10, మే 2021, సోమవారం

కరోనా మన్ కి బాత్

 కరోనా రాకచూసి మిగిలిన వ్యాధులన్నీ సర్దుకు కూర్చున్నాయి.

ఏమిటలా వున్నావు’ ధైర్యం చేసి అడిగింది కలరా నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ.

ఎలా ఉండను? నిన్న మొన్నటిదాకా మొత్తం ప్రపంచాన్ని గడగడలాడించానని విర్రవీగాను’

ఇప్పుడు మాత్రం ఏమైంది? నీ నామ స్మరణ చేయకుండా భూలోకవాసులకు క్షణం గడవడం లేదు కదా!’ అన్నది హెచ్.ఐ.వి.

నేనూ అలాగే అనుకున్నాను. ఈ సృష్టి ప్రారంభం అయిన తర్వాత యావత్ ప్రపంచ ప్రజల నోళ్ళలో నా పేరు ఎన్ని కోట్లమారు మారుమోగుతున్నదో చూసి నేనూ పులకరించిపోయాను. వాళ్ళు నా పేరు వింటేనే ఎంతగా భయపడుతున్నారో కళ్ళారా చూసి పొంగిపోయాను. కానీ అది భయం కాదనీ, వాళ్ళు నాతో పరాచికాలు ఆడుతున్నారనీ ఇపుడిప్పుడే గ్రహింపుకు వచ్చి సిగ్గుపడుతున్నాను’

అదేమిటే అలా అంటున్నావు. నువ్వు కదా మా అందర్నీ చూస్తుండగానే మించిపోయావు. నీ పేరు వింటేనే వణికిపోయేలా మానవుల్ని మార్చగలిగావు అని మేమిక్కడ అసూయతో రగిలిపోతుంటే ఏమిటిది ఇలా నీ ఈ మాటలతో మమ్మల్నిలా మళ్ళీ సంతోషపెడుతున్నావు’ అంది ఎబోలా.

అలానా! నేను రంగ ప్రవేశం చేసిన తర్వాత మీకెవ్వరికీ సరైన పనిపాటలు లేకుండాపోయాయి కదా! ఆ ఖాళీ టైములో మీరు కాస్త పత్రికలు చదివితే, కొంచెం టీవీలు చూస్తే విషయం బోధపడేది’

పత్రికలూ, టీవీలు అంటూ మమ్మల్ని భయపెట్టకు. మేము ఇంతమందిమి కలిసి చేయలేని అపకారాన్ని అవి ఒంటిచేత్తో మానవాళికి చేస్తున్నాయి. అసలేం జరిగిందో నువ్వే చెప్పు, వింటాం’ అంది కేన్సర్.

మనుషులకు చావు భయాన్ని మించిన భయం వుండదు అనే ధీమాతో నేను భూలోకంలో అడుగుపెట్టాను. మొదట్లో నా అభిప్రాయం నిజమే అనిపించింది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళు మళ్ళీ తమ మునపటి వ్యవహారాల్లో మునిగి తేలుతున్నారు. చావు ముంగిట్లో వుందని తెలిసి కూడా చిన్నారులపై లైంగిక దాడులు చేస్తూనే వున్నారు. చనిపోతే కట్టుకుపోయేది ఏమీ ఉండదని తెలిసికూడా ఆన్ లైన్ మోసాలతో ఇతరులని దోచుకుంటూనే వున్నారు. కరోనా బారిన పడితే రేపు మనది కాదు అనే భయం ఎటు పోయిందో తెలవదు ఎప్పుడో మూడేళ్ళకు వచ్చే ఎన్నికల్లో గెలవడం ఎలాగా, ప్రత్యర్ధిని ఓడించడం ఎలాగా అని మల్లగుల్లాలు పడుతున్నారు. దొంగతనాలు, దోపిడీలు జరుగుతూనే వున్నాయి. భూఆక్రమణలు మునుపటి కంటే ఎక్కువయ్యాయి. డబ్బు పోగేసుకోవడం ముమ్మరమయింది. మరణభయంతో జనంలో అత్యాశ లేకుండా పోతుంది అనుకుంటే ఆ కక్కుర్తి మరీ ఎక్కువయింది. తింటున్నారు, తాగుతున్నారు, క్వారంటైన్లలో చిందులేస్తున్నారు. వైద్యం చేయడానికి లక్షలు గుంజుతున్నారు. చనిపోతే శవాన్ని అప్పగించడానికి డబ్బులు లాగుతున్నారు. నిజం చెప్పాలంటే నా రాకకు ముందుకంటే కూడా ఇప్పుడు ప్రపంచం మరీ పాడయిపోయింది.

ఇన్నిరోజుల అనుభవంతో చెబుతున్నా వినండి. కరోనా అంటే భయం కంటే డబ్బు అంటే మమకారమే వాళ్లకు ఎక్కువ అని తేలిపోయింది’ (10-05-2021)

పేర్ల పురాణం

 ప్రభుత్వాలు మారినప్పుడల్లా పధకాల పేర్లు మారడం అందరికీ తెలిసిందే. పధకాలు కాకుండా ప్రభుత్వ శాఖల పేర్లు కూడా మారిపోవడం కూడా కొత్తేమీ కాదు.

మోడీ ప్రభుత్వం కేంద్రంలోని మానవ వనరుల అభివృద్ధి శాఖను విద్యా మంత్రిత్వ శాఖగా మారుస్తూ నిర్ణయించింది. సమగ్ర జాతీయ విద్యా విధానానికి రూపకల్పన చేసిన పిమ్మట దాని అమలుకోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ శాఖకు దాని పూర్వ నామమే దక్కింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి విద్యా మంత్రిత్వ శాఖగా ఉంటూ వస్తున్న ఈ శాఖ పేరును రాజీవ్ గాంధి ప్రధానమంత్రి అయినప్పుడు మానవ వనరుల అభివృద్ధి శాఖగా మార్చారు. అప్పటికే అనేక కీలకమైన శాఖలు నిర్వహించిన పీవీ. నరసింహారావు గారిని ఈ శాఖకు మంత్రిని చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, పీవీ గారంతటి సీనియర్ కు ఇంతటి అప్రధాన శాఖ ఏమిటని. రాజీవ్ గాంధి ఆ శాఖ పేరును కూడా మానవ వనరుల అభివృద్ధి శాఖగా మార్చారు. పీవీ గారు ఆ శాఖను ఎంత సమర్ధవంతంగా తీర్చిదిద్దారు అంటే చివరకు అది కేంద్ర ప్రభుత్వంలోని అతి కీలక మంత్రిత్వ శాఖల్లో ఒకటిగా మారిపోయింది.
ఇటువంటి ఘటనలు పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరిగాయి. సమాచార, పౌర సంబంధ శాఖను ఉన్నట్టుండి సమాచార, జన సంబంధ శాఖగా మార్చారు. అంటే పౌర అనే పదం తీసేసి జన అనే పదం చేర్చారు. కానీ రాజధాని నుంచి జిల్లాల వరకు ఆ శాఖ కార్యాలయాల బోర్డులను, లెటర్ హెడ్లను, ఆఖరికి అధికారిక స్టాంపులను మార్చాల్సి వచ్చింది.
మళ్ళీ చాలా కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభువులకు ఆ పేరు నచ్చలేదు. తిరిగి సమాచార, పౌర సంబంధ శాఖగా మారిపోయింది.
చిత్రం ఏమిటంటే ఆ శాఖ పేరులోనే పౌర సంబంధాలు. నిజానికి ఆ అధికారులు నెరిపేది పత్రికా సంబంధాలు.

