14, డిసెంబర్ 2016, బుధవారం

నిజంగా అపురూపం


అపురూప దృశ్యాలు అనుదినం అనుభవంలోకి రావు. అవి చాలా అరుదుగా తటస్థ పడతాయి కాబట్టే అపురూపం.
నిన్న సాయంత్రం అటువంటి అనుభూతి అనుభవంలోకి వచ్చింది.
ఒకరా ఇద్దరా పదుల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్  అధికారులు. ఒకానొక కాలంలో ఈ దేశాన్ని, ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని పాలించిన, ఒక రకంగా శాసించిన అధికారులు వాళ్ళు. నా జర్నలిష్టు జీవితంలో అనేక పర్యాయాలు వారిని కలుసుకోగల ఆవకాశం లభించింది. గంటలపాటు వెయిట్ చేసినా పని ఒత్తిడిని బట్టి కలవడానికి వీలులేని బిజీ వ్యక్తులు ఈరోజు విశ్రాంత అధికారులుగా శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతూ హైదరాబాదులో నిన్న జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయి పాత సంగతులు నెమరు వేసుకున్నారు. డెబ్బయి ఏళ్ళ నుంచి 102 సంవత్సరాల వరకు  వివిధ వయస్సుల్లో వున్న వీరిలో చాలామంది అత్యంత ఉన్నత ఉద్యోగాలు నిర్వహించారు. కార్యదర్శులుగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నతాధికారులుగా, పోలీసు డైరెక్టర్ జనరల్స్ గా పనిచేసిన వీరిలో అనేకులు నా పూర్వాశ్రమంలో వృత్తిరీత్యా పరిచయస్తులే కనుక పలకరింపులకు, పాత ముచ్చట్లకు ఆ వేదిక ఒక విడిదిగా మారింది.
ఇక సందర్భం.
ఐసీఎస్ అధికారి, ఎందరో ఐఏఎస్ అధికారులకు గురు సమానులు అయిన సీఎస్ రామచంద్రన్ శతజయంతి. స్పెషల్ చీఫ్ సెక్రెటరీ గా పదవీ విరమణ చేసిన గాయత్రీ రామచంద్రన్ తండ్రి గారు. వారు కుటుంబ స్నేహితులు కాబట్టి ఆ పరిచయంతో అందిన ఆహ్వానంతో వెళ్ళిన బయటి వారిలో అంటే ఐఏఎస్ కానివారిలో డాక్టర్ ఏపీ రంగారావు, మా అన్నయ్య రామచంద్ర రావు, డాక్టర్ బాలాజీ, జ్వాలా, నేనూ ఉన్నాము. సి ఎస్ రామచంద్రన్ గురించి ప్రచురించిన గ్రంధాన్ని 102 ఏళ్ళ వృద్ధ ఐసీఎస్ అధికారి శ్రీ వీ.కే.రావు గారు ఆవిష్కరించారు. వారు గతంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, డాక్టర్ నీలం సంజీవరెడ్డి భారత రాష్ట్రపతిగా ఉన్నకాలంలో వారికి ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. చేతి కర్ర సాయంతో నడిచి వచ్చిన ఆ శతాధిక వృద్ధ మూర్తి వేదిక ఎక్కి పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించడం నిజంగా ఒక అపురూప దృశ్యం.   

         


రామోజీరావు మొదటి ఓటమి


(నిన్న హైదరాబాదులో మరణించిన వెటరన్ జర్నలిస్ట్  శ్రీ వి.హనుమంతరావు రాసిన జర్నలిస్ట్ అంతర్వీక్షణంపుస్తకం నుంచి కొన్ని భాగాలు- 2012లో నా బ్లాగులో రాసింది. సుమారు పదివేలమంది స్పందన చూరగొన్న రచన. ఆ గొప్పతనం ఆయనదే)
యు.ఎన్.ఐ. నుంచి రాజీనామా చేసి హైదరాబాదులో కొత్తగా ప్రారంభించిన ఈనాడుఎడిషన్ లో చేరాను. నాతో  కలిపి మరో ముగ్గురు ఎడిటర్లు ఏబీకే ప్రసాద్, పొత్తూరి వేంకటేశ్వర రావు, టీవీ కృష్ణ పనిచేసేవారు. రామోజీ రావు చీఫ్ ఎడిటర్. వ్యాసాలూ, సంపాదకీయాలు రాయటం రాకపోయినా, ‘ఈనాడుఅన్ని ఎడిషన్లు చదివి ఆయనకు తప్పు అని తోచినవన్నీ ఎర్ర పెన్సిల్ తో మార్క్ చేసేవారు. ప్రముఖ ఇంగ్లీష్ పత్రికల్లో  వచ్చే ఆసక్తికరమయిన వ్యాసాలను అనువాదం చేయించి ఈనాడులో ప్రచురించేవారు. హిందూ పత్రిక స్తాయిలో తెలుగులో పత్రిక తేవడం తన లక్ష్యం అని చెప్పుకునేవారు. ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చేవరకు  ఒకరకంగా బాగానే వుందనిపించేది. ఆ తరవాత రామారావును, తాజాగా చంద్రబాబును భుజాన వేసుకుని పత్రికను నడిపించిన వైనం పాఠకులకు చిరపరిచితమే.”  
ఈనాడులో ఉద్యోగం అంటే ఎన్నాళ్ళు వుంటుందో ఎప్పుడు వూడుతుందో తెలవదు. హైదరాబాదులో నలుగురు పాత్రికేయులు ఎక్కడయినా కలిస్తే అందులో ఇద్దరు ఈనాడుమాజీలు. వ్యాపార రీత్యా ఆయన (రామోజీరావు) యెంత ప్రతిభ చూపించారో, ఉద్యోగుల విషయంలో అంత కాఠిన్యం ప్రదర్శించారు. వేజ్ బోర్డు సిఫారసులను అమలుచేయాలని కోరుతూ కార్మికులు ఇచ్చిన విజ్ఞప్తిని వారి ఎదుటే చెత్తబుట్టలో పడేసారు. సిబ్బంది సమ్మెతో ఇరవై మూడు రోజులు ఈనాడుపత్రిక  ప్రజల ముఖం చూడలేదు. సుప్రీం కోర్టు -  సమ్మె చట్ట బద్ధమే అని ఇచ్చిన తీర్పుతో రామోజీ రావు సుమారు కోటి రూపాయలు చెల్లించుకోవాల్సివచ్చింది. రామోజీ రావుకు అది మొదటి  ఓటమి.
పత్రికల్లో ప్రచురించే వార్తను అనుకూలంగాను, ప్రతికూలంగాను మలచి ప్రచురించవచ్చు. కాబట్టి పాఠకులకో చిన్న హెచ్చరిక. నల్లటి అక్షరాలన్నీ నిజాలని నమ్మకండి. పూర్తిగా అబద్ధమనీ అనుకోవద్దు.
పత్రిక ప్రకటనల వ్యవహారాలు చూసే మేనేజర్ ఇంకో గంటలో పత్రిక అచ్చవుతుందనగా వెళ్లి, అరపేజీ,లేదా పావు పేజి వ్యాపార ప్రకటన ప్రచురించి తీరాలి అంటే, సంపాదక వర్గం ఆ మేరకు వార్తలు తీసేసి ఆ వ్యాపార ప్రకటనను ప్రచురించి తీరాలి.
నేను ఈ వృత్తి (జర్నలిజం) లో ప్రవేశించినప్పటి ఆర్ధిక పరిస్థితులు ఇప్పడు తలచుకుంటే నవ్వొస్తుంది. బస్తా బియ్యం ఎనిమిది రూపాయలు. అణాకు నాలుగు ఇడ్లీలు. ముప్పై కిలోమీటర్ల బస్సు ప్రయాణానికి నాలుగణాలు. పూటకూళ్ళమ్మ హోటల్లో మూడుపూటల నెల భోజనానికి నాలుగున్నర రూపాయలు.
“1955  మధ్యంతర ఎన్నికలు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల నడుమ అతి భీకరంగా జరిగాయి. కమ్యూనిష్టులు అధికారంలోకి వచ్చేస్తున్నారు; పుచ్చలపల్లి సుందరయ్య ముఖ్యమంత్రి, రాజేశ్వర రావు హోం మంత్రి అనే వాతావరణం రాష్ట్రంలో నెలకొంది. కాని, చివరకు కమ్యూనిష్టులు ఓడిపోయారు. రాష్ట్రంలో పార్టీ పత్రిక విశాలాంధ్ర తప్ప మిగతా పత్రికలన్నీ కాంగ్రెస్ కొమ్ము కాశాయి. ప్రముఖ సంపాదకుడు నార్ల వేంకటేశ్వర రావు సంపాదకత్వంలో ఆంధ్రప్రభ ముందు వరసలో నిలబడి కమ్యూనిష్టులకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది. విశాలాంధ్ర, ఆంధ్రప్రభల మధ్య కార్టూన్ల యుద్ధం హోరాహోరీగా నడిచింది. ప్రతి కార్టూనుకు  జవాబుగా మరో కార్టూన్ ప్రభలో వచ్చేది. అప్పటికీ, ఇప్పటికీ రాష్ట్రంలో పత్రికల సత్య నిష్ఠ గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు పత్రిక అయిన ఆంధ్ర ప్రభ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అనుకూలంగా రాస్తే, దాని తమిళ్ ఎడిషన్ దానికి వ్యతిరేకంగా రాసేది. ఇదంతా పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవడం కోసమే.
హైదరాబాదులో  (యు.ఎన్.ఐ.) వార్తా సంస్థలో నాకు ముందు పనిచేసిన డి. సీతారాం కు వున్న  కాంటాక్టులు (పరిచయాలు) అన్నీ ఇన్నీ కావు. నేను బాధ్యతను స్వీకరించిన తరువాత ఒక రాత్రి ఎవరో ఫోను చేసి ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేక విమానం వచ్చిందని చెప్పి ఫోను పెట్టేసారు. బహుశా నా పాత మిత్రుడి (సీతారాం) కాంటాక్ట్ అయివుంటుంది. మరుసటి రోజు బ్యాంకుల జాతీయకరణ వార్త పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. ఆ రోజున రాష్ట్రపతి సికిందరాబాదులోని రాష్ట్రపతి నిలయంలో బస చేసి వున్నారు. అంటే సంతకం కోసం విమానంలో ప్రత్యేక దూత వచ్చాడన్న మాట.
 “రాజకీయ నాయకులకు పత్రికలతో చాలా అవసరం వుంది. దానికోసం  జర్నలిష్టుల ప్రాపకం కావాలి. అందుకోసం ఏం చేయాలన్న చేస్తారు. ఫ్లాట్లు, స్కూటర్లు, కార్లు, మందు  సీసాలు ఏదీ కాదనర్హం. యాభయ్యవ దశకంలో నేను ఢిల్లీ లో విలేఖరిగా పనిచేసేటప్పుడు ఒక విదేశీ రాయబార కార్యాలయం ప్రతినెలా ఒక స్కాచ్ బాటిల్  ని  ఎంపిక చేసుకున్న జర్నలిష్టుల ఇళ్లకు పంపేది. అందుకు ప్రతిఫలంగా ఏమీ అడిగే వారు కాదు. కొన్ని నెలలు గడిచిన తరువాత తమకు ఫలానా ప్రభుత్వ సమాచారం కావాలని మెల్లగా బయట పెట్టేవారు. సీసాలు సీసాలు పట్టించిన తరువాత కాదనే ధైర్యం ఎవరికి వుంటుంది?”
(జర్నలిష్ట్ అంతర్వీక్షణం పాత్రికేయ జీవితంలో ఆరు దశాబ్దాల అనుభవాలు అనుభూతులు రచన : శ్రీ వి.హనుమంత రావు  ప్రచురణ : డేటా న్యూస్ ఫీచర్స్, హైదరాబాద్  500 084)
07-07-2012.


ధన్యత


గొప్పవాళ్ళను గురించి రాయడంలో వున్న గొప్పతనం ఈ ఉదయం బోధపడింది. సుప్రసిద్ధ జర్నలిష్టు వి.హనుమంతరావుగారి పై ‘సాక్షి’ దినపత్రికలో ఈరోజు నేను రాసిన వ్యాసంపై స్పందన గమనించిన తరువాత నాకీ సంగతి తెలిసింది. తెలుగు రాష్ట్రాలలోని మొత్తం ఇరవై మూడు జిల్లాలనుంచి అసంఖ్యాకంగా ఫోన్లు వస్తూనే వుండడం చూసి ఆశ్చర్యపోవడం నా వంతయింది. గొప్ప మనుషులనుగురించి రాయగలగడం కూడా ఒక రకంగా అదృష్టమే.
బెజవాడ నుంచి తుర్లపాటి కుటుంబరావు గారు ఫోను చేసి చెప్పారు. జర్నలిజంలో ఓనమాలు నేర్చుకున్నది నేను  ఆయన దగ్గరే.
“ఈ వ్యాసం చదివిన తరువాత నువ్వు నా శిష్యుడవని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను” అన్నారాయన.

సాక్షి రామచంద్ర మూర్తి గారికి కృతజ్ఞతలు.         

13, డిసెంబర్ 2016, మంగళవారం

ఆయన రచనాదాహం తీరనిది


జర్నలిష్ట్ కురువృద్ధుడు వి. హనుమంతరావుగారు తన తొంభయ్ రెండో ఏట మంగళవారం  ఉదయం హైదరాబాదులో కన్ను మూశారు. ఈతరం వారికి తెలియని ఈ వృద్ధ పాత్రికేయుడి గురించి తెలియచెప్పాలంటే ఏదో సినిమాలోలా కధను ముందుకూ వెనక్కీ తిప్పాలి.
ముందు హైదరాబాదు. ఇది జరిగి చాలా ఏళ్ళయింది. దేశంలో అగ్రశ్రేణి ప్రభుత్వ రంగ బాంక్ అయిన స్టేట్ బాంక్ చైర్మన్ గా తల్వార్ గారు వుండేవారు. బాంకులో పనిచేసే అన్ని శ్రేణుల  అధికారులకు శిక్షణ ఇప్పించడానికి దేశం మొత్తానికి కలిపి హైదరాబాదు, బేగంపేటలోని విశాలమైన ఆవరణలో స్టేట్ బాంక్ స్టాఫ్ కాలేజ్ ఏర్పాటు చేసారు. దాన్ని ప్రారంభించడానికి అప్పటి కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీ చవాన్ తో పాటు తల్వార్ గారు కూడా హైదరాబాదు వచ్చారు. ప్రారంభోత్సవం అదీ బాంక్ స్థాయికి తగ్గట్టే ఘనంగా జరిగింది. వివిధ జాతీయ దినపత్రికలు, స్థానిక దినపత్రికల్లో ఆ వార్తను ఫొటోలతో సహా మొదటి పేజీలో చాలా విపులంగా ప్రచురించారు.
ఈ విషయాన్ని ఇక్కడ వొదిలేసి కాసేపు విశాఖపట్నం జిల్లావెళ్లి వద్దాం.
స్టేట్ బాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటయిన వ్యవసాయాభివృద్ధి బాంక్ కూడా రాష్ట్రంలో చాలా చురుగ్గా పనిచేస్తున్న రోజులవి. ఆ బాంక్ శాఖలో పనిచేస్తున్న ఎర్రంరాజుగారనే ఒక యువ అధికారి జిల్లాలోని గ్రామీణ రైతులకు వ్యవసాయ రుణాలు ఇచ్చేందుకు వెడుతూ విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న యు.ఎన్.ఐ. వార్తా సంస్థ విలేకరిని వెంటబెట్టుకుని వెళ్ళారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా రుణమంజూరీ తంతు కొనసాగింది. మామూలుగా అయితే విలేకరులెవ్వరు సాధారణంగా ఒక చిన్న కార్యక్రమం కోసం అంత సమయం వెచ్చించరు. కానీ ఆ అధికారి తీసుకువెళ్ళింది ఆషామాషీ జర్నలిష్టుని కాదు. తివిరి ఇసుమున తైలం తీయగల సమర్ధుడు అనే పెద్ద పేరు చిన్నతనంలోనే తెచ్చుకున్న వి.హనుమంతరావు గారిని. ఓ చెట్టు నీడన కూర్చుని రైతులకు రుణాల మంజూరీ వ్యవహారాన్ని గమనిస్తున్న ఆయన దృష్టిని ఒక అంశం ఆకట్టుకుంది. పేద రైతులు వాళ్ళ అవసరాల కొద్దీ, లేదా వారి వారి తాహతు కొద్దీ వంద రూపాయలనుంచి రెండు మూడు వేల రూపాయల వరకు రుణాలు తీసుకుంటున్నారు. తీసుకున్న రుణానికి బ్యాంకు అందచేసిన కాగితాలపై వేలిముద్రలు వేస్తున్నారు.  విలేకరిగా ఈ వ్యవహారాన్ని అంతా గమనిస్తూ వచ్చిన హనుమంతరావు రైతులు  పూర్తిచేసిన ఒక ధరఖాస్తు పత్రాన్ని తీసుకుని చూసారు. ఒక్కొక్కదానిపై నాలుగువందల వేలిముద్రలు కనిపించాయి. ఆ విషయాన్ని మరింతగా ధృవపరచుకున్న ఆయన  క్షణం ఆలస్యం చేయకుండా   పోస్ట్ ఆఫీసుకు వెళ్లి, వార్తను రాసి టెలిగ్రాం ద్వారా హైదరాబాదులోని తన ఆఫీసుకు పంపారు.
మళ్ళీ ఓ మారు హైదరాబాదు వస్తే....
‘వందరూపాయల రుణం కోసం నాలుగు వందల సంతకాలు’ అంటూ యూఎన్ ఐ వార్తాసంస్థ  పంపిన వార్తను ఒక ఇంగ్లీష్ దినపత్రిక మరునాడు మొదటి పేజీలో ప్రచురించింది.  స్టేట్ బాంక్ చైర్మన్ తల్వార్ గారు పాల్గొన్న స్టాఫ్ కాలేజ్ ప్రారంభోత్సవం వార్త కూడా ఫోటోతో సహా మొదటి పుటలోనే ఆ పక్కనే ప్రచురించడం కాకతాళీయం కావచ్చు. కానీ ఆ వార్త స్టేట్ బ్యాంకు రుణాల మంజూరీ విధానాన్ని పూర్తిగా మార్చివేయగలదని ఎవ్వరూ ఆరోజు ఊహించి వుండరు. ఆ వార్త తల్వార్ మహాశయుల దృష్టిలో పడింది. ఆయన వెంటనే మొత్తం వ్యవహారం గురించి ఆరా తీసారు. వంద రూపాయలకు నాలుగు వందల సంతకాలు తీసుకుంటున్న సంగతి నిజమే అని విచారణలో తేలింది. ఆయన  వెంటనే స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రుణమంజూరీ పద్దతిని సులభతరం చేస్తూ ఉత్తర్వులు జారీచేసారు.
ఒక జర్నలిస్ట్ తన చుట్టూ ఉన్న విషయాల్ని 'గమనించడం' అలవాటు చేసుకుంటే కొన్ని లక్షల మంది జీవితాల్ని మార్చవచ్చు అనడానికి ఇది ఒక ఉదాహరణ.
జర్నలిజం వృత్తిని అవహేళన చేస్తూ మాట్లాడేవారు, ఈ వృత్తిలో అలవడే అనేకానేక వ్యసనాలను ప్రస్తావిస్తూ వుంటారు. వారి సందేహాలకు సమాధానమే  హనుమంతరావు గారు. రాస్తూ బతకొచ్చని, బతుకుతూ రాయొచ్చని నిరూపిస్తూ డెబ్బయి ఏళ్ళకు పైగా రాస్తూ పోయిన, రాస్తూనే దాటిపోయిన  హనుమంతరావు గారు నిజంగా ధన్యజీవి. రాయడం, రాస్తూవుండడం ఆయనకు వ్యసనం కావచ్చు. కానీ అది సమాజానికి మేలు చేసే విషయం.
గొప్ప జర్నలిష్టుని ప్రపంచం భరిస్తుంది. ఆదరిస్తుంది, అభిమానిస్తుంది. కాని అతగాడిని భరించడం యెంత కష్టమో తెలిసేది మాత్రం  ఆ జర్నలిష్ట్ భార్యకి మాత్రమే. అనుభవంతో చెబుతున్న మాట ఇది. ప్రపంచం బాధ్యత తప్ప ఇంటి బాధ్యత పట్టని గొప్ప జర్నలిష్టులు నాకు చాలామంది తెలుసు. జీ కృష్ణ గారు వారిలో అగ్రగణ్యులు. అలాటి విశిష్ట వ్యక్తులను గౌరవించేటప్పుడు విధిగా వారిని భరించిన భార్యలను కూడా గుర్తుపెట్టుకుని, గుర్తించి గౌరవించాలి. ఆ విధంగా హనుమంతరావు గారికి లభించిన గౌరవ ప్రతిపత్తుల్లో న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన సగంవాటా నిస్సంశయంగా ఆయన అర్ధాంగి సరళ గారిదే.


రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595 

12, డిసెంబర్ 2016, సోమవారం

మెషిన్ ఆల్వేస్ ఫెయిల్స్

అనేవాడు కాలేజీలో మా మాస్టారు.
యంత్రం అన్న తరువాత అది అదేవిధంగా ఎల్లకాలం పనిచేస్తుందన్న గ్యారెంటీ లేదు అనేది ఆయన భావం. ఎప్పుడన్నా పనిచేయక పోవచ్చు, అనడానికి, ఎప్పుడూ పనిచేయదు అనడానికి ఏదో తేడా వుంది అని ఇప్పుడు అర్ధం అవుతోంది కానీ చదువుకునే రోజుల్లో మాస్టారి మాటే వేదం కనుక ఆ మాటే ఇప్పటికీ గుర్తుండిపోయింది.
ఇవాళ మధ్యాన్నం ఏదో పనిమీద బయటకు వెళ్లి తిరిగి రావడానికి ఊబెర్ బుక్ చేయబోతే మొరాయించింది. కార్డు ప్రాబ్లం అంటూ ఏదో మెసేజ్ చదివేలోగానే మాయమై పోతోంది. సమస్య ఏమిటో అర్ధం కాలేదు కానీ ఈ పూటకి ఊబెర్ ప్రాప్తం లేదనుకుని ఆటోని ఆశ్రయించాను. ముందు నూట ఇరవై అని, ఇరవై నా దగ్గర చిల్లర వుండదనుకున్నాడో ఏమో వందకి ఒప్పుకున్నాడు. ఇంటికి వచ్చి చూసుకుంటే AM- ATMSBI పేరిట ఓ ఎస్సెమ్మెస్. “Dear Customer. Your txn at POS ……….declined as account is inoperative or locked. Please contact your branch for resolution.”
ఒకటయితే చూడను అనుకున్నారేమో వరసగా నిమిషానికి ఒకటి చొప్పున మొత్తం నాలుగు పొట్టి సందేశాలు. పక్కనే పేపర్లో ‘కార్డు గీకండి, కోటి గెలవండి” అని వెక్కిరింత వ్యాఖ్య.
ఈరోజు బ్యాంకుకు సెలవు, వరసగా మూడు రోజుల తరువాత రేపు తెరిస్తే అక్కడ ఎలా వుంటుందో ఏమో!
నా ఎక్కవుంటు   inoperative లేక locked అనే విషయం తెలుసుకోవడానికి పడుతూ లేస్తూ బ్యాంకుకు వెళ్ళాలా! ఇంటి నుంచి ఆన్ లైన్లో తెలుసుకునే ఏర్పాటు ఎందుకు చెయ్యరు?
పొద్దున్న ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు   operative గా వుండి lock కాకుండా వున్న ఎక్కవుంట్ వున్నట్టుండి ఎలా inoperative అయింది లేదా lock అయింది.
పైగా అదే  బ్యాంకులో, అదే బ్రాంచిలో నేను 1975 నుంచి అక్కవుంట్ హోల్డర్ని. ఒక్కసారి కూడా defaulter  అనే ముద్ర నా మీద పడలేదు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైర్ అయ్యేవరకు కూడా నేను ఆ బ్యాంకుతో అనుబంధం తెంచుకోలేదు. పదేళ్లకు పైగా నా పెన్షన్ అక్కవుంట్ కూడా అక్కడే వుంటోంది. ఇవన్నీ సరే! నేను ఒక సాధారణ పౌరుడ్ని. అంతే అనుకుందాం పోనీ.
 ఇటువంటి సందేశాలు వరస వెంబడి నాలుగు పంపించిన బ్యాంకు వాళ్ళు అసలు విషయం ఏమిటో ముందే ఎందుకు తెలియచేయలేదు? మొత్తం అన్ని పనులు ఇంటి వద్దనుంచే ఆన్ లైన్లో చక్కబెట్టుకోవచ్చు అంటున్నప్పుడు మళ్ళీ ఈ పిలుపులు ఏమిటి.?
మొత్తం దేశం ఆన్ లైన్ వైపు ప్రయాణిస్తుంటే నేను బ్యాంకుకి వెళ్ళకుండా అదే విధానంలో పరిష్కారం చూపెట్టలేరా?
నాకు తెలుసు ఇవన్నీ జవాబు దొరకని  భేతాళ ప్రశ్నలని.
తెలిసి చెప్పక పోయినా ఎవరి తలలు పగలవు, ఆలోచించి ఆలోచించి మన తలలు పగలడం తప్ప.

ఘోరమైన క్రూర జంతువు

మీడియా అవార్డుల ప్రదానోత్సవంలో పరుచూరి గోపాల కృష్ణ పలుకులు:
“ఎవరెస్టుఎక్కిన తరువాత ఇక ఎక్కే ఎత్తులు వుండవు, కిందకు జారడం తప్ప. అందుకే నేను ఎవరెస్టు ఇంకా ఎక్కుతున్నాను అనే అనుకుంటూ నా వృత్తిలో ముందుకు వెడుతున్నాను, అప్పుడే కాళ్ళు నేల వుంటాయి”
“ప్రపంచంలోని  జంతుజాలాన్ని చూపే ఒక ప్రదర్శనకు వెళ్లాను. వరసగా చూస్తూ పోతున్నాను. కోతులు, కుందేళ్ళు, పులులు, సింహాలు. అన్నీ బొమ్మలే అనుకోండి. చివర ఒక బోర్డు కనిపించింది. “యావత్ సృష్టిలో భయంకరమైన జంతువును మీరిప్పుడు చూడబోతున్నారు”
అక్కడ ఒక అద్దం వుంది. దానికి ఎదురుగా నిలబడివున్న నా ప్రతి బింబమే అందులో నాకు కనిపించింది.
నిజమే కదా! ఈ లోకంలో మనిషిని మించిన భయంకరమైన జంతువు మరోటి ఏముంది? మిగిలిన క్రూర జంతువులు ఆకలి వేసినప్పుడే వేటాడి తింటాయి. కడుపు నిండినా ఆహారాన్ని కూడబెట్టుకునేవాడు ఒక్క మనిషి మాత్రమే!”
“ఒక లఘు చిత్రం చూశాను. నడి రోడ్డు. కరెంటు స్తంభానికి ఒక కుర్రవాడిని  కట్టేసిఉంచుతారు. దారిన పోయే వారందరూ అక్కడ కాసేపు ఆగి ఓ వింత చూసినట్టు చూసి తమ దారిన వెళ్లిపోతుంటారు. సాయంత్రంవరకూ ఇదే తంతు. ‘ఇదేమిటి’ అని ఆరా తీసినవాళ్ళుంటే ఒట్టు.”
చివర్లో ఒకరు రంగప్రవేశం చేసి చెబుతారు. “జనంలో మానవత్వం ఇంకా మిగిలున్నదాలేదా అనేది తెలుసుకోవడానికి ఈ ప్రయత్నం”  అని.
మీడియా అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్య అతిధిగా ప్రసంగిస్తూ పరుచూరి గోపాల కృష్ణ ఇలాంటి కబుర్లు ఇంకా చాలా చెప్పారు.
 “ఇతి వార్తాః”

(పరుచూరి వారికి కృతజ్ఞతలు)

యునిసెఫ్ మీడియా అవార్డులు


యునిసెఫ్, సీఎంఎస్ సంయుక్త ఆధ్వర్యంలో మీడియా అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాదులోని తాజ్  డెక్కన్ హోటల్లో జరిగింది. వివిధ మీడియా ఛానళ్ళు, పత్రికలలో వెలువడిన బాలల హక్కులకు సంబంధించిన కధనాలను పరిశీలించి అవార్డులను ఎంపిక చేసిన జ్యూరీ బృందంలో నాతో పాటు ప్రముఖ రచయిత్రి డాక్టర్ మృణాలిని, సీనియర్ జర్నలిష్టు కేబీ లక్ష్మి, జీ. వల్లీశ్వర్, ఎస్. నగేష్ కుమార్, గోవిందరాజు చక్రధర్ వున్నారు. రిటైర్డ్ ఐ.ఏ.ఎస్. అధికారి రేచల్ ఛటర్జీ జ్యూరీ చైర్  పర్సన్ గా వ్యవహరించారు. ప్రసిద్ధ సినీ రచయిత పరుచూరి గోపాల కృష్ణ అవార్డులను ప్రదానం చేశారు. యునిసెఫ్ అధికారి కుట్టి జార్జ్, సీఎంఎస్ ప్రతినిధులు వాసంతి, అనిత పాల్గొన్నారు.




Photo Courtesy: UNICEF