16, మార్చి 2013, శనివారం

అమెరికాలో ఆడవాళ్ళ పండుగ



న్యూ జెర్సీ, మార్చ్, 11, 2013.


అమెరికా తెలుగు ఆసోసియేషన్ (అటా) ఆధ్వర్యంలో ఈ నెల పదో తేదీన న్యూ జెర్సీలో
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు.
చట్నీ మనార్ లో జరిగిన ఈ కార్యక్రమంలో న్యూ జెర్సీ, పెన్సిల్ వేనియా,న్యూ
యార్క్,దేలావార్, కన్నెకట్ (నోట్ : ఈ నగరాల పేర్లు సరిచూసుకోండి)
నగరాలనుంచి మహిళలు ఈ ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వీరిలో డాక్టర్లు,
న్యాయవాదులు,వ్యాపారవేత్తలు,ఐ.టి. వృత్తి నిపుణులు,గృహిణులు, సామాజిక
సేవారంగానికి చెందినవారు వున్నారు.

నాటి ఉత్సవానికి ప్రత్యేకత ఏమిటంటే సమావేశ మందిరం గులాబీ రంగు
సంతరించుకుంది. ప్రేమ, శాంతికి ప్రతీక అయిన గులాబి రంగు వస్త్రాలను
దుస్తులను ధరించడం ప్రపంచ వ్యాప్తంగా స్త్రీవాదులకు అనూచానంగా
వుంటోందన్నది ఇక్కడ గమనార్హం.
అటా - 2014 అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వాహక సంఘం సభ్యురాలు శ్రీమతి
జమున పుస్కూర్ తొలుత స్వాగతం పలికారు.
న్యూ యార్క్ లోని ఇండియన్ కాన్స్యులేట్ లో ఆక్టింగ్ కాన్స్యులేట్ జనరల్
గా పనిచేస్తున్న డాక్టర్ దేవ్ యాని కోబ్రగడే జ్యోతి ప్రజ్వలనతో
కార్యక్రమం మొదలయింది.
సుమారు నాలుగు వందలమంది హాజరయిన నాటి సభను ఉద్దేశించి  ప్రసంగిస్తూ మహిళలు
శక్తివంతంగా తయారు కావాల్సిన అవసరం వుందని ఆమె నొక్కి చెప్పారు. అలాగే,
స్త్రీలు విద్యావంతులై, ఆర్ధిక స్వావలంబన సాధించుకున్ననాడే జగతికి నిజమైన
ప్రగతి అని అన్నారు.
ఏ.ఏ.పి.ఐ. పూర్వ అధ్యక్షురాలు డాక్టర్ సునీత కనుమూరి మహిళలు వ్యాపార
రంగంలో రాణించాల్సిన  అవసరం గురించి ప్రసంగించారు.
మహిళలు తమ  వృత్తినీ, సంసార బాధ్యతలను సమర్ధవంతంగా, సమతూకంగా నిర్వహించుకోవడం గురించి
ఏ.టి. అండ్ టి. సంస్తకు చెందిన మాధవి అరువ  మాట్లాడగా, మహిళలు శాంతి
గురించి బ్రహ్మకుమారీలకు చెందిన  సిస్టర్ సంధ్య వివరించారు.
విశ్వవ్యాప్తంగా తమ ప్రతిభాపాటవాలతో ఖ్యాతి సంపాదించిన మహిళామణులను
గురించి మాధవి అరువ, మైథిలీ రెడ్డి ప్రదర్శించిన పవర్ పాయింట్
ప్రెజెంటేషన్ సభికులను ఆకట్టుకుంది.
సభకు హాజరయిన అటా నాయకులు వచ్చే ఏడాది జులై లో ఫిలడెల్ఫియా లో
నిర్వహించనున్న అటా పదమూడవ మహాసభలను గురించి, యువజన సదస్సు గురించి
వివరించారు.
ఆంధ్రప్రదేశ్ లో అనాధ పిల్లల సంరక్షణ కోసం విశేషమైన సేవలు అందిస్తున్న
హెల్ప్’ (హెచ్.ఇ.ఎల్.పి.) స్వచ్చంద సంస్థ స్థాపకురాలు శ్రీమతి మాధవి
పోలేపల్లిని అటా మహిళా విభాగం వారు సత్కరించారు.
ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని  అటా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
నిర్వాహక సంఘం వారు లాటరీ టిక్కెట్ల విక్రయం ద్వారా సేకరించిన నాలుగు
వందల డాలర్లను న్యూ జెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న మహిళా హక్కుల పరిరక్షణ
సంఘానికి విరాళంగా ఇచ్చారు. అమెరికాలో నివసిస్తున్న దక్షిణాసియా మహిళలపై
జరిగే అన్ని రకాల హింసలను తుదముట్టించే లక్ష్యంతోఈ సంస్థ తన
కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మార్చ్ ఎనిమిది పదో తేదీల
నడుమ జన్మించిన మహిళల పుట్టినరోజులను ఈ సందర్భంగా నిర్వహించారు. తరచుగా
వార్తలలో తారసిల్లే భారతీయ మహిళలను గురించి జమునా పుస్కూర్కల్పనా సువర్ణ
సంయుక్తంగా నిర్వహించిన  క్విజ్ పోటీ అనేకమందిని ఆకర్షించింది. సభ్యులు ఉత్సాహంగా
క్విజ్ లో పాల్గొని సమాధానాలు చెప్పడంలో పోటీలు పడ్డారు.
అలాగే, బిందు మాదిరాజు, భాను మాగంటిఅనూ దాసరి, వరూధినీ మిట్టా కలసి
చీరెలపై నిర్వహించిన  గేమ్ షో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలచింది.
స్తీపాత్రలు ప్రధాన భూమిక పోషించిన తెలుగు చలన చిత్రాలకు సంబంధించి
నిర్వహించిన మరో కార్యక్రమం కూడా సభికులను ఆకర్షించింది. పెదాల కదలికను
అర్ధంచేసుకుని సభికులు సినిమాల పేర్లు చెప్పగలగాలి. ఈ కార్యక్రమాన్ని
కల్పనా సువర్ణ, సంగీత ధన్నపునేని, జ్యోతి ముత్యాల జనరంజకంగా
ప్రదర్శించారు.
విజేతలందరికీ తగిన రీతిలో బహుమతులను అందచేసారు.
చక్కటి దుస్తులను ధరించినందుకు ఇచ్చే బహుమతికి అంజలి, నాగమణి
ఎంపికయ్యారు. టి.ఎఫ్.ఏ.ఎస్. అధ్యక్షురాలు మంజు భార్గవ ఈ బహుమతులను వారికి
అందచేసారు.
కార్యక్రమం ఆసాంతం సభ్యులు అనేక విస్మయకర ప్రదర్శనలతో  సభికులను అలరించారు.
లావణ్య  సతీష్ చక్కటి పాటలు పాడి వీనులవిందు చేస్తే, నిర్మల శిష్ట్ల శాస్త్రీయ
నృత్యాలతో కనుపండువ చేసారు.
కవిత తోటకూర బృందం తెలుగు, హిందీ సినిమా పాటలతో ఆడిటోరియాన్ని
హోరెత్తించారు. కరతాళధ్వనులతో సభామందిరం మారుమోగింది.
ఇలాటి సందర్భాలలో ఏర్పాటుచేసే చీరెలు, బంగారు ఆభరణాల స్టాళ్లలో మంచి
సందడి కనిపించింది. చక్కటి వ్యాపారం జరిగినందుకు స్టాళ్ళ నిర్వాహకుల
వదనాల్లో ఆనందం కనిపించింది.
ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి  ఐక్యరాజ్యసమితి చక్కటి
నినాదాన్ని రూపొందించింది.
మాటంటే మాటే:  మహిళలపట్ల సాగుతున్న హింసను అరికట్టడానికి సరైన  సమయం ఇదే!
ప్రపంచ  వ్యాప్తంగా మహిళలందరూ  ఈ నినాదాన్ని స్వాగతించారు.
న్యూ జెర్సీలో సమావేశం అయిన అటా మహిళలు స్త్రీలపట్ల జరుగుతున్న
అత్యాచారాలను  ముక్తకంఠంతో ఖండించారు. స్త్రీలపట్ల యేరూపంలో హింస
జరిగినా సహించరాదన్న అభిప్రాయం వ్యక్తం అయింది. ఈ సమావేశం వల్ల జరిగిన
శుభ పరిణాం ఏమిటంటే , తమ ఆదాయంలో కొంత భాగాన్ని హింసలకు గురిఅవుతున్న
మహిళలకు విరాళంగా ఇవ్వడానికి సైతం నిర్ణయించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ అటా
నిర్వాహక సంఘం కృతజ్ఞతలు తెలిపింది.
కార్యక్రమానికి సంబంధించిన ప్రతి ఒక్క సందర్భాన్ని ఫోటోల్లో భద్రపరచిన
సురేష్ జిల్లాకు, డిస్క్ జాకీ గా వ్యవహరించిన అనిల్ అకులకు నిర్వాహకులు
ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు.
అటా ప్రాంతీయ సమన్వయకర్తలు రఘువీర్ రెడ్డి,భగవాన్ పింగ్లీ ప్రదర్శించిన
సమన్వయ పాటవం ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఎంతగానో దోహద పడింది.
అలాగే, జమున పుస్కూర్,రమేష్ మాగంటి, 2004 అటా సదస్సు కన్వీనర్ పరమేష్
భీంరెడ్డి కృషి మొత్తం కార్యక్రమం జయప్రదం చేయడంలో ప్రధాన భూమిక
పోషించింది. న్యూ జెర్సీ స్థానిక అటా నాయకులు చక్కటి మద్దతు ఇచ్చారు.
(NOTE: Please correct the names-
దయచేసి పేర్లు సరి చూసుకోండి)
16-03-2013 

15, మార్చి 2013, శుక్రవారం

అందరూ అనుకున్నదే అయింది



అవిశ్వాసం మీద విశ్వాసం లేకుండా పెట్టిన తీర్మానం ఏమవుతుంది? అనుకున్నట్టే అయింది. సుదీర్ఘ చర్చ అనంతరం వీగిపోయింది.
ఇలా కాకుండా ఇంకోలా అవుతుందని ఎవరయినా అనుకుంటే ఈనాటి రాజకీయాల సంగతి వారికి తెలియదని అనుకోవాలి.


ఎనిమిది గంటలన్నారు. ఇంకా అమీ తుమీ తెలియకుండా గంటలు గంటలు సభ సాగిపోయింది.
ఎక్కడ ఆగుతుందో ఎవరికీ తెలియదు. ఆగినా ఆగకపోయినా ఇబ్బంది ఎవరికీ లేదు.
సినిమా మొదలు కాకముందే కధ తెలిసిపోయినట్టు అవిశ్వాస తీర్మానం ఏమవుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే.
అందుకే షాడో బాక్సింగ్ మాదిరిగా ‘నీడలతో పోట్లాడినట్టు’ ఏ పార్టీవారు ఆ పార్టీకి తగ్గట్టుగా మాట్లాడారు. పార్టీలు, అధికారం గోలే కాని ప్రజల సమస్యలు ఎవరికీ పట్టినట్టు లేదు.
‘అవిశ్వాసం యెందుకు పెట్టారు?’ చర్చకు సమాధానం ఇస్తూ ముఖ్యమంత్రిగారి సందేహం.
నిజమే.
అవిశ్వాసం పెట్టాల్సింది ప్రతిపక్షాలు కాదు. ప్రజలు. కానీ వారికి ఆశ వున్నా ఆస్కారం లేదు. వాళ్లు తమ టైం వచ్చేవరకు అయిదేళ్ళు ఆగాల్సిందే. అంతవరకూ వాళ్లు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ఆటలు సాగాల్సిందే. రాజ్యాంగం రాసిన పెద్దలు ఈ చిన్న విషయాన్ని యెందుకు మరచిపోయారో తెలవదు.
‘మేం చక్కగా పాలిస్తున్నాం’ అంటారు పాలకులు.
‘ఇంత దరిద్రగొట్టు పాలన కనీ వినీ ఎరగం’ అంటారు అంతవరకూ పాలించి ప్రతిపక్షానికి బదిలీ అయిన పెద్దలు.
పాలితులు అంటే అసలు వోట్లు వేసి వీళ్ళను గెలిపించి అధికార అందలం  ఎక్కిస్తున్న ప్రజలకు మాట్లాడే ఛాన్సే లేదు.
ఒక్కసారి వోటు వేసి గెలిపించిన తరువాత అయిదేళ్లపాటు మళ్ళీ ప్రశ్నించే అవకాశం లేకపోవడం మన ప్రజాస్వామ్యం చేసుకున్న దురదృష్టం.
ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అంటారు.
ప్రజలు ప్రభువులా ? అడిగే హక్కులేని నోరు వాయి లేని పశువులా?
కఠినం అనిపించినా ఇది వాస్తవం – ఇదే వాస్తవం
(15/16 -03-2013) 

బ్రేకింగ్ న్యూస్ – ఇప్పుడే అందిన వార్త –





నమ్మితే నమ్మండి – నమ్మకపోతే పోండి

శాసన సభ గత కొద్ది గంటలు గా నడుస్తోంది. మరోసారి వాయిదా పడడం కోసం ఇంకోసారి వాయిదా పడడం అలవాటుగా మారిన ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నడుస్తోంది. సభ్యులు మాట్లాడుతున్నారు. టీవీలు ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్నాయి.
ఈ విచిత్రం ఎందుకట?
టీ.ఆర్.ఎస్., వై.ఎస్.ఆర్.సీ.పీ.  విడివిడిగా నోటీసులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం వల్ల చర్చ తప్ప మిన్ను విరిగి మీద పడేదేమీ లేదని టీడీపీ జారీ చేసిన విప్ తో తేలిపోయిన తరువాత అవిశ్వాస తీర్మానంపై ఎనిమిది గంటల చర్చకు సభలో తెర లేచింది. ‘ఫలితం ముందుగానే తెలిసిపోయిన వోటింగ్ కూడా ఈ రోజే జరిగిపోతుంది. అప్పటిదాకా టీవీల్లో షాడో బాక్సింగ్ చూడక తప్పదు.


టెయిల్ పీస్ : వెనుకటి రోజుల్లో జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం లోక్ సభలో ప్రవేశ పెట్టాయి. విపక్ష సభ్యులందరూ  పాలక పక్షం నిర్వాకాలను నిలబెట్టి, నిలదీశారు. బ్రహ్మాండమయిన పద జాలం ప్రయోగించి అధికార పక్షం పనితీరును ఎండగట్టారు. ఆ తరువాత వోటింగ్ జరగడం, తీర్మానం వీగిపోవడం షరా మామూలుగా జరిగిపోయాయి. ఆ తరువాత, నెహ్రూ మంత్రివర్గంలో రక్షణ మంత్రిగా పనిచేసిన కృష్ణ మీనన్ ఒక మాట అన్నారు.
“నో కాన్ఫిడెన్స్ మోషన్ (అవిశ్వాస తీర్మానం) ఈజ్ నతింగ్ బట్ షాడో బాక్సింగ్”   
*shadowboxing - sparring with an imaginary opponent (for exercise or training)  - 15-03-2013

Srishti the Great - శ్రిష్టి కి అభినందనలు


Srishti, our  grand daughter, is now the Inter district champion for the Global Reading Challenge!  (Seattle,USA.) Onto the Grand Challenge for the state next week! Go girl!


శ్రిష్టి కి అభినందనలు 

14, మార్చి 2013, గురువారం

“ప్రభుత్వపక్షము బలము ఎక్కడ వుండును?”




“ప్రతిపక్షముల అనైక్యతలోనుండును”

“ప్రతిపక్షములు అనివేటినందురు?”



“భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగు చందమున, ప్రజాసమస్యలపై విడివిడిగా పోరాడుతూ, తమలో తాము పోరాడువాటిని ప్రతిపక్షములందురు”    

వాయిదాల అసెంబ్లీ


మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి 
మళ్ళీ మళ్ళీ వాయిదాలు పడడానికి కాబోలు.


14-03-2013

13, మార్చి 2013, బుధవారం

గ్యాస్ బుకింగ్ సమయంలో జాగ్రత్త!

గ్యాస్ బుకింగ్ చేసేటప్పుడు జర భద్రం! బుక్ చేసి క్యాన్సిల్ చేస్తే సబ్సిడీ సిలిండర్ గోవిందా. ఇది స్వానుభవం. ఫోటో చూస్తే తెలుస్తుంది.




ఈ స్వానుభవ ఉదంతానికి చిన్న సవరణతో కూడిన వివరణ. అదేమిటంటే మా ఇంట్లో ఈ గ్యాస్ బుకింగ్ వ్యవహారం నా పోర్ట్ ఫోలియో. ఈ రెండు సందర్భాలలో అసలు జరిగినదేమిటంటే - ముందు గ్యాస్ బుక్ చేసాను. సిలిండర్ రాకపోవడంతో వారం పదిరోజులు చూసి మళ్ళీ ఫోను చేసాను. మీ సిలిండర్ ఇప్పటికే డెలివరీ చేయడం జరిగిందని ఓ రికార్డెడ్ వాయిస్ జవాబు చెప్పింది. ఇంట్లోనే వున్నాము. డోర్ లాక్ ప్రసక్తి లేదు. కానీ ఈ గోడు ఆ వాయిస్ వినలేదు కదా. దానితో మళ్ళీ బుక్ చేసాను. అంతకు ముందు డెలివరీ అయిందన్న సిలిండర్ ఎటు పోయిందో తెలియదు కానీ, అది కూడా లెక్కలోకి తీసుకుని కొత్త సిలిండర్ ను సబ్సిడీ కోటాలో చేర్చినట్లులేదు. అదీ మా వాడు వాళ్ల వెబ్ సైట్ లోకి వెళ్ళి చూస్తే తెలిసింది.- భండారు నిర్మలాదేవి W/O  భండారు శ్రీనివాసరావు 

ఇలా చేసి చూడండి!



ఏవీ తోచడం లేదా? బోరుకొడుతోందా? అచ్చం ఇలాటివాళ్లకోసమే మన ఘనమయిన పెట్రోలియం మంత్రిత్వ శాఖ వారు లక్షలు ఖర్చుపెట్టి పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు. గ్యాస్ సబ్సిడీ పొందేందుకు మీ ఆధార్ నంబరును మీ సంబంధిత గ్యాస్ కంపెనీకి పంపుకోవడానికి కొన్ని విధానాలను  పొందుపరిచారు. అందులో ఒకదాంట్లో వేలుపెట్టి చూసాను. చీమ కుట్టలేదు కాని తల బొప్పికట్టింది. ఆ కధాక్రమం చిత్తగించండి.

రెండు ఎస్.ఎం.ఎస్. లు పంపండి  అన్నారు. ఓస్  ఇంతే  కదా అనుకున్నాను. వివరాలు,ఉదాహరణలు కూడా చక్కగా ఇచ్చారు.
మొదటిది: మొబైల్ నెంబరు నమోదు చేసుకోవడానికి  – (గ్యాస్ కంపెనీ): IOC/HPC:REG <స్పేస్>  పంపిణీ దారు ఫోను నెంబరు సున్నా లేకుండా <స్పేస్> వినియోగదారు నెంబరు  (ఉదాహరణకు ) REG 117654321 564321)
రెండో ఎస్ ఎం ఎస్ – మీ ఆధార్ నెంబరు మీ నమోదిత మొబైల్ నెంబరు నుంచి పంపండి.
UID<స్పేస్> ఆధార్ నెంబరు  (ఉదాహరణకు: UID 343434343434)
ఇంకేం! కాసేపు ప్రయత్నిస్తే పోలా అనిపించి రంగం లోకి దిగాను అన్ని నెంబర్లు వివరాలు సిద్దంగా వుంచుకుని సిద్దమైపోయాను.
పత్రికా ప్రకటనలో చెప్పింది చెప్పినట్టు అక్షరం పొల్లుపోకుండా, నెంబర్లు తప్పు పడకుండా ఏకదీక్షగా కూర్చుని పనిపూర్తి చేసాను.
కొద్ది సేపటిలోనే ఎస్.ఎం.ఎస్.  వచ్చినట్టు మొబైల్ లో సంకేతం వచ్చింది. ‘అమ్మయ్య పనిచేసే ప్రభుత్వం’ అని కితాబు ఇచ్చుకుంటూ ఎస్.ఎం.ఎస్.  ఓపెన్ చేసాను. అందులో ఇలావుంది:
For Reg. type
HPDistributorPhoneNumberWithSTDCodeConsumerNumber and send to 9666023456
ఎక్కడో దూడ వేసాననుకుని మళ్ళీ ఓపిగ్గా అవే వివరాలతో ఎస్ ఎం ఎస్ పంపాను. సమాధానం తిరుగు టపాలో (ఎస్ ఎం ఎస్ లో) ఠక్కున వచ్చింది. చూస్తే అందులో:
For Reg. type
HPDistributorPhoneNumberWithSTDCodeConsumerNumber and send to 9666023456
అక్షరం పొల్లు పోకుండా అంతా “SAME TO SAME”
అయ్యా ఇదీ కధ.
ఏవి సేతురా లింగా! (13-03-2013)

12, మార్చి 2013, మంగళవారం

చీరే మేరే సప్నే






పండక్కి ఈ మారయినా
షాపులో చేసి అరువయినా
కనీసం  కంచిపట్టు చీరయినా
కొని తీరాలి ఆరునూరయినా

(వాక్టూన్లు – భండారు - ఆంధ్ర జ్యోతి దినపత్రిక – 1975)