20, డిసెంబర్ 2016, మంగళవారం

‘రాయి’నైనా కాకపోతిని.....


ఏదో సినిమాలో నటుడు నాగభూషణాన్ని ఎవరో అడుగుతారు ‘మీరేం చేస్తుంటార’ని. ఆ పాత్రలో నాగభూషణం చెప్పిన జవాబు. “దానధర్మాలు చేస్తుంటాను” ఆయనకి అది తప్ప మరోటి చేతకాదు.
“ఏమిటి మీరిలా రాస్తూనే వుంటారు” కొందరు మిత్రులు నన్ను ఆరా తీస్తుంటారు. నాదీ అదే పరిస్తితి.

“రాయడం తప్ప నాకు ఇంకోటి చేతకాదు”

19, డిసెంబర్ 2016, సోమవారం

తేనె దొరికేది తిరిగే తుమ్మెదకే!

భలేమంచి చౌక ......
ఆరు ఖండాలు...ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా.
పద్నాలుగు దేశాలు....నేపాల్, భూటాన్, ఇరాన్, చైనా, స్వీడన్, నార్వే, ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్, స్కాట్ లాండ్, మెక్సికో, బ్రెజిల్, నైజీరియా, తాస్మానియా...
ఇవన్నీ కేవలం రెండువందల యాభయ్ రూపాయలకే. పాస్ పోర్టులు, వీసాలు అక్కరలేదు.
ఎలాగంటారా?

అలుపెరుగని యాత్రిక రచయిత ఎం. ఆదినారాయణ రాసిన ‘భూ భ్రమణ కాంక్ష’ చదివి చూడండి.



Image may contain: 1 person

18, డిసెంబర్ 2016, ఆదివారం

నీది, నాది, మనది

“స్వామీ ! ఒక ధర్మ సందేహం”
“సంశయించకుండా అడుగు నాయనా!”
“ప్రతిదీ నాది నాది అనుకుంటాం. దీని నుంచి బయటపడే మార్గం లేదా?”
“ఒక చిన్న కధ చెబుతాను. విన్న తరువాత సందేహం వుంటే అడుగు.
“అనగనగా ఒక ఏకాంబరం. ఒకరొజూ పొరుగూరికి వెళ్లి తిరిగొచ్చేసరికి వున్నఇల్లు మంటల్లో తగలబడిపోతోంది. వూరి జనమంతా చేరి చోద్యం చూస్తున్నారు.
ఏకాంబరం గుండె పగిలిపోయింది. తాతలకాలం నాటి ఇల్లు, కళ్ళఎదుటే పరశురామ ప్రీతి అయిపోతోంది. ఎలా! ఎలా! మనసులో ఒకటే బాధ. ఏం చెయ్యలేని నిస్సహాయత. నిన్ననే ఇంటికి బేరం తగిలింది. అసలు ధరకంటే ఎక్కువే ఇవ్వచూపాడు. కానీ ఇంటి మీద మమకారంతో ఏకాంబరం ఒప్పుకోలేదు.
ఇంతలో అతడి పెద్దపిల్లాడు వచ్చాడు. తండ్రి చెవిలో చెప్పాడు.
“మీరు ఊరెళ్ళినప్పుడు అతగాడు మళ్ళీ వచ్చాడు. ఇంకా ఎక్కువకే కొంటానని మాటతో పాటు చాలా మొత్తం బయానాగా ఇచ్చాడు. బేరం బాగా వుండడం వల్ల మీకు చెప్పకుండానే ఒప్పుకున్నాను”
ఈ మాట చెవినపడగానే ఏకాంబరం మనసు స్తిమిత పడింది. ‘అమ్మయ్య ఇప్పుడు ఇల్లు తనది కాదు. ఈ భానన కలగగానే అతడూ చోద్యం చూస్తున్న వారిలో ఒకడిగా మారిపోయాడు. ఇల్లు అగ్నికి ఆహుతి అవుతోందన్న ఆందోళన సమసిపోయింది.
ఇలా ఉండగానే రెండో కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రితో అన్నాడు.
“ఒక పక్క మన ఇల్లు తగలబడి పోతుంటే మీరేంటి, ఇలా నిర్వికారంగా చూస్తూ నిలబడ్డారు?”
తండ్రి జవాబు చెప్పాడు. 'ఇంకెక్కడ మన ఇల్లు. మీ అన్నయ్య నిన్ననే ఎవరికో అమ్మేశాడు”
“భలే వారే ! అతడు మనకు బయానా మాత్రమే ఇచ్చాడు, పూర్తి పైకం ఇవ్వలేదు”
ఏకాంబరానికి మళ్ళీ దిగులు పట్టుకుంది. కొంతసేపటి క్రితం వరకు వున్న మనాది మళ్ళీ పట్టుకుంది.
“అయ్యో! తగలబడుతోంది నా ఇల్లే” అనే స్పృహ తిరిగి ఆవరించింది.
ఇంతలో మూడో కుమారుడు వచ్చి మరో మాట చెప్పాడు.
“చూశావా నాన్నా మన ఇల్లు కొన్నవాడు యెంత మంచివాడో! ఈ ప్రమాదం రేపు జరిగి వుంటే ఏమయ్యేది. ఇలా జరుగుతుందని మీకూ తెలియదు, నాకూ తెలియదు.  అంచేత మీ నాన్నను బాధపడవద్దని చెప్పు. ఆ ఇల్లు నాదే. మాట ప్రకారం డబ్బు మొత్తం ఇచ్చేస్తానని అన్నాడు"
మళ్ళీ సీను రివర్సు.
అంటే. ఆ ఇల్లు తనది కాదు. ఈ భావన అంకురించడంతో మళ్ళీ అతడూ నలుగురిలో ఒకడిగా  మారిపోయాడు.
నిజానికి ఏదీ మారలేదు. మారింది అల్లా తనదీ, పరాయిదీ అనే భావన ఒక్కటే”   

 (ఇంగ్లీష్ కధనానికి స్వేఛ్చానువాదం)

17, డిసెంబర్ 2016, శనివారం

వాదాలు, వాయిదాల సమావేశాలు

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 18-12-2016, SUNDAY)

మొత్తం మీద పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిశాయి. ముగిశాయి అని చెప్పొచ్చు కానీ, జరిగాయని చెప్పడం కష్టం. నియమావళి ప్రకారం నిర్వహించాలి కనుక  తూతూ మంత్రంగా సమావేశాలను జరిపినట్టు అనిపిస్తోంది. జరిగినన్నాళ్ళు ఏనాడూ  సభాకార్యక్రమాలు  ముందు నిర్ణయించుకున్న  విధంగా  జరిగింది లేదు, వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరాఖరుకు నిరవధికంగా వాయిదా పడడం తప్పించి.
ప్రతిపక్షాలు నిర్హేతుకంగా అడ్డుకోవడం వల్లనే ఈ పరిస్తితి తలెత్తిందని పాలక పక్షం వాదన. సభను సజావుగా నిర్వహించే చిత్తశుద్ధి పాలకపక్షంలో లోపించిందని ప్రతిపక్షాల ప్రతివాదన. మొత్తానికి ఎవరి పాత్ర వారు పోషించారు. ఆ పాత్రల్లో జీవించారు. కధను రక్తి కట్టించారు. కడకు సమావేశాలు ముగిశాయని అనిపించి చేతులు దులుపుకున్నారు.
యావత్ జాతిని ప్రభావితం చేసిన పెద్ద నోట్ల రద్దు దరిమిలా దేశంలో తలెత్తిన పరిణామాలే సమావేశాలను సయితం ప్రభావితం చేశాయి. సభ ద్వారా ప్రధాని మోడీ జాతికి సంజాయిషీ చెప్పాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పట్టుబట్టింది.సభలో తాను గొంతు విప్పితే భూకంపం వస్తుందన్న రీతిలో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధి సభ ‘వెలుపల’ హెచ్చరిక చేశారు. నల్లకుబేరులపై తాను  ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రంతో అవినీతికి మారుపేరైన కాంగ్రెస్ నేతలు బెంబేలెత్తిపోతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ సభ ‘వెలుపల’ ఎక్కడో ఒక బహిరంగసభలో వ్యాఖ్యానించారు. ఒక పక్క పార్ల మెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు వీరిరువురు సభలో కాకుండా ఇలా  ‘బయట’ మాట్లాడ్డం విడ్డూరంగా అనిపిస్తుంది. చర్చలకు, వివరణలకు అత్యున్నత వేదిక పార్లమెంటును ఒదిలిపెట్టి ‘వెలుపల’ గంభీర ప్రకటనలు చేయడం వెనుక ఉద్దేశ్యాలు ఏమైఉంటాయన్న దానిపై మీడియాలో కొత్త చర్చ మొదలయింది. ఏదిఏమైనా పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజల ఇబ్బందులపై జనం తరపున మాట్లాడే అమూల్య అవకాశాన్ని ఇటు ప్రతిపక్షాలు,  అన్ని విషయాలు సాధికారికంగా  వివరించి, ఏవైనా సందేహాలు వుంటే వాటిని  నివృత్తి చేయగలిగిన సువర్ణావకాశాన్ని అటు  పాలకపక్షం చేజేతులా జారవిడుచుకున్నాయనే చెప్పాలి.
కొత్త కోడలు కాపురం చేసే కళ కాలి మెట్టెలు చూసే చెప్పొచ్చన్నట్టు ఈ సమావేశాలు ఇలానే జరుగుతాయని మొదటి రోజునే బోధపడింది.
పెద్ద నోట్ల రద్దు గురించి ప్రధాని సభలో ఉండగానే చర్చ జరగాలని ప్రతిపక్షాలు భీష్మించాయి.
గతంలో ప్రతిపక్షంలో వుండగా ఇలానే సభను అడ్డుకున్న బీజేపీ, గతాన్ని హాయిగా  మరచిపోయి  మొండికేసింది. పాలకపక్షం, ప్రతిపక్షం రెండూ కూడా  తమదయిన పాత్రలను తమదయిన బాణీల్లో పాత్రోచితంగా అవధులు మీరి మరీ పోషించాయి. పరిస్తితి ఈ విధంగా గాడి తప్పడానికి మీరు కారణం అంటే మీరు కారణంఅని ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకున్నారు తప్పిస్తే,  ఏఒక్కరూ, ఉమ్మడిగా ‘మనం’ కారణం అనుకోలేదు. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఏ దిశగా సాగుతున్నదో అర్ధం చేసుకోవడానికి ఇదొక్కటి చాలు.
చట్టసభలు సజావుగా నడవాలంటే  పాలక పక్షం ముందు బాధ్యత తీసుకోవాలి. ప్రతిపక్షాలు బాధ్యతతో వ్యవహరించాలి. ఈ పవిత్ర కర్తవ్య నిర్వహణలో పాలక ప్రతిపక్షాల వైఫల్యమే, బాధ్యతారాహిత్యమే  పార్లమెంటు సమావేశాలు ఇలా నిరర్ధకంగా ముగియడానికి ప్రధాన కారణం. ఈ విషయం నిర్ధారించడానికి పార్లమెంటరీ నియమ నిబంధలని అపోసన పట్టక్కరలేదు. బజారున పోయే ఏ సామాన్యుడిని అడిగినా ఇదే చెబుతాడు.
నిజానికి సభ సజావుగా నడవకపోతే ప్రతిపక్షానికే  నష్టం. పాలకపక్షానికి ఒకరకంగా వెసులుబాటు. సభ జరిగేలా చూసుకుంటే పాలక పక్షం తప్పొప్పులను ఎత్తి చూపి నిలదీయడానికి ప్రతిపక్షాలకు అవకాశం లభిస్తుంది. సభ జరక్కపోతే ఏదో అప్పటికి మమఅనిపించి పాలక పక్షం బయటపడొచ్చు. అయితే సభను అడ్డుకోవడం ద్వారా లభించే ప్రచార లాభం ‘ఉభయులను’ మరోరకంగా ఆలోచింపచేస్తున్నాయి. అందుకే ఇన్ని గడబిడలు. ఇన్ని శషభిషలు.      
ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు ఒక పార్టీని ఓడించి మరో పార్టీకి పట్టం కడుతున్నారు అంటే ఏమిటి అర్ధం. పాత ప్రభుత్వ విధానాలతో విసిగిపోయి, కొత్తగా వచ్చే ప్రభుత్వం అయినా కొత్త బాటలో నడవక పోతుందా అనే ఆశతో కదా!
గత  లోక సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని అక్కున చేర్చుకుని అంతటి స్థాయిలో ఆదరించడానికి దోహదం చేసిన అంశాల్లో ఇదొకటి. మార్పుకోరి వారు మోడీకి  ఓటు వేసారు. ఎన్నికలకు ముందు మోడీ కానీ, ఆయన నేతృత్వం వహించిన ఎన్డీయే కూటమి కానీ ప్రజలకు కొత్తగా చేసిన పెద్ద పెద్ద వాగ్దానాలు కూడా ఏమీ లేవు. యేవో కొన్ని నామకార్ధం చేసినా వాటిపై సామాన్యులు పెట్టుకున్న ఆశలు పెద్దగా లేవనే చెప్పాలి.  ప్రజలు మోడీకి పట్టం కట్టింది ఆయన ఏదో మార్పు తీసుకువస్తాడనే ఆశతోనే. ప్రధాని పీఠం ఎక్కిన కొత్తల్లో ఆయన ప్రదర్శించిన వ్యవహార శైలి, చెప్పిన మాటలు, చేసిన ప్రకటనలు ఈ ఆశలకు కొత్త ఊపిరిలూదాయి.
అయితే మొన్న ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో అధికార పక్షం అటు సభలో, వెలుపలా గతాన్ని మరచి వ్యవహరించిన తీరు, సమర్ధించుకున్న విధానం ప్రజలు మోడీ ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలపై నీళ్ళు చల్లాయి. గతంలో మీరు అధికారంలో వున్నప్పుడు మీ నిర్వాకం ఏమిటిఅని ఎదురు ప్రశ్నించడం,  ‘మార్పుతెస్తామన్న సర్కారుకు శోభస్కరం కాదు.
