Journalist V.Hanumatha Rao no more లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Journalist V.Hanumatha Rao no more లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, డిసెంబర్ 2016, మంగళవారం

ఆయన రచనాదాహం తీరనిది


జర్నలిష్ట్ కురువృద్ధుడు వి. హనుమంతరావుగారు తన తొంభయ్ రెండో ఏట మంగళవారం  ఉదయం హైదరాబాదులో కన్ను మూశారు. ఈతరం వారికి తెలియని ఈ వృద్ధ పాత్రికేయుడి గురించి తెలియచెప్పాలంటే ఏదో సినిమాలోలా కధను ముందుకూ వెనక్కీ తిప్పాలి.
ముందు హైదరాబాదు. ఇది జరిగి చాలా ఏళ్ళయింది. దేశంలో అగ్రశ్రేణి ప్రభుత్వ రంగ బాంక్ అయిన స్టేట్ బాంక్ చైర్మన్ గా తల్వార్ గారు వుండేవారు. బాంకులో పనిచేసే అన్ని శ్రేణుల  అధికారులకు శిక్షణ ఇప్పించడానికి దేశం మొత్తానికి కలిపి హైదరాబాదు, బేగంపేటలోని విశాలమైన ఆవరణలో స్టేట్ బాంక్ స్టాఫ్ కాలేజ్ ఏర్పాటు చేసారు. దాన్ని ప్రారంభించడానికి అప్పటి కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీ చవాన్ తో పాటు తల్వార్ గారు కూడా హైదరాబాదు వచ్చారు. ప్రారంభోత్సవం అదీ బాంక్ స్థాయికి తగ్గట్టే ఘనంగా జరిగింది. వివిధ జాతీయ దినపత్రికలు, స్థానిక దినపత్రికల్లో ఆ వార్తను ఫొటోలతో సహా మొదటి పేజీలో చాలా విపులంగా ప్రచురించారు.
ఈ విషయాన్ని ఇక్కడ వొదిలేసి కాసేపు విశాఖపట్నం జిల్లావెళ్లి వద్దాం.
స్టేట్ బాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటయిన వ్యవసాయాభివృద్ధి బాంక్ కూడా రాష్ట్రంలో చాలా చురుగ్గా పనిచేస్తున్న రోజులవి. ఆ బాంక్ శాఖలో పనిచేస్తున్న ఎర్రంరాజుగారనే ఒక యువ అధికారి జిల్లాలోని గ్రామీణ రైతులకు వ్యవసాయ రుణాలు ఇచ్చేందుకు వెడుతూ విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న యు.ఎన్.ఐ. వార్తా సంస్థ విలేకరిని వెంటబెట్టుకుని వెళ్ళారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా రుణమంజూరీ తంతు కొనసాగింది. మామూలుగా అయితే విలేకరులెవ్వరు సాధారణంగా ఒక చిన్న కార్యక్రమం కోసం అంత సమయం వెచ్చించరు. కానీ ఆ అధికారి తీసుకువెళ్ళింది ఆషామాషీ జర్నలిష్టుని కాదు. తివిరి ఇసుమున తైలం తీయగల సమర్ధుడు అనే పెద్ద పేరు చిన్నతనంలోనే తెచ్చుకున్న వి.హనుమంతరావు గారిని. ఓ చెట్టు నీడన కూర్చుని రైతులకు రుణాల మంజూరీ వ్యవహారాన్ని గమనిస్తున్న ఆయన దృష్టిని ఒక అంశం ఆకట్టుకుంది. పేద రైతులు వాళ్ళ అవసరాల కొద్దీ, లేదా వారి వారి తాహతు కొద్దీ వంద రూపాయలనుంచి రెండు మూడు వేల రూపాయల వరకు రుణాలు తీసుకుంటున్నారు. తీసుకున్న రుణానికి బ్యాంకు అందచేసిన కాగితాలపై వేలిముద్రలు వేస్తున్నారు.  విలేకరిగా ఈ వ్యవహారాన్ని అంతా గమనిస్తూ వచ్చిన హనుమంతరావు రైతులు  పూర్తిచేసిన ఒక ధరఖాస్తు పత్రాన్ని తీసుకుని చూసారు. ఒక్కొక్కదానిపై నాలుగువందల వేలిముద్రలు కనిపించాయి. ఆ విషయాన్ని మరింతగా ధృవపరచుకున్న ఆయన  క్షణం ఆలస్యం చేయకుండా   పోస్ట్ ఆఫీసుకు వెళ్లి, వార్తను రాసి టెలిగ్రాం ద్వారా హైదరాబాదులోని తన ఆఫీసుకు పంపారు.
మళ్ళీ ఓ మారు హైదరాబాదు వస్తే....
‘వందరూపాయల రుణం కోసం నాలుగు వందల సంతకాలు’ అంటూ యూఎన్ ఐ వార్తాసంస్థ  పంపిన వార్తను ఒక ఇంగ్లీష్ దినపత్రిక మరునాడు మొదటి పేజీలో ప్రచురించింది.  స్టేట్ బాంక్ చైర్మన్ తల్వార్ గారు పాల్గొన్న స్టాఫ్ కాలేజ్ ప్రారంభోత్సవం వార్త కూడా ఫోటోతో సహా మొదటి పుటలోనే ఆ పక్కనే ప్రచురించడం కాకతాళీయం కావచ్చు. కానీ ఆ వార్త స్టేట్ బ్యాంకు రుణాల మంజూరీ విధానాన్ని పూర్తిగా మార్చివేయగలదని ఎవ్వరూ ఆరోజు ఊహించి వుండరు. ఆ వార్త తల్వార్ మహాశయుల దృష్టిలో పడింది. ఆయన వెంటనే మొత్తం వ్యవహారం గురించి ఆరా తీసారు. వంద రూపాయలకు నాలుగు వందల సంతకాలు తీసుకుంటున్న సంగతి నిజమే అని విచారణలో తేలింది. ఆయన  వెంటనే స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రుణమంజూరీ పద్దతిని సులభతరం చేస్తూ ఉత్తర్వులు జారీచేసారు.
ఒక జర్నలిస్ట్ తన చుట్టూ ఉన్న విషయాల్ని 'గమనించడం' అలవాటు చేసుకుంటే కొన్ని లక్షల మంది జీవితాల్ని మార్చవచ్చు అనడానికి ఇది ఒక ఉదాహరణ.
జర్నలిజం వృత్తిని అవహేళన చేస్తూ మాట్లాడేవారు, ఈ వృత్తిలో అలవడే అనేకానేక వ్యసనాలను ప్రస్తావిస్తూ వుంటారు. వారి సందేహాలకు సమాధానమే  హనుమంతరావు గారు. రాస్తూ బతకొచ్చని, బతుకుతూ రాయొచ్చని నిరూపిస్తూ డెబ్బయి ఏళ్ళకు పైగా రాస్తూ పోయిన, రాస్తూనే దాటిపోయిన  హనుమంతరావు గారు నిజంగా ధన్యజీవి. రాయడం, రాస్తూవుండడం ఆయనకు వ్యసనం కావచ్చు. కానీ అది సమాజానికి మేలు చేసే విషయం.
గొప్ప జర్నలిష్టుని ప్రపంచం భరిస్తుంది. ఆదరిస్తుంది, అభిమానిస్తుంది. కాని అతగాడిని భరించడం యెంత కష్టమో తెలిసేది మాత్రం  ఆ జర్నలిష్ట్ భార్యకి మాత్రమే. అనుభవంతో చెబుతున్న మాట ఇది. ప్రపంచం బాధ్యత తప్ప ఇంటి బాధ్యత పట్టని గొప్ప జర్నలిష్టులు నాకు చాలామంది తెలుసు. జీ కృష్ణ గారు వారిలో అగ్రగణ్యులు. అలాటి విశిష్ట వ్యక్తులను గౌరవించేటప్పుడు విధిగా వారిని భరించిన భార్యలను కూడా గుర్తుపెట్టుకుని, గుర్తించి గౌరవించాలి. ఆ విధంగా హనుమంతరావు గారికి లభించిన గౌరవ ప్రతిపత్తుల్లో న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన సగంవాటా నిస్సంశయంగా ఆయన అర్ధాంగి సరళ గారిదే.


రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595