26, డిసెంబర్ 2009, శనివారం

గుబులు పుట్టిస్తున్న ఉప ఎన్నికలు - భండారు శ్రీనివాసరావు

ఏమి సేతురా లింగా !

ముని  మంత్రంబు నొసంగ నేల? 
నొసగె బో -
మున్ముందు మార్తాండు రమ్మని నేకోరగానేల?
కోరితిని బో -
అతండు రానేల?
వచ్చెను బో -
కన్నియనంచు నెంచక నను చేపట్టగా నేల?
పట్టెను బో -
పట్టి నొసంగ నేల?
అడుగంటెన్‌ కదా! కుంతి సౌభాగ్యముల్‌!


                                           
కరుణశ్రీ పద్య రూపంలో పలికించిన ` కుంతీ విలాపం' మాదిరిగా ఉంది నేడు రాష్ట్రంలో ఉప ఎన్నికల నేపధ్యంలో వివిధ పార్టీల పరిస్థితి.
గెలిచి తీరతాం! అన్న ధీమా కాస్తా
గెలవకపోతామా! అన్న ఆశగా మారి
గెలుస్తామా! అన్న సంశయ రూపం ధరిస్తే -
మిగిలేది కుంతీ విలాపమే!

కోరిన వరాలిచ్చు కొండంత దేవుళ్ళలాంటి వాళ్ళు  కాదు ఓటర్లు.  వాళ్ళ నాడి కనిపెట్టడం రాజకీయ పార్టీలను పుట్టించిన బ్రహ్మదేవుడి తరం కూడా కాదు. వాళ్ళ మూడ్‌ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అలాగని గాలి వాటం కాదు. సమయం వచ్చినప్పుడు కీలెరిగి వాత పెట్టడంలో వారికి వారే సాటి. ఈ పాటి వాస్తవం ఎరగబట్టే పార్టీ నేతల్లో ఇంత గుబులు.

ఆవిరయ్యే హామీలు 

రాష్ట్రం అగ్ని గుండంగా మారి, వేసవితాపం, భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరిగిపోతున్న సమయంలో ఉప ఎన్నికల వేడితోడయి జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రధాన పార్టీలు ఎడాపెడా కురిపిస్తున్న హామీల వర్షాలు కూడా వారితాపాన్ని తీర్చలేకపోతున్నాయి. ఉపశమనాన్ని కలిగించలేకపోతున్నాయి.

ఇక పార్టీలు, పార్టీల నేతలు, ఉపనేతలు, కార్యకర్తల పరిస్థితి మరీ ఘోరం. మండు వేసవిలో వచ్చిపడ్డ ఈ ఉప ఎన్నికలు నిజంగా వారి పాలిట అగ్ని పరీక్షగా తయారయ్యాయి. కరెంటు కోతలు, ఉక్కపోతల నడుమ పరీక్షలు రాసే విద్యార్ధుల మాదిరిగా ఉంది వారి పరిస్థితి.
పైకి ఎంత ధీమాగా ఉన్నా -  బింకంగా కనబడ్డా -
` ఎందుకొచ్చిన ఎన్నికలు రా' అన్న బాధ వారి మనసులను ఏదో మూల తొలుస్తూనే వుండాలి!
ఇది ఇలా ఎందుకు జరిగింది? అన్న ప్రశ్న  ఎంత స్వాభావికమైనదో -
అలా జరిగి వుంటే - ఇలా జరిగేది కాదేమో అన్న భావన కూడా అంత స్వాభావికమైనదే?
`` ఆ నాడు సర్కారు ఎక్‌‌సప్రెస్‌ లేటుగా వచ్చి - మీరు పెళ్ళి చూపులకు ఆలస్యంగా వచ్చివుంటే - మా నాన్న ఎంచక్కా నాకు ఆ భీమవరం సంబంధమే ఖాయం చేసివుండేవాడు' అన్నదట ఓ ఇల్లాలు శోభనం రోజున కట్టుకున్న మొగుడితో.
అలాగే - భవనం వెంట్రామ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు, తన స్నేహితుడు ఎన్‌. టీ. రామారావుని రాజభవన్‌కు ఆహ్వానించకపోయి ఉంటే - వెంట్రామ్‌ సలహా మేరకు రామారావుకు కాంగ్రెస్‌ అధిష్టానం రాజ్యసభ సభ్యత్వం ఇచ్చివుంటే - అసలు తెలుగుదేశం పార్టీ పుట్టేదే కాదన్నాడొక రాజకీయ విశ్లేషకుడు.
మరో విశ్లేషకుడు మరో అడుగుముందుకువేసి - డిప్యూటీ స్పీకర్‌కు బదులుగా - చంద్రశేఖరరావుకు చంద్రబాబు తన మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉంటే తెలంగాణా రాష్ట్ర సమితి ఉండేదే కాదు. ఈ ఉప ఎన్నికలు వచ్చేవే కావు పొమ్మన్నాడు.
అందుకే మన జనం వేదాంతాన్ని నమ్ముకున్నది
కానున్నది కాకమానదు. కానిది కానే కాదు.


భండారు శ్రీనివాసరావు
జయీ భవ! దిగ్విజయీభవ

గత మూడు దశాబ్దాల కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల చరిత్రను వై ఎస్సా ర్‌ తిరగరాస్తున్నారు. నాలుగేళ్ళ పదవీకాలాన్ని విజయవంతంగా ఈ నెలలో పూర్తి చేసుకుని అయిదో ఏట అడుగుపెడుతున్నారు. ఏ విధంగా చూసినా - రాజశేఖరరెడ్డిది ఒక రికార్డే. 48 నెలల్లో ఎన్ని పథకాలు? ఎన్ని ప్రణాళికలు? ఎన్ని ప్రాజెక్టులు?
అధికార యంత్రాంగాన్ని ఊపిరి సలపనివ్వకుండా అమలు చేస్తున్న పథకాల తీరుతెన్నులు గమనించిన వారికి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల్లో రాజశేఖరరెడ్డి విశిష్టత బోధపడుతుంది. ఎన్నికల హామీలను అమలు పరచడమే కాకుండా - ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలను గమనిస్తూ - కొత్త ఆలోచనలకు రూపం కల్పిస్తూ ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్న తీరు హర్షనీయం! అభినందనీయం!
అందుకే అంటున్నారు జనం
రాజశేఖరా ! నీపై మోజుతీరలేదురా !!

( జూన్ - 2008 )

కామెంట్‌లు లేవు: