తెలంగాణా గురి మళ్ళీ తప్పుతోందా ?
ద్రోణాచార్యుడు కురు, పాండు కుమారులకు విలు విద్య పోటీ పెట్టాడు. చెట్టుపై పిట్టబొమ్మను పెట్టి పిట్ట కంటిని గురిపెట్టి కొట్టమన్నాడు. ముందుగా ధుర్యోధనాదులను పిలిచి బాణం ఎక్కుపెట్టి ఏం కనపడుతున్నదో చెప్పమన్నాడు.`చెట్టు చెట్టు కొమ్మలు కొమ్మలనడుమ పిట్టబొమ్మ కనపడుతున్నాయని' వారు సమాధానం చెప్పారు.
ద్రోణుడు అర్జునుని పిలిచి అదే ప్రశ్న అడిగాడు. `పిట్ట కన్ను మాత్రమే కనపడుతోందని' కిరీటి జవాబిచ్చాడు. లక్ష్యం పట్ల గురి ఎలా ఉండాలో తెలియ చెప్పడానికి ఈ కథ చెప్పేవాళ్ళు. అంటే లక్ష్య సాధనకు ఏకాగ్రత కావాలి. సాధించాల్సింది తప్ప మరో దానిపై మనసు మరల్చరాదు, అన్నది ఈ కథలోని నీతి. కానీ `తెలంగాణా రాష్ట్ర సాధన అనే ఉద్యమం ఏ మలుపు తిరుగుతోంది? `తెలంగాణా నా ప్రాణం తెలంగాణా రాష్ట్ర సాధనే నా ధ్యేయం' అనే నినాదంతో ఆవిర్భవించిన తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడైన చంద్రశేఖరరావు నోట `మహా కూటమితో కాంగ్రెస్ ఓటమి' అనే మాట ఎలా వచ్చింది? అంటే తెలంగాణా సాధన అన్న ప్రధాన లక్ష్యాన్ని కాంగ్రెస్ ఓటమి అనే ఉమ్మడి ధ్యేయం వెనక్కు నెట్టి వేసిందని అనుకోవాలా? కూటమిలోని మిగిలిన పార్టీలకు కాంగ్రెస్ ఓటమి ప్రధాన ధ్యేయం కావడానికి తప్పుపట్టాల్సింది ఏమీలేదు. కానీ తెలంగాణా అన్న ఏకైక లక్ష్యంతో ఏర్పాటైన తెలంగాణా రాష్ట్ర సమితి చేస్తున్నదేమిటి.
మహా కూటమిలోని మిగిలిన పార్టీల విషయం వేరు తెరాస పరిస్థితి వేరు. మహాకూటమో, మెగా కూటమో ఏదో ఒక కూటమి అవసరం వారి వారి రాజకీయ అవసరాల కోణం నుంచి చూస్తే ఒక తక్షణావసరం కావచ్చు కానీ, తెరాస దాని తీరు మార్చుకోకపోయినా, ప్రాధాన్యతల క్రమం మార్చుకోవడాన్ని తెలంగాణా అభిమానులు ఎలా జీర్ణించుకుంటారో అన్నది భవిష్యత్ తేలుస్తుంది.
సామ , దాన, భేద, దండోపాయాలతోనైనా సరే కార్యాన్ని సాధించాలనే సూత్రం తెలంగాణా సాధన లక్ష్యసాధనకు అన్వయింపచేయాలని చూడడం తగని పని. తెలంగాణా ప్రాంతంలోని అధిక సంఖ్యాకులకు ప్రత్యేకరాష్ట్రం పట్ల మక్కువ లేదన్న సంకేతాలను పంపే ప్రమాదం ఈ కూటములవల్ల కలిగే అవకాశం ఉంది. బహుశా, తెరాస నేతకు కూడా ఈ అంశం బోధపడే, `మహా కూటమితో కాంగ్రెస్ ఓటమి' అనేనినాదంతో అంతరంగాన్ని అవిష్కరించి ఉంటారు.
ఈ రోజున నిజానికి తెలంగాణా ఊసెత్తని పార్టీ అంటూ రాష్ట్రంలో కలికానికి కూడా కానరాదు. కానీ నాలుక తెలంగాణా అంటున్నా మనసులో మర్మం మరోటి ఉందన్న అనుమానం అందరికీ ఉంది. వేరే ఉద్దేశ్యాలను మనసులో ఉంచుకుని తెలంగాణా నామజపం చేసేవాళ్ల వల్లే తెలంగాణాకు ఎక్కువ ముప్పు పొంచి ఉంది. తెలంగాణా మేధావులు కూడా ఈ విషయంలో పెదవి విప్పకపోవడం విషాదకరం.
తెలంగాణా వాదులకూ, తెలంగాణా పేరుతో పబ్బం గడుపుకోవాలని చూసే తెలంగాణా రాజకీయ వాదులకూ నడుమ ఎంతో అంతరం ఉంది. 1969 నుంచి జరుగుతున్నది ఇదే. మహా కూటమి ఏర్పాటుతో ఇది పునరావృతం అయ్యే అవకాశాలు పెరిగాయి. అన్ని జండాలు కలుపుకుని రాజశేఖరరెడ్డిని గద్దె దింపాలన్న ఒకే ఒక ఎజెండాతో ముందుకు సాగే ఈ కూటమి కలలు ఫలించి కాంగ్రెస్ ఓటమి పాలయినా తెలంగాణా వస్తుందన్న గ్యారంటీ లేదు. కాంగ్రెస్ పరాజయం వల్ల మహా కూటమిలోని ఇతర పార్టీలకు లబ్ది చేకూరవచ్చునేమో కానీ, తెలంగాణా రాష్ర్ట సమితికి అదనంగా ఒకటో అరో సీట్లు పెరగడం మినహా ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ లక్ష్య దిశగా వొరిగేదేమీ ఉండదు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనపై మడమ తిప్పని పోరాటం చేయాలని తామంతా కలసి ప్రతిజ్ఞ చేశామని చంద్రశేఖర రావు చెప్పడాన్ని బట్టి చూస్తే ప్రత్యేక రాష్ట్ర లక్ష్యానికి ఎడం జరుగుతున్నట్లు ఎవరికైనా అనిపిస్తే అందుకు ఆయన అభ్యంతరం పెట్టకూడదు. మరోసారి మోసపోవడమే తెలంగాణాను నిజంగా కోరుకునే వారికి మిగిలిందా అని అనిపిస్తే కూడా తప్పు పట్టాల్సిన పనిలేదు. ఎవరు శ్రేయోభిలాషులు అన్నది తెలంగాణా వారే అర్ధంచేసుకుని ఆదరించాల్సి ఉంది. మరోసారి తప్పటడుగు పడితే కాలు కూడదీసుకోవడానికి కూడా వీలుండదు. ( ఫిబ్రవరి - 2009 )
1 కామెంట్:
శ్రీనివాసరావు గారు,
ఎలా వున్నారు? మీ బ్లాగ్ ఇప్పుడే కంటబడింది. చాలా తమాషాగా వుంది. మిమ్మల్ని ఇలా కలుసుకోవటం. ఇంకా మీ బ్లాగ్ చదవలేదు. చదివి మళ్ళీ కామెంట్ పెడతాను. నా బ్లాగ్ www.kalpanarentala.blogspot.com
కల్పనారెంటాల
కామెంట్‌ను పోస్ట్ చేయండి