27, డిసెంబర్ 2009, ఆదివారం

చిక్కు సమస్యలు - చిరు పరిష్కారాలు

వార్త - వ్యాఖ్య


చిక్కు సమస్యలు - చిరు పరిష్కారాలు

- భండారు శ్రీనివాసరావు

యాభయ్ ఏళ్ళక్రితానికి - ఇప్పటికీ కొట్టొచ్చినట్టు కనబడే మార్పు ఏమిటి? అని అడిగితే - ఆ రోజుల్లో సినిమా హాళ్ళలో చుట్ట - బీడీ సిగరెట్లు తాగేవారు - ఇప్పుడది లేదని - ఆరు పదులు వయసు దాటిన వారెవరైనా జవాబు చెబుతారు.


అప్పటికీ - ఇప్పటికీ పొగత్రాగేవారి సంఖ్య తగ్గిందా అంటే అదీ లేదు. సినిమా హాల్లో సిగరెట్ తాగితే జరిమానా వేస్తామని బెదిరించారా అంటే అదీ లేదు. అన్ని సినిమా హాళ్ళ వద్ద ప్రత్యేక సిబ్బందిని నియమించి కట్టుదిట్టం చేశారా అని ప్రశ్నించుకుంటే లేదనే సమాధానం వస్తుంది. పొగరాయుళ్ళను పట్టుకుని కౌన్సిలింగ్లూ గట్రా నిర్వహించారా అంటే అదీ లేదు. ప్రేక్షకులతో సమావేశాలు ఏర్పాటు చేసి పొగత్రాగవద్దని క్లాసులు తీసుకున్నారా అంటే ఆ దాఖలాలూ లేవు. మరి పొగత్రాగందే పట్టుమని పది నిమిషాలు ఓపలేని ధూమపాన ప్రియులు సిగరెట్ల జోలికి పోకుండా సినిమాలు ఎలా చూస్తున్నారు?

ఈ ప్రశ్నకి సమాధానం ఒక్కటే. ప్రజల్లో ఓ సుగుణం ఉంది. అది చూసి నేర్చుకోవడం. డేరా టూరింగ్ టాకీసులూ,రేకుల సినిమా హాళ్ళ కాలం ముగిసి ఎయిర్ కండిషన్ థియేటర్ల కాలం మొదలు కాగానే సినిమా హాళ్ళలో పొగత్రాగడం మంచిది కాదని పక్క వాళ్ళని గమనిస్తూ ఎవరికి వారే తెలుసుకున్నారు. ఈ సూత్రాన్నే ట్రాఫిక్ అధికారులు గమనించి అమలు చేస్తే సమస్యలకు సగం పరిష్కారం లభిస్తుంది. లేని పక్షంలో - ఒక దినపత్రిక పేర్కొన్నట్టు -" సమస్యమీదే - పరిష్కారం మీదే మేం నిమిత్త మాత్రులం - ఇదీ ట్రాఫిక్ పోలీసుల వరుస" అనే విమర్శల తాకిడిని తట్టుకోక తప్పదు.

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ని చక్కదిద్దడం అన్నది ఆషామాషీ వ్యవహారం కాదు. కాకపోతే , అందుకోసం తీసుకుంటున్న చర్యలేమిటన్నదే జవాబు లేని-  రాని ప్రశ్న.  

 ట్రాఫిక్ అంశాలపై ఏర్పాటు చేసిన సదస్సులు - సమావేశాల్లో పౌరులు ఏదయినా చెప్పబోతే `సమస్యలు చెప్పమంటే, సలహాలు చెబుతున్నారని' కొందరు అధికారులు విరుచుకు పడిన తీరు గమనిస్తే వారి అసహన వైఖరి తేటతెల్లమవుతుంది. అవగాహన కల్పించే తీరు సరిగా లేదేమో అనిపిస్తుంది. కొన్ని కొన్ని చిన్న చిన్న చర్యలతో సమస్యకు పరిష్కారం లభిస్తుందేమో ప్రయత్నించి చూడడంలో తప్పేమీ లేదని వారు గ్రహించాలి. అన్నింటికంటే ముందు చేయాల్సింది - ట్రాఫిక్ అధికారులు తమ ప్రాధాన్యతలను నిర్ధారించుకోవడం. హెల్మెట్లు, సీటు బెల్టులవంటి నిబంధనల అమలుకు తీసుకుంటున్న శ్రద్ధని - కొంతకాలం పాటయినా - ట్రాఫిక్ని చక్కదిద్దడానికి మరల్చాలి. ఎక్కడ - ఏ సమయంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందో అధ్యయనం చేసి అందుకు తగ్గట్టుగా అదనపు సిబ్బందిని - ఆయా కూడళ్ళలో - అవుట్ సోర్సింగ్ పద్ధతిపై నియమించాలి. ఈ సిబ్బంది కయ్యే ఖర్చుని ఆయా కూడళ్ళ చుట్టు పక్కల ఉండే దుకాణాలు, నివాస సముదాయాలనుంచి పారదర్శక పద్ధతిలో వసూలు చేయాలి.రోడ్లు దాటడానికి రాజధాని నగరంలో అనేక చోట్ల ఫుట్ వోవర్ బ్రిడ్జీలు నిర్మించారు. ప్రకటనలకు మినహా - వాటిని జనం ఉపయోగిస్తున్న దాఖలాలు లేవు. స్త్రీ, బాల, వృద్ధులు ఆ వంతెనలు ఎక్కలేరు. ఎక్కగలిగిన వారు, ఎక్కనే ఎక్కరు. అందువల్ల వాటిని మరింత ఉపయోగంలోకి తీసుకురావడానికి వాటికి లిఫ్టులు అమర్చాలి. అందుకయ్యే వ్యయాన్ని కొద్ది కొద్దిగా వినియోగదారుల నుంచి రుసుము రూపంలో రాబట్టుకోవాలి. ఇలాటి  ఏర్పాట్లకి వీలులేనిచోట్ల ప్రత్యామ్నాయాలు పరిశీలించాలి. అనేక  రద్దీ కూడళ్ల వద్ద రోడ్డుదాటలేక అవస్తలు పడేవారు అనేకమంది కనిపిస్తుంటారు. భవసాగరం కంటే రోడ్డు దాటడమే కష్టంగా భావిస్తుంటారు.ఇలాటి సంగతి పట్టించుకునే నాధుడు కనబడడు.  బాగా అభివృద్ధిచెందిన ప్రపంచ నగరాలలో అయితే, రోడ్డుదాటడానికి  పుష్ బటన్ వ్యవస్తలు వుంటాయి. రోడ్డుపక్కన వున్న పుష్ బటన్ నొక్కగానే రోడ్డు క్రాస్ చేయడానికి వీలుగా దీపం వెలుగుతుంది. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోతాయి.

 లేదా విద్యుత్ తో కూడా పని లేకుండా - జండాలను ఉపయోగించే ఒక విధానం అమల్లోవుంది. అదేమిటంటే- రోడ్డుకు ఇరువైపులా బాస్కేట్లలో కొన్ని జండాలను ఉంచుతారు. రోడ్డుదాటాలనుకునేవారు ఆ జండాను తీసుకుని ఊపుకుంటూ వెళ్లిపోవచ్చు. రోడ్డుదాటిన తరవాత అవతలవైపు వున్న బాస్కేట్లో వుంచి తమదారిన వెళ్లిపోవచ్చు.
అలాగే,       
ప్రైవేటు విద్యా సంస్థల వద్ద నిర్మించిన వంతెనల పూర్తి వ్యయాన్ని ఆ సంస్థల నుంచే వసూలు చేయాలి. విద్యార్ధుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు పిండుతున్న ఆ సంస్ధలకి ఇదేమంత పెద్దభారం కాబోదు.

థియేటర్లు, పాఠశాలలు, ఆఫీసుల వేళల్లో తగుమార్పులు చేయడం ద్వారా, ఒకే సమయంలో, ప్రజలు, వాహనాలు భారీ సంఖ్యలో రోడ్ల మీదకు రాకుండా నియంత్రించడం వీలుపడుతుంది.

కనిపించిన చోటల్లా `నోపార్కింగ్' బోర్డులు పెట్టకుండా   పార్కింగ్ కి  అనువయిన స్ధలాలని ముందుగా గుర్తించాలి. పోలీసు వాహనాలు `నోపార్కింగ్' ప్రదేశాల్లో నిలపకుండా చూడాలి.
ప్రయివేటు బస్సులని ఎలాగూ  అదుపు చేయలేరు కనుక - రాత్రి సమయాలల్లో కొన్ని కొన్ని విద్యాసంస్తలకున్న ఖాళీ జాగాలలో ప్రయాణీకులను  ఎక్కించుకునేందుకు అనుమతి ఇవ్వాలి. ఇందుకోసం వసూలు చేసే రుసుముని ఆయా విద్యా సంస్తలకే ఇవ్వాలి. ఇలాచేయడంవల్ల అనేక ప్రాంతాలలో రాత్రివేళల్లో ట్రాఫిక్ జామ్స్ తగ్గిపోతాయి.      

స్కూళ్ళకీ, ఆఫీసులకీ వెళ్ళే బిజీ సమయాల్లో చెకింగ్లు జరిపే పద్ధతికి స్వస్తి చెప్పాలి. సిగ్నల్ జంపింగ్ చేసే వాహనదారులను పట్టుకుని భారీ జరిమానాలు విధించాలి. రద్దీ సమయాలని దృష్టిలో పెట్టుకుని ` వీ ఐ పీ ' ల పర్యటనల వేళల్లో మార్పు చేయాలి.

ఇవన్నీ చేసినా, సమస్య నూటికి నూరుపాళ్లు  పరిష్కారం కాకపోవచ్చు. కానీ పరిస్థితి కొంతలో కొంత మెరుగు పడడానికీ , పోలీసుల పట్ల ప్రజలకున్న అవగాహన, అభిప్రాయాల్లో సానుకూల మార్పు రావడానికే ఈ చర్యలు ఖచ్చితంగా దోహదం చేస్తాయి.


భండారు శ్రీనివాసరావు

302, మధుబన్

ఎల్లారెడ్డి గూడా

హైదరాబాద్ - 500073

సెల్ 98491 30595

మెయిల్ bhandarusr@yahoo.co.in