24, డిసెంబర్ 2009, గురువారం

Kudos to Congress!

Kudos to Congress!







-Bhandaru Srinivasrao







The Congress high command has finally honored its promise that it made to people of Telangana. It has come in the form of a birthday ‘gift’ from none other than the UPA Chairperson and Congress President Sonia Gandhi. Like the midnight freedom to the country even the decision of the Congress high command indeed has come right close to the midnight on Wednesday, the December 9.







In fact, the Congress, which fought the 2004 assembly polls with Telangana Rashtra Samiti had promised its Chief K Chandrasekhara Rao that it would consider his demand for separate statehood at an appropriate time. And, Rao believed the Congress and also joined the Union cabinet of UPA government as Labour Minister. But, situation did not warrant the Congress to take a decision on Telangana as both the Left parties – the CPI and CPM extended the Congress-led minority UPA government at the Centre – were against smaller states. Added to this was the Lok Sabha having the CPM member, Mr Somnath Chatterjee, as the Speaker.







The CPM, time and again, expressed its opposition to any further disintegration of the country on the argument that the Indian Republic states were formed on linguistic basis. As a result, the Manmohan Singh headed Congress government was unable to fulfill its promise made to the TRS chief. On the other hand, the helpless TRS leader kept on giving dates to his supporters of the possible announcement from the UPA government. When he realized the Congress helplessness, he decided to call ‘quits’, first asking his colleagues in Andhra Pradesh legislative assembly to resign and later following suit.







He not only proved a point by re-seeking entry into parliament from the same Karimnagar parliament constituency and winning with handsome majority. Yet, he appears to have been faltered in case of his colleagues in the state assembly. Ironically, the party suffered humiliating defeat not only facing split before the bypolls, but also in its outcome. The party was split into two after the 2004 elections with only 14 of the 27 elected members decided to ‘stick’ with Rao and resign to contest bypolls. Even in the bypolls, KCR led group suffered further humiliation as only seven of the 14 returned to the state assembly.







But, unrelenting Rao did not leave his path for separate statehood and kept on putting pressure on the Congress-led UPA government at the Centre. In 2009 elections, he decided to align with the main Opposition Telugu Desam-led “Mahakutami” to fight Congress and yet again suffered humiliation as his party failed to perform any better. All the KCR’s “game-plans” were successfully “foiled” by a strong leader in Congress in the form of Dr Y S Rajasekhara Reddy.







Incidentally, the untimely death of Dr Reddy in chopper crash has given Rao a golden opportunity to raise the separate statehood demand. Added to that intra-party bickerings within the Congress helped him to intensify the agitation demanding for separate statehood. The clever move by him to take up fast-unto-death agitation too paid rich dividends.







The worsening situation arose out of fasting Rao’s deteriorating health condition panicked the Congress high command to hurry up its long-pending decision on Telangana issue. Today, as the Congress enjoys considerable numerical strength in the UPA dispensation could take such a bold decision to declare initiative for formation of separate statehood for Telangana, which was simmering for the past two to three decades.







With the Wednesday night’s decision, the Indian National Congress and its president Sonia Gandhi has proved its critics __ who have been calling the party the most undisciplined and not trust worthy __ that it has some political values. A handful of party members representing the Andhra and Rayalaseema regions, who boasted to abide by the decision of Sonia are now ‘revolting’ only prove their ‘dishonesty’. How, Sonia and her ‘think tank’ can overcome the situation only time will tell.

ఒక తుర్లపాడు- రెండు గుళ్ళు

ఒక తుర్లపాడు- రెండు గుళ్ళు





'ఇంతవరకు పన్నెండు వేలమందికి పైగా భోజనాలు చేసారుట!'



'అయితే ఏంటట! గత అరవయి ఏళ్లుగా వాళ్ళింట్లో సాగుతూ వస్తున్న 'అన్నసత్రం' గురించి ఏమీ తెలిసినట్టులేదే ? అక్కడ భోజనం చేసిన వాళ్ళతో పోలిస్తే ఇదెంత?'



'ఏళ్లతరబడి పాడుబడ్డ ఈవూరి గుడికి ఈ వైభోగం ఏవిటో? కాశీ నించి తెచ్చారుట చూడండి ఆ శివలింగం ఎలా వెలిగిపోతోందో? కంచిలో చెక్కించుకు వచ్చిన ఆ దేవతా మూర్తుల విగ్రహాలని చూస్తె చాలు జన్మ తరించిపోవడానికి.'



'అది సరేనండీ బాబూ. దాన్ని కాదన్నదెవరు ? అటు చూడండి. గుడికి కూతవేటు దూరంలో పెంకుటిల్లు కనబడుతోందా. ఆ ఇంటి బయట నులక మంచం పై సేదదీరుతున్న 'అపర దేవతలు' కనబడుతున్నారా. ఆయన ఎవరనుకున్నారు. ఇన్నాల్టికి ఈ వైభోగం సంతరించుకున్న ఈ గుడి వుంది చూసారూ ఆ దేవాలయానికి సాక్షాత్తు వంశపారంపర్య ధర్మకర్త - బెజవాడలో పేరుమోసిన లాయరు తుర్లపాటి హనుమంతరావు పంతులుగారు. పోతే ఆ పక్కన వున్నది ఎవరో తెలుసా? డెబ్బయి సంవత్సరాలకు పైగా ఆయన వేలు పట్టుకుని పక్కనే నడుస్తూ - గంపెడు పిల్లలను - సొంతం, పరాయి అన్న తేడా లేకుండా - పెంచి పెద్ద చేసిన మహా దొడ్డ ఇల్లాలు ఆయన సహధర్మచారిణి- సరస్వతమ్మ గారు -. వాళ్ళిద్దర్నీ చూస్తుంటే శివ పార్వతులను చూస్తున్నట్టుగా లేదూ?'



'మీరు భలే చెబుతారండీ! ప్లీడరు గారిని తెలియని వాళ్ళు ఈ తాలూకాలోనే కాదు, హోలుమొత్తం జిల్లాలోనే లేరు. అలాగే సరస్వతమ్మగారు- ఆమె చేతి వంట రుచి చూడని వాళ్ళు వాళ్ళ చుట్టపక్కాల్లో కలికం వేసినా కనిపించరు. ఆయన గారి మాటకు అంత విలువ వున్నది కనుకనే - ఈ సత్కార్య నిర్వహణకు వేలూ లక్షలు పోగుపడ్డాయి.'



