26, డిసెంబర్ 2009, శనివారం

వార్త - వ్యాఖ్య - ఇంకానా! ఇకపై సాగదు!

ఇంకానా! ఇకపై సాగదు!
- భండారు శ్రీనివాసరావు
రాను రాను - సామాన్యుడనే వాడికి - ఓటు వెయ్యడం మినహా ఏ ‘హక్కూ’ లేకుండా పోతోంది. కానీ, అతడ్ని అడ్డం పెట్టుకుని బతికేవారికి మాత్రం అన్ని హక్కులూ - హక్కుభుక్తమై పోతున్నాయి.
నిజానికి, పార్టీలూ,పర్టీల నాయకులూ, అమాత్యులూ, అధికారులు,ఉద్యోగులు, పోలీసులూ, అందరూ ప్రజల్లో భాగమే. ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే. ఎదిగో - ఎన్నికయ్యో, హక్కులు సాధించుకుని అధికారం చెలాయిస్తున్నారు. సామాన్యులు ఎలాంటి హక్కులూ లేకుండా కునారిల్లుతున్నారు. అదే తానులోంచి వచ్చిన వాళ్ళు మాత్రం వృత్తుల పేరిటా, ఉద్యోగాల పేరిటా,సంఘాలు పెట్టుకుని, హక్కుల పోరాటాల పేరుతో లేని అధికారాలు అనుభవిస్తున్నారు. పై పదవులకు నిచ్చెనలు వేసుకుంటున్నారు.
సంఘాల కుంపట్లు పెట్టుకోని వర్గాలు ఈనాడు కాగడాలు వేసి గాలించినా కనిపించవు. ఎన్జీవోలకు సంఘాలున్నాయి.
ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులకు అసోసియేషన్లు ఉన్నాయి. రిక్షాలు లాగేవారికే కాదు, విమానాలు నడిపేవారికీ యూనియన్లు ఉన్నాయి. అమ్మేవారికి, కొనేవారికి సమాఖ్యలున్నాయి. రాసేవారికి, ఆ రాసిన వాటికి అచ్చేసేవారికీ సంస్థలు ఉన్నాయి. ఆడవారికీ, భార్యాబాధితులకు సయితం సమాజాలున్నాయి. వృత్తుల వారీగా, కులాలవారీగా, మతాలవారీగా ఎవరి సంఘాలు వారికి ఉన్నాయి. వీటన్న్టిటికీ, సొంతంగా ఏర్పరచుకున్న హక్కులు ఉన్నాయి. లేకపోయినా, వాటికోసం పోరాడగల యంత్రాంగ వ్యవస్తలున్నాయి.భావాలను విప్పిచెప్పగల గళాలు ఉన్నాయి. వాటిని ప్రజలకు చేరవేసే మాధ్యమాలు ఉన్నాయి. హక్కుల సాధనకోసం సమ్మెలు, బంద్ లు, ఆందోళనలు, నిరసనలు, రాస్తారోఖోలు, రైల్ రోఖోలు, ఘెరావ్ లు, ముట్టడులూ, ఊరేగింపులూ, బైఠాయింపులూ, అటకాయింపులూ, మానవహారాలు, దిష్టిబొమ్మల దహనాలు, ఇలా ఎన్నో రకాలుగా, ఎన్నెన్నో రూపాల్లో.. సామాన్యుడి సాదారణ జీవితాన్ని అతలాకుతలం చేస్తూ మరింత దుర్బరంగా మారుస్తూ - పై పెచ్చు తాము పడుతున్న ఈ పడరాని పాట్లన్నీ ఆ సామాన్యుడి కోసమే అని చెప్పి నమ్మించగల టక్కుటమార విద్యలన్నీ వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇవన్నీ లేనివాడు, అసలేమీ లేనివాడు మాత్రం రాజ్యాంగం తనకు కల్పించిన అన్ని రక్షణలకూ తూట్లు పొడుస్తున్న ఈ అస్తవ్యస్త మధ్య చిక్కుకుపోయి నానా అవస్థలు పడుతూ దిక్కుతోచక విలవిలలాడుతున్నాడు.
కారణాలు ఏమైనా, హేతుబధ్దత ఎంత ఉన్నా, బంద్ ల వల్లా, రాస్తారోఖోల వల్ల నష్టపోతున్నదీ, కష్టపడుతున్నదీ సామాన్యులే అన్నది నగ్న సత్యం. నిరసనలూ, ఆందోళనల పేరుతో రాజకీయపార్టీలు, వాటి అనుబంధ సంస్థలు, కార్మిక సంఘాలు, ఇతర సంస్థలూ, ఇష్టారాజ్యంగా నడిరోడ్లపై చేస్తున్న ధర్నాలు, బైఠాయింపులు నిత్యకృత్యంగా మారి జనజీవితాన్ని నరకప్రాయంగా మారుస్తున్నాయన్నది అంతే నిజం.
ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే నెపంతో రోడ్డెక్కుతున్న రాజకీయ పార్టీలు, కార్మికసంఘాలు తమ వైఖరులనూ, విధానాలను పునస్సమీక్షించుకోవాలి. ఏ సామాన్య జనం కోసమైతే ఉద్యమాలు, ఆందోళనలూ, నిర్వహిస్తున్నామని ఆయా పార్టీలూ, సంఘాలు అనుకుంటున్నాయో, ఆ సామాన్య జనాన్నే తమ విధానాలు మరింత చికాకు పరుస్తున్నాయన్న వాస్తవాన్ని అర్దం చేసుకోవాలి. పోరాటాల పేరుతోనో, ఇతరేతర రాజకీయ కారణాలతోనో బడుగుజీవి నడుం విరుస్తున్న ఈ అపబ్రంశపువిధానాలు ఏ నాగరిక దేశంలోనూ కానరావు. సాటి పౌరులకు ఇబ్బంది కలగని రీతిలో నిరసనలు ప్రకటించే పద్ధతులను సభ్యసమాజం పాటించి తీరాలన్న ప్రాధమిక స్పృహ మనదేశంలో కలికానికి కూడా కానరాదు.
ఒకసారి, సూర్యాపేట మీదుగా బస్సులో ఖమ్మం వెడుతుంటే నడుమ దారిలో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. కారణం వాకబు చేయడానికి వెడితే కొంతదూరంలో ఏదో పార్టీకి చెందిన కార్యకర్త్గలు - పట్టుమని పదిమంది కూడా లేరు. - జండాలు పట్టుకుని, నినాదాలు చేస్తూ నడిరోడ్డు పై ధర్నా చేస్తున్నారు. ‘ఇలా ఎంతసేపు మీ తమాషా చూడాలనిగద్దిస్తే ఒక్క అరగంట ఓపిక పట్టండి సార్! ఫలానా టీవీ వాళ్ళు దోవలో ఉన్నామని ఇప్పుడే సెల్ ఫోన్లో చెప్పారు. అని వాళ్ళనాయకుడు జవాబిచ్చాడు. ఇలాంటి ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోఖోలు ససేమిరా చూపించేది లేదని చానళ్ళన్నీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోగల్గితే మెరుగయిన సమాజం కోసం నిజంగా కృషి చేసినట్టవుతుంది. ప్రచారం కోసం కాకుండా ప్రజాక్షేమాన్ని కోరుకునే సంస్థలు కూడా తమ కార్యకర్తల్ని తక్షణం రంగంలోకి దింపి ‘ఇలా ప్రజలని ఇబ్బందుల పాలు చేసే వారికి దయచేసి ఓట్లు వెయ్యవద్దు అనే ప్లకార్డులను పట్టుకుని మౌనంగా ఆ పక్కన నిలబడితే, నవ్యత్వం కోసం పటుపడే ఛానెళ్ళన్నీ ఆ దృశ్యాలను ఒక్కమారైనా ప్రసారం చేయగలిగితే , ఇంకోసారి ఏపార్టీ, ఏయూనియన్ కూడా ఇలాంటి ఆందోళనలక్ సాహసించదు. కానీ సంచలనం ఒక్కటే సమస్తం అనుకునే ఈ పోటాపోటీ ప్రచార వ్యాపార యుగంలో ఇది నెరవేరని కలే.
కానీ, ఏదో ఒకరోజు ‘సామాన్యుడి రోజు’ కూడా వస్తుంది. నిరసనలని వ్యక్తం చేయడానికి ఎంచుకున్న విధానాల ద్వారా వేలాది మంది ప్రజలను అకారణంగా ఇబ్బంది పెట్టే హక్కు వీరికెవరిచ్చారన్న ప్రాధమిక ప్రశ్న ముందుకు వస్తుంది.
అర్భకుడు, అమాయకుడు అనుకున్న ఈ సామాన్యుడే తిరగబడి ‘ఇంకానా’ ఇకపై సాగదు!’ అంటూ హూంకరిస్తూ - తన జీవితంతో ఆటాడుకుంటున్న ‘వర్గాల’ మెడలు వంచే రోజు తప్పక వస్తుంది. తస్మాత్ జాగ్రత్త!

(ఆగష్టు -2009)
వార్త - వ్యాఖ్య
ఎన్నికల ముందు - ఎన్నికల తర్వాత
- భండారు శ్రీనివాసరావు

నలభై ఏళ్ళ క్రితం పత్రికల్లో జీవన్ టోన్ ప్రకటనలు విరివిగా దర్శనమిచ్చేవి. ఆ టానిక్ తీసుకోకముందూ - తీసుకున్న తర్వాత దేహ సౌష్టవం ఎలా మారిపోతుందన్న విషయాన్ని ఫోటోలతో సహా వివరించేవి. ఇప్పుడు ఎన్నికల ముందూ - తర్వాత రాజకీయ పార్టీల్లో కానవస్తున్న గుణాత్మక మార్పు వాటిని గుర్తుకు తెస్తోంది.
ఎన్నికల ప్రక్రియ ముగిసి, రెండోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన తర్వాత రాజశేఖరరెడ్డి వ్యవహార శైలి పుర్తిగా మారిపోయిందన్న భావం వచ్చే వార్తా కథనాలు గత కొద్ది రోజులుగా వెలువడుతున్నాయి. శాసన సభ స్పీకర్ ఎంపిక నుంచి మొదలు పెట్తి, బోగస్ రేషన్ కార్డుల ఏరివేత, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లులో మారిన ముఖ్యమంత్రి స్వరం - ఇత్యాది ఉదాహరణలతో, ఓడమల్లయ్య - బోడిమల్లయ్య వంటి సామెతలను ఉటంకిస్తూ అనేక విమర్శలు, ప్రతిపక్షాల నోటి నుంచే కాకుండా, పత్రికా వ్యాసాల ద్వారా వెలువడుతూ ఉండటం చూస్తే- ’ఎవ్వరూ మారలేదు’ అన్న సత్యం బోధపడుతుంది.
ఎన్నికల ముందు ఏ పార్టికయినా ప్రధమలక్ష్యం గెలుపు సాధించడం. దానికోసం అనేకరకాల వ్యూహాలను రచిస్తారు. ఎన్నో ఎత్తుగడలు వేస్తారు. ప్రలోభపెట్టే ప్రసంగాలు చేస్తారు. ఊరించే హామీలు గుప్పిస్తారు ఇందుకు ఎవరూ మినహాయింపు కాదన్నది అందరికీ తెలిసిందే.
అంతవరకూ, ఇదంతా ‘రాజకీయం’ అన్నది పార్టీల ప్రగాఢ విశ్వాసం. ఇక ఆ తర్వాత - ఓడిపోయిన వారికి పోయేదేమీలేదు. గెలవలేక పోయామే అన్న చింత తప్ప చిక్కులూ, ఇక్కట్లూ గెలిచి కూర్చున్న వారికే. ఇక అప్పుడు రాజకీయం తప్పుకుంటుంది. రాజనీతిజ్ఠత తెరపైకి వస్తుంది. ఇప్పుడు రాజశేఖరరెడ్డిలో పత్రికలకు కానవస్తున్న ‘మార్పు’లోని పరమార్ధం ఇదే.
మొన్న మొన్నటి వరకూ - ఎన్నికల సమరంలో వై.ఎస్. - తన పార్టీని ముందునుండి నడిపించారు. సామ, దాన్, బేధ, దండోపాయాల వంటి సమస్త అవకశాలను, ఏ ఒక్క దానిని వదిలిపెట్టకుండా విజయాన్ని సాధించాలన్న ఏకైక ధ్యేయంతో పనిచేసి, ప్రచారం చేసి అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నారు. ఇక ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపించే గురుతర బాధ్యత ఆయన భుజస్కంధాలపై ఉంది. ఖజానా ఖాళీ అయ్యిందనీ, నిధులలేమి నిజ స్వరూపం ప్రదర్శిస్తోందని మళ్ళీ అవే పత్రికలు రాస్తున్న రాతల్నే ప్రాతిపదికగా తీసుకుంటే రాష్ట్ర రధసారధి బాధ్యత ఇంకా ఎంత పెరిగిందో అవగతమవుతుంది. అదృష్టవశాత్తూ మిగిలిన పార్టీలతో పోటీపడి అనవసర ఎన్నికల వాగ్దానాలు శ్రుతిమించి చేయకపోవడం గుడ్దిలో మెల్ల. తొలివిజయం ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. మలి విజయం అహంకారాన్ని అందిస్తుందంటారు..పరిమితులను మించిన అధికారం పెడత్రోవల వైపు నడిపిస్తుందని కూడా అంటారు. వ్యక్తిత్వానికి అసలు సిసలు పరీక్ష ఈ స్థితిలోనే ఎదురవుతుంది. ఎదురొడ్డి నెగ్గినవారు నేతగా నిలబడతారు. జనం గుండెల్లో కలకాలం నిలిచిపోతారు.
ముఖ్హ్యమంత్రిగా తొలి ఐదేళ్ళలో రాజశేఖర రెడ్డి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఎన్నో పథకాలు తలపెట్టారు. సాధ్యాసాధ్యాలను లెక్కించకుండా ప్రాజెక్టులు ప్రారంభించారు. సమాజంలోని ఏ ఒక్క వర్గాన్ని విస్మరించకుండా అందరికీ అన్ని మేళ్ళు చేయాలన్న ఉదార సదాశయంతో పనిచేశారు. వాటిల్లో కొన్ని జరిగాయి, మరికొన్ని అసంపూర్తిగా మిగిలాయి, మరికొన్నింటిని అమలులో చిత్త శుద్ధి లోపించింది. ఇవన్నీ సాకల్యంగా ఎరిగున్న మనిషి కనుకనే కలెక్టర్లతో మాట్లాడిన మాటల్లో - ఆయన మనసులోని మాటలు బయటకు వచ్చాయి.
‘రాజకీయాలన్నవి ఎన్నికల వరకే, ఆ తరువాత ఆలోచన అంతా అభివృధిపైనే’ అనే ఉవాచ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిదే కాబట్టి, కొత్త ప్రభుత్వం తన పాత పథకాలను పటిష్టంగా అమలుచేయడానికి వీలుగా కొంత వ్యవధి ఇచ్చి చూడడం ఆయన విధి.
టీడీపీ ఆలోచనా ధోరణి కూడా ఇదే విధంగా ఉందన్నట్లు వచ్చిన వార్తల్లో నిజం ఉంటే అంతకంటే కావల్సింది ఏమీ లేదు. గెలుపోటములను ఒకే రీతిన జీర్ణించుకోగల స్థిత ప్రజ్ణత రాజకీయాల్లో కొరవడినప్పుడే ఇబ్బందులు తలెత్తుతాయి.
పదమూడవ శాసనసభ సమావేశాల తొలి రోజుల తీరుతెన్నులను గమనించిన వారికి ‘కొత్త సీసాలో పాత సారా’ సామెత గుర్తుకురావడంలో ఆశ్చర్యం లేదు. స్పీకర్ గా కిరణ్ కుమార్ రెడ్ది ఎన్నిక తదనంతర పర్యవసానాలు చూస్తే, భవిష్యత్తు పట్ల నిరాశే కలుగుతుంది. టీడీపీ ఉపనాయకుడు అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ ‘ఈ అయిదేళ్ళూ ఇంతేనా’ అని నిర్వేదం ప్రకటించారు. కానీ, తమ వైఖరి కూడా చూసేవారికి అదే నిర్వేదం కలిగించిందన్న వాస్తవాన్ని అర్ధంచేసుకున్న దాఖలా కానరాలేదు. మారామని చెప్పుకోవడం వేరు, మారినట్లు కానరావాలి కూడా అప్పుడే రాజకీయం సమూలంగా మారిపోతుంది.

25, డిసెంబర్ 2009, శుక్రవారం

వార్త - వ్యాఖ్య



ఎన్నికల ముందు - ఎన్నికల తర్వాత



- భండారు శ్రీనివాసరావు









నలభై ఏళ్ళ క్రితం పత్రికల్లో జీవన్ టోన్ ప్రకటనలు విరివిగా దర్శనమిచ్చేవి. ఆ టానిక్ తీసుకోకముందూ - తీసుకున్న తర్వాత దేహ సౌష్టవం ఎలా మారిపోతుందన్న విషయాన్ని ఫోటోలతో సహా వివరించేవి. ఇప్పుడు ఎన్నికల ముందూ - తర్వాత రాజకీయ పార్టీల్లో కానవస్తున్న గుణాత్మక మార్పు వాటిని గుర్తుకు తెస్తోంది.



ఎన్నికల ప్రక్రియ ముగిసి, రెండోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన తర్వాత రాజశేఖరరెడ్డి వ్యవహార శైలి పుర్తిగా మారిపోయిందన్న భావం వచ్చే వార్తా కథనాలు గత కొద్ది రోజులుగా వెలువడుతున్నాయి. శాసన సభ స్పీకర్ ఎంపిక నుంచి మొదలు పెట్తి, బోగస్ రేషన్ కార్డుల ఏరివేత, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లులో మారిన ముఖ్యమంత్రి స్వరం - ఇత్యాది ఉదాహరణలతో, ఓడమల్లయ్య - బోడిమల్లయ్య వంటి సామెతలను ఉటంకిస్తూ అనేక విమర్శలు, ప్రతిపక్షాల నోటి నుంచే కాకుండా, పత్రికా వ్యాసాల ద్వారా వెలువడుతూ ఉండటం చూస్తే- ’ఎవ్వరూ మారలేదు’ అన్న సత్యం బోధపడుతుంది.



ఎన్నికల ముందు ఏ పార్టికయినా ప్రధమలక్ష్యం గెలుపు సాధించడం. దానికోసం అనేకరకాల వ్యూహాలను రచిస్తారు. ఎన్నో ఎత్తుగడలు వేస్తారు. ప్రలోభపెట్టే ప్రసంగాలు చేస్తారు. ఊరించే హామీలు గుప్పిస్తారు ఇందుకు ఎవరూ మినహాయింపు కాదన్నది అందరికీ తెలిసిందే.



అంతవరకూ, ఇదంతా ‘రాజకీయం’ అన్నది పార్టీల ప్రగాఢ విశ్వాసం. ఇక ఆ తర్వాత - ఓడిపోయిన వారికి పోయేదేమీలేదు. గెలవలేక పోయామే అన్న చింత తప్ప చిక్కులూ, ఇక్కట్లూ గెలిచి కూర్చున్న వారికే. ఇక అప్పుడు రాజకీయం తప్పుకుంటుంది. రాజనీతిజ్ఠత తెరపైకి వస్తుంది. ఇప్పుడు రాజశేఖరరెడ్డిలో పత్రికలకు కానవస్తున్న ‘మార్పు’లోని పరమార్ధం ఇదే.



