29, డిసెంబర్ 2009, మంగళవారం

అభివృద్ధి - ఆరోపణలు - భండారు శ్రీనివాసరావు

అభివృద్ధి - ఆరోపణలు - భండారు శ్రీనివాసరావు

` ఖమ్మం జిల్లాలోని ప్రాజెక్టుల్లో ఏ రాయినడిగినా, రప్పనడిగినా నా పేరే చెబుతుంది ' అనేవారు కీర్తి శేషులు, మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు.

జలగం
 తన జిల్లాకు తాను చేసిన అభివృద్ధి గురించి చెప్పేటప్పుడు ఆయన మాటల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. ` జిల్లాలో జనం తినే ప్రతి బియ్యపు గింజ మీదా నా పేరే రాసుంటుంది' అని కూడా అంటుండే వారు - సాగర్‌ ఎడమ కాలువని ఖమ్మం జిల్లా మీదుగా మళ్ళించిన ఘనత తనదేనని చెప్పే సందర్భాల్లో.

ప్రాజెక్టులను, పథకాలను మంజూరు చేసే అధికారం కలిగిన వాళ్ళు - తమ తమ ప్రాంతాలకు పెద్దపీట వెయ్యడం అన్నది విడ్డూరమేమీ కాదు. కేంద్రప్రభుత్వంలో ` అధికార చక్రం తిప్పే తమిళనాడు అధికారులూ ' మంత్రులూ, తమ రాష్ట్రానికి మేలు చేసే విషయంలో కులమతాలు, పార్టీ విభేదాలనూ పక్కన పెడతారనే సంగతి అందరికీ తెలిసిందే.రాష్ట్రానికి ముఖ్యమంత్రో, దేశానికి ప్రధానమంత్రో అయినంత మాత్రాన, సొంతూరు గురించి, సొంతమనుషుల గురించీ పట్టించుకోకూడదనడం ఏం ధర్మం?

చంద్రబాబు
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన నియోజకవర్గం కుప్పం అభివృద్ధి విషయంలో ప్రత్యే శ్రద్ధ కనబరిచి ఎంతో కృషి చేశారు. చిత్తూరు జిల్లాలో వెనకబడ్డ ప్రాంతం అయిన కుప్పంలో ఇజ్రాయెల్‌ తరహా ప్రాజెక్టుని అమలు చేసి, అక్కడి రైతాంగాన్ని అభివృద్ధిపధంలో నడిపించారు. అలాగే, రాష్ట్రానికి ముఖ్యమంత్రులయిన వారందరూ తాము అధికారంలో ఉన్నప్పుడు తమ తమ ప్రాంతాలకు తగిన రీతిలో అభివృద్ధి ఫలాలను అందించే విషయంలో ఇతోధికంగా శ్రమించినవారే.

వైఎస్ఆర్
ఇప్పుడు కడప జిల్లాలో, పులివెందుల ప్రాంతానికీ రాజశేఖరరెడ్డి చేస్తున్నదదే!
దేశానికి రాజయినా, తల్లికి కొడుకే అన్నట్టు - ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంతి అయినా తాము ముందు జవాబుదారీగా ఉండాల్సింది తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గ ప్రజలకే! అందుకోసమే రాజు తలచుకుంటే రోడ్లకు కొదవా అనే రీతిలో పులివెందులలో నాలుగులేన్ల రహదారి నిర్మాణానికి అధికారులు ఆఘమేఘాలమీద అనుమతులిచ్చారంటూ చేస్తున్న విమర్శలు అర్ధరహితం అని చెప్పాల్సివస్తోంది. అయితే రాష్ర్టంలో ఉప ఎన్నికలు రగిలిస్తున్న వేడిలో అగ్నికి మరింత ఆజ్యం పోయడానికి ఇలాంటి విమర్శలు వెలువడడం కూడా సహజమే. వేసవి సెగలతో రాష్ట్రం నిప్పులకొలిమిలా మారుతున్న సమయంలో వచ్చిపడ్డ ఈ ఎన్నికలు అన్ని పార్టీలకీ అగ్ని పరీక్షగా తయారయ్యాయి. భగభగమండే ఎండల్లో ఎన్నికల ప్రచారం తలకు మించిన భారం అయినా నాయకులకూ, వారి అనుచరగణానికీ తిప్పలు తప్పడం లేదు.
పెళ్ళానికి జీతం, నడిచేవాడికి దూరం చెప్పకూడదన్న పద్ధతిలో వాతావరణ శాఖ వారు కూడా ఏ రోజుకారోజు అ వేసవి తాపం మరో రెండు రోజులే అని నెట్టుకొస్తున్నారు. నిండు వేసవిని పండు వెన్నెలగా భావిస్తూ సాగిస్తున్న ఈ ఎన్నికల ప్రచారాల తీరు తెన్నులు గమనిస్తుంటే నా చిన్ననాటి స్నేహితుడు జ్ఞాపకం వస్తున్నాడు. అతడు ఏడాది పొడుగునా, సినిమాలు, షికార్లంటూ జల్సాగా తిరిగేవాడు. పరీక్షలు దగ్గరపడే సరికల్లా పుస్తకాలు ముందేసుకుని టీలు తాగి - నైటౌట్లు చేసి ప్రశ్నలూ, జవాబులు భట్టీయం వేసి ఫస్టుమార్కులతో పాసయ్యేవాడు. అక్కడ్నించి షరా మామూలే! పరీక్షలు వచ్చేవరకూ మళ్ళీ పుస్తకాల మొఖం చూసేవాడు కాదు.

note : all images in this blog are copy righted to respective owners

కామెంట్‌లు లేవు: