6, ఆగస్టు 2021, శుక్రవారం

కావాల్సింది అణ్వస్త్రాలా? అన్నవస్త్రాలా – భండారు శ్రీనివాసరావు

(Published in ANDHRAPRABHA on 08-08-2021, SUNDAY)

ఒక చిన్న పిల్లాడు, మరో లావాటి మనిషి, వీరిద్దరూ ఒకానొక కాలంలో ప్రపంచానికి చుక్కలు చూపెట్టారు.
ఆ కధాకధన విశేషములు ఏమనిన!
యావత్ ప్రపంచంలో అవాంఛిత, అద్భుత సంఘటనల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది, అమెరికా మొట్టమొదటి సారి జరిపిన అణుబాంబు పరీక్ష. డెబ్బయ్ ఏళ్ళకు పూర్వం న్యూ మెక్సికోలోని సోకొర్రోకు ఆగ్నేయంగా 35 మైళ్ళ దూరంలో 1945 జులై 16 వ తేదీన 'ట్రినిటీ' అనేగుప్త నామంతో అమెరికా, ప్రప్రధమ అణు పరీక్షను జయప్రదంగా నిర్వహించింది. లోకంలో అణుశకం ప్రారంభానికి అది నాంది అనుకోవచ్చు.
అమెరికా ఈ పరీక్షకు పెట్టిన గుప్తసంకేత నామం ‘ట్రినిటీ'. అయితే, పరీక్షించిన అణుబాంబుకు నిర్దేశించిన పేరు 'ది గాడ్జెట్'. తొలి పరీక్ష విజయవంతమైన ఉత్సాహంతో అమెరికా ఆ తరువాత కొద్ది వ్యవధిలోనే రెండు అణుబాంబులను జపాన్ పై ప్రయోగించి, అణుబాంబు శక్తి సామర్ధ్యాలనే కాకుండా దాని వినాశన శక్తిని సైతం ప్రపంచానికి పరీక్షించి చూపింది.
1945 ఆగస్టు నెల ఆరోతేదీన మొట్టమొదటి అణుబాంబు ప్రయోగం హిరోషిమాపై జరిగింది. మరో మూడు రోజుల తరువాత అంటే తొమ్మిదో తేదీన రెండో అణుబాంబును జపాన్ లోని నాగసాకీపై ప్రయోగించింది. హిరోషిమాపై జారవిడిచిన అణుబాంబు గుప్త నామం 'లిటిల్ బాయ్'. కాగా, నాగసాకీని మట్టుబెట్టిన బాంబుకు పెట్టిన పేరు 'ఫ్యాట్ మాన్'.
నిజానికి హిరోషిమాపై ప్రయోగించిన తొలి బాంబు ముందుగా పరీక్షచేసి చూసినది కాదు. అయినా అది యెంత నష్టం చేయాలో అంతా చేసి చూపించింది. ఈ బాంబును ముందుగా పరీక్షించక పోవడానికి కూడా కారణం వుంది. ఒకేఒక్క బాంబుకు అవసరమయ్యే యురేనియం- 235 నిల్వలు మాత్రమే అప్పటికి అమెరికా దగ్గర వున్నాయి. దాంతో ఆ బాంబును ముందుగా పరీక్షించి చూడడానికి ఆ దేశానికి వీలులేకుండా పోయింది.
హిరోషిమా, నాగసాకీలపై అమెరికా ప్రయోగించిన ఈ రెండు అణుబాంబులు కలిసి సృష్టించిన మారణహోమం ఇంతా అంతా కాదు. ప్రయోగించిన ఒకటి రెండు క్షణాల వ్యవధిలోనే లక్షా నలభయ్ ఎనిమిది వేలమంది ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. వాటివల్ల ఉత్పన్నమైన అణు ధార్మిక ప్రభావం కారణంగా ఆ తరువాత అయిదేళ్ళ కాలంలో మరణించిన వారి సంఖ్య లక్షల్లో వుంది. క్షతగాత్రులు, వికలాంగులుగా మారి జీవచ్చవాలుగా తయారయిన వారి సంఖ్యకి అంతే లేదు. దీన్నిబట్టి అణ్వస్త్రాల వల్ల అవనికి పొంచి వున్న పెనుముప్పును అర్ధం చేసుకోవచ్చు.
ఇదంతా గతం. ఈ గతానికి కూడా ఒక ఆసక్తికరమైన మరో గతం వుంది. పనిలో పనిగా దాన్ని కూడా గుర్తు చేసుకోవడం ఈ వ్యాస ఉద్దేశ్యం.
అమెరికా తొలి అణుపరీక్షకు అంతా సిద్ధం చేసుకుంది. అయితే ముహూర్త సమయానికి అమెరికా శాస్త్రవేత్తలకు వర్షం రూపంలో తొలి అడ్డంకి ఎదురయింది. అణువిస్పోటన పరీక్షకు తెల్లవారు ఝామున నాలుగు గంటలకు ముహూర్తం నిర్ణయించారు.కానీ, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో వాతావరణం అనుకూలించ లేదు. ఆ పరిస్తితుల్లో పరీక్ష నిర్వహిస్తే పరిణామాలు దారుణంగా వుండవచ్చని భయపడ్డ అధికారులు పరీక్షను కొద్దిసేపు వాయిదా వేసారు. ప్రెసిడెంట్ ట్రూమన్ తో సహా అందరూ ఎదురు చూస్తున్న వాతావరణ నివేదిక ఉదయం నాలుగు గంటల నలభయ్ అయిదు నిమిషాలకు శాస్త్రవేత్తలకు అందింది. పరీక్షకు అధికార్లు పచ్చ జెండా చూపారు. సరిగ్గా అయిదు గంటల పది నిమిషాలకల్లా ఇరవై నిమిషాల కౌంట్ డౌన్ మొదలయింది. అక్కడికి