ఇక కాంగ్రెస్ విషయం తీసుకుంటే, గత ఎన్నికల తరువాత ఆ పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. ఒకప్పుడు దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీకి లోకసభలో ప్రధాన ప్రతిపక్షం హోదాకు సరిపడనంతగా అతి తక్కువ స్థానాలు కట్టబెట్టి ఓటర్లు ఆ పార్టీపై తమ కసి ప్రదర్శించారు. ఆ స్థాయిలో పరాజయం మూటగట్టుకున్న ఆ పార్టీ నేతల నోళ్ళు చాలా రోజులు మూగనోము పట్టాయి. కానీ ఆ నోళ్ళు మళ్ళీ పెగలడానికి కారణం కాంగ్రెస్  పార్టీ నాయకత్వం ప్రతిభ ఎంతమాత్రం కాదు. ఈ పుణ్యమో, పాపమో ఆ చలవ పూర్తిగా మోడీ ప్రభుత్వానిదే. ఇందుకు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి రుణపడివుండాలి.
ఎన్నోసార్లు చెప్పుకున్నట్టు మనకు రేపటి గురించి ఆలోచించే  రాజనీతిజ్ఞులు లేరు. అందరూ ఈరోజు గురించి తపన పడే  రాజకీయ నాయకులే.  
పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత రాజకీయ ప్రయోజనమో, లేదా మీడియా ప్రచారమో సంపాదించుకుని ఉండవచ్చు. కానీ అంశం ఎలాటిదయినా, అందులోని తీవ్రత ఎంతటిదయినా సభ జరగకుండా అడ్డుకోవడం విజ్ఞత అనిపించుకోదు. గతంలో ఇదేమాదిరిగా సభను అడ్డుకుకున్న బీజేపీ తీరును గుర్తుచేసి, ఆ పార్టీ గతాన్ని ఎండగట్టడంవరకు పరిమితమై, సభను నడపడంలో సహకరించి వుంటే కాంగ్రెస్ లోని మార్పునుప్రజలు గమనించేవారు.
హుందాగా ప్రవర్తించకపోవడం ద్వారా,  మీడియా ప్రచారాన్ని మించిన ప్రజాదరాన్ని బీజేపీ, కాంగ్రెస్ రెండూ దారుణంగా కోల్పోయాయి.
పార్లమెంటు సమావేశాలకు అయ్యే ఖర్చు నిమిషానికి రెండున్నర లక్షలు, రోజుకు ఆరుకోట్లు, ఇన్ని రోజులకు వెరసి ఇన్ని వందల కోట్లు అంటూ గణాంకాలు చెబుతుంటారు. మరి సభ జరక్కుండా చేసి ఎదుటివారి మీద నిందలు మోపుతున్న ఈ రాజకీయ పార్టీలు ఇంతటి స్థాయిలో ప్రజాధనం దుబారా కావడానికి  యేమని సమాధానం చెబుతాయి. ఆయా పార్టీలనుంచి ఈ డబ్బును  తిరిగి వసూలు చేసే విధంగా  రాజ్యాంగ సవరణ చేయాలని ఎవరయినా కోరుకుంటే తప్పేమిటి?           
పొతే, పార్లమెంటు సమావేశాల తీరుతెన్నులపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, బీజేపీ కురు  వృద్ధుడు లాల్ కిషన్ అద్వానీ అసహనం వ్యక్తం చేశారు. సామాన్యుడి మనసులోని మాటనే వారు తమ నోట పలికారు.  ప్రజాస్వామ్య వేదికలు ఒత్తిళ్లకు గురవుతున్నాయని చర్చావేదికగా ఉండాల్సిన పార్లమెంటు యుద్ధ క్షేత్రంగా మారిపోయిందన్న రీతిలో  ఆవేదన వెలిబుచ్చారు. సామాన్యుడి మాటను రాజకీయ నాయకులు ఎటూ చెవిన పెట్టరు. దేశ రాజకీయాల్లో తలపండిన పెద్దమనుషులు, అనేక (రాజకీయ) యుద్దముల ఆరితేరినవారు అయిన ప్రణబ్  ముఖర్జీ, అద్వానీలు, ‘సభను హుందాగా నడిచేట్టు చూడండి’ అంటూ   ఇచ్చిన సలహా అయినా కనీసం చెవికెక్కించుకుంటారేమో చూడాలి.    
తోక టపా: సరే! శీతాకాల సమావేశాలు ముగిశాయి. పార్లమెంటు సమావేశాలు మళ్ళీ జరుగుతాయి కదా! అవెలా సాగుతాయి అనే ప్రశ్నకు జవాబు చెప్పడానికి జ్యోతిష్యం తెలిసివుండనక్కరలేదు.  (17-12-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595



16, డిసెంబర్ 2016, శుక్రవారం

కళ్ళనీళ్ళ పెళ్లి


1971 డిసెంబరు 15 వ తేదీ   రాత్రి  మద్రాసు నుంచి అంబాసిడర్ కారులో తిరుపతి ప్రయాణం. దారిలో భోరున వాన. అట్లా ఇట్లా కాదు, ఉరుములు, మెరుపులుపిడుగులు. మధ్యమధ్యలో ఆగుతూ తెల్లారేలోపునే తిరుమల చేరాము. ఎస్వీ కాటేజీలో పైన గదులు తీసుకున్నాము. పురోహితుడు ఎలా దొరికాడో తెలవదు.  మా ఆవిడ పిన్నివసుంధర కొన్న నీలం రంగు ఫారెన్ నైలెక్స్ చీరె పెళ్లి చీరె. నేను ధోవతి కట్టుకున్నానో, ప్యాంటు షర్టు తో పెళ్లి చేసుకున్నానో గుర్తు రావడం లేదు. ఎందుకంటే సందర్భం, సన్నివేశం అలాంటివి.  తొమ్మిదీ పది గంటల  నడుమ పెళ్లి జరిగిపోయింది. వెంటనే వెళ్లి బాలాజీ దర్శనం చేసుకున్నాము. ఇప్పట్లోలా క్యూ లైన్లు లేవు. కొండ దిగి వచ్చి భోజనం చేసి వచ్చిన కారులోనే మళ్ళీ మద్రాసు వెళ్ళాము. మా ఆవిడ స్నేహితులు  టీ నగర్ హోటల్లో విందు ఇచ్చారు. అటునుంచి మా మామగారి వద్దకు వెళ్లాం. కూతుర్ని చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. నీకు ఏం తక్కువ చేస్తానని అనుకుని ఇలా పెళ్లి చేసుకున్నావని మా ఆవిడను అడిగారు. కన్నీళ్ళే జవాబు.
రిజర్వేషన్ల గొడవ లేని రోజులు. అంచేత  16 వ తేదీ రాత్రి బయలుదేరి రైల్లో మర్నాడు ఉదయం బెజవాడ చేరుకున్నాము.  మా పెద్దన్నయ్య ఇంటికి వెళ్ళాము. మా అమ్మగారు కూడా అక్కడే వుంది. మమ్మల్ని  చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. కాళ్ళకు దణ్ణం పెట్టగానే దగ్గరకు తీసుకుని మనసారా ఆశీర్వదించింది.
పెళ్లోద్దు పెళ్ళాం కావాలిఅనే నా మొండి పట్టుదల ఫలితం మా పెళ్లి. ఇరువైపుల పెద్దల చేత కళ్ళనీళ్ళు పెట్టించింది కూడా. బహుశా అదే ఆఖరిసారి  కావచ్చు.
మా పెళ్ళికి పెద్దల ఆమోదం లభించింది అన్న సంతోషంలో ఆంద్ర జ్యోతి ఆఫీసుకు వెళ్లి ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు గారిని కలుసుకుని మా పెళ్లి వృత్తాంతం తెలియచేశాము. ఆయన మా ఇద్దర్నీ మెచ్చుకోలుగా చూస్తూ, ‘రోజూ ఎన్నో ఆదర్శాలు వల్లె వేస్తుంటాము.  నువ్వు చేసి చూపించావు. వెళ్ళండి. హాయిగా కాపురం చేసుకోండి. మళ్ళీ వచ్చి ఉద్యోగంలో చేరుతున్నాను, అని చెప్పేవరకు నీకు సెలవు ఇస్తున్నాను. ఇదే మీకు నా పెళ్లి కానుక’ అన్నారాయన.   

తోకతపా: ఇలాంటి పెళ్లిళ్లకు ఫోటోలు వుండవు, జ్ఞాపకాలు తప్ప.
(16-12-2016)

15, డిసెంబర్ 2016, గురువారం

లవ్ శాల్యూట్!


సుఖంగా పెరిగి కష్టాలు పంచుకోవడం యెంత కష్టమన్నది కష్టాల్లో పుట్టి కష్టాల్లో పెరిగిన వారికి ఓ పట్టాన అర్ధం కాదు. అందుకే నన్ను కట్టుకుని మా ఆవిడ పడ్డ కష్టాలు నాకెన్నడూ తెలవదు. తెలిసినా అది ఆమె బాధ్యత అనుకున్నాను, బాధ్యతారాహిత్యానికి నిలువెత్తు ఉదాహరణ అయిన నేను.
మా కాపురానికి  ఈ రోజుతో నలభయ్ అయిదేళ్ళు. మా ప్రేమ వివాహం  కాలపరీక్షను తట్టుకుని నిలిచిందని కాలరు ఎగరేయొచ్చేమో.
నా కారణంగా కష్టాలు పడ్డా, అరవై అయిదేళ్ళ వయస్సులో మా ఆవిడను కన్నసంతానం మాత్రం సుఖపెడుతూనే వున్నారు. నా వల్లఆమెకు జరిగిన మేలు ఇదొక్కటేనేమో!.
అదేమిటో చిత్రం! 
అదృష్ట, దురదృష్టాలు రెండూ పోటీ పడి నన్ను వరించాయి.


ఈ సందర్భంగా ఒక అసందర్భ ప్రలాపం.     
జర్నలిష్టు కురువృద్ధుడు వీ.హనుమంతరావు గారి గురించి రాస్తూ సాక్షి పత్రికలో నేను రాసిన వ్యాసంలో కొన్ని వాక్యాలను ఎక్కడెక్కడినుంచో చాలామంది  మహిళలు ఫోను చేసి మరీ  మెచ్చుకున్నారు. అవే ఇవి:
“గొప్ప జర్నలిష్టుని ప్రపంచం భరిస్తుంది. ఆదరిస్తుంది, అభిమానిస్తుంది. కాని అతగాడిని భరించడం యెంత కష్టమో తెలిసేది మాత్రం  ఆ జర్నలిష్ట్ భార్యకి మాత్రమే. అనుభవంతో చెబుతున్న మాట ఇది. ప్రపంచం బాధ్యత తప్ప ఇంటి బాధ్యత పట్టని గొప్ప జర్నలిష్టులు నాకు చాలామంది తెలుసు. జీ కృష్ణ గారు వారిలో అగ్రగణ్యులు. అలాటి విశిష్ట వ్యక్తులను గౌరవించేటప్పుడు విధిగా వారిని భరించిన భార్యలను కూడా గుర్తుపెట్టుకుని, గుర్తించి గౌరవించాలి. ఆ విధంగా హనుమంతరావు గారికి లభించిన గౌరవ ప్రతిపత్తుల్లో న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన సగంవాటా నిస్సంశయంగా ఆయన అర్ధాంగి సరళ గారికే దక్కాలి”

(16-12-2016)

పలుకే బంగారమాయెరా! బాపూ నీ పలుకే......


(ఈరోజు బాపూ గారి జయంతి)
Srinivasulu Bhattaram గారని నాకొక ఇంటర్ నెట్ మిత్రులు వున్నారు. చక్కని రాయసకాడు. సున్నితమైన హాస్యం ఆయన రచనల్లో చిప్పిల్లుతూ వుంటుంది. ఆయన  నాలాగే బాపూ రమణలవీరాభిమాని. బాపూ గారితో వ్యక్తిగత సన్నిహిత పరిచయం వున్న అదృష్టవంతులు కూడా.  ఆయన ఇంటిపేరు తెలుగులో ఎలారాస్తే యేమో అని యధాతధంగా ఇంగ్లీష్ లోనే ఇవ్వాల్సివస్తోంది. బాపూ గారి గురించి ఆయన ఒక మెయిల్ పంపారు. బాపూ అభిమానులందరూ చదవాల్సిన  విషయాలు అందులో  వున్నాయి.  కానీ శ్రీనివాసులు  గారికి ఓ అలవాటు. ఆయన అన్నీ పీడీఎఫ్ ఫార్మాట్ లోనే పంపుతారు. అంచేత మూడే మూడు పంక్తులు, వారి అనుమతి వుంటుందనే విశ్వాసంతో,  కింద ఇస్తున్నాను.

నిన్న (25-08-2013) మాటీవీలో ప్రసారమయిన ఫిలిం ఫేర్ అవార్డ్ ఫంక్షన్లో బాపు గారికి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ ఇవ్వడం చూసాను. దర్శకుడు రాఘవేంద్రరావు ఆయనకు అవార్డ్ అందచేసారు. అవార్డ్ ఇచ్చాక ...యాంకర్స్ ఆనవాయితీగా బాపుగారిని కొన్ని మాటలు చెప్పమన్నారు. ఆయన చెప్పిన మాటలు....అక్షరాలా ....కొన్ని మాటలు....’ “
(26-08-2013నాటి నా బ్లాగునుంచి)