'ఒక్క డబ్బుంటే సరిపోతుందా! అదిగో అటు చూడండి! దీక్షా వస్త్రాలలో తిరుగుతున్నాడే ఆ కుర్రవాడు. అడ్వకేటు గారి చిన్నకొడుకు. పెద్దాయన లాగే ఈ చిన్నాయన కూడా విజయవాడలో పెద్ద లాయరుగారే. పేరు భై ర్రాజు. వయస్సులో చిన్నవాడయినా - పెద్దల పేరు నిలబెట్టడానికి నడుం కట్టాడు. ఆలోచన నాన్న గారిది. ఆచరణ పిల్లవాడిది. సంకల్ప బలం వుంటే తిరుగుండదు అనడానికి ఈ రోజు ఈ వూళ్ళో జరుగుతున్న ఈ ఉత్సవమే ఒక ఉదాహరణ. ఇంత చిన్న వయస్సులో ఇంతటి మహత్కార్యక్రమాన్ని నిష్ఫలా పేక్షతో - నిర్వహిస్తున్నాడే ఆ చిన్నవాడి పెద్దమనస్సును మెచ్చుకోక తప్పదు. అందుకే అన్నారు - దైవం మానుష రూపేణా అని. - మీరు గుడికి వెళ్లి ఆ దేవదేవుడి పూజలో తరించండి. నేను మాత్రం - నిజమయిన దేవతలు కొలువున్న ఈ 'గుడి' లోనే కాలక్షేపం చేస్తాను'



- భండారు శ్రీనివాస రావు

22-11-2009 తుర్లపాడు నుంచి

దూరదర్శన్లో ఉద్యోగ విరమణ రోజున_

________________దూరదర్శన్లో ఉద్యోగ విరమణ రోజున________________________

అందరికీ నమస్కారం...



జాతస్య మరణం ధృవం అన్నట్టు- సర్కారు ఉద్యోగికి ఏదో ఒకనాడు-'ఈనాడు ' అనేది రాక తప్పదు.



నా వృత్తి జీవితపు చరమాంకంలో కొద్దికాలం మీతో కలిసి పనిచేసే సదవకాశం దొరికింది. పరస్పర అవగాహనకు ఈ స్వల్ప సమయం చాలకపోవచ్చు. కానీ మీ అభిమానం చూస్తుంటే ఈ అభిప్రాయం తప్పేమోనని అనిపిస్తోంది.



చూస్తుండగానే ముప్పయ్యేళ్ళు చక చకా గడిచిపోయాయి.ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపూ సొలుపూ వుండదన్నట్టు కాలం హాయిగా వేగంగా దొర్లిపోయింది. వొప్పచెప్పిన పనులతోపాటు చిన్నా చితకా ఇతరత్రాలు కూడా నెత్తికెత్తుకున్నందువల్ల -చేసే పనిలో ఏనాడూ రొటీన్ ఫీల్ కాలేదు.ఏరోజుకారోజు కొత్తగా గమ్మత్తుగా గడిచిపోయింది.



అసూయ తెలియని పై అధికారులు-అత్మీయత కనబరిచే సాటి సిబ్బంది- ఏ ఉద్యోగికైనా ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది?



అందుకే- అత్త లేని కోడలులాగా అందరిలోను-అందరితోను కలిసిపోయి,కలగలిసిపోయి ఓ మోస్తరుగా అత్తెసరు మార్కులు కొట్టేయగలిగానని అనుకుంటున్నాను.



అయితే ఉప్పూ, కారం తినేవాడిని కనుక - ఎప్పుడో ఒకప్పుడు - ఎవరినోఒకరిని నొప్పించే వుంటాను. మాటతూలే వుంటాను. ఇలాంటి సందర్భాలలో అప్పటికప్పుడే సారీ చెప్పేసి మనసు కడిగేసుకోవడం నాకలవాటు. అయినా, నావల్ల మనసు నొచ్చుకున్నవారెవరైనావుంటే మన్నించమని మనసారా కోరుకుంటున్నాను. అప్పుడే ప్రశాంతమైన ఉద్యోగ విరమణ పర్వానికి అర్ధం పరమార్ధం.



నాకు మాట్లాడడం రాదు.ఇది నా మాట కాదు.-మా ఆవిడ ఉవాచ.

అందుకే మనసులోని మాటలను ఇలా అక్షరాలలో పరచి మీ అందరితో పంచుకుంటున్నను.



మీ వద్ద సెలవు తీసుకునేముందు మరో మాట...



నిజమే!కృతజ్ఞతలు బాహాటంగా చెప్పడం చాల కష్టమే...



అందుకే మీ అందరికీ మరోసారి మరొక్క నమస్కారం.



హైదరాబాదు

02-01-2006. -భండారు శ్రీనివాసరావు

రెండు కన్నీటి బొట్లు - భండారు శ్రీనివాసరావు

రెండు కన్నీటి బొట్లు - భండారు శ్రీనివాసరావు



దేశవ్యాప్తంగా,మీడియాలో,పత్రికల్లో అత్యధికంగా వినపడ్డ,కనపడ్డ పదం వైఎస్సార్.ఆ పేరు వినబడుతూనే వుంటుంది కానీ,ఇక ఆ రూపం కనబడే అవకాశమే లేదు.ఒక వ్యక్తి గుణగణాలను సమాజం సంపూర్తిగా అవగాహన చేసుకోవడం జరిగేది అతడి మరణం తర్వాతనే అన్నది రాజశేఖర రెడ్డి గారి విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజమైంది.



'రాజశేఖరా!నీపై మోజు తీరలేదురా!' అని తెలుగు ప్రజానీకం రెండోపర్యాయం ఆయనకు అధికార పగ్గాలు అప్పగించి వంద రోజులు నిండీనిండగానే-రాజశేఖరుడికి నూరేళ్ళు నిండిపోవడం అత్యంత విషాదకరం.



'రాజసాన ఏలరా!' అని మనసారా కోరుకున్న ప్రజలకు ఆయన ఆకస్మిక మరణం విధి విధించిన శాపం.

అర్థవంతమైన జీవితాలెప్పుడూ అర్ధంతరంగానే ముగిసిపోతుంటాయి.మాట తప్పని మనిషిగా, మడమ తిప్పని వీరుడిగా పేరు తెచ్చుకున్న వైఎస్సార్-అరవై యేళ్ళు రాగానే రిటైర్ అయిపోతానన్న మాటని నిలబెట్టుకుంటూ-జీవితం నుంచే రిటైర్ కావడం అన్నది-ఆయన పధకాల ద్వారా బతుకులు పండించుకుంటున్న బడుగు జీవుల దురద్రుష్టం.



1978 నుంచి ఇప్పటివరకూ ఒక జర్నలిష్టుగా ఆయన్ని కలుసుకున్న సందర్భాలు అనేకం వున్నాయి.విలేకరులను విందు సమావేశాలకు ఆహ్వానించినప్పుడు ఆయన తరహానే వేరుగా వుండేది.బిగుసుకుపోయినట్టు వుండడం, మర్యాద కోసం మొహాన నవ్వు పులుముకోవడం ఆయన స్వభావానికే విరుధ్ధం.నవ్వులో స్వచ్చత,పిలుపులో అత్మీయత వుట్టిపడేవి.నమ్మినవాళ్ళని నట్టేట ముంచకపోవడం,నమ్ముకున్నవాళ్ళకోసం యెంతకైనా తెగించడం జన్మతః అబ్బిన గుణాలు.వీటివల్ల-రాజకీయ జీవితంలో మేలు కన్న కీడే ఎక్కువ జరిగిన సందర్భాలు వున్నా, ఆయన లెక్కపెట్టింది లేదు.తీరు మార్చుకున్నదీ లేదు. ఈ విలక్షణ లక్షణమే వైఎస్సార్ కు రాష్త్రవ్యాపితంగా అభిమానులను తయారుచేసిపెట్టింది.ఎన్నికలు వచ్చినప్పుడు కేవలం తన నియోజకవర్గానికే పరిమితం కాకుండా- రాష్త్రంలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ తరపున ప్రచారం చేయగల ఖలేజాను ఆయనకు కట్టబెట్టింది.



1975 లో నేను రేడియో విలేకరిగా హైదరాబాదులో అడుగుపెట్టిన మూడేళ్ళ తరవాత రాజశేఖరరెడ్డి గారు తొలిసారి శాసన సభకి ఎన్నిక కావడం-మంత్రి పదవి చేపట్టడం జరిగింది.వయస్సు మళ్ళినవాళ్ళే రాజకీయాల్లోకి వస్తారనే అభిప్రాయానికి భిన్నంగా యువరక్తం రాజకీయ రంగంలోకి రావడం అప్పుడే మొదలయింది.



కొంచెం అటు ఇటుగా రాష్త్ర రాజకీయాల్లో అడుగిడిన రాజశేఖరరెడ్డి గారు, చంద్రబాబు నాయుదుగారూ ప్రాణ స్నేహితులుగా మసలిన రోజులకు నేను కూడా సాక్షిని కావడం యాద్రుచ్చికం. మంత్రి పదవి తనను ముందు వరించినప్పటికీ- చంద్రబాబు నాయుడు గారు సైతం మంత్రి అయ్యేంత వరకూ ఆయన పడ్డ ఆరాటం- ఆనాటి జర్నలిష్టులందరికీ తెలుసు.



రాజశేఖర రెడ్డిగారిని నేను మొదటిసారి చూసింది-ఆ రోజుల్లొ సచివాలయానికి కూతవేటు దూరంలో వున్న సరోవర్ హోటల్ (ఇప్పుడు మెడిసిటి హాస్పిటల్) టెర్రేస్ మీద.సచివాలయంలో జరిగిన ఒక సంఘటన దరిమిలా వివరణ ఇచ్చేందుకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భం అది.అప్పట్లో ఆయన ఒక తరహా మీసకట్టులో కనిపించే వారు.కానీ, కపటం లేని మందహాసానికి మాత్రం అప్పటికీ, ఇప్పటికీ ఆయనదే కాపీ రైట్.

ఇటు హైదరాబాదులోనూ,అటు ఢిల్లీలోనూ వైఎస్సార్ నివాసాలు జర్నలిష్టులతో కళకళలాడుతూవుండేవి. వేళాపాళాతో నిమిత్తంలేకుండా ఆ ఇళ్ళకి వెళ్ళివచ్చే చనువు వుండేది.సుధీర్ఘకాలం రాజకీయరంగంలో కొనసాగడం వల్ల,పేరుతో పిలిచి పలకరించగల జర్నలిష్టు స్నేహితులు ఆయనకు రాష్త్రంలోని అన్ని ప్రాంతాల్లో వుండడం సహజమే.



2004 లో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి కాగానే-ఆయనతోవున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని, కేవీపీ గారి ద్వారా నా మనసులోని మాటని ఆయన చెవిన వేశాను.అప్పటికే కొన్ని ప్రైవేటు టీవీ చానళ్ళు రంగప్రవేశం చేసినందువల్ల-రేడియో కేంద్రానికి వచ్చి తొలి సందేశం రికార్డు చేయడం అన్నది కొద్దిగా ఇబ్బందే.అయినా, ఆయన నా మాట మన్నించి- నేరుగా ఆకాశవాణి కేంద్రానికి వచ్చారు.అలాగే,హైదరాబాదు దూరదర్శన్ లో నేను రిటైర్ కావడానికి ముందు కూడా ఆయన స్టుడియోకి వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.



వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన రెండేళ్ళకే నా విలేకరిత్వానికి తెరపడింది. అయినా,ఆ తర్వాత కూడా, వార్షికంగా నిర్వహించే విందు సమావేశాలకు నాకు ఆహ్వానం అందుతూనే వుండేది. రిటైర్ అయిన తర్వాత చాలా రోజులకు జరిగిన-మా రెండో కుమారుడి వివాహానికి-ముఖ్యమంత్రిగా యెన్నో పని వొత్తిళ్ళు వున్నప్పటికీ హాజరై ఆశీర్వదించి వెళ్ళడం- నా పట్ల వారికున్న వాత్సల్యానికి మచ్చుతునకగా భావిస్తాను.

ఆయన ప్రతిపక్షనాయకుడిగా వున్నరోజుల్లో ఎప్పుడైనా కాలక్షేపంగా కలుసుకున్న సందర్భాల్లో రాజకీయాల ప్రస్తావన వచ్చినప్పటికీ- ఆయన నాతో సరదా కబుర్లనే ఇష్టపడేవారు.రేదియో విలేకరిగా నాకున్న పరిమితులను ఆకళింపు చేసుకోవడమే కాకుండా- 'శ్రీనివాసరావుని ఇబ్బంది పెట్టకండయ్యా!' అని తోటి జర్నలిష్టులకి సర్దిచెప్పేవారు.

ఒక విలేకరికి-ఒక రాజకీయనాయకుడికి నడుమ సహజంగావుండే సాధారణ సంబంధాన్ని మహోన్నతంగా పెంచి పెద్ద చేసిన పెద్దమనసు ఆయనది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా పెనవేసుకున్న ఈ బంధం తెగిపోయిన విపత్కర సందర్భంలో- ఆ మహోన్నత వ్యక్తిత్వానినికి నివాళి అర్పిస్తూ-'రెండు కన్నీటి బొట్లు ' రాల్చడం మినహా ఏమీ చేయలేని చేతకానితనానికి చింతించడం తప్ప చేయగలిగింది ఏముంది?



Bhandaru Srinivas Rao (I.I.S.)

Cell: 98491 30595 Res: 040 2373 1056.

భండారు వంశం గోత్ర నామాలు

భండారు వంశం గోత్ర నామాలు




తండ్రి : రాఘవేశ్వర శర్మ (రాఘవరావు గారు) పరాశర గోత్రం

తాత: (తండ్రి తండ్రి) పర్వతాలేశ్వర శర్మ (పర్వతాలయ్య గారు) పరాశర గోత్రం

ముత్తాత (తండ్రి తాత) రామేశ్వర శర్మ (రామయ్య గారు) పరాశర గోత్రం

తల్లి వెంకట్రావమ్మ పరాశర గోత్రం

బామ్మ (తల్లి అత్తగారు-తండ్రి తల్లి) రుక్మిణమ్మ పరాశర గోత్రం

బామ్మ తండ్రి చిదంబరం రోహితస గోత్రం

బామ్మ తల్లి చెల్లమ్మ (చెల్లమ్ముమ్మ) రోహితస గోత్రం

బామ్మ తాత సీతారామయ్య పరాశర గోత్రం

బామ్మ బామ్మ వెంకటమ్మ పరాశర గోత్రం

తాత (తల్లి తండ్రి) శ్రీనివాస రావు కొండపల్లి శ్రీవత్స గోత్రం

ముత్తాత (తల్లి తాత) కృష్ణారావు శ్రీ వత్స గోత్రం

పినతండ్రి రామప్రసాదరావు (ప్రసాదం బాబాయి) పరాశర గోత్రం

పినతండ్రి భార్య రాంబాయి పరాశర గోత్రం

పినతాత లక్ష్మీనారాయణ (లక్ష్మయ్య తాతయ్య) పరాశర గోత్రం

పినతాత భార్య వరలక్ష్మి (వరం బామ్మ) పరాశర గోత్రం

పినతాత సుబ్బారావు (సుబ్బయ్య తాతయ్య) పరాశర గోత్రం

పినతాత భార్య సీతమ్మ (సీతం బామ్మ) పరాశర గోత్రం

మేనత్త రంగనాయకి (రంగమ్మత్తయ్య) కాశ్యపస

మేనమామ (మేనత్త భర్త) లక్ష్మీనరసింహారావు కొలిపాక కాశ్యపస

మేనత్త కమలాబాయి (చిన్నత్తయ్య) కాశ్యపస

మేనత్త భర్త శ్రీనివాసరావు పర్చా కాశ్యపస

మేనత్త సీత (చిదంబరం అత్తయ్య) కాశ్యపస

మేనత్త భర్త లక్ష్మీనరసింహారావు కాశ్యపస

పెత్తల్లి చుక్కమ్మ గౌతమ గోత్రం

పెత్తల్లి భర్త వెంకట నరసయ్య గౌతమ గోత్రం

మేనమామ రామచంద్రరావు కొండపల్లి శ్రీ వత్స గోత్రం

మేనమామ భార్య రాజ్యలక్ష్మి (రాజమ్మత్తయ్య) శ్రీ వత్స గోత్రం

మేనమామ కృష్ణారావు కొండపల్లి శ్రీ వత్స గోత్రం

మేనమామ భార్య వెంకట సుబ్బాయమ్మ(గండ్రాయత్తయ్య) శ్రీ వత్స గోత్రం

మేనబావ శ్రీనివాసరావు కొండపల్లి శ్రీ వత్స గోత్రం

మేనబావ వెంకటేశ్వరరావు కొండపల్లి శ్రీ వత్స గోత్రం

అక్క రాధ భరద్వాజ

బావ అయితరాజు రాంరావు భరద్వాజ

మేనల్లుడు ఏవీజీ కుమార్ (వెంకన్న) భరద్వాజ

బావ రామచంద్రరావు కొలిపాక కాస్యపస గోత్రం

బావ కవుటూరి కృష్ణమూర్తి కౌసికస గోత్రం

మేనల్లుడు శేషు కౌసికస గోత్రం

మేనల్లుడు తుర్లపాటి రాఘవరావు (పుతక) కణ్వస గోత్రం

అక్క అన్నపూర్ణ భరద్వాజ

బావ వెంకటప్పారావు భరద్వాజ



మేనల్లుడు చంద్ర కాంతారావు భరద్వాజ

మేనల్లుడు రంగారావు (రంగడు) భరద్వాజ

బావ పింగిలి మధుసూదనరావు భారద్వాజస గోత్రం

అన్నయ్య భండారు పర్వతాలరావు గారు పరాశర

అన్నయ్య భండారు వెంకటేశ్వర రావు పరాశర

అన్న (పినతండ్రి కొడుకు) భండారు సత్యమూర్తి పరాశర గోత్రం

గురువు హనుమంతరావు గారు భారద్వాజస గోత్రం

మేనమామ కొడుకు మోహనరావు శ్రీ వత్స గోత్రం

మేనమామ కొడుకు భార్య యజ్ఞ పదాయి శ్రీ వత్స గోత్రం

పర్వతాలరావు గారి షడ్డకుడు భావనారాయణ భారద్వాజ

పినతండ్రి అల్లుడు పట్టాభిరామారావు భారద్వాజ

గురువు రాఘవరావు పరాశర

గురువు హరినారాయణ భారద్వాజ

గ్రేట్ ఫెయిల్యూర్ స్టొరీ -భండారు శ్రీనివాస రావు

గ్రేట్ ఫెయిల్యూర్ స్టొరీ -భండారు శ్రీనివాస రావు ( డిసెంబరు ఆరు -రెండు వేల ఆరు)



పంతొమ్మిదివందల డెబ్బయి ఒకటి -ఆగష్టు నెల- ఇరయయ్యవ తేది.

విజయవాడ, లబ్బీపేట లోని 'ఆంద్ర జ్యోతి' కార్యాలయం.

అందులో అడుగు పెట్టి - ఎడిటర్ నార్ల వెంకటేశ్వర రావు గారిని కలుసుకున్నాను.

ఆయన ఎగాదిగా చూసి, నా పరిచయం కనుక్కుని-

'మీ అన్నయ్య ఒకటే చంపేస్తున్నాడయ్యా! పైకి పో. ఉపేంద్ర వుంటాడు. నేను పంపానని చెప్పు' అన్నారు ఫోన్ మీద చేయి వేస్తూ.

అదే నా తొట్ట తొలి ఉద్యోగ నియామకపు ఉత్తర్వు.





ఉపేంద్ర గారిని కలిసాను. కూర్చోమని సైగ చేసారు. గుర్రపు నాడా ఆకారంలో వున్నా బల్ల చివర్లో కూర్చున్నాను. పీ టీ ఐ , యు ఎన్ ఐ వార్తల్ని తెలుగులోకి తర్జుమా చేయమన్నారు. ఆ విధంగా మొదలయింది నా జర్నలిస్టు జీవితం.





ఉదయం ఎనిమిది గంటలకల్లా అన్నం తిని ఆంధ్ర జ్యోతి కి వెళ్ళే వాడిని. అన్నయ్య పర్వతాలరావు గారు ఇమ్మన్న రూపాయి నోటు వొదినె సరోజినీ దేవి నా చేతులో పెట్టేది. రాను పోను సిటీ బస్సుకు నలభై పైసలు. మధ్యాహ్నం ఆఫీసు కు ఎదురుగా వున్నా టీ స్టాల్లో ముప్పయి పైసలు పెట్టి ఒక సమోసా తిని టీ తాగేవాడిని. రోజుకు ము ప్పయి పైసలు మిగిలేవి. వేరే ఖర్చులు లేవు. అలా నెలకు సుమారు పది రూపాయలు ఆదా. అదే నా మొట్టమొదటి నెలసరి ఆదాయం.





అలా మూడు నెలలు గడిచాయి. జీతం విషయం నేను అడగను లేదు - వాళ్ళు చెప్పను లేదు. ఒక రోజు అటెండర్ నాగేశ్వరరావు నా దగ్గరకు వచ్చి ఎక్కవుంటేంట్ ని కలవమని చెప్పాడు. వెడితే- ఓ ఓచర్ మీద సంతకం చేయించుకుని పది- పది రూపాయల నోట్లు - వంద నా చేతిలో పెట్టారు. అదే నా తొలి వేతనం.







ఉద్యోగం తప్ప వేరే ధ్యాస లేని రోజులవి. రాసిన ప్రతిదీ మర్నాడు పేపర్లో రాకున్నా ప్రూఫ్ లో అచ్చయిన నా ఐటెంసుని నేనే చదువుకుని

మురిసిపోయేవాడిని. నేను చేరిన కొత్తల్లోనే నార్ల గారు హైదరాబాద్ వెళ్ళిపోవడం - నండూరి రామమోహనరావు గారు భాద్యతలు స్వీకరించడం జరిగిపోయాయి.ఎందుకో ఏమోగానీ,దిన,వార పత్రికలకు సంబంధిoచిన అన్ని అంశాలలో నాకు తర్ఫీదు ఇచ్చారు. ప్రతిరోజూ ఎడిట్ పేజీలో కార్టూన్ తో కూడిన నాలుగు వాక్యాల గేయాన్ని 'వాక్టూనులు ' అనే శీర్షికతో రాసేవాడిని. సినిమా సమీక్షలు, పుస్తక సమీక్షలు, ఆదివారాల్లో

పిల్లలకోసం ప్రత్యెక కధలు , బంగ్లాదేశ్ అవతరణకు దోహదం చేసిన పంతొమ్మిదివందల డెబ్బయి ఒకటి ఇండో-పాక్ యుద్ధంలో భారత సైన్యాల కదలికలను సూచించే మ్యాపులు - ఇలా అన్నింట్లో నేనున్నానంటూ వేలు పెట్టేవాడిని. శ్రీయుతులు ఉపేంద్ర, ఐ వెంకటరావు,కే.రామకృష్ణ, వీరభద్రరావు, ఎల్వీ రమణ ( ఈ మధ్యనే కాలం చేశారు), సత్యనారాయణ, ఆంజనేయులు, చంద్రశేఖర ఆజాద్ వంటి సహోద్యోగుల నడుమ నా ఆంధ్ర జ్యోతి ఉద్యోగ పర్వం నాలుగున్నర సంవత్సరాలపాటు ఇట్టే గడిచిపోయింది.



అన్నట్టు చెప్పడం మరిచాను. మొదట్లోనే నార్లగారు నాకో బ్రహ్మొపదేశం చేశారు. జర్నలిస్టు అనే వాడు ఎప్పుడూ, జేబులో రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకోవాలనే వారు. చాలా కాలంపాటు దాని పాటించాను కూడా. తర్వాతి రోజుల్లో రేడియోలో ఏదో విషయంలో పేచీ వచ్చి,రాజీనామా ఇచ్చేసి ఇంటికి వచ్చేశాను. అంతే! నెలరోజులపాటు మళ్ళీ ఆఫీసు మొహం చూడలేదు. చివరికి ఎవరో పూనుకుని రాజీ చేయడం, ఉద్యోగంలో తిరిగి చేరడం జరిగిపోయాయి. అదో అధ్యాయం.



హైదరాబాద్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగంలో విలేకరిగా చేరడం యాద్రుచ్చికమే అని చెప్పాలి. అంతకుముందు ఈ ఉద్యోగాన్ని ఎంతో సమర్ధంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్న తురగా కృష్ణమోహన రావు గారు - గోల్కొండ ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లి- దురదృష్టవశాత్తు -నకిరేకల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆ విధంగా ఏర్పడ్డ ఖాళీని భర్తీ చేయడానికి ఆకాశవాణి ఇచ్చిన ప్రకటనకు అనుగుణంగా నేను ధరకాస్తు చేసుకోవడం, ఇంటర్వ్యూ కు హాజరు కావడం - సెలెక్ట్ కావడం జరిగిపోయాయి. ఆంద్ర జ్యోతి అనుభవం ఈ ఉద్యోగం పొందడానికి అదనపు అర్హతగానే కాకుండా- అసలైన అర్హతగా తోడ్పడిందని నా నమ్మకం. రాసిన రాతలు అచ్చులో చూసుకునే అవకాశం ఆంద్ర జ్యోతి ద్వారా లభిస్తే- సొంత గొంతును తెలుగునాట నలుగురికీ వినిపించే వీలు రేడియోలో దొరికింది. వార్తా సేకరణ, కూర్పు, తెలుగులోకి అనువాదం ఇలాంటి ప్రక్రియలతో పాటు, రెగ్యులర్ న్యూస్ రీడర్లు రాని రోజున ఏకంగా స్టూడియో లోకి వెళ్లి వార్తలు చదివేయడం- వారానికి రెండు మార్లు వార్తా వాహిని - ఒకసారి జీవన స్రవంతి (రోజువారి జరిగే ఘటనలకు కొంత హాస్యాన్ని జోడించి తయారు చేసిన ప్రత్యెక వార్తలు ) ఇలా అన్నిరకాలుగా నా రేడియో జీవితాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాను.



ఆ రోజుల్లో ఇన్ని పత్రికలూ లేవు. ఇంత మంది విలేకరులు లేరు. ముఖ్య మంత్రి నిర్వహించే విలేకరుల సమావేశానికే పది, పన్నెండు మంది హాజరైతే గొప్పగా వుండేది. నేను రేడియోలో చేరింది ఎమర్జెన్సీ రోజుల్లో కావడం వల్ల-వార్తల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగం రేడియో పై ఎక్కువగా ఆధారపదాల్సిరావడం- రేడియో విలేకరిగా నా ప్రాధాన్యత కొంత పెరిగింది. అంజయ్య గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు - రేడియో మీది అభిమానాన్ని, నా మీది వ్యక్తిగత అభిమానాన్ని కలబోసి ప్రదర్శించేవారు. విలేకరుల సమావేశాలను -'శ్రీనివాస్ వచ్చాడా!' అని కనుక్కుని మొదలు పెట్టడం అప్పుడప్పుడు నలుగురిలో ఇబ్బందిగా వుండేది. తన ఎయిర్ బస్ మంత్రివర్గంపై చెలరేగిన విమర్శల దరిమిలా- మంత్రుల మూకుమ్మడి రాజీనామాలను ప్రకటించడానికి ఓసారి విలేకరులకు కబురు పెట్టారు. మధ్యాన్నం వార్తల టైం దగ్గర పడుతుండడంతో-రాజీనామాల సంగతి ముందుగా నాకు చెప్పడం- విలేకరుల సమావేశం మొదలు కాకముందే ఆ సమాచారం ప్రాంతీయ వార్తల్లో ప్రసారం కావడం జరిగిపోయింది. ఇది నా వృత్తి జీవితంలో మరచిపోలేని సంఘటన



ఆ రోజుల్లో ప్రతి రోజు సచివాలయానికి వెళ్లి మధ్యాహ్నం దాకా ప్రెస్ రూం లోనో లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ ల్లోనో గడిపి- అంతవరకు సేకరించిన సమాచారం తెసుకుని న్యూస్ బుల్లెటిన్ కు అందించడానికి కాలినడకన రేడియో స్టేషన్ కు వెడుతుండే వాడిని. ఒకరోజు అలా పోతున్నప్పుడు ముఖ్యమంత్రి పైలట్ వాహనం సైరన్ మోగిస్తూ వెళ్ళింది.అంజయ్య గారు- తన అధికారిక వాహనం అయిన అంబాసిడర్ కారులో డ్రైవర్ పక్కన ముందు సీట్ లో కూర్చునే వారు. ఆయనకు కార్యకర్తల తాకిడి ఎక్కువ. వెనుక సీట్ లో ఎవరికీ వారు దూరి పోయేవారు. ఈ ఇబ్బంది తట్టుకోవడం కోసమో ఏమో ఆయన ముందు సీట్ కి మారిపోయారు. సరే! ఆ రోజు నా పక్కనుంచి వెళ్ళిన ముఖ్యమంత్రి వాహనం కొద్దిగజాలు ముందుకు పోయి ఆగింది. ఆయన అంగరక్షకుడు బాలాజీ- - రిటైర్ అయిన తర్వాత ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో పనిచేస్తున్నారు- కిందికి దిగి సీఎం గారు పిలుస్తున్నారు రండి అనడం- నన్ను కారు ఎక్కించుకుని రేడియో స్టేషన్ లో దింపడం క్షణాల్లో జరిగిపోయాయి. అనుకోకుండా ముఖ్యమంత్రి రేడియో

స్టేషన్ కి రావడంతో మా వాళ్ళంతా అవాక్కయ్యారు. అంజయ్య గారు ఇలా నాపట్ల చూపిన అవ్యాజానురాగాలకి ఇంకా ఎన్నో ఉదాహరణలు వున్నాయి. అవి ఆయన గొప్పతనానికి, మంచి తనానికి తార్కాణాలుగా భావిస్తానే కాని , నా ప్రత్యేకత ఏమీ లేదు.



పొతే, ఎందరో మంత్రులు, ఎంతోమంది ముఖ్యమంత్రులు, డీజీపీలు ,చీఫ్ సెక్రటరీలు, సీనియర్ ఐ ఏ ఎస్ , ఐ పీ ఎస్ అధికారులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, శాసన సభ్యులు - ఇందరితో సాన్నిహిత్యాలు, విందులు, వినోదాలు,విమాన యానాలు,విదేశీ ప్రయాణాలు, హెలికాఫ్టర్

చక్కర్లు - మాస్కో రేడియో ఉద్యోగ విజయాలు - ఓ విధమైన 'మత్తులో' వృత్తి జీవితం గడిచిపోయింది.



అటు చూస్తే, వ్యక్తిగత జీవితం ఓ గుండు సున్నా. జీతానికీ, జీవితానికీ పొంతన లేకపోవడంతో అందినంతవరకు అప్పులు చేయడం (చేబదుళ్లు పుట్టవు కానీ జర్నలిష్టులకు మాత్రం బ్యాంకు రుణాలు కోకొల్లలు ) వాటిని తీర్చడం కోసం మళ్ళీ కొత్తవి చేయడం - అదో రుణ చక్ర భ్రమణం. ఇలా ఊబిలో కూరుకుపోయిన జీవితానికి ఆసరాగా మా ఆవిడ నిర్మల- అమ్మ వొడిని ప్రారంభించింది. కన్న సంతానం ఇద్దరు పిల్లలతో పాటు - మరో పాతికమంది పసి పిల్లల ఆలనా పాలనా నెత్తిన వేసుకుంది. ఓ గృహిణిగా సంసార బాధ్యతలో పాలు పంచుకుంటున్నదని అనుకున్నానే కాని, అలవికాని భారం మోస్తున్నదని అనుకోలేదు. ఫలితం - పదేళ్ళ తరవాత ఆమెకు జరిగిన ఓపెన్ హార్ట్ సర్జరీ. మరో పదేళ్ళ అనంతరం మొన్నీమధ్య రెండో సర్జరీ.



ఇక వృత్తి జీవితం చివరి రెండేళ్ళు - కే ఎస్ శర్మ గారి పుణ్యమా అని హైదరాబాద్ దూర్ దర్శన్ వార్తా విభాగంలో ఆర్వీవీ గారి సారధ్యంలో దొర్లిపోయాయి. రెండువేల అయిదు డిసెంబరు ఆఖర్లో ఉద్యోగ విరమణ. మోహన్ కందా గారన్నట్టు- మనిషికి మరణం, ఉద్యోగికి రిటైర్మెంట్ రెండూ తప్పవు.



వెనక్కు తిరిగి చూసుకుంటే- ఎన్నో అనుభూతులు-అనుభవాలు.

అన్నింటి సమగ్ర సమాహారమే జీవితం.

నిజానికి జీవితంలో ఫెయిల్యూర్ స్టొరీ లు వుండవచ్చు కానీ, ఏ జీవితం ఫెయిల్యూర్ కాదు.





(డిసెంబర్. ఆరు - రెండువేల ఆరులో రాసినదానికి కొద్దిపాటి సవరణలతో )

మహిళలపై టీవీ ప్రభావం

మహిళలపై టీవీ ప్రభావం




ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం కాదు హింసాయుగం.

'ఎందెందు వెదికిచూసిన అందందే శ్రీహరి కనిపిస్తాడని' ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడితో అంటాడు. కానీ హింస కోసం అలా వెతకాల్సిన పని కూడా లేదు.



హింస ఎక్కడ లేదు? నగరాల్లో- గ్రామాల్లో- ఇళ్ళల్లో- వీధుల్లో- మాటల్లో- చర్చల్లో ఎక్కడ చూసినా హింస విలయతాండవం చేస్తోంది. అంతెందుకు - సినిమాల్లో చూపిస్తున్న హింస నేరుగా టీవీల ద్వారా డ్రాయింగ్ రూముల్లోకి జొరబడుతోంది. అవునా? కాదా?



అయిదేళ్ళక్రితం అమెరికా వెళ్లాను. మన దగ్గరినుంచి వెళ్లి అక్కడ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్న అనేకమంది తెలుగు పిల్లలు కనిపించారు. 'మీ ఈ అభివృద్దికి కారణం ఏవిటన్న నా ప్రశ్నకు వాళ్ళు చెప్పిన సమాధానాలలో ఒకటి ఈనాటి ఈ చర్చకు సంబంధించినది వుంది. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు క్రమం తప్పకుండా దూరదర్శన్ లో క్విజ్ ప్రోగ్రాములు చూసే వాళ్ళమనీ, ఆ నాలడ్జే తరువాత జీవితంలో అక్కరకు వచ్చిందనీ వాళ్ళు చెప్పారు.

టీవీల వల్ల పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుందనడానికి దీన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు.



లాహోర్ లో ఇన్ష్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఎడ్మినిస్ట్రేషన్ లో చదువుకునే విద్యార్ధులు నిరుడు ఒక పరిశోధనా పత్రం ఒకటి రూపొందించారు. ఎలక్ట్రానిక్ మీడియా ఎఫెక్ట్ ఆన్ చిల్ద్రెన్ అన్నది సబ్జెక్టు. వాళ్ళ లెక్క ప్రకారం-

అక్కడి పిల్లల్లో -

పన్నెండు సంవత్సరాల లోపు వాళ్ళు రోజుకి రెండుగంటలు టీవీ చూస్తారట. ఓ అరగంటపాటు హోం వర్క్ చేసుకుని -ఓ గంట టీవీ గేమ్స్ చూస్తారట.

ఓ యిరవయి నిమిషాలు రేడియో వింటారు. మరో యిరవయి నిమిషాలు పుస్తకాలు చదవడానికీ, ఓ గంట ఆటలకీ, రెండున్నర గంటలు స్నేహితులతో ముచ్చట్లకీ ఖర్చు చేస్తారని తేలింది.

మరో ఆసక్తి కరమయిన విషయం ఏమిటంటే - చాలామంది పిల్లలు టీవీ తమకు సెకండ్ పేరెంట్ లాంటిదని చెప్పారు. టీవీ వల్ల ఇమాజినేటివ్ పవర్ పెరుగుతుందన్నారు. కొత్త భాషలు, కొత్త పదాలు నేర్చుకోవచ్చన్నారు. అదేసమయంలో వాళ్ళు మరో మాట కూడా చెప్పారు. పేద పిల్లలు టీవీ వల్ల నష్టపోతున్నారన్నారు. అలాగే పెద్దల నుంచి వేధింపులకు గురయ్యే పిల్లలు - టీవీలు చూసి హింసా మార్గం పడుతున్నారని, దౌర్జన్యకారులుగా తయారవుతున్నారని, చదువులో వెనకబడుతున్నారని వెల్లడించారు. ఈ పరిశోధన చేసిన విద్యార్ధులు కొన్ని విలువయిన సూచనలు కూడా చేశారు. బెడ్ రూముల్లో టీవీలు ఉండకూడదన్నారు. వాణిజ్యపరంగా నిర్వహించే టీవీ చానళ్ళను రెగ్యులేట్ చేయాలన్నారు. పిల్లలు చూసే ప్రోగ్రాములపై పెద్దలు ఓ కన్నేసి వుంచాలన్నారు.



రాజ్యాంగంలోని ఆర్టికిల్ యిరవై ఒకటి మనందరికీ జీవించే హక్కు ఇచ్చింది. రయిట్ టు లివ్ విత్ డిగ్నిటి అంటే హుందాగా, గౌరవంగా జీవించే హక్కు కూడా ఈ అధికరణం పౌరులకు ఇస్తోందని - హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా గతంలో స్పష్టం చేసాయి. టీవీల్లో మహిళలని అసభ్యంగా చూపించడం ఈ ఆర్టికిల్ కి విరుద్ధం. కానీ ఏ టీవీ చానల్ కూడా దీన్ని పట్టించుకున్న దాఖలా లేదు.



వంటలు-ఆరోగ్యం- ఎడ్యుకేషన్ - వీటి మీద చాలా ఛానళ్ళు అనేక చక్కటి ప్రోగ్రాములు అందిస్తున్నాయి. వీక్షకుల స్పందన కూడా వీటికి బాగా వుంది. మంచి సంగతులు సరే. చెడు ప్రభావం తలచుకుంటేనే భయపడాల్సి వస్తోంది. ఆడవాళ్ళల్లో- ముఖ్యంగా గృహిణుల్లో చాలామందికి టీవీ చూడడంతోనే సరిపోతోంది. సరయిన వ్యాయామం లేక ఊబకాయం సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లలు ఆకర్షణీయమయిన టీవీ యాడ్స్ చూసి పిల్లలు జంక్ ఫుడ్స్ కి అలవాటుపడుతున్నారు. పత్రికల్లో ఇలాంటి ప్రకటనలు మామూలే కదా అనవచ్చు. కానీ నిరక్ష్యరాస్యులపై వాటి ప్రభావం అంతగా వుండదు. టీవీల యుగం వచ్చాక చదువుతో నిమిత్తం లేదు. చూసి కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారు. కన్స్యూమరిజం బాగా ప్రబలడానికి ఈ డ్రాయింగ్ రూం టీవీలే కారణం. ఇన్ని రకాల టీవీలు లేని రోజుల్లో పల్లెటూళ్ల లోని ఆడవాళ్ళకు అనేక రకాల కాలక్షేపాలు ఉండేవి. కుట్లు. అల్లికలు, సంగీతం అలా ఏదో ఒక ప్రయోజనకరమయిన వాటితో పొద్దు పుచ్చుకునేవాళ్ళు. ఇప్పుడో- సీరియళ్లు చూస్తూ వాటిపై చర్చోపచర్చలు చేసుకోవడంతోనే సరిపోతోంది. పిల్లలని చూడడానికి అమెరికా వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడి సీరియల్ ఏమయిపోతోందో అని బెంగ పడుతున్నారని వింటుంటే వాటికి ఎంతగా ఎడిక్ట్ అయ్యారో అర్ధం చేసుకోవచ్చు.



ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడయి తోచు చందాన - ఈ నాడు ప్రయివేటు ఛానళ్ళు కుటుంబంలో అందరికీ కావాల్సిన ప్రోగ్రాములను నేత్రానందంగా తయారుచేసి అందిస్తున్నాయి. కొన్నిసందర్భాలలో ఇవి కుటుంబ సభ్యుల నడుమ పొరపొచ్చాలకు కూడా కారణమవుతున్నాయి. దానితో ఎవరికి వాళ్ళు తమ విభవం కొద్దీ ఎవరి గదుల్లో వాళ్ళు విడిగా టీవీ సెట్లు ఏర్పాటుచేసుకుంటున్నారు. కుటుంబ సభ్యుల మధ్య అసలే అంతంత మాత్రంగా వున్న 'మాటా మంతీ' దీనితో నామమాత్రంగా మారిపోయింది. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే 'గెస్టులు' గా తయారవుతున్నారు. ఇరుగు పొరుగు- చుట్టపక్కాలతో సంబంధబాంధవ్యాలే కనుమరుగవుతున్నాయి. టీవీ చూస్తున్న సమయంలో ఫోన్ వస్తే సమాధానం చెప్పేవారే కరువవుతున్నారు.



ఇక అశ్లీల కార్యక్రమాలను గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

అశ్లీలాన్ని అరికట్టే సదాశయంతో రూపొందించే ప్రోగ్రాములే అశ్లీల దృశ్యాలతో నిండిపోతున్నాయి.



ఒక్క మాటలో చెప్పాలంటే- తీరిక పుష్కలంగా ఉన్నవాళ్ళకోసం ఛానళ్ళు తీరిక లేకుండా పనిచేస్తున్నాయి.



-భండారు శ్రీనివాసరావు -