మొన్న మొన్నటి వరకూ - ఎన్నికల సమరంలో వై.ఎస్. - తన పార్టీని ముందునుండి నడిపించారు. సామ, దాన్, బేధ, దండోపాయాల వంటి సమస్త అవకశాలను, ఏ ఒక్క దానిని వదిలిపెట్టకుండా విజయాన్ని సాధించాలన్న ఏకైక ధ్యేయంతో పనిచేసి, ప్రచారం చేసి అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నారు. ఇక ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపించే గురుతర బాధ్యత ఆయన భుజస్కంధాలపై ఉంది. ఖజానా ఖాళీ అయ్యిందనీ, నిధులలేమి నిజ స్వరూపం ప్రదర్శిస్తోందని మళ్ళీ అవే పత్రికలు రాస్తున్న రాతల్నే ప్రాతిపదికగా తీసుకుంటే రాష్ట్ర రధసారధి బాధ్యత ఇంకా ఎంత పెరిగిందో అవగతమవుతుంది. అదృష్టవశాత్తూ మిగిలిన పార్టీలతో పోటీపడి అనవసర ఎన్నికల వాగ్దానాలు శ్రుతిమించి చేయకపోవడం గుడ్దిలో మెల్ల.



తొలివిజయం ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. మలి విజయం అహంకారాన్ని అందిస్తుందంటారు..పరిమితులను మించిన అధికారం పెడత్రోవల వైపు నడిపిస్తుందని కూడా అంటారు. వ్యక్తిత్వానికి అసలు సిసలు పరీక్ష ఈ స్థితిలోనే ఎదురవుతుంది. ఎదురొడ్డి నెగ్గినవారు నేతగా నిలబడతారు. జనం గుండెల్లో కలకాలం నిలిచిపోతారు.



ముఖ్హ్యమంత్రిగా తొలి ఐదేళ్ళలో రాజశేఖర రెడ్డి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఎన్నో పథకాలు తలపెట్టారు. సాధ్యాసాధ్యాలను లెక్కించకుండా ప్రాజెక్టులు ప్రారంభించారు. సమాజంలోని ఏ ఒక్క వర్గాన్ని విస్మరించకుండా అందరికీ అన్ని మేళ్ళు చేయాలన్న ఉదార సదాశయంతో పనిచేశారు. వాటిల్లో కొన్ని జరిగాయి, మరికొన్ని అసంపూర్తిగా మిగిలాయి, మరికొన్నింటిని అమలులో చిత్త శుద్ధి లోపించింది. ఇవన్నీ సాకల్యంగా ఎరిగున్న మనిషి కనుకనే కలెక్టర్లతో మాట్లాడిన మాటల్లో - ఆయన మనసులోని మాటలు బయటకు వచ్చాయి.



‘రాజకీయాలన్నవి ఎన్నికల వరకే, ఆ తరువాత ఆలోచన అంతా అభివృధిపైనే’ అనే ఉవాచ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిదే కాబట్టి, కొత్త ప్రభుత్వం తన పాత పథకాలను పటిష్టంగా అమలుచేయడానికి వీలుగా కొంత వ్యవధి ఇచ్చి చూడడం ఆయన విధి.



టీడీపీ ఆలోచనా ధోరణి కూడా ఇదే విధంగా ఉందన్నట్లు వచ్చిన వార్తల్లో నిజం ఉంటే అంతకంటే కావల్సింది ఏమీ లేదు. గెలుపోటములను ఒకే రీతిన జీర్ణించుకోగల స్థిత ప్రజ్ణత రాజకీయాల్లో కొరవడినప్పుడే ఇబ్బందులు తలెత్తుతాయి.



పదమూడవ శాసనసభ సమావేశాల తొలి రోజుల తీరుతెన్నులను గమనించిన వారికి ‘కొత్త సీసాలో పాత సారా’ సామెత గుర్తుకురావడంలో ఆశ్చర్యం లేదు. స్పీకర్ గా కిరణ్ కుమార్ రెడ్ది ఎన్నిక తదనంతర పర్యవసానాలు చూస్తే, భవిష్యత్తు పట్ల నిరాశే కలుగుతుంది. టీడీపీ ఉపనాయకుడు అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ ‘ఈ అయిదేళ్ళూ ఇంతేనా’ అని నిర్వేదం ప్రకటించారు. కానీ, తమ వైఖరి కూడా చూసేవారికి అదే నిర్వేదం కలిగించిందన్న వాస్తవాన్ని అర్ధంచేసుకున్న దాఖలా కానరాలేదు.



మారామని చెప్పుకోవడం వేరు, మారినట్లు కానరావాలి కూడా అప్పుడే రాజకీయం సమూలంగా మారిపోతుంది.

యిద్దరు మిత్రులు -వైఎస్సార్ - చంద్రబాబు

  సరిగ్గా   ముప్పయేళ్ళ క్రితం, మార్చి 15వ తేదిన - 'ఇద్దరు మిత్రులు ' రాష్ట్ర శాసనసభలలో కొత్త సభ్యులుగా అడుగుపెట్టారు. ఆ ఇద్దరు - భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులు కాగలరని ఆనాడు ఎవ్వరూ వూహించి ఉండరు. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో తొలి అడుగులు కలిసి వేసిన ఆ ఇద్దరి దారులు వేరైపోతారని కానీ, ఆ ఇరువురి మధ్య వెల్లి విరిసిన స్నేహం ఆవిరి కాగలదని కానీ ఏమాత్రం అనుకోవడానికి అవకాశం లేని రోజులవి. ఆ ఇద్దరూ ఎవరన్నది పెద్ద ప్రశ్నా కాదు - సమాధానం చెప్పలేనంత క్లిష్టమైనది కాదు. కాకపోతే, ఒకప్పటి ప్రాణస్నేహితులయిన రాజశేఖరరెడ్డి - చంద్రబాబు కొన్ని విషయాలలో చాలా అదృష్టవంతులయిన రాజకీయ నాయకులనే చెప్పాలి.

1978 లో వైఎస్సార్ తో రచయిత

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు - ఆయన పార్టికి ఆయనే అధినేత - కేంద్రంలో సయితం ఆయిన కనుసన్నల్లో పనిచేసే ప్రభుత్వాలే కొనసాగాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్ టి రామారావుగారికి కూడా ఈ వైభోగం లేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఎప్పుడూ చుక్కెదురే. ఇక రాజశేఖరరెడ్డి విషయం తీసుకుంటే - ఆయన ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించేనాటీకి - కాంగ్రెస్ పార్టి అధిష్టానం తీరుతెన్నులే పూర్తిగా మారిపోయాయి. తరచుగా ముఖ్యమంత్రులను మార్చే విధానానికి సోనియాగాంధి నాయకత్వంలోని ఆ పార్టి అధిష్టానం తిలోదకాలు ఇచ్చింది.



ముఖ్యమంత్రి వైఎస్సార్ తో రచయిత


స్వపక్షంలోనే విపక్ష రాజకీయాలు - చెపట్టిన ప్రతి అబివృద్ధి కార్యక్రమానికి ఏవో ఒక రకమైన ఆరోపణలు మరకలు - మీడియాలో ఒక వర్గంపై ప్రత్యక్ష యుద్ధాలు - దూరమైన మిత్ర పక్షాలు - దగ్గరవుతున్న శత్రుగుడారాలు ఇవన్నీ సహజంగా పాలకపక్షానికి చికాకు కలిగించే అంశాలే. అయినా కాని - మందహాసం చిందిస్తూ మీడియాలో కనపడే రాజశేఖరెడ్డిని చూసే వారికి కలత చెందాల్సిన ఈ అంశాలేవీ ఆయనని కలవర పరుస్తున్న దాఖలాలు కనపడటలేదు. మంత్రివర్గం ఏర్పాటులో - పార్టిలో అసమ్మతిని ఏదో ఒక రూపంలో రెచ్చగొట్టే విషయాల్లో అధిష్టానానికి ఇంకా ఎంతో కొంత పట్టువున్నట్టూ కానవచ్చినా - ముఖ్యమంత్రిని మార్చేసాహసానికి పునుకోలేని స్థితిలో ఉండడం రాజశేఖరరెడ్డి కి శ్రీరామరక్షగా మారింది. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలను ధీమంతంగా ఎదుర్కోగలిగిన రాజకీయ జవసత్వాలు ఉన్న ప్రత్యామ్నాయ నాయకత్వం రాష్ట్ర కంగ్రెస్‌లో లోపించడం రాజశేఖరేడ్డికి మరో కవచం. జనాకర్షణ శక్తి ఆయనలో తగ్గిపోయినట్టు - స్వపక్షంలో విపక్షం ఎంత గగ్గోలు పెట్టినా - అందులో వాస్తవం ఉందని నమ్మడానికి ఆధారాలు లేవు. అందుకే - చంద్రబాబు - రాజశేఖరరెడ్డి అదృష్టవంతులయిన రాజకీయ నేతల కోవలోకి చేరిపోయారని చెప్పడం. పార్టీలో - ప్రభుత్వంలో ఎదురులేని స్థితికి చేరుకోవడం - అస్తిత్వానికి ముప్పులేకపోవడం - సహజంగానే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అవి అతిగా పెరిగిపోయి - అహంకారానికి మితిమీరిన ఆత్మవిశ్వాసానికి దారితీయనంతకాలం - ఎలాంటి అనర్థాలకు అవకాశం ఉండదు. రెండోతరం చివరాఖరి దశలని మినహాయిస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబుది మరింత కలిసివచ్చిన కాలం. ఇంటా - బయటా ఆయన పేరు మారుమ్రోగిపోయింది. ప్రపంచపటంలో ఆంధ్రప్రదేశ్‌కి చోటు దక్కింది. ఎన్నారైలకి  రాష్ట్రంలో ఓటు హక్కు ఇస్తే - ఆయన మరికొన్ని దశాబ్దాలవరుకు ముఖ్యమంత్రిగా కొనసాగగలరన్న వూహాగానలకు ఈ ఎన్నారైల అభిమానం ఊపిరి పోసింది. ఆకాశానికి నిచ్చెనలు వేసి - అంధ్ర ప్రదేశ్‌ని పైక్కించే పధకాల రచనకు కంప్యుటర్ వేగంతో శ్రీకారం చుట్టింది.

కాలు విరిగి ఆసుపత్రిలోవున్న రచయితను ముఖ్యమంత్రి హోదాలో పరామర్సిస్తున్న చంద్రబాబు


ఆ తర్వాత జరిగింది చరిత్ర - మిత్రపక్షాలు వైరి పక్షాలుగా మారి వీధులకెక్కారు. ప్రకృతి కన్నేర్ర చేయడంతో - వరుస కరువులతో రైతాంగం వెన్ను విరిగింది. విధ్యుత్ కొరత కడగండ్లని మరింత పెంచిమిది. సంస్కరణలు ధరలు పెంపుకు దోహదంచేసి - పరిస్థితులు మరింత దిగజారేలా చేశాయి. జరుగుతాయనుకున్న ఎన్నికలు మరింత దూరం జరగడం - తాత్కాలిక సర్కారు పాలాధికారులకు ఎన్నికల కమీషన్ ముక్కుతాడు విధించడం - చంద్రబాబుని మరింత వుక్కిరి బిక్కిరి వేశాయి. ముందరి కాళ్ళకు బంధాలు వేశాయి. ప్రత్యేక తెలెంగాణా పేరుతో వుద్యమం ప్రారంభించి - ఎన్నికల్లో పోటిచేసిన ట్. ఆర్. స్. నేత చంద్రశేఖర రావుతో - కాంగ్రెస్ వ్యుహాత్మాకంగా చేతలు కలపడంతో - రాష్ట్రంలో తెలుగుదేశం పరిపాలనకు చరమగీతం పాడినట్టయింది.
కణకణమండే ఎండాకా కాలంలో రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో జరిపిన సూదీర్ఘ పాదయాత్రతో సాధించిన కాంగ్రెస్ విజయంతో - చంద్రబాబు పాలన - రెండో టరం వ్యవధి పూర్తికాకుండానే ముగిసిపోయింది.

ఇక రాజశేఖరెడ్డి విషయానికి వస్తే - ఆయన సరైన సమయంలో ముఖ్యమంత్రి అయ్యారనే చెప్పాలి. 2004లో కాంగ్రెస్ గెలిచి వుండని పక్షంలో - భవిష్యత్తులో ఆయనకి   ఈ అవకాశం లభించే పరిస్థితి వుండేదికాదు. గతంలో కూడా ముఖ్యమంత్రి రేసులో ఆయన లేకపోలేదు. అప్పుడే ఈ పదవి ఆయనికి లభించి ఉంటే - రెండేళ్ళో - మూడేళ్ళో ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన కాంగ్రెస్ మాజీల జాబితాలో ఆయన చేరిపుండేవారేమో. ఈ సారి సరైన తరుణంలో ముఖ్యమంత్రి కాగలిగారు. కనుక - మూడేళ్ళ పదవీకాలాన్ని జయప్రదంగా పూర్తిచేసుకుని పూర్తి టర్మ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఒక రికార్డ్ సృష్టించే దిశగా ముందుకు సాగుతున్నారు.

రాజశేఖరరెడ్డిది  ఆశ్రిత పక్షపాత బుద్ది. అందుచేతనే,  అందరిని కలుపుకుపోవడం లేదన్న  విమర్శలు సొంత పార్టి వారే చేస్తున్నారు. కాకపోతే ఈ విషయంలో ఆయన కారణాలు ఆయనకు వుండవచ్చు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో అధికార పర్వంలో నిర్వహింఛిన కాలం బహు తక్కువ. కాంగ్రెస్ అధికారంలో వున్నప్పుడు సయితం ఆయన్నీ ,  ఆయన అనుచరులనీ  ఆదరించి అందలం ఎక్కించింది లేదు. అందుకే ఎంతో కాలం వేచి చూసిన తర్వాత లభించిన అధికార  తాయిలాన్ని పంచే విషయంలో ఆయన తన అనుచర గణానికి పెద్ద పీట వేయడంలో ఆశ్చర్యపోవల్సింది లేదు. అందుకే నమ్ముకున్నవారికి వైఎస్సార్ కొమ్ముకాస్తారని అన్నా కూడా ఆయన  అభ్యంతరపెడుతున్నదీ లేదు.

దటీజ్ రాజశేఖరరెడ్డి.

ఆయన్ని బాగా తెలిసుకున్నవాళ్ళందరికి ఇది బాగా తెలిసిన సంగతే.

                                                                      

ముగ్గురు మిత్రులు

నలభయి ఏళ్ళ తర్వాత కలుసుకున్న ముగ్గురు మిత్రులు గురించిన ఆంద్ర జ్యోతి కధనం  
 




వార్తకు ప్రాణం విశ్వాసం - వార్త వ్యాఖ్య - భండారు శ్రీనివాస రావు

(November 16- National Press Day)



వార్తకు ప్రాణం విశ్వాసం 
- వార్త వ్యాఖ్య - భండారు శ్రీనివాస రావు (ఆకాశవాణి - హైదరాబాద్ - ప్రాంతీయ వార్తా విభాగం సౌజన్యంతో )
చాలా ఏళ్ళనాటి సంగతి.
కేంద్రంలో ఆనాడు సహాయ మంత్రిగావున్న డాక్టర్ కే ఎల్ రావు గారు మా వూరు రావాల్సివుంది. గంటలు గడిచిపోతున్నా మంత్రిగారి జాడ లేదు. చీకటి పడింది. ఇంతలొ దూరంగా వూరి పొలిమేరల్లో మోటార్ కార్ల హెడ్ లైట్ ల కాంతి కనబడింది. అమ్మయ్య వచ్చేసారులే అనుకున్నాం. కానీ, కాసేపటి తరవాత ఆ లైట్ ల వెలుతురు కూడా కానరాలేదు. మంత్రిగారి పర్యటన మొదలుకాకుండానే ముగిసిపోయింది.
మర్నాడు ఉదయం రేడియో లో ప్రాంతీయ వార్తలు విన్నప్పుడు అసలు విషయం తెలిసింది. సరయిన రహదారి లేకపోవడంవల్ల దారి తప్పిన మంత్రిగారి పరివారం- మా వూరికి వచ్చే దారి కనుక్కోలేక - విధి లేని పరిస్థితిలో ప్రోగ్రాం రద్దుచేసుకుని యెకాయెకిన విజయవాడ తిరిగి వెళ్ళిపోయిందట. ఆ సాయంత్రం వచ్చిన పత్రిక ద్వారా మరికొన్ని విశేషాలు తెలిసాయి. మునేటికి అవతల - దారీ తెన్నూ లేకుండావున్న అనేక గ్రామాలను కలుపుతూ రోడ్డు వేయాలని కే ఎల్ రావు గారు నిర్ణయించారట. మంత్రి గారు రాకపోయినా- రోడ్డు వస్తున్నందుకు గ్రామస్తులు సంతోషించారు.
పొతే- ఆరోజు సాయంత్రం వచ్చిందని చెప్పానే ఆ ఆంద్ర పత్రిక ఒక్కటే మా వూరు మొత్తానికి దిక్కు. ఉదయం ముద్రించిన పేపర్ సాయంకాలానికి కానీ మా వూరు చేరేది కాదు. బస్సు సదుపాయాలు అంతంత మాత్రం. రోడ్ల సంగతి సరేసరి. చెప్పాల్సిన పని లేదు.
ఆంద్ర పత్రిక - కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారి పత్రిక. పందొమ్మిదివందల ఎనిమిది లోనే ఆనాటి బొంబాయి లో దాన్ని ప్రారంభించారు. అప్పటికే కొన్ని పత్రికలూ వస్తున్నప్పటికీ - తెలుగు పత్రికా రంగంలో ఆ పత్రిక స్థానం ఎవరూ కాదనలేనిది. పంతులు గారు కూడా పత్రికను వాణిజ్య ప్రాతిపదిక పై నడపలేదు. పైపెచ్చు- బొంబాయి నుంచి ప్రతి రోజూ తన స్వంత ఖర్చులపై పత్రికను ఆంద్ర ప్రాంతంలోని గ్రంధాలయాలకూ , రీడింగ్ రూంలకూ పంపేవారు. తెలుగునాట పత్రికలూ చదివే ఆసక్తి పెరగడానికి పంతులుగారి ఈ ప్రయత్నం దోహదం చేసింది కూడా.
ఇక మళ్ళీ మా వూరికి వెడితే-
గూడా సత్యనారాయణ సిద్దాంతి గారనే వయో వృద్దుడు - తనకొచ్చే కొద్దిపాటి ఆదాయంలో - మూడు రూపాయలు నెలసరి చందా కట్టి - పోస్ట్ లో పత్రికను తెప్పించుకునేవారు. పేపర్ రాగానే- వూళ్ళో చడువుకున్న వాళ్ళూ- చదువుకోని వాళ్ళూ - ఒక చోట చేరిపోయేవాళ్ళు. అప్పయ్య మాస్టారు - తన కంచు కంఠంతో వార్తలను ఆమూలాగ్రం చదివి వినిపించేవారు.
"అమెరికా అధ్యక్షుడిగా జాన్ ఫిట్జరాల్ద్ కెన్నడీ ఎన్నిక- వోటమి అంగీకరిస్తూ నిక్సన్ ప్రకటన-
" కాంగోలో జరిగిన విమాన ప్రమాదంలో ఐరాస సెక్రెటరీ జనరల్ దాగ్ హామర్ షెల్డ్ దుర్మరణం - దుర్ఘటనపై నీలినీడలు-
" మన సారధి- మన సచివుడు- మన జవహర్ - మనకిక లేడు-"
ఇలా సాగిపోయేవి ఆ వార్తలు.
వాటిని వినేవాళ్ళలో చాలామందికి అమెరికా అనే మరో దేశం వుందని తెలియదు. కాంగో ఎక్కడ వుందో- లియోపాల్డ్ విల్లీ అనేది వూరు పేరో - పూవు పేరో తెలియదు. తెలిసిందల్లా - తెలియనిది తెలుసుకుంటున్నామన్న తృప్తి . కొత్త సంగతులు తెలుసుకోవాలన్న ఆసక్తి. యిదే పత్రికలకు వున్న శక్తి.
అందుకనే- సమాచార మార్పిడికి వున్న ఈ బలాన్ని ఆవాహన చేసుకున్న పత్రికలు ప్రజలమీద పట్టుపెంచుకుంటూ వస్తున్నాయి.
అంతటి శక్తి స్తోమతలను ఇముడ్చుకున్న పత్రికా రంగం చరిత్ర గురించి- ఈ రోజు జాతీయ పత్రికా దినం పాటిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని ముచ్చటించుకుందాం.
అనేక శతాబ్దాల క్రితం ప్రభుత్వ ప్రభుత్వ ప్రకటనలే - అంటే రాజ శాసనాలే- సమాచార పత్రాలుగా వెలువడేవి. ప్రాచీన రోము సామ్రాజ్యంలో - జూలియస్ సీజర్ - లోహ, శిలా ఫలకాలపై శాసనాలను చెక్కించి - బహిరంగ ప్రదేశాలలో ప్రదర్శించే వారట .చైనాలో- పదహారో శతాబ్దంలోనే - మింగ్ ప్రభువుల కాలంలో వార్తా పత్రికలను ప్రచురించిన దాఖలాలు వున్నాయి. పదహారు వందల యాభయ్ ఆరులో మొదలై ఇప్పటిదాకా వెలువడుతున్న పత్రిక ఒకటి వుంది. ఈ స్వీడన్ పత్రికను - ఆ తరవాత మరో పత్రికతో విలీనం చేసిన పిదప కూడా - పాత పేరుని దానికి జోడించి ప్రచురిస్తూ వుండడం ఒక విశేషం. అంటే మూడు వందల నలభయ్ మూడు సంవత్సరాలుగా ఏకబిగిన నడుస్తున్న అతి ప్రాచీన పత్రిక ఇదే అన్న మాట.
పోతే - పన్దొమ్మిదవ శతాబ్దం ఆరంభంలో పారిశ్రామిక విప్లవం పుణ్యమా అని - వార్తా పత్రికల తీరుతెన్నులే పూర్తిగా మారిపోయాయి. పద్దెనిమిది వందల పదునాలుగులోనే - లండన్ టైమ్స్ పత్రిక- నిమిషానికి పదకొండు వందల కాపీలు ముద్రించగల అచ్చు యంత్రాన్ని సమకూర్చుకుంది. క్రమంగా ఈ రంగంలో పోటీ పెరిగిపోయి- చవక పత్రికలు రంగ ప్రవేశం చేసాయి. పెన్నీ ప్రెస్ అనే వార్తా పత్రిక - తన ధరను సాటి పత్రికల ధరలో ఆరో వంతుకు తగ్గించి అమ్మడం మొదలుపెట్టి- అమ్మకాలను గణనీయంగా పెంచుకుంది.
ఇక ప్రస్తుతానికి వస్తే- ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్న అవకాశాలను- సాధన సంపత్తులనూ అందిపుచ్చుకున్న ఈ నాటి పత్రికలూ సర్వాంగ సుందరంగా ముస్తాబై పాఠకులను ఆకర్షిస్తున్నాయి.
ఈరోజు జాతీయ పత్రికా దినం కాబట్టి- కనీసం ఈ రోజయినా పత్రికా విలువలను గురించి కొంత నిష్కర్షగా చర్చ జరగాల్సిన అవసరం వుంది. కాలానుగుణమైన మార్పుల మూలంగా- మిగిలిన రంగాల్లో కానవస్తున్న వికృత ధోరణుల నీలినీడలు పత్రికా రంగంపై కూడా ప్రసరిస్తున్నాయన్న ఆరోపణల నేపధ్యంలో ఈ చర్చ అవసరం మరింత పెరిగింది.
ఒక పెద్ద పత్రికలో వార్త పడినప్పుడు జనం దాని గురించి మాట్లాడుకోవడం సహజం. చదువుకున్న వాళ్ళు దాన్ని గురించి మరింత చర్చించుకుంటారు కూడా. నిరక్షరాస్యులయితే విని అవునా అని అనుకుంటారు. అధికారులు స్పందిస్తారు. అనధికారులు వీలుని బట్టి ఖండిస్తారు. లేదా హర్షిస్తారు. సాధారణంగా జరిగే వ్యవహారం ఇది.
నిజాయితీ, నిబద్దతా, విశ్వసనీయతా - వార్తకు ప్రాణం పోస్తాయి. ఇవి లేని వార్తకు ప్రాణం వుండదు. ప్రామాణికం వుండదు. కానీ- ఈనాటి పత్రికల్లో - ఆ మాటకి వస్తే - మీడియాలో - ఈ మూడింటికీ ఎంత విలువ ఇస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే.
విశ్వసనీయత కంటే మనుగడే ప్రధానమనుకున్నప్పుడు - పత్రికల ద్వారా సాధించాలనుకున్నదీ - సంపాదించాలని అనుకున్నదీ 'ఇంకేదో' వుందనుకున్నప్పుడు - పత్రికా స్వేచ్ఛకి అర్ధమే మారిపోతుంది.
జాతీయ పత్రికా దినం సందర్బంగా ఏర్పాటు చేసే సభలు సమావేశాల్లో ఈ అంశానికి తగిన ప్రాధాన్యం లభించగలదని ఆశిద్దాం.
(భండారు శ్రీనివాస రావు - పదమూడు నవంబర్ )

విందామయా నరుడ విందామయా - భండారు శ్రీనివాస రావు

విందామయా నరుడ విందామయా - భండారు శ్రీనివాస రావు

చిన్నప్పుడు చదివిన ముళ్ళపూడి వారి జోక్ గుర్తొస్తోంది.
"పెళ్ళయిన కొత్తల్లో పెళ్ళాం మాట మొగుడు వింటాడట.
తరవాత్తరవాత - మొగుడి మాట పెళ్ళాం వింటుందట.
పొతే, ఆ తరవాత మాత్రం - ఆ ఇద్దరి మాటలు ఇరుగూ పొరుగూ వింటారట."

ఈ వినడం అన్నది చెవికి సంబంధించిన విషయం. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తే పోలా - అనే చెవలాయిలు- వినదగునెవ్వరు చెప్పిన అని- ఎవరేది చెప్పినా చెవులు రెండూ వొగ్గించి, రిక్కించి మరీ వింటారు.

కొందరు భార్యలు - " నా (మా) మొగుడు నా (మా) మాట వింటాడు " అన్న తృప్తిలో అన్ని అసంతృప్తులు మరచిపోతుంటారు. మగవాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి, మాట వినే పెళ్ళాం దొరికిందని బయట చెప్పుకుంటూ, మురిసి ముక్కచెక్కలవుతూ మగధీరులమని మీసం మెలేస్తుంటారు.

వినికిడి సమస్య అంటూ లేకపోతె, ఈ వినకపోవడం అన్న ప్రసక్తే వుండదు. ఆ సమస్య వుంటే ఈ వినే సమస్యకు తావుండదు. ఎంచక్కా, ఎవరేం చెబుతున్నా వింటున్న ఫోజు పెట్టి- చెప్పేవాళ్ళ నోటి దురద వొదిలించవచ్చు.
విని, తలాడించే అలవాటు మగవాళ్ళలో ముఖ్యంగా పెళ్ళయిన వాళ్లలో ఎక్కువన్న థియరీ ఒకటుంది. ఈ బాపతు మగాళ్ళు ఆ బాపతు అపప్రధ వొదిలించుకోవడానికి ఆదర్శ పురుషుల అవతారం ఎత్తుతుంటారు. " భార్య మాట వింటే తప్పేమిటి? ఆవిడా మనలాంటి మనిషే కదా." అంటూ తమకి తాము సర్ది చెప్పుకుంటారు.

కాగా మరో రకం మగాళ్ళు- తమ మగాడితనాన్ని - వేరే రకంగా ప్రదర్శిస్తుంటారు.

" నన్నడిగితే అసలు మగాళ్ళ మాటల్ని ఆడవాళ్ళు వినకపోవడమే కాదు, ఎదిరించమని కూడా చెబుతాను. నా విషయమే తీసుకోండి. మామూలుగా మొగుళ్ళు రాగానే భార్యలు లేచినిలబడడం ఆనవాయితీ కదా. మా ఇంట్లో అలా కాదు. నేను బయట నుంచి రాగానే మా ఆవిడ లేచి నిలబడబోతుంది. పరవాలేదు కూర్చో అంటాను. నా మాట వినొద్దన్నది మా ఇంట్లో నా రూలు కాబట్టి లేచి నిలబడుతుంది. చూసారా! అదీ నేను నా భార్య కిస్తున్న స్వేఛ్చ." అంటుంటారు ఈ కోవలోకి వచ్చే మొగుళ్ళు.

బొత్తిగా మాట వినని జనం -జనాభాలో ఎక్కువ. వీళ్ళని 'సీతయ్యలు' అంటారని కూడా ఈ మధ్యనే తెలిసింది - ఓ సినిమా పుణ్యమా అని.

పొతే,వినడం వినకపోవడం అన్న రూట్లో ముందుకుపోయే పని కాసేపు పక్కనపెడదాం.

హైదరాబాద్ ఆలిండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ గా పనిచేసిన శ్రీ పీ ఎస్ గోపాల కృష్ణ -'విన్నవింత' అనే శీర్షికతో రేడియో లో ఒక కార్యక్రమం కొన్నాళ్ళు నడిపారు. విన్న వింతలను శ్రోతలతో పంచుకోవడం రచయిత ఉద్దేశ్యం. అయితే వినేవారికి పెద్దపీట వేసే పెద్ద మనసు వున్నవాడు కనుక, విన్నవించుకోవడం అనే అర్థంతో దానికి "విన్నవింత" అని పేరు పెట్టారు.

మా బోటి రేడియోలో పనిచేసిన వాళ్లకి వినే వాళ్ళే 'దేవుళ్ళు' కాబట్టి , పొద్దునపూట వచ్చే ఆ ప్రోగ్రాం వాళ్ళకో 'నివేదన' గా భావించే వాళ్ళం. ఆయన చెప్పే వన్నీ మంచి విషయాలే కాబట్టి , ఆ రోజుల్లో శ్రోతలు కూడా మంచి సంగతులు వినే బాపతు కాబట్టి- ఆయన కూడా రకరకాల పనికొచ్చే కబుర్లతో దాన్ని తీర్చిదిద్దేవారు.(ఇన్ని కా'బట్టీలు' అవసరమా అంటే- ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పకపోతే రేడియో వాళ్లకి తెలుగు రాదు అని అపోహపడే ప్రమాదం సయితం లేకపోనూ లేదు) . శ్రోతలు కూడా 'రేడియోలోచెప్పడమేమిటి? మనం వినడమేమిటి?' అని భేషజాలకు పోకుండా బుద్దిగా వినేవారు. ఆ విధంగా చెప్పేవారికి వినేవారు, వినేవారికి చెప్పేవారు లేరనే కరువు లేకుండా పోయింది. ఆ మాటకు వస్తే ఆ రోజుల్లో రేడియోలో ఇలాంటి చక్కటి కార్యక్రమాలు ఎన్నో వినేవాళ్ళం అని గుర్తు చేసుకునే ఆనాటి శ్రోతలు ఈ రోజుల్లో కూడా తారసపడడం కద్దు.
మళ్ళీ అసలు సంగతికొస్తే-
'వినంగానే సరిపోదు- విన్నది ఆచరించాలనీ - అప్పుడే విన్నదానికి సార్ధకత' అనే వాళ్ళున్నారు.
'ఒరేయ్ కన్నా! మోటార్ సైకిల్ పై అంత స్పీడ్ గా వెళ్లకురా!' అని తండ్రి అంటే- పిల్లాడు విన్నట్టుగా తలాడిస్తే - నిజానికి అది వినడం కిందికి లెక్క రాదు.
విని పాటించినప్పుడే - 'రాముడు మంచి బాలుడు, తలిదండ్రుల మాట జవదాటడు' అని కన్నవాళ్ళు - వినే వాళ్లకు చెప్పుకునే వీలుంటుంది.

వినడంలో ఇంత విషయం వుంది కాబట్టే- నోములు, వ్రతాలు చేసేటప్పుడు వ్రత కధలు విన్నవాళ్ళకు కూడా 'వ్రత ఫలం' లో భాగం కల్పించారని - సూతుడు శౌనకాది మునులకు చెప్పగా-అది విన్నవాళ్ళలో ఒకడు తెలియచేయడమైనదని సర్వజనులకు ఇందుమూలముగా తెలియపరచడమైనది.



------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------