీత) కేసరి రంగు మిశ్రమాన్ని వాడతారు. ఇతర వైష్ణవులు నామంలో ఎర్రని పొడిని వాడతారుట. ఇవన్నీ, నాకు అర్ధం కాని విషయాలే కాదు, అవసరం లేని విషయాలు కూడా. ఎప్పుడైనా గుడికి వెడితే దేముడికి దండం పెట్టి బయటకు రావడమే తప్ప మిగిలిన విషయాలు పట్టించుకోను.

గుడి మహా ద్వారం దగ్గర ఫోటో తీసుకుందామని అనిపించింది. సెల్ఫీ తీయడం రాదు, తీసేవాడు కనిపించలేదు. కనపడిన వాడిని అడగడానికి మొహమాటం. లేకపోతే ఆ ఫోటో మా జీవితంలో ఆఖరిసారి కలిసి దిగిన ఒక అపూర్వమైన జ్ఞాపకంగా మిగిలిపోయేది.
ఇంటికి వచ్చేముందు జూబిలీ హిల్స్ లోనే ఉంటున్న మా రెండో అన్నయ్య గారి ఇంటికి వెళ్ళాము, మా కుటుంబానికి పెద్దలు అయిన రామచంద్రరావు గారు, విమల వదినల ఆశీస్సులు తీసుకుందామని. భోజనం చేసిన తర్వాత ఏదో సినిమాకి వెళ్ళిన గుర్తు. ఆ తర్వాత పదంటే పది రోజులకే మాసివ్ హార్ట్ (ఫెయిల్యూర్) అటాక్ వచ్చి మా ఆవిడ మరణించడంతో ఆ జ్ఞాపకాలన్నీ అలికినట్టు గజిబిజిగా అయిపోయాయి.



కావాల్సింది అణ్వస్త్రాలా? అన్నవస్త్రాలా – భండారు శ్రీనివాసరావు

(Published in ANDHRAPRABHA on 08-08-2021, SUNDAY)

ఒక చిన్న పిల్లాడు, మరో లావాటి మనిషి, వీరిద్దరూ ఒకానొక కాలంలో ప్రపంచానికి చుక్కలు చూపెట్టారు.
ఆ కధాకధన విశేషములు ఏమనిన!
యావత్ ప్రపంచంలో అవాంఛిత, అద్భుత సంఘటనల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది, అమెరికా మొట్టమొదటి సారి జరిపిన అణుబాంబు పరీక్ష. డెబ్బయ్ ఏళ్ళకు పూర్వం న్యూ మెక్సికోలోని సోకొర్రోకు ఆగ్నేయంగా 35 మైళ్ళ దూరంలో 1945 జులై 16 వ తేదీన 'ట్రినిటీ' అనేగుప్త నామంతో అమెరికా, ప్రప్రధమ అణు పరీక్షను జయప్రదంగా నిర్వహించింది. లోకంలో అణుశకం ప్రారంభానికి అది నాంది అనుకోవచ్చు.
అమెరికా ఈ పరీక్షకు పెట్టిన గుప్తసంకేత నామం ‘ట్రినిటీ'. అయితే, పరీక్షించిన అణుబాంబుకు నిర్దేశించిన పేరు 'ది గాడ్జెట్'. తొలి పరీక్ష విజయవంతమైన ఉత్సాహంతో అమెరికా ఆ తరువాత కొద్ది వ్యవధిలోనే రెండు అణుబాంబులను జపాన్ పై ప్రయోగించి, అణుబాంబు శక్తి సామర్ధ్యాలనే కాకుండా దాని వినాశన శక్తిని సైతం ప్రపంచానికి పరీక్షించి చూపింది.
1945 ఆగస్టు నెల ఆరోతేదీన మొట్టమొదటి అణుబాంబు ప్రయోగం హిరోషిమాపై జరిగింది. మరో మూడు రోజుల తరువాత అంటే తొమ్మిదో తేదీన రెండో అణుబాంబును జపాన్ లోని నాగసాకీపై ప్రయోగించింది. హిరోషిమాపై జారవిడిచిన అణుబాంబు గుప్త నామం 'లిటిల్ బాయ్'. కాగా, నాగసాకీని మట్టుబెట్టిన బాంబుకు పెట్టిన పేరు 'ఫ్యాట్ మాన్'.
నిజానికి హిరోషిమాపై ప్రయోగించిన తొలి బాంబు ముందుగా పరీక్షచేసి చూసినది కాదు. అయినా అది యెంత నష్టం చేయాలో అంతా చేసి చూపించింది. ఈ బాంబును ముందుగా పరీక్షించక పోవడానికి కూడా కారణం వుంది. ఒకేఒక్క బాంబుకు అవసరమయ్యే యురేనియం- 235 నిల్వలు మాత్రమే అప్పటికి అమెరికా దగ్గర వున్నాయి. దాంతో ఆ బాంబును ముందుగా పరీక్షించి చూడడానికి ఆ దేశానికి వీలులేకుండా పోయింది.
హిరోషిమా, నాగసాకీలపై అమెరికా ప్రయోగించిన ఈ రెండు అణుబాంబులు కలిసి సృష్టించిన మారణహోమం ఇంతా అంతా కాదు. ప్రయోగించిన ఒకటి రెండు క్షణాల వ్యవధిలోనే లక్షా నలభయ్ ఎనిమిది వేలమంది ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. వాటివల్ల ఉత్పన్నమైన అణు ధార్మిక ప్రభావం కారణంగా ఆ తరువాత అయిదేళ్ళ కాలంలో మరణించిన వారి సంఖ్య లక్షల్లో వుంది. క్షతగాత్రులు, వికలాంగులుగా మారి జీవచ్చవాలుగా తయారయిన వారి సంఖ్యకి అంతే లేదు. దీన్నిబట్టి అణ్వస్త్రాల వల్ల అవనికి పొంచి వున్న పెనుముప్పును అర్ధం చేసుకోవచ్చు.
ఇదంతా గతం. ఈ గతానికి కూడా ఒక ఆసక్తికరమైన మరో గతం వుంది. పనిలో పనిగా దాన్ని కూడా గుర్తు చేసుకోవడం ఈ వ్యాస ఉద్దేశ్యం.
అమెరికా తొలి అణుపరీక్షకు అంతా సిద్ధం చేసుకుంది. అయితే ముహూర్త సమయానికి అమెరికా శాస్త్రవేత్తలకు వర్షం రూపంలో తొలి అడ్డంకి ఎదురయింది. అణువిస్పోటన పరీక్షకు తెల్లవారు ఝామున నాలుగు గంటలకు ముహూర్తం నిర్ణయించారు.కానీ, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో వాతావరణం అనుకూలించ లేదు. ఆ పరిస్తితుల్లో పరీక్ష నిర్వహిస్తే పరిణామాలు దారుణంగా వుండవచ్చని భయపడ్డ అధికారులు పరీక్షను కొద్దిసేపు వాయిదా వేసారు. ప్రెసిడెంట్ ట్రూమన్ తో సహా అందరూ ఎదురు చూస్తున్న వాతావరణ నివేదిక ఉదయం నాలుగు గంటల నలభయ్ అయిదు నిమిషాలకు శాస్త్రవేత్తలకు అందింది. పరీక్షకు అధికార్లు పచ్చ జెండా చూపారు. సరిగ్గా అయిదు గంటల పది నిమిషాలకల్లా ఇరవై నిమిషాల కౌంట్ డౌన్ మొదలయింది. అక్కడికి పదహారుమైళ్ళ దూరంలో నిర్మించిన ఎత్తయిన టవర్ పైనుంచి ఉన్నతాధికారులు ప్రయోగ ప్రక్రియని పరిశీలిస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం అయిదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నలభయ్ అయిదు సెకన్లకు, మానవాళి భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తూ తొలి అణువిస్పోటనం లోక భీకరంగా ఆవిష్కృతమైంది. ఆ పేలుడుకు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దద్దరిల్లాయి. క్షణంలో వందో వంతులో ఇరవై కిలో టన్నుల టీ.ఎం.టీ. శక్తికి సరిసమానమైన 'ఎనర్జీ' విడుదల అయింది. తెల్లవారుఝామున మసకచీకటి కమ్ముకున్న ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, కొండలు, ఒకటి రెండు క్షణాల పాటు కళ్ళు మిరుమిట్లు కొలిపేలా, 'వేయి సూర్యుల కాంతి'తో వెలిగిపోయాయి. బాంబు పేలిన చోట పది అడుగుల లోతు, వంద అడుగుల వెడల్పు కలిగిన గొయ్యి ఏర్పడింది. ఆ ప్రదేశం యావత్తూ నిప్పుల కొలిమిలా మారింది. నీలం నుంచి ఎరుపు, ఎరుపు నుంచి పచ్చ, పచ్చ నుంచి తెలుపు - ఇలా రకరకాలుగా రంగులు మారుతున్న దృశ్యాలు ఆకాశంలో దర్శనమిచ్చాయి. పెద్ద పుట్టగొడుగు మాదిరిగా నల్లటి నలుపు రంగుతో సమ్మిశ్రితమైన ఎర్రటి పొగ మేఘాలు గగన తలంలో ఏడున్నర మైళ్ళ ఎత్తు వరకు ఎగసి పడ్డాయి.
'ట్రినిటీ' పరీక్ష డైరెక్టర్ కెన్నెత్ బ్రెయిన్ బ్రిడ్జ్ అణుబాంబు ప్రయోగం సృష్టించిన ఉత్పాతానికి విభ్రమ చెందాడు. లోక వినాశనానికి దోహదం చేసే దారుణ ప్రక్రియలో పాలుపంచుకున్న నిర్వేదం ఆయన తొలి పలుకుల్లో ధ్వనించింది.
'ఛీ! ఛీ! జరగరానిది జరిగిపోయింది. మనం మనుష్యులమే కాదు' ఇదీ ఆయన వ్యాఖ్య.
పొతే, ట్రినిటీ పరీక్షకు సాక్షీభూతంగా నిలచిన మరో శాస్త్రవేత్త జే.రాబర్ట్ ఓపెన్ హీమర్ ఆనాటి దృశ్యాన్ని అభివర్ణిస్తూ 'వేయి సూర్యుల కాంతి' అనే పద ప్రయోగం చేసారు. కాకతాళీయం కావచ్చు, ఆ వర్ణన భగవద్గీత లోని 'దివి సూర్య సహస్రస్య' (భగవద్గీత పదకొండవ అధ్యాయం, పన్నెండవ శ్లోకం, ప్రధమ పాదం) అనే పదానికి దగ్గరగా వుంది. ఆ శాస్త్రవేత్తకు సంస్కృతంతో పరిచయం వుంది అనడానికి ఓ దాఖలా వుంది. ఆయనే చాలా ఏళ్ళ తరువాత అణు బాంబు పరీక్షను గురించి చెబుతూ మరో మాట చెప్పారు. ముందు అది ఎవరికీ అర్ధం కాలేదు. ఎందుకంటే అది సంస్కృతంలో వుంది. భగవద్గీత లోనిదే ఆ వాక్యం కూడా. 'కాలోస్మిలోక క్షయకృత్ ప్రవ్రుద్దో లోకాన్ సమాహర్తు మిహ ప్రవృత్తః'
అంటే:
"నేనే మృత్యువును. లోకాలను నాశనం చేసే సర్వం సహా శక్తిని"
ఉపశ్రుతి:
ఒక పాత లెక్క ప్రకారం, ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో అమెరికా (7700 ), రష్యా (8500 ), యూకే (225 ), ఫ్రాన్సు (300 ), చైనా (250 ), భారత్ (100 ), పాకిస్తాన్ (110 ) అన్నింటినీ కలుపుకుని మొత్తం 17185 అణ్వాయుధాలు వున్నాయి. 60 ఏళ్ళ క్రితం అమెరికా జపాన్ పై ప్రయోగించిన ఓ మోస్తరు ఆటం బాంబులు రెండింటికే రెండు మహానగరాలు అల్లడితల్లడి అయ్యాయి. లక్షల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అంతకంటే ఎక్కువమంది అణుధూళి సోకి జీవిత పర్యంతం జీవచ్చవాల మాదిరిగా జీవితాలు గడిపారు. ఆస్తి నష్టం సంగతి చెప్పక్కర లేదు. మరి ఇలా అన్ని దేశాలు తమ ఆయుధాగారాలను, ఆటంబాంబు, హైడ్రోజన్ బాంబుల వంటి సామూహిక హనన ఆయుధసంపత్తితో నింపుకుంటూ పొతే, మానవ జాతి మనుగడకు పూచీ ఎక్కడ? ఈ ప్రశ్న సరే!
“మానవాళికి ఈనాడు కావాల్సింది అణ్వస్త్రాలా? అన్నవస్త్రాలా?”
దీనికి జవాబు ఇచ్చేది ఎవ్వరు?

https://epaper.prabhanews.com/c/62330656

షర్మిల పొలిటికల్ టార్గెట్ ఎవరు..?


కొద్దిసేపటి క్రితం ఆధాన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో

ఆగస్టు జ్ఞాపకాలు


ప్రతి నెలా మొదటి వారంలో అలా నడుచుకుంటూ వెళ్లి రత్నదీప్ సూపర్ మార్కెట్లో నెల వారీ సరుకులు కొని, హోం డెలివరీ చేయమని చెప్పి మళ్ళీ నడుచుకుంటూ తిరిగి రావడం కొన్నేళ్లుగా మా ఇద్దరికీ ఓ అలవాటుగా మారింది. అలాగే రెండేళ్ల క్రితం ఆగస్టు మొదటివారంలో ఈ నెలవారీ నడక మొదలు పెట్టాం. ఎప్పుడూ లేనిది మా ఆవిడ ఓ సంచీ చేతబట్టుకుని వచ్చింది.
తిరిగి వస్తుంటే ఇదిగో ఈ పక్క సందులోనే మన అరుణ ఇల్లు ఒకసారి చూసిపోదాం అంది. అరుణ అంటే మా వలలి. మూడు నెలల నుంచి వంటకు రావడం లేదు. అరుణ వాళ్ళు వుండేది మూడో అంతస్తులో. మెట్లెక్కి వెళ్ళాలి. ఫోన్ చేసి కిందికి పిలవరాదా అన్నాను.
“లేదు పొద్దునే తనతో మాట్లాడాను. వాళ్లమ్మ గారి ఊరికి పోతోందిట. ఉత్తమనిషి కూడా కాదు, మెట్లు దిగి ఏమి వస్తుంది. మీరిక్కడే వుండండి, నేను కలిసి వస్తాను’ అన్నది స్థిరంగా. ఇక నేనూ ఆవిడతో పాటు వెళ్లక తప్పలేదు.
పైన ఒకటే గది. మమ్మల్ని చూడగానే అరుణ భారంగా లేవలేక లేచింది. వెలిగిపోతున్న మొహంతో మమ్మల్ని చూస్తూ మంచం మీద కూర్చోమంది.
మా ఆవిడ తాను తెచ్చిన సంచీలోనుంచి కుంకుమ భరిణ, చీరె, జాకెట్ పీస్ తీసి బొట్టుపెట్టి ఇచ్చింది. తీసుకువచ్చిన మిఠాయిలు, పూలు అందించింది.
‘పండంటి బిడ్డను కనడమే కాదు, రాగానే నాకు తీసుకువచ్చి చూపించాలి సుమా’ అని అరుణ దగ్గర మాట తీసుకుంది.
అరుణ మాట నిలబెట్టుకుంటూ మూడు నెలల తర్వాత పసిబిడ్డను తీసుకుని మా ఇంటికి వచ్చింది. కానీ ఆ బిడ్డను చూడడానికి తను లేదు.
అరుణ ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత ఆమె బతికి వుంది కేవలం పదిరోజులే.



(06-08-2021)