ఆదివారం తర్వాత ఈ రోజంతా స్తబ్దుగా వుండిపోయాను.
నిన్న మధ్యాన్నం
పరకాల సుధీర్ గారింటి లోపలకు అడుగుపెడుతున్నప్పుడు ఎలాగో అనిపించింది. దాదాపు
మూడేళ్లు కావస్తోంది నేను వేరేవారి ఇంటికి
అలా ఒంటరిగా వెళ్లి.
ఆ
సాయంత్రం పరకాల గారింటి నుంచి బయటకు వస్తుంటే మనసు ఖాళీగా అనిపించింది. అదేమిటో
చిత్రం, మనసు తేలిక పడ్డట్టుగా కూడా అనిపించింది. నా మనసు ఖాళీగా అనిపించడానికి
కారణం, పాత
స్నేహితులం అందరం ఒక్కచోట ఇలా కలిసి అలా విడిపోవడం. మనసు తేలిక కావడానికి కారణం, ఇన్నేళ్ళ
తర్వాత అందరం ఇలా కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయడం.
మనుషులు
మనుషులు కలవడం కూడా ఒక అపూర్వంగా చెప్పుకునే రోజులు వస్తాయని ఏనాడూ అనుకోలేదు.
ముప్పయ్యేళ్ల
క్రితం నేను రేడియో మాస్కోలో పనిచేసే రోజుల్లో మాస్కోలోని ఇండియన్
ఎంబసీలో పనిచేసిన నేవల్ కమాండర్లు సుధీర్
పరకాల, ఆయన భార్య రమా పరకాల, దాసరి
రాము, ఆయన
భార్య అమ్మాజీ రాము, స్టీల్ అధారిటీ తరపున
పనిచేసిన ఇంజినీర్ కే.వీ. రమణ, భార్య త్రిలోచన రమణ, హిందూస్తాన్
ఏరో నాటిక్స్ తరపున పనిచేసిన శ్రీధర్ కుమార్, ఆయన భార్య విశాల శ్రీధర్ కుమార్ నిన్న స్నేహితుల
దినోత్సవం రోజున సికిందరాబాదు ఆర్మీ ఏరియా దాటిన తర్వాత ఒక సివిలియన్ కాలనీలో నివాసం ఉంటున్న
పరకాల సుధీర్, రమ దంపతుల ఇంట్లో కలుసుకున్నాం. ఓ
నాలుగ్గంటల పాటు సాగిన కాలక్షేప సహిత భోజన కార్యక్రమంలో పాత కబుర్లు అనేకం కలబోసుకున్నాం.
దాదాపు
రెండేళ్లుగా తెలిసిన వారితో,
తెలియని వారితో ఫోన్లో మాట్లాడడం తప్ప ముఖతః మాట్లాడుకున్నది చాలా చాలా తక్కువ.
కరోనా
కాలానికి ముందు, మా
ఆవిడ జీవించివున్న రోజుల్లో మాస్కో మిత్రుల కలయికలు చాలా తరచుగా జరుగుతూ ఉండేవి.
ఎందుకంటే వీరందరికీ, మాస్కోలో,
ఇక్కడా కూడా దండలో దారంగా వుండేది నా
శ్రీమతి నిర్మల.
(02-08-2021)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి