20, మే 2014, మంగళవారం

రివైండ్ - 2010 (మూడో భాగం)

కన్నంతలో విన్నంతలో అమెరికా : 
లింకన్ సిటీ సముద్ర తీరంలో ఒక బుల్లిఅద్భుతాన్ని కూడా చూసాము. నిజానికి అది అద్భుతమేమీ కాదు. దేన్నయినా టూరిస్ట్ ఎట్రాక్షన్ గా అమెరికన్లు ఎలా మార్చుకుంటారనడానికి ఇది మరో ఉదాహరణ.




ప్రపంచంలో అతి పొట్టినదిని ఇక్కడ చూడవచ్చు.’ - అన్న బోర్డు చూసి దాన్ని చూడడానికి ఎంతో ఉత్సాహపడ్డాము. తీరా చూస్తె అదొక పిల్ల కాలువలా వుంది. తీరం పక్కన రోడ్డుకు ఆవల వున్న కొండల్లో పుట్టి సముద్రంలో కలుస్తున్న నది అని తెలిసింది. దాని పొడవు  కేవలం 440 అడుగులు. అంత చిన్ననది వచ్చి కలుస్తున్నది దేనిలోసముద్రాలు అన్నింటిలో అతి పెద్దదయిన పసిఫిక్ మహాసముద్రంలో.  అది మరో విశేషం. దాన్ని దొరకబుచ్చుకుని టూరిస్ట్ ఆకర్షణగా మార్చివేసారు. 


(ఇదే ఆ నది. నీళ్ళ రంగు తేడా చూసారుగా)


ఈ చిట్టి పొట్టి నది సముద్రంలో కలుస్తున్న చోట ఇంకో విశేషం గమనించాము. అదేమిటంటే ఈ నదిలో నీళ్ళు గోరువెచ్చగా వుంటాయి. ఒక్క అడుగు ముందుకు వేసి సముద్రంలో కాలు పెడితే గడ్డకట్టేంత చల్లగా వుంటాయి.

(2010)

19, మే 2014, సోమవారం

రివైండ్ - 2010 (రెండో భాగం)

కన్నంతలో విన్నంతలో : 
పసిఫిక్ మహా సముద్రం అంటే శాంతిసముద్రమని చదువుకున్నట్టు గుర్తు. కానీ, ‘ఈ పాయింట్ దాటి వెళ్ళవద్దు. అతి పెద్ద అలలు హటాత్తుగా పైనబడే అవకాశం వుంది.అనే హెచ్చరిక బోర్డు కనిపించింది. సునామీలు సృష్టిస్తున్న ప్రమాదాల నేపధ్యంలో ఇలాటి హెచ్చరిక బోర్డులు పెడుతున్నారని తెలిసింది. మేమున్న చోటికి కొన్ని మైళ్ల పరిధిలో ఫ్లారెన్స్, న్యూ పోర్ట్, లింకన్ సిటీ వంటి పట్టణాలు వున్నాయి. వున్న మూడు రోజులూ ఈ వూళ్ళన్నీ చూసాము. ఇవన్నీ టూరిస్ట్ రిసార్టులే. వారికి కావాల్సిన అన్ని వసతులూ పుష్కలంగా వున్నాయి. దేనికోసం వెదుక్కోవాల్సిన అవసరం వుండదు.


 ప్రతిచోట ఏదో ఒక ప్రత్యెక ఎట్రాక్షన్ . ఒకచోట సముద్ర గర్భంలో జలచరాల జీవనం ఎలావుంటుందో తెలియచెప్పే ఆరెగన్ స్టేట్  ఆక్వేరియం చూసాము.
 షార్కులు, డాల్ఫిన్ లు, ఆక్టోపస్ లు, ఆనకొండల మధ్య తిరుగుతూ పొద్దు తెలియకుండా గడిపాము. 

జీ పీ ఎస్ సిస్టం పుణ్యమా అని దారి కోసం ఎవరినీ దేవులాడాల్సిన పని అంతకన్నాలేదు. కారు ఎక్కగానే వూరి పేరు, వీధి నెంబరు, ఇంటి నెంబరు, లేదా షాపు, రెస్టారెంట్ వివరాలు ఫీడ్ చేస్తే చాలు - ఎక్కడికక్కడే అది గైడ్ చేస్తూ దారి చూపుతుంటుంది. మాటల్లో పడి, దారి తప్పినా అది వెంటనే హెచ్చరికలు వినిపిస్తూ మరో ప్రత్యామ్నాయ మార్గం చెప్పి మళ్ళీ సరయిన దోవకు చేరేలా సూచనలు ఇస్తుంది. అందువల్ల యెంత తెలియని ప్రదేశానికి వెళ్ళినా దారి తప్పే ప్రమాదంఎంతమాత్రం వుండదు. అంతేకాదు, మార్గమధ్యంలో మరమ్మతుల నిమిత్తం కానీ మరో అవసరం కోసం కానీ ఎక్కడయినా రహదారులు మూసివేసినా లేక వాహనాలను దారి మళ్ళించాల్సివచ్చినా - ఆ తాజా సమాచారం కూడా అది గ్రహించి అప్పటికప్పుడు కొత్త దోవలను సూచించడం ఇందులోని మరో సౌలభ్యం. (2010)

రివైండ్ - 2010

కన్నంతలో విన్నంతలో అమెరికా : 
పసిఫిక్ తీరం పొడవునా కొన్ని వందల మైళ్ల దూరం నిర్మించిన విశాలమయిన రహదారివెంట వెడుతుంటే చెట్ల నడుమనుంచి అతి పెద్ద ఆ మహాసముద్రం దోబూచులాడుతున్నట్టు కానవస్తూనే వుంది.
వాషింగ్టన్ స్టేట్ లోని సియాటిల్  నుంచి  ఆరెగన్ రాష్ట్రంలోని డీపోబే టూరిస్ట్ రిసార్ట్ కు  చేరడానికి ఆరేడు గంటలు పట్టింది. మధ్యలో ఒక పార్కులో ఆగి ఓ చెట్టుకింద కూర్చుని ఇంటినుంచి తెచ్చుకున్న పులిహోర లాగించాము.డీపోబే లో అయిదు గదులు వున్న ఒక ఇంటి మొత్తాన్ని నెట్లో బుక్ చేయడం వల్ల కార్లో వున్న జీ పీ ఎస్  సిస్టం సాయంతో ఆ ఇంటిని తేలిగ్గానే పట్టుకోగలిగాము. మాంత్రికుడి ప్రాణం మర్రిచెట్టు తొర్రలో వున్నట్టు ఆ ఇంటి తాళం చెవిని  ఇంటి ముందువున్న  ఒక చిన్న లాకరులో భద్రపరిచారు. ఒక కోడ్ నెంబరు ద్వారా దాన్ని తెరిచి  తాళం చెవి తీసుకుని లోపల ప్రవేశించాము.


(పసిఫిక్ తీరంలో పుట్టినరోజు)


 మూడంతస్తుల భవనం. కింద రెండు కార్లు పార్క్ చేసుకోవడానికి షెడ్డు వుంది. పైన విశాలమయిన డ్రాయింగ్ రూముతో పాటు గ్యాస్, డిష్ వాషర్, వంట సామాగ్రి, ప్లేట్లు గ్లాసులతో సహా అన్ని వసతులతో కూడిన కిచెన్ వుంది.  పదిమంది భోజనం చేయడానికి వీలయిన డైనింగ్ టేబుల్,  అతి పెద్ద ప్లాస్మా టీవీఫైర్ ప్లేస్,  సోఫాలు వున్నాయి.  పైన పడక గదులు, ఒక పక్కన బాల్కానీలో హాట్ టబ్ఏర్పాటు చేసారు. అయిదారుగురు కలసికట్టుగా అందులో కూర్చుని విశ్రాంతి తీసుకోవచ్చు. వెచ్చటి నీటి ధారలు అతి వేగంగా చిమ్ముతూ అన్నివైపులనుంచి శరీరాలను తాకుతూ మసాజ్ చేస్తుంటాయి. అందులోకి దిగిన తరవాత పిల్లలకూ పెద్దలకూ కాలం తెలియదు. చల్లని సముద్రతీరంలో వెచ్చగా జలకాలాడడం అదో అనుభూతి. స్నాన పానాదులు ముగించుకుని డీపోబే టూరిస్ట్ రిసార్ట్లో వింతలూ విశేషాలు చూస్తూ- అతిదగ్గరలో అలలతో తీరాన్ని తాకుకుతున్న అతి పెద్ద మహాసముద్రాన్ని తిలకిస్తూ కలయ తిరిగాము. (2010)

'జ్యోతి కార్టూనిస్ట్ శేఖర్ ఇక లేడు'

'జ్యోతి కార్టూనిస్ట్ శేఖర్ ఇక లేడు' అంటూ ఆయన సోదరుడు  కృష్ణ పంపిన ఎస్ ఎం ఎస్ తో ఈరోజు మొదలయింది. కానీ ఆయన సుస్తీగా వున్నప్పుడు 'బాపూ' గారు ఆయనకు రాసిన ఉత్తరం చదివిన తరువాత శేఖర్ గారికి మరణం లేదనిపించింది.సాక్షాత్తు  'బాపూ' గారే, శేఖర్ గారికి  'వీరాభిమానిని' అని చెప్పుకోవడమే కాదు,  అక్షరాలా రాసిచ్చిన తరువాత శేఖర్ గారికి నిజంగా మరణం లేదు. ఆయన ఎప్పటికీ చిరంజీవే. సందేహం లేదు.



17, మే 2014, శనివారం

ఇక భయం లేదు


మోడీ గెలుస్తాడా ? రాహుల్ గెలుస్తాడా ?కేసీఆరా ! చంద్రబాబా! జగనా !
ఇవన్నీ నిన్నటి మాటలు. ఇవాళ ఫలితాలు తేలిపోయాయి. ఇక ఆ చర్చ అనవసరం.
ఓటరుగా మన బాధ్యత మనం పూర్తిచేశాం. ప్రభుత్వాలు ఏర్పడతాయి. పాలకులు కొలువు తీరుతారు. వాళ్లు మనకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చారా సరే. లేకుంటే, వాళ్ల దగ్గర లేని ఆయుధం,   అయిదేళ్ళ తరువాత మన దగ్గర మాత్రమే వుండే 'ఓటు'  అనే ఆయుధం మనదగ్గరే వుంటుంది. బెంగ  పడాల్సిన పని లేదు.


ఈసారి మనం తెలిసో తెలియకో తెలివిగా ఒక మంచి పని చేశాం. అటు కేంద్రంలో, ఇటు తెలంగాణలో, మరో పక్క సీమాంధ్రలొ ఒకే పార్టీకి ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేసుకునే సౌలభ్యం ఇచ్చాం. వెనుకటి మాదిరిగా సంకీర్ణాలకి చోటివ్వలేదు. ఎన్నికల ప్రణాళికలో అన్ని పార్టీలు అలవికాని వాగ్దానాలు చేసుకుంటూ పోయాయి. సంకీర్ణ ధర్మం ప్రకారం అమలు చేయలేకపోయాం అని ఇన్నాళ్ళు కుంటి సాకులు చెబుతూ వచ్చాయి.
అది, ఇంకానా ఇకపై కుదరదు.
చెప్పిన మాట నిలబెట్టుకొకపోతే ఆయా పాలక పక్షాలను కాలరు పట్టి నిలదీసే మహత్తర అవకాశాన్ని మనమే కల్పించుకున్నాం.

ఇక భయం లేదు. మనకు మనమే ఒక రక్షరేఖ కల్పించున్నాం.           

జంప్ జిలానీలు - భండారు రామచంద్ర రావు


గోడ దూకితే గారెల గంపలో పడొచ్చు లేదా ముళ్ళకంపపై పడొచ్చు. ఏదైనా జరగొచ్చు.
ఇటీవల ముగిసిన ఎన్నికల్లో 'ఈ జంప్ జిలానీల'  గురించిన వివరాలతో శ్రీ భండారు రామచంద్రరావు ఏర్చికూర్చిన కధనాలు:


(శ్రీ భండారు రామచంద్రరావు)

చివరి నిమిషంలో గోడదూకి మటాష్ అయిన జంప్ జిలానీలు-
మైనంపల్లి హనుమంతరావు, జీ. వివేక్,  నోముల నరసింహయ్య, జైపాల్ యాదవ్, కవితా నాయక, టీ. జీ. వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి, శిల్పా మోహన రెడ్డి, లబ్బి వెంకటస్వామి, శ్రీనివాసులు రెడ్డి, వరదరాజులరెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడి, బీ. విజయకుమార్, గల్లా అరుణ కుమారి, కొత్తపల్లి సుబ్బారాయుడు, వెల్లంపల్లి శ్రీనివాస్, కుతూహలమ్మ, కారుమూరి నాగేశ్వర రావు, దగ్గుబాటి పురంధేశ్వరి,