పదహారుమైళ్ళ దూరంలో నిర్మించిన ఎత్తయిన టవర్ పైనుంచి ఉన్నతాధికారులు ప్రయోగ ప్రక్రియని పరిశీలిస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం అయిదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నలభయ్ అయిదు సెకన్లకు, మానవాళి భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తూ తొలి అణువిస్పోటనం లోక భీకరంగా ఆవిష్కృతమైంది. ఆ పేలుడుకు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దద్దరిల్లాయి. క్షణంలో వందో వంతులో ఇరవై కిలో టన్నుల టీ.ఎం.టీ. శక్తికి సరిసమానమైన 'ఎనర్జీ' విడుదల అయింది. తెల్లవారుఝామున మసకచీకటి కమ్ముకున్న ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, కొండలు, ఒకటి రెండు క్షణాల పాటు కళ్ళు మిరుమిట్లు కొలిపేలా, 'వేయి సూర్యుల కాంతి'తో వెలిగిపోయాయి. బాంబు పేలిన చోట పది అడుగుల లోతు, వంద అడుగుల వెడల్పు కలిగిన గొయ్యి ఏర్పడింది. ఆ ప్రదేశం యావత్తూ నిప్పుల కొలిమిలా మారింది. నీలం నుంచి ఎరుపు, ఎరుపు నుంచి పచ్చ, పచ్చ నుంచి తెలుపు - ఇలా రకరకాలుగా రంగులు మారుతున్న దృశ్యాలు ఆకాశంలో దర్శనమిచ్చాయి. పెద్ద పుట్టగొడుగు మాదిరిగా నల్లటి నలుపు రంగుతో సమ్మిశ్రితమైన ఎర్రటి పొగ మేఘాలు గగన తలంలో ఏడున్నర మైళ్ళ ఎత్తు వరకు ఎగసి పడ్డాయి.
'ట్రినిటీ' పరీక్ష డైరెక్టర్ కెన్నెత్ బ్రెయిన్ బ్రిడ్జ్ అణుబాంబు ప్రయోగం సృష్టించిన ఉత్పాతానికి విభ్రమ చెందాడు. లోక వినాశనానికి దోహదం చేసే దారుణ ప్రక్రియలో పాలుపంచుకున్న నిర్వేదం ఆయన తొలి పలుకుల్లో ధ్వనించింది.
'ఛీ! ఛీ! జరగరానిది జరిగిపోయింది. మనం మనుష్యులమే కాదు' ఇదీ ఆయన వ్యాఖ్య.
పొతే, ట్రినిటీ పరీక్షకు సాక్షీభూతంగా నిలచిన మరో శాస్త్రవేత్త జే.రాబర్ట్ ఓపెన్ హీమర్ ఆనాటి దృశ్యాన్ని అభివర్ణిస్తూ 'వేయి సూర్యుల కాంతి' అనే పద ప్రయోగం చేసారు. కాకతాళీయం కావచ్చు, ఆ వర్ణన భగవద్గీత లోని 'దివి సూర్య సహస్రస్య' (భగవద్గీత పదకొండవ అధ్యాయం, పన్నెండవ శ్లోకం, ప్రధమ పాదం) అనే పదానికి దగ్గరగా వుంది. ఆ శాస్త్రవేత్తకు సంస్కృతంతో పరిచయం వుంది అనడానికి ఓ దాఖలా వుంది. ఆయనే చాలా ఏళ్ళ తరువాత అణు బాంబు పరీక్షను గురించి చెబుతూ మరో మాట చెప్పారు. ముందు అది ఎవరికీ అర్ధం కాలేదు. ఎందుకంటే అది సంస్కృతంలో వుంది. భగవద్గీత లోనిదే ఆ వాక్యం కూడా. 'కాలోస్మిలోక క్షయకృత్ ప్రవ్రుద్దో లోకాన్ సమాహర్తు మిహ ప్రవృత్తః'
అంటే:
"నేనే మృత్యువును. లోకాలను నాశనం చేసే సర్వం సహా శక్తిని"
ఉపశ్రుతి:
ఒక పాత లెక్క ప్రకారం, ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో అమెరికా (7700 ), రష్యా (8500 ), యూకే (225 ), ఫ్రాన్సు (300 ), చైనా (250 ), భారత్ (100 ), పాకిస్తాన్ (110 ) అన్నింటినీ కలుపుకుని మొత్తం 17185 అణ్వాయుధాలు వున్నాయి. 60 ఏళ్ళ క్రితం అమెరికా జపాన్ పై ప్రయోగించిన ఓ మోస్తరు ఆటం బాంబులు రెండింటికే రెండు మహానగరాలు అల్లడితల్లడి అయ్యాయి. లక్షల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అంతకంటే ఎక్కువమంది అణుధూళి సోకి జీవిత పర్యంతం జీవచ్చవాల మాదిరిగా జీవితాలు గడిపారు. ఆస్తి నష్టం సంగతి చెప్పక్కర లేదు. మరి ఇలా అన్ని దేశాలు తమ ఆయుధాగారాలను, ఆటంబాంబు, హైడ్రోజన్ బాంబుల వంటి సామూహిక హనన ఆయుధసంపత్తితో నింపుకుంటూ పొతే, మానవ జాతి మనుగడకు పూచీ ఎక్కడ? ఈ ప్రశ్న సరే!
“మానవాళికి ఈనాడు కావాల్సింది అణ్వస్త్రాలా? అన్నవస్త్రాలా?”
దీనికి జవాబు ఇచ్చేది ఎవ్వరు?

https://epaper.prabhanews.com/c/62330656

కామెంట్‌లు లేవు: