12, మార్చి 2021, శుక్రవారం

పదేళ్లనాటి మాటే అయినా నిత్య సత్యం – భండారు శ్రీనివాసరావు

 


అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి

వార్త

ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ‘ఈనాడు-ఈటీవి’ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఒక  ప్రశ్న, దానికి సమాధానం ఇలా వున్నాయి. (25-11-2011)

 

ప్రశ్న: “పీసీసీ అధ్యక్షునితో ఎలాంటి సంబంధాలున్నాయి?”

సమాధానం: “బాగున్నాయి. కాంగ్రెస్ దానంతట అది వోడించుకుంటుంది తప్ప వేరే పార్టీకి కాంగ్రెస్ ని వోడించే బలం లేదు.” 

“మేమంతా ఐకమత్యంగా ఉంటేనే తిరిగి గెలుస్తాం”

(2011 నవంబరులో ఈనాడు దినపత్రిక లో ప్రచురించిన ముఖ్యమంత్రి  ఇంటర్వ్యూ)

వ్యాఖ్య

“కుఠార మాలికాం దృష్ట్యా

కంపంతతి తరోవనే!

తత్ర వృద్ధ తరుహ్  ప్రాహుహ్

మామకోనాస్తి కిం భయం”

ఈ సంస్కృత శ్లోకానికి  తెలుగు అనువాదం:

“ఒకడు పది గొడ్డళ్లను, వాటిని మాలగా గుచ్చి, భుజాన వేసుకుని తన వూరికి, ఒక అడవి దోవగుండా వెళ్తున్నాడు. అడవిలో కుర్ర చెట్లు ఇది చూసి హడలిపోయాయి. అది చూసి, ఒక వృద్ధ వృక్షం “ఎందుకర్రా అట్లా హడలిపోతున్నారు! ఆ గొడ్డళ్ళు  మనలనేం చేస్తయ్యి! వాటిలో మన వాడు (కర్ర) లేడు గదా!” అని అభయం ఇచ్చింది.

“అదీ కాంగ్రెస్ వాళ్లు పొందికగా కూర్చుని నేర్వవలసిన పాఠం.”

(కలం కూలీగా తనను తాను అభివర్ణించుకున్న ప్రముఖ జర్నలిస్ట్ కీర్తిశేషులు శ్రీ జి. కృష్ణ రాసిన ‘అప్పుడు –ఇప్పుడు’ గ్రంధం నుంచి)

 

రాయాలంటే భయమేస్తోంది – భండారు శ్రీనివాసరావు

 ‘రాయాలనే వుంది. కానీ భయమేస్తోంది అన్నాడు ఓ ముప్పయ్ అయిదేళ్లకు పైగా పరిచయం ఉన్న ఓ సీనియర్ పాత్రికేయ  మిత్రుడు, ‘ఖాళీగానే  వున్నావ్, ఏదైనా రాయొచ్చు కదా’ అనే నా ప్రశ్నకు జవాబుగా.

ప్రముఖ ఆంగ్ల పత్రికలో విలేకరిగా పాత్రికేయ జీవితం ప్రారంభించి అదే పత్రికలో దాదాపు నలభయ్ ఏళ్ళు పనిచేసి ఉన్నత స్థానానికి ఎదిగిన ప్రస్థానం ఆయనది. రాజకీయ నాయకులతో అంటకాగిన జీవితం. ముఖ్యమంత్రులను, మంత్రులను నేరుగా కలిసి, లేదా ఫోనుచేసి  మాట్లాడగలిగిన అవకాశం కలిగిన వృత్తి. ఆయన రాసిన వార్తలకు రాజకీయ నాయకులు స్పందించి నేరుగా ఆ పత్రిక ఆఫీసుకే వెళ్లి ఆయన్ని కలిసి తమ గోడు విన్నవించుకున్న సందర్భాలు అనేకం.   

‘సోషల్ మీడియాలో నువ్వూ మరికొందరు మితృలు రాస్తున్న జ్ఞాపకాలు ఆసక్తిగా చదువుతుంటాను. నాకూ రాయాలని అనిపిస్తుంది. కానీ మన రోజుల్లో ఏదైనా వార్త కానీ వ్యాసం కానీ రాస్తే  దాన్ని సానుకూలంగా తీసుకునే వారు. లేదా ఓ ఖండన ఇచ్చేవాళ్ళు. దాన్ని మనం ప్రచురించేవాళ్ళం. జర్నలిజంలో, రాజకీయాల్లో అలాంటి విలువలు ఉండేవి. ఇప్పుడు నాయకులే కాదు, వారి అనుచరులు, అభిమానులు కూడా చెలరేగిపోయి ఉచ్చనీచాలు లేకుండా కామెంట్లు పెడుతున్నారు. వారికి మనం రాసిన దాంతో నిమిత్తం లేదు. మొత్తం వ్యాసంలో వారి అభిమాన నాయకుడు లేదా పార్టీకి ఎక్కడైనా వ్యతిరేకంగా రాశామా అన్నదే వారికి ముఖ్యం.  అలా వారికి అనిపిస్తే చాలు, కాగితం మీద పెట్టడానికి వీలులేని వికృత భాషలో వ్యాఖ్యలు చేస్తున్నారు. అలా అని మన బంగారం మంచిదని నేను అనడం లేదు. జర్నలిజం అనేది మార్కెట్లో దొరికే  మిగిలిన వస్తువుల్లో ఒకటిగా మారిపోయింది. ఏ వార్త వెనుక ఏ రాజకీయ శక్తులు పనిచేస్తున్నాయో సామాన్య పాఠకుడికి కూడా ఇట్టే అర్ధం అవుతోంది. మీడియా యాజమాన్యాలే రాజకీయ రంగులు నిస్సిగ్గుగా పూసుకుని తిరుగుతున్నప్పుడు ఇక మనం  చేయగలిగింది ఏముంది?

మిత్రుడి పలుకుల్లో నిర్వేదంతో కూడిన నిజం ధ్వనించింది.

‘సరే! ఇదంతా నీకు ఎందుకు చెబుతున్నాను అంటే నువ్వు తప్పకుండా ఇదంతా ఓ పోస్టు రూపంలో రాస్తావనే నమ్మకం నాకుంది. ఆ విధంగా నా మనసులోని భారం కొంతైనా తగ్గుతుందేమో

(12-03-2021)

మంచి పుస్తకం కూడా ప్రాప్తమే – భండారు శ్రీనివాసరావు

 2011. అంటే పదేళ్లు.

మాజీ డీజీ హెచ్.జే. దొర గారు ఎంత హుందాగా ఉంటారో ఆయన రాసినఎన్టీఆర్ తో నేను’ అనే పుస్తకావిష్కరణ కూడా అంత హుందాగా ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. ఆదివారం (18-12-2011) కావడంతో హైదరాబాదు బుక్ ఎగ్జిబిషన్ కిటకిటలాడింది. అంత జనసందోహంలో కూడా ఆవిష్కరణ సభ చక్కగా నిర్వహించారు. వేదిక మీద గవర్నర్ నరసింహన్ తోపాటు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వర రావు, కే.రామచంద్రమూర్తి, మాజీ ఐజీ రావులపాటి సీతారామా రావు, ఎమెస్కో విజయ కుమార్ వుంటే,  సభకు హాజరయిన వారిలో మాజీ డీజీపీలు అరవిందరావు, ఆర్. ప్రభాకర రావు, మాజీ ఐపీఎస్ అధికారులు శివశంకర్, డాక్టర్ సుబ్రహ్మణ్యం, ఇంకా అనేకమంది పోలీసు అధికారులు, జర్నలిస్టులు వున్నారు.

గవర్నర్ నరసింహన్ గారి ప్రసంగం ఆత్మీయంగా సాగుతూ భేషజాలు లేని మనసులోని మాటలతో సభికులను ఆసాంతం ఆకట్టుకుంది.

అనంతపురంలో దొర గారు ఎస్పీ గా పనిచేస్తున్నప్పుడు నరసింహన్ గారు ట్రైనీ ఏఎస్పీ గా జాయిన్ అయ్యారట. దొరగారి శ్రీమతి కూడా తనను ఎంతో బాగా చూసుకొనేవారని చెప్పారు. ఓ సారి ఆయన తీవ్రంగా అస్వస్తులు అయినప్పుడు పుట్టపర్తి నుంచి సత్య సాయిబాబా విభూతి తీసుకువచ్చి పెట్టారుట. ఈ మాటలు చెబుతూ గవర్నర్ నరసింహన్ గారు సభలో వున్న దొరగారి శ్రీమతికి వేదికపై నుంచే ప్రత్యేకంగా అభివాదం చేసారు. వాళ్ళ ఆత్మీయత ఎప్పటికీ మర్చిపోలేననన్నారు. ఇంటికి వెళ్తే పూత రేకులు పెట్టేవారని గుర్తు చేసుకొన్నారు.దొర గారు ఎప్పుడు ‘అముల్ బేబీ’ మాదిరిగా చిరునవ్వులు నవ్వుతూ వుంటార’ని అంటూ సభలో నవ్వుల పువ్వులు పూయించారు. అయితే అంత మాత్రాన ఆయన దగ్గర చొరవ తీసుకోలేమమని అన్నారు. పూత రేకులు పెట్టిన కొంత సేపటికే ‘నైట్ పెట్రోలింగుకు ఎందుకు వెళ్ళలేద’ని కేకలేసేవారని చెబుతూ, డిపార్ట్ మెంట్ లో వున్న అప్పటి భయ భక్తులను సభికులకు, ముఖ్యంగా సభలో వున్న పోలీసు అధికారులకు జ్ఞాపకం చేసారు. రావులపాటి సీతారామారావు గారిని గురించి చెబుతూ ‘ఆయనతో పాటు పన్నెండు మంది ట్రెయినీ డీఎస్పీలు అనంతపురం పోలీసు ట్రైనింగ్ కాలేజీలో వుండేవారని, మద్రాస్ నుంచి తాను తెచ్చిన తినుబండారాలన్నీ వాళ్ళే తీసేసుకునేవార’ని చురక వేసారు. తనకు తెలుగు చదవడం బాగా  రాకపోయినా, పుస్తకం టైటిల్ ‘ఎన్టీఆర్ తో నేను’ అనే బదులు ‘ఎన్టీఆర్ నేనే’ అని పెడితే సరిపోయేదని చతురోక్తి విసిరారు. గవర్నర్ స్థాయిలో వుండి కూడా అనుబంధాలకు, ఆత్మీయతకు నిదర్శనంగా నిలిచారు నరసింహన్ గారు.

పుస్తకావిష్కరణ కార్యక్రమం పూర్తయిన తర్వాత అందరికి ఆ పుస్తకం కావాలని అనిపించింది. కొంత మందికి ఎమెస్కో విజయ్ కుమార్ గారు కాంప్లిమెంటరీగా ఇచ్చారు. అందరికి ఇవ్వడం సాధ్యం కాదు కదా. ఆ హడావిడిలో ఆర్వీవీ కృష్ణారావుగారు వెంటనే బుక్ ఎగ్జిబిషన్ లో వున్న ఎమెస్కో స్టాల్ కి వెళితే ‘లేవు’ అని చెప్పారు. అప్పటికే అందరూ వెళ్లిపోతున్నారు. దొరగారితో ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ లు తీసుకుంటూ వుండడంతో ఆయన బిజీగా వున్నారు. ఈలోగా ఎవరో చెప్పారు ‘నవోదయ స్టాల్ లో ట్రై చెయ్యండి’ అని. అక్కడకి వెడితే కొద్ది కాపీలే వున్నాయి. ఆయన రెండు కాపీలు కొని, దొర గారి దగ్గరకి వచ్చి ‘సార్! మీ సంతకం కావాలి” అంటే వెంటనే గుర్తు పట్టి సంతకం చేసిచ్చారు. ‘రెండో పుస్తకం మీద కూడా కావాలి సార్! ఇది భండారు శ్రీనివాస రావుకి’ అంటే ‘శ్రీనివాసరావు ఎలా వున్నాడు?’ అని ఎంతో అభిమానంగా అడుగుతూ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. కృష్ణారావు గారు, నేను ఇదివరలో రేడియోలో పనిచేసే రోజుల్లో దొరగారితో చాలా సన్నిహితంగా వుండే వాళ్ళం. నక్సలైట్ సమస్య ఉధృతంగా వున్న రోజుల్లో రేడియో ప్రభావం బాగా వుండేది. ఢిల్లీ నుంచి వచ్చే స్పాట్ లైట్ వంటి ముఖ్యమయిన కార్యక్రమాల్లో సయితం ఈ సమస్యకు ఎక్కువ ప్రాధాన్యం వుండేది. వృత్తి  రీత్యా మేము ఆయన్ని కలిసినప్పుడు, ముఖ్యంగా కొత్త సంవత్సరం ఆరంభంలో డీజీపీ సంప్రదాయంగా ఇచ్చే పార్టీల్లో మమ్మల్ని గుర్తుంచుకుని అభినందించేవారు.

ఈ విధంగా దొరగారు రాసిన ‘ఎన్టీఆర్ తో నేను’ అనే పుస్తకం కొనకుండానే, ఆయన ఆటోగ్రాప్ తో సహా, నా చేతికి వచ్చింది.

ప్రతి ధాన్యపు గింజమీదా తినేవాడి పేరు రాసివుంటుందిట. అలాగే ప్రతి పుస్తకం మీదా దాన్ని చదివేవాడి పేరు ఉంటుందేమో!

అలా అయాచితంగా దొరగారి పుస్తకం ఆయన సంతకంతోసహా నా చేతికి వచ్చింది.

 

 (12—03 -2021)

11, మార్చి 2021, గురువారం

చైనాలో రైలు ప్రయాణం

 

పరవస్తు లోకేశ్వర్ గారు రాసిన 'సిల్క్ రూటులో సాహస యాత్ర' పుస్తకంలో కొన్నేళ్ల క్రితం చైనాలో తన రైలు ప్రయాణ అనుభవాన్ని ఇలా అభివర్ణించారు.
“చైనా భాషలో లీన్ యాన్ అంటే పువ్వుల తోట అని అర్ధం. కానీ ఎడారి కొసన ఉన్న పట్టణం కాబట్టి ఎక్కడా చెట్టూ చేమా జాడ కూడా లేదు. రైలు స్టేషన్ కు మూడంచెల పటిష్టమైన భద్రత. టిక్కెట్టు యెంత ముందు కొనుక్కున్నా ఎవర్నీ ప్లాట్ ఫారం మీదికి వెళ్ళనివ్వరు. రైలు రావడానికి ఓ పదినిమిషాల ముందు లోపలకి అనుమతిస్తారు. సామానులు మోయడానికి కూలీలు వుండరు. వృద్ధులతో సహా అందరూ ఆరోగ్య వంతులే కాబట్టి ఎవరి లగేజి వాళ్ళు అవలీలగా మోసుకెడతారు. ప్లాట్ ఫారం శుభ్రంగా అద్దంలా వుంటుంది. ఎటువంటి దుకాణాలు వుండవు. రణగొణ ధ్వనులు చెత్తాచెదారానికి ఆస్కారంవుండదు. రైలు కదలగానే ప్లాట్ ఫారం ఖాళీగా, నిశ్శబ్దంగా వుంటుంది. ఒకరిద్దరు రైల్వే ఉద్యోగులు మాత్రమె కనబడతారు. ఇక ప్రతి బోగీకి ఒక అటెండెంటు నీటుగా నీలం రంగు డ్రెస్సులో తలమీద టోపీతో ఉంటాడు. టిక్కెట్లు చెక్ చేయడం, బెర్తులు చూపించడంతో పాటు ప్రతి గంటకు చీపురుతో పెట్టె మొత్తం శుభ్రం చేస్తుంటాడు. వారిలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ కనబడింది. ప్రతి ఆరు సీట్లకి ఒక ప్లాస్టిక్ చెత్త బుట్ట వుంటుంది. ప్రయాణీకులు చెత్త అందులోనే వేస్తారు. అటెండెంటు ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేస్తాడు. ప్రతి బోగీలో బాత్ రూములు, వాష్ రూములు విడిగా వుంటాయి. టాయిలెట్లు వెస్ట్రన్ తరహా కాదు. పాత మోడల్స్. అంటే ముసలివారితో సహా ఎవరికి ఆ దేశంలో మోకాళ్ళ నొప్పులు లేవని అర్ధం అయింది. ప్రయాణీకులు అందరి వద్దా డిస్పోసబుల్ స్లిప్పర్స్ వున్నాయి. రైలు ఎక్కగానే బూట్లు విప్పేసి వాటిని ఉపయోగించి దిగేముందు వాటిని చెత్త డబ్బాలో వేస్తారు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రాత్రి పడుకోబోయే ముందు ఆడామగా తేడా లేకుండా అందరూ శుభ్రంగా బ్రష్ చేసుకుని నిద్రకు ఉపక్రమిస్తున్నారు.
“చైనా రైల్వేలలో నాకు నచ్చిన మరో విషయం ఏమిటంటే రాబోయే స్టేషన్ కు అయిదు నిమిషాల ముందు, స్టేషన్ దాటిన తర్వాత అయిదు నిమిషాల పాటు టాయిలెట్ తలుపులు ఆటోమేటిక్ గా లాక్ అవుతాయి. ఈ పద్దతి వల్ల రైల్వే స్టేషన్లు, రైలు పట్టాలు, పరిసరాలు శుభ్రంగా వుంటాయి. రైలు మార్గాలను దేశ మంతటా ఫెన్సింగ్ చేశారు. దానివల్ల పశువులు, మనుషులు, వాహనాలతో ప్రమాదాలు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తవు.
“ఆరోగ్యం పట్ల చైనీయుల చైతన్యం నన్ను ఆశ్చర్య పరిచింది. నలభయ్ గంటల సుదీర్ఘ ప్రయాణం. కండరాలు పట్టేయకుండా ఏదయినా స్టేషన్లో రైలు ఆగిందంటే చాలు గభాలున ప్లాట్ ఫారం మీదకు గెంతి వార్మ్ అప్ లు మొదలు పెడతారు.
“భీకరాకార పర్వత గర్భాలను తొలిచి నిర్మించిన టన్నెల్స్ ద్వారా సాగిన ఆ రైలు ప్రయాణం ఒక మధురానుభూతి”
అని అభివర్ణించారు పరవస్తు లోకేశ్వర్ తన పుస్తకంలో.

ఇంటి వద్దకే పోలింగు బూత్ – భండారు శ్రీనివాసరావు

 

పోస్టల్ బ్యాలెట్ ఓ సీనియర్ పాత్రికేయుడి అనుభవం
వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ వరదాచారి గారు ఒక అనుభవాన్ని ఈరోజు వాట్సప్ ద్వారా పంచుకున్నారు. ఆయనిలా రాశారు:

“నిన్న ఒక పోలింగు అధికారిణి, ఒక మూవీ కెమెరామన్, మరో స్టిల్ కెమెరామన్, ఇద్దరు సహాయకులు, మరో పోలీసు అధికారి కలిసి హైదరాబాదులోని పాత జర్నలిస్టుకాలనీలో మాఇంటికి వచ్చి బ్యాలట్ పత్రం ఇచ్చి, నేను వోటువేసి కవరులో పేట్టి ఇస్తే, సీలువేసిన బ్యాలట్ డబ్బాలో దాన్ని భద్రపరచి తీసుకువెళ్ళారు. ఇదంతా కెమెరాల్లో రికార్ఢు చేశారు.
“ఈ ఏర్పాటు బాగుంది. పోస్టల్ బ్యాలట్ మునిసిపల్ ఎలక్షన్ లో కూడా ఇచ్చారు. కాని పోస్టు ద్వారా పంపి అలానే పోస్టు ద్వారానే స్వీకరించారు. అయితే ఇప్పుడు అనుసరించిన విధానం ఓటరుకు మరింత సౌకర్యంగా ఉంది.”
(11-03-2021)

10, మార్చి 2021, బుధవారం

విశాఖ ఉక్కు - రాజీనామా చేస్తే ఏమవుతుంది?

విశాఖ ఉక్కు - రాజీనామా చేస్తే ఏమవుతుంది?

సీఎమ్ జగన్ తన పదవికి రాజీనామా చేయాలి – భండారు శ్రీనివాసరావు

 సీ ఎం రాజీనామా చేస్తేనే , కేంద్రం విశాఖ ఉక్కు విషయంలో మెట్టు దిగివస్తుందని ఓ నాయకుడు అన్నట్టు టీవీల్లో వస్తోంది. మరి ఆ నాయకుడు కూడా పదవిలేని వాడేమీ కాదు. ముందు తన పదవికి రాజీనామా చేసి మరొకరిని చేయమంటే ఒక పద్దతిగా వుండేది. కానీ అలా చేస్తే రాజకీయం ఎలా అవుతుంది.

రాజీనామాల వల్ల ఫలితం ఉండదా అనే ప్రశ్న ఒకటి వుంది. వుంటుంది. కానీ అందుకు దీర్ఘకాలిక పోరాటం అవసరమవుతుంది. పుష్కర కాలం పైగా సాగిన తెలంగాణా పోరాటంలో ఉద్యమ నాయకులు ఎన్నిసార్లు రాజీనామాలు చేసారో, ఎన్ని ఉప ఎన్నికల్లో ప్రజలు తమ అభిలాషను వ్యక్తం చేశారో, ఆ విషయం కేంద్రానికి బోధ పడడానికి ఎంత కాలం పట్టిందో ఆ సంగతులన్నీ ఈనాడు విశాఖ ఉక్కుకోసం రాజీనామాలు డిమాండ్ చేస్తున్న వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి. అలా దీర్ఘకాలిక ఉద్యమం చేయగల సత్తా తమకు వుందో లేదో ఒకసారి అంచనా వేసుకోవాలి.
ప్రత్యేక హోదా కోసం ఆనాడు వైసీపీ లోక సభ సభ్యులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. అయినా వచ్చిందా! ఇలా రాజీనామా చేయగానే అలా దిగిరావడానికి కేంద్రంలో వున్నది అల్లాటప్పా ప్రభుత్వం కాదు. కొన్ని వాస్తవాలను అవగాహన చేసుకుని ఆచరణాత్మక విధానంతో ముందుకు పోవాలి.
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర ప్రాంత నాయకులు జరగబోయే వాస్తవాన్ని గమనించకుండా సమైక్య నినాదంతో ముందుకు వెళ్ళడం వల్ల ఎలాంటి నష్టం జరిగిందో ఆలోచించుకోవాలి.
‘రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిపోయింది. మీకేమి కావాలో అడగండి అని నాటి కేంద్ర ప్రభుత్వం అడిగినప్పుడు ఆంధ్ర ప్రాంత నాయకులు చేష్టలు ఉడిగి వుండిపోయారు. ఇప్పుడూ అదే విధంగా ఆలోచిస్తున్నారు.
రాజీనామాల వల్ల ఫలితం ఉంటుందని అనుకుంటే చేయండి. కానీ ఇలా ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటూ కాలక్షేపం చేయకండి.
ఎదుటివారి చిత్తశుద్ధిని శంకిస్తూ పదేపదే మాట్లాడే సమస్త రాజకీయ పార్టీల నాయకులు తమతమ పదవులకు ఒక్కుమ్మడిగా రాజీనామా చేయండి. ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రభుత్వ సంస్థల అధిపతులు, ప్రతిపక్ష నాయకుడు, పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీ, శాసన మండలి సభ్యులు తమ అధికార పదవులకు, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్ట్ జనసేన పార్టీల నాయకులు తమ పార్టీ పదవులకు ఒకేసారి రాజీనామాలు చేయాలి. శాసన సభ్యులు, శాసన మండలి సభ్యుల రాజీనామాలు అధికారికంగా ఆమోదించిన తర్వాత అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ కూడా రాజీనామా చేయాలి. అప్పుడు రాజకీయ పార్టీల చిత్తశుద్ధి ఏమిటన్నది జనాలకు అర్ధం అవుతుంది. వారి పట్టుదల కేంద్రానికి బోధ పడుతుంది. అలా కాకుండా ఈ ఉద్యమం ద్వారా ఏదైనా రాజకీయ లబ్ది చేకూరితే అది తమ ఖాతాలోనే పడాలి, ఇతరులకు రాకూడదు అనుకుంటే అదో రాజకీయ క్రీడ మాత్రమే అవుతుంది. ఉద్యమం అనిపించుకోదు.
కేంద్రం మెడలు వంచగలం అనే నమ్మకం వుంటే ఆ పని చేయండి. అయ్యేపని కాదు అని మీ మనసు మూలల్లో వుంటే, వాస్తవిక దృక్పథంతో వ్యవహరించి విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికుల ఉద్యోగ భద్రత, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, నిరుపయోగంగా వున్న కర్మాగారం భూములు అన్యాక్రాంతం కాకుండా చూడడం, భూములు కోల్పోయిన వారికి సరైన పరిహారం ఇప్పించేలా చూడడం ఇటువంటి అంశాలపై గట్టి హామీ పొందేలా ప్రయత్నం చేయండి. అలా చేసే ముందు ఒక్క గొంతుకతో కేంద్రాన్ని నిలదీయండి ‘ముందు మా విశాఖ ఉక్కు ఎందుకు, దేశంలో మరో దానితో మీ విధానాల అమలు మొదలు పెట్టండని’
ఔషధం చేదుగా వున్నా పనిచేస్తుంది. అలాగే మంచి సలహా కూడా.
రాజకీయాలు పక్కన పెట్టి ఆలోచించండి. మార్గం మీకే కనపడుతుంది.
(10-03-2021)