108


తనదాకా వస్తే కానీ...
వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి హయాములో ఉమ్మడి రాష్ట్రంలో 108 అంబులెన్స్ సర్వీసులు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో మొదలయ్యాయి. ఒక ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు ఈ పధకాన్ని అసెంబ్లీలో, బయట చెరిగి పారేసేవాడు. రోడ్డు మీద గాయపడ్డ వాళ్ళని దగ్గరలో ఆసుపత్రులకు చేర్చడానికి ఇంత డబ్బు పెట్టి అంబులెన్సులు ఏర్పాటు చేయాలా అనేది ఆయన గారి వాదన.
ఇలా వుండగా అనుకోని కష్టం ఆయనకే వచ్చి పడింది. ఏదో ఊరు వెళ్లి తిరిగి వస్తుంటే ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఎవరో 108 సర్వీసుకు ఫోన్ చేశారు. వాళ్ళు ఆఘమేఘాల మీద వచ్చి ఆయన్ని సికిందరాబాదు ఆసుపత్రిలో చేర్చారు. తీసుకురావడంలో కొద్దిగా ఆలస్యం అయినా పరిస్థితి వేరుగా ఉండేదని కోలుకున్న తర్వాత ఆయనకు తెలిసింది. విలువలు ఉన్న నాయకుడు కాబట్టి 108 సర్వీసులు ఆపదలో ఉన్నవారికి అమోఘమైన సేవలు అందిస్తున్నాయని పత్రికలవారికి చెప్పారు.

9, మే 2021, ఆదివారం

తల్లీ నిన్ను దలంచి......

 (మే నెల రెండో ఆదివారం అంతర్జాతీయ మాతృదినోత్సవం)

అమ్మ అన్న దేవత లేకపోతే-

ఇది రాస్తున్న నేనూ లేను. చదువుతున్న మీరూ వుండరు.

రోజూ తలచుకోవాల్సిన ఈ దేవతను ఏదో ఒకనాడయినా తలచుకునేందుకు ఈ నాటి నాగరికత మనకో ‘రోజు’ను ఇచ్చింది.

అదే, – మదర్స్ డే – మాతృమూర్తి దినోత్సవం.

దేశదేశాల్లో ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం ఇప్పుడు ఆనవాయితీగా తయారయింది.

అయితే, భారత దేశంతో సహా అనేక దేశాలలో ఈనెలలోనే అదీ రెండో ఆదివారం నాడే ఉత్సవాన్ని జరుపుకుంటూ తమకు జన్మ ఇచ్చిన మాతృదేవతలను స్మరించుకుంటున్నారు. కానుకలిచ్చి కన్నరుణం తీర్చుకుంటున్నారు.

తల్లులను ఏడాదిలో ఒకరోజయినా గుర్తుంచుకుని పండగ చేసుకునే ఈ సంప్రదాయ మూలాలు మనకు విదేశాలనుంచే దిగుమతి అయ్యాయి.

సంవత్సరంలో మూడువందల అరవై అయిదు రోజుల్లో ఒక రోజుకిమదర్స్ డే’ గా గుర్తింపు సాధించడానికి దాదాపు నూట ఇరవై ఏళ్ళ క్రితమే అమెరికాలో ఒక మహిళ ఏళ్ళ తరబడి పోరాటం చేయాల్సి వచ్చిందంటే – తల్లులపట్ల సమాజానికి వున్న చిన్న చూపు ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.

అన్నా జార్విస్ అనే ఈ అమ్మడు – 1890 లోనే తాను నివసిస్తున్న గ్రాఫ్టన్ నగరం వొదిలి ఫిలడెల్ఫియాకు మకాం మార్చుకున్నది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లికి గుర్తింపు తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతో వొంటరి పోరాటం ప్రారంభించింది. 1905 లో తన తల్లిని ఖననం చేసిన స్మశాన వాటికలో అమ్మ సమాధి ఎదుట నిలబడి – చనిపోయిన లేదా జీవించివున్న మాతృమూర్తులపట్ల గౌరవపురస్సరంగా ఏడాదిలో ఒక రోజుకిమదర్స్ డే’ గా గుర్తింపు తీసుకువస్తానని ప్రతిన పూనింది. దీనికో బలమయిన కారణం వుందని కూడా చెప్పుకుంటారు. ఈవిడ తల్లి – అన్నా రీవేస్ జార్విస్ కన్నుమూయడానికి ముందు ఏదో ఒక విషయంలో తల్లీ కూతుళ్ళ నడుమ వాదులాట జరిగిందట. ఆ తరవాత కొద్దిసేపటికే తల్లి మరణించడం - కూతురు అన్నా జార్విస్ కి తీరని మనస్తాపాన్ని కలిగించిందట. ఇందులో నిజానిజాల సంగతి ఎలావున్నా – ఆ తరవాత రోజుల్లో జార్విస్ సాగించిన పోరాటం చరిత్రలో ఒక అధ్యాయంగా మారింది.

ఈ క్రమంలో ఆమె చేస్తున్న ఉద్యోగాన్ని వొదిలిపెట్టింది. రాజకీయ నాయకులకు, చర్చి అధికారులకు, ప్రభుత్వంపై వొత్తిడి తీసుకురాగల అవకాశం వున్న బడా పారిశ్రామిక వేత్తలకు ఉత్తరాలు రాసింది. విజ్ఞప్తులు చేసింది. దరిమిలా వెస్ట్ వర్జీనియా ప్రభుత్వం ముందుగా స్పందించి ఆ రాష్ట్రంలో ‘మదర్స్ డే’ అధికారికంగా జరపడానికి అంగీకరించింది. ఆ తరవాత 1914 లో అమెరికా కాంగ్రెస్ కూడా మెట్టుదిగివచ్చి ఈ దిశగా ఒక తీర్మానం ఆమోదించడం – ఆనాటి ప్రెసిడెంట్ ఉడ్రో విల్సన్ సంతకం చేయడం చకచకా జరిగిపోయాయి. అన్నా జార్విస్ పట్టుదలపై అమల్లోకి వచ్చిన ఈ ‘మదర్స్ డే’ ఉత్తర్వులో ఒక విశేషం వుంది. మొత్తం కుటుంబం శ్రేయస్సుకు అనుక్షణం పాటుపడే 'అమ్మ'కే ఈ గౌరవం దక్కాలన్నది జార్విస్ ఆకాంక్ష. అందుకు అనుగుణంగానే – ప్రజా రంగంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మహిళామణులను మాత్రమే గౌరవించుకునే రోజుగా కాకుండా – అమ్మలగన్న అమ్మలందరికీ కృతజ్ఞతలు తెలిపే రోజుగా ‘మదర్స్ డే’ ని జరుపుకోవడమే అందులోని విశిష్టత. అందుకే ఇంగ్లీషులో ‘మదర్స్ డే’ రాసేటప్పుడు ఏకవచనంలో అంటే 'తల్లి' దినోత్సవం (Mother's Day) గా పేర్కొంటారు.

మదర్స్ డే సాధించాలన్న అన్నా జార్విస్ పట్టుదల అయితే నెరవేరింది కానీ ఆమె కన్న మరికొన్ని కలలు మాత్రం కలలుగానే మిగిలిపోయాయి. 'మదర్స్ డే నాడు తల్లులకు కానుకలుగా పూలూ గ్రీటింగ్ కార్డులూ పంపకండి, ఆమె పట్ల మీ ప్రేమానురాగాలు వ్యక్తం చేస్తూ సొంత దస్తూరీతో నాలుగు వాక్యాల ఉత్తరం ముక్క రాయండ'న్న అన్నా జార్విస్ వేడుకోలు గాలిలో కలిసిపోయింది. గ్రీటింగ్ కార్డుల్లో వ్యక్తమయ్యేది మొక్కుబడి ప్రేమేననీ, సొంతంగా ఉత్తరం రాస్తే తల్లికి కలిగే తృప్తే వేరనీ - జార్విస్ చేసిన విజ్ఞప్తులన్నీ – తల్లి పాలను సయితం లాభాలకు అమ్ముకోవాలనే ‘మార్కెట్ శక్తుల’ ఎత్తుగడలముందు వెలతెలా పోయాయి. మాతృమూర్తి దినోత్సవం కోసం నిర్విరామగా పోరాడిన అన్నా జార్విస్ – పిల్లలు లేకుండానే, తల్లి కాకుండానే – 1948 లో చేతిలో చిల్లిగవ్వ లేకుండా దిక్కుమాలిన పరిస్తితుల్లో కన్నుమూసింది. ఏ తల్లి కోసం ఆమె అంతగా పోరాడిందో – ఆ తల్లి సమాధి చెంతనే అన్నా జార్విస్ ని ఖననం చేయడం అన్న తృప్తి ఒక్కటే ఆమెకు దక్కింది.

అన్నా జార్విస్ కోరుకున్నట్టుగా – మదర్స్ డే జరుపుకోవడం అనేది ఒక మొక్కుబడి వ్యవహారం కాకుండా చూడాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవడమే కాదు వాటిని ఆనాడు అమలుపరచాలి.

మదర్స్ డే నాడు తల్లి దగ్గరకు వెళ్లి ఆ రోజల్లా ఆమెతో గడపగలిగితే అంతకు మించిన సార్ధకత వుండదు. ఒక రోజు మొత్తం తల్లితో గడిపి, సొంతంగా వంట చేసి ఆమెతో తినిపించగలిగితే మాతృరుణాన్ని ఏదో కొంతయినా తీర్చుకున్నట్టే. అలా కుదరని పక్షంలో – గ్రీటింగ్ కార్డుతో పాటు స్వయంగా అమ్మకు రాసిన ఉత్తరాన్ని కూడా జతపరచాలి. తల్లి మనసు తెలుసుకుని ఆమె కోరుకున్న విధంగా పనిచేస్తున్న స్వచ్చంద సంస్తలకు విరాళం పంపాలి. తల్లీ తండ్రి లేని అనాధ పిల్లలను చేరదీయాలనే నిర్ణయం తీసుకోగలిగితే అంతకు మించిన కానుక ఏ తల్లీ ఆశించదు.

మదర్స్ డే నాడు గుడికి వెళ్ళాల్సిన పనిలేదు. ఇంట్లో వెలిసివున్న మాతృదేవతకు నమస్కరించండి. ముక్కోటి దేవతలు మీ పూజలందుకుంటారు. ఇది సత్యం.

 

8, మే 2021, శనివారం

నస్మరంతి గాడు

 ఇది ముళ్ళపూడి వారు సృష్టించిన పదం

“పెళ్ళయి పదేళ్లవుతున్నా పెళ్ళానికి పుట్టింటి పేరు మీదనే ఉత్తరాలు వస్తుంటే ఆ మొగుడు ముండావాడిని ‘నస్మరంతిగాడు అంటారని అప్పుడెప్పుడో రాఘవయ్య గారి జ్యోతి పత్రికలో ఆయన  రాశారు. అంటే, ఎవరూ పట్టించుకోని వాడిని గురించి ముళ్ళపూడి వెంకట రమణ గారు తనదైన శైలిలో అలా భాష్యం చెప్పారు.

ఫోను సంభాషణలో ఈ విషయం నానుంచి విన్న మిత్రుడు ఒకరు మరో ఆసక్తికరమైన విషయం దీనికి జోడించాడు.

“ఈ ఫేస్ బుక్ ప్రపంచంలో పోస్టు పెట్టి పది గంటలు అయినా ఒక్క లైకు కానీ, చిన్నమెత్తు కామెంటు కానీ రాకపోతే అతడ్ని కూడా నస్మరంతి అంటారుష”

శాస్త్రం – శాస్త్రీయం

 

శివ పురాణంలో ఒక ఘట్టం గురించిన ప్రస్తావన వుంది. లోకంలో పాపుల సంఖ్య పెరిగిపోవడం చూసి లయకారుడు అయిన మహా శివుడికి మహాకోపం కలిగింది. ఆయన వెంటనే తన జటాఝూటం నుంచి ఒక కేశాన్ని తీసి దానితో కృత్య అనే మహమ్మారిని సృష్టించి పాపులను సంహరింప చేస్తాడు. ఇది ఐతిహ్యం.

అలాగే, జనాభా గురించి మాల్తూసియన్ థియరీ అని ఒకటుంది. థామస్ రాబర్ట్ మాల్తూస్ అనే శాస్త్రవేత్త ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.

ప్రపంచంలో జనాభా, ఆహార ధాన్యాల ఉత్పత్తితో నిమిత్తం లేకుండా అపరిమితంగా పెరిగిపోయే సందర్భాలలో ప్రకృతి తనంతట తాను ఆ దామాషాను తగిన విధంగా సవరించుకుని, సమతూకం చేసుకుంటుందని (Checks and Balances) మాల్తూస్ మహాశయుల సిద్ధాంతం. ఈ క్రమంలోనే కరువులు, కాటకాలు, ఉప్పెనలు, తుపానులు, మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించి, అంటువ్యాధులు ప్రబలి ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతారని ఆ శాస్త్రవేత్త భాష్యం.
(08-05-2021)

7, మే 2021, శుక్రవారం

జీవితం అంటే ఓ పరీక్షే!


“భయం అంటే కోరిక” అన్నారు జిడ్డు కృష్ణమూర్తి.
కోరిక తీరదేమో అనే సందేహమే భయంగా మారుతుంది అని వారి తాత్పర్యం.

ఒక విద్యార్థి పరీక్షలను లెక్కపెట్ట కుండా ఏడాది పొడుగునా అడ్డమైన తిరుగుళ్లతో కాలక్షేపం చేస్తాడు. పరీక్షలు దగ్గర పడేసరికి భయపడిపోతాడు, సరిగ్గా రాయలేనేమో అనే సందేహంతో. పరీక్ష పాసవాలి అనే కోరిక తీరదేమో అనే భయంతో. ఎందుకంటే పరీక్ష రాయడానికి అతడు సంసిద్ధంగా లేడు. అందుకు తగిన సన్నాహం చేసుకోలేదు.

అలాగే జీవితం అనే పరీక్ష రాయడానికి కూడా కొంత సంసిద్ధత కావాలి. అది లేకపోతే భయం వేస్తుంది.
ఇక్కడ పరీక్ష అంటే మరణం. మరణ కాలం దగ్గర పడుతుంటే మనసులో ఆందోళన మొదలవుతుంది. అప్పటిదాకా ఎందుకూ పనికిరాని లౌకిక విషయాలతో మమేకమై, సంపాదన యావలో మునిగిపోయి, ప్రాపంచిక ప్రలోభాలకు లోనయి అసలు జీవిత పరమార్థం ఏమిటో మరిచిపోతాడు మనిషి. అల్లరిచిల్లరగా తిరిగిన విద్యార్ధికి మల్లేనే మానవుడికి కూడా మరణం అంటే భయం వేస్తుంది. కోరికలు తీరకపోవడమే దానికి కారణం. బాగా శ్రద్ధగా చదివిన విద్యార్థి ఎలాంటి భయ సంకోచాలు లేకుండా పరీక్షకు తయారవుతాడు. కోరికలు లేని మనిషి కూడా మరణ భయానికి దూరం అవుతాడు.

కాబట్టి జీవితం అనే విలువైన సమయాన్ని మంచి పనులకు ఉపయోగిస్తే, మంచి విద్యార్ధికి పరీక్ష భయం లేనట్టే మంచి మనిషికి కూడా మరణ భయం మాయమై పోతుంది.
(07-05-2021)