25, డిసెంబర్ 2009, శుక్రవారం

వార్త - వ్యాఖ్య



ఎన్నికల ముందు - ఎన్నికల తర్వాత



- భండారు శ్రీనివాసరావు









నలభై ఏళ్ళ క్రితం పత్రికల్లో జీవన్ టోన్ ప్రకటనలు విరివిగా దర్శనమిచ్చేవి. ఆ టానిక్ తీసుకోకముందూ - తీసుకున్న తర్వాత దేహ సౌష్టవం ఎలా మారిపోతుందన్న విషయాన్ని ఫోటోలతో సహా వివరించేవి. ఇప్పుడు ఎన్నికల ముందూ - తర్వాత రాజకీయ పార్టీల్లో కానవస్తున్న గుణాత్మక మార్పు వాటిని గుర్తుకు తెస్తోంది.



ఎన్నికల ప్రక్రియ ముగిసి, రెండోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన తర్వాత రాజశేఖరరెడ్డి వ్యవహార శైలి పుర్తిగా మారిపోయిందన్న భావం వచ్చే వార్తా కథనాలు గత కొద్ది రోజులుగా వెలువడుతున్నాయి. శాసన సభ స్పీకర్ ఎంపిక నుంచి మొదలు పెట్తి, బోగస్ రేషన్ కార్డుల ఏరివేత, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లులో మారిన ముఖ్యమంత్రి స్వరం - ఇత్యాది ఉదాహరణలతో, ఓడమల్లయ్య - బోడిమల్లయ్య వంటి సామెతలను ఉటంకిస్తూ అనేక విమర్శలు, ప్రతిపక్షాల నోటి నుంచే కాకుండా, పత్రికా వ్యాసాల ద్వారా వెలువడుతూ ఉండటం చూస్తే- ’ఎవ్వరూ మారలేదు’ అన్న సత్యం బోధపడుతుంది.



ఎన్నికల ముందు ఏ పార్టికయినా ప్రధమలక్ష్యం గెలుపు సాధించడం. దానికోసం అనేకరకాల వ్యూహాలను రచిస్తారు. ఎన్నో ఎత్తుగడలు వేస్తారు. ప్రలోభపెట్టే ప్రసంగాలు చేస్తారు. ఊరించే హామీలు గుప్పిస్తారు ఇందుకు ఎవరూ మినహాయింపు కాదన్నది అందరికీ తెలిసిందే.



అంతవరకూ, ఇదంతా ‘రాజకీయం’ అన్నది పార్టీల ప్రగాఢ విశ్వాసం. ఇక ఆ తర్వాత - ఓడిపోయిన వారికి పోయేదేమీలేదు. గెలవలేక పోయామే అన్న చింత తప్ప చిక్కులూ, ఇక్కట్లూ గెలిచి కూర్చున్న వారికే. ఇక అప్పుడు రాజకీయం తప్పుకుంటుంది. రాజనీతిజ్ఠత తెరపైకి వస్తుంది. ఇప్పుడు రాజశేఖరరెడ్డిలో పత్రికలకు కానవస్తున్న ‘మార్పు’లోని పరమార్ధం ఇదే.



మొన్న మొన్నటి వరకూ - ఎన్నికల సమరంలో వై.ఎస్. - తన పార్టీని ముందునుండి నడిపించారు. సామ, దాన్, బేధ, దండోపాయాల వంటి సమస్త అవకశాలను, ఏ ఒక్క దానిని వదిలిపెట్టకుండా విజయాన్ని సాధించాలన్న ఏకైక ధ్యేయంతో పనిచేసి, ప్రచారం చేసి అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నారు. ఇక ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపించే గురుతర బాధ్యత ఆయన భుజస్కంధాలపై ఉంది. ఖజానా ఖాళీ అయ్యిందనీ, నిధులలేమి నిజ స్వరూపం ప్రదర్శిస్తోందని మళ్ళీ అవే పత్రికలు రాస్తున్న రాతల్నే ప్రాతిపదికగా తీసుకుంటే రాష్ట్ర రధసారధి బాధ్యత ఇంకా ఎంత పెరిగిందో అవగతమవుతుంది. అదృష్టవశాత్తూ మిగిలిన పార్టీలతో పోటీపడి అనవసర ఎన్నికల వాగ్దానాలు శ్రుతిమించి చేయకపోవడం గుడ్దిలో మెల్ల.



తొలివిజయం ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. మలి విజయం అహంకారాన్ని అందిస్తుందంటారు..పరిమితులను మించిన అధికారం పెడత్రోవల వైపు నడిపిస్తుందని కూడా అంటారు. వ్యక్తిత్వానికి అసలు సిసలు పరీక్ష ఈ స్థితిలోనే ఎదురవుతుంది. ఎదురొడ్డి నెగ్గినవారు నేతగా నిలబడతారు. జనం గుండెల్లో కలకాలం నిలిచిపోతారు.



ముఖ్హ్యమంత్రిగా తొలి ఐదేళ్ళలో రాజశేఖర రెడ్డి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఎన్నో పథకాలు తలపెట్టారు. సాధ్యాసాధ్యాలను లెక్కించకుండా ప్రాజెక్టులు ప్రారంభించారు. సమాజంలోని ఏ ఒక్క వర్గాన్ని విస్మరించకుండా అందరికీ అన్ని మేళ్ళు చేయాలన్న ఉదార సదాశయంతో పనిచేశారు. వాటిల్లో కొన్ని జరిగాయి, మరికొన్ని అసంపూర్తిగా మిగిలాయి, మరికొన్నింటిని అమలులో చిత్త శుద్ధి లోపించింది. ఇవన్నీ సాకల్యంగా ఎరిగున్న మనిషి కనుకనే కలెక్టర్లతో మాట్లాడిన మాటల్లో - ఆయన మనసులోని మాటలు బయటకు వచ్చాయి.



‘రాజకీయాలన్నవి ఎన్నికల వరకే, ఆ తరువాత ఆలోచన అంతా అభివృధిపైనే’ అనే ఉవాచ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిదే కాబట్టి, కొత్త ప్రభుత్వం తన పాత పథకాలను పటిష్టంగా అమలుచేయడానికి వీలుగా కొంత వ్యవధి ఇచ్చి చూడడం ఆయన విధి.



టీడీపీ ఆలోచనా ధోరణి కూడా ఇదే విధంగా ఉందన్నట్లు వచ్చిన వార్తల్లో నిజం ఉంటే అంతకంటే కావల్సింది ఏమీ లేదు. గెలుపోటములను ఒకే రీతిన జీర్ణించుకోగల స్థిత ప్రజ్ణత రాజకీయాల్లో కొరవడినప్పుడే ఇబ్బందులు తలెత్తుతాయి.



పదమూడవ శాసనసభ సమావేశాల తొలి రోజుల తీరుతెన్నులను గమనించిన వారికి ‘కొత్త సీసాలో పాత సారా’ సామెత గుర్తుకురావడంలో ఆశ్చర్యం లేదు. స్పీకర్ గా కిరణ్ కుమార్ రెడ్ది ఎన్నిక తదనంతర పర్యవసానాలు చూస్తే, భవిష్యత్తు పట్ల నిరాశే కలుగుతుంది. టీడీపీ ఉపనాయకుడు అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ ‘ఈ అయిదేళ్ళూ ఇంతేనా’ అని నిర్వేదం ప్రకటించారు. కానీ, తమ వైఖరి కూడా చూసేవారికి అదే నిర్వేదం కలిగించిందన్న వాస్తవాన్ని అర్ధంచేసుకున్న దాఖలా కానరాలేదు.



మారామని చెప్పుకోవడం వేరు, మారినట్లు కానరావాలి కూడా అప్పుడే రాజకీయం సమూలంగా మారిపోతుంది.

కామెంట్‌లు లేవు: