31, అక్టోబర్ 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (239) : భండారు శ్రీనివాసరావు

 రేపు మనది కాదు

అక్టోబర్, నవంబరు.

దేశంలో కోట్లాది మంది ప్రభుత్వ పెన్షనర్లు ఈ రెండు నెలల్లో బతికుండి మళ్ళీ పుడతారు. పుడతారో లేదో కానీ, తాము బతికే వునట్టు వున్నట్టు ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇస్తే కాని మరుసటి నెల నుంచి పెన్షన్ రాదు. అంచేత ముసలీ ముతకా అందరూ తమకు పెన్షన్ వున్న/వస్తున్న బ్యాంకుకు బారులు తీరతారు. ప్రభుత్వాలు జీవన్ ప్రమాణ్ వంటి యాప్స్ ప్రవేశపెట్టి, ఇంటి నుంచే తాము బతికే వున్నట్టు బ్యాంకుకు తెలిపే వెసులుబాటు కల్పించారు. అయితే ఇందుకు కొంత ఫేస్ రికగ్నిషన్ వంటి సాంకేతిక ప్రజ్ఞ అవసరం.

సరే! బాగానే వుంది.

కానీ ఈ బతుకు సర్టిఫికేట్ కు, రేపు మనది కాకపోవడానికి ఏమిటి సంబంధం? వుంది.

ముందీ కధ చిత్తగించండి.

పెసిమిజం అనుకోకండి. నిజంగా రేపనేదే లేదు. నిన్న చరిత్ర. నేడు నిజం. రేపు అనుమానం.

చాలా ఏళ్ళ క్రితం మా ఇంటికి ఓ పెద్ద మనిషి వచ్చారు. నిజంగా ఆయన అన్నింట్లో పెద్దమనిషే. సందేహం లేదు. రిటైర్ అయ్యేనాటికి సొంత ఇల్లు వుంది. పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇంట్లో ఉండాల్సిన అన్ని సౌకర్యాలు వున్నాయి.

ఒక రోజు ఆ పెద్దమనిషి గారి భార్య మొగుడ్ని ఓ కోరిక కోరింది, డ్రాయింగు రూములో మాదిరిగానే బెడ్ రూమ్ లో కూడా ఓ ఏసీ పెట్టించమని. ఓస్ అదెంత పని అనుకున్నాడు. ఓ షాపుకు వెళ్లి మాట్లాడాడు. మరుసటి రోజు ఉదయం కల్లా పెడతానన్నాడు. విధి మరోలా తలచింది.

ఎలాటి రోగం రొష్టు లేని ఆయన భార్య ఆ రాత్రే విపరీతమైన గుండెపోటు వచ్చి కన్ను మూసింది.

మా ఇంట్లో ఏసీ గదిలో కూర్చోమంటే ఆయనకు మనస్కరించ లేదు. సెల వేసినట్టు భార్య అడిగిన ఆఖరు కోరిక గుర్తు చేసుకోవడమే ఆయనకు ఓ చేదు జ్ఞాపకంలా మిగిలి పోయింది.

రాత్రి వరకు కబుర్లు చెప్పిన మనిషి మరునాడు లేదు. ఇక రేపు వుందనే నమ్మకం ఏమిటి? అది ఓ భ్రమ’ అన్నాడాయన.

నిజమే అనిపించింది.

అందుకే ఏ పనీ రేపు చేద్దాం అనుకోవద్దని కూడా ఆ క్షణంలో అనిపించింది. ఈ రోజే మనది. ఎవరికన్నా సాయం చేద్దాం అనే మనసుంటే ఆలస్యం చేయకుండా వెంటనే చేయాలన్న మాట.

ఎందుకంటే రేపు మనది కాదు.

ఇది గుర్తుకు రాగానే బ్యాంకుకు బయలుదేరాను. ఈరోజు అక్టోబరు 31.

మతి మరపు కదా! లైఫ్ సర్టిఫికేట్ దాఖలుకు ఇవ్వాళే ఆఖరు రోజు అనుకున్నా. ఇంతలో మళ్ళీ గుర్తు వచ్చింది. ఫేస్ బుక్ స్నేహితులు రామనాద్ Ramnath Kampamalla గత ఆగస్టులో మా ఇంటికి వచ్చారు. ఆయన ఉద్యోగమే కంప్యూటర్ల సంస్థలో. లైఫ్ సర్టిఫికేట్ విషయంలో ఆయన సాయం తీసుకుని మొత్తం మీద ఆ ప్రక్రియ పూర్తి చేశాను.

తిరుగు టపాలో వచ్చినట్టు నిమిషాల్లోనే మెసేజ్ వచ్చింది.

మీ లైఫ్ సర్టిఫికేట్ డిజిటల్ పద్దతిలో జయప్రదంగా సమర్పించినందుకు కృతజ్ఞతలు. ఆ సర్టిఫికేట్ ని మీకు పెన్షన్ ఇచ్చే ఏజెన్సీ ప్రాసెస్ చేసి, పెన్షన్ విడుదల చేస్తుంది’

అమ్మయ్య! బ్యాంకుకు వెళ్ళే పని లేకుండా పోయింది అని సంతోషించి, ఆ విషయం అంతటితో మరిచిపోయాను.

మానవ మాత్రుడిని కనుక నేను మరిచిపోయాను.

ప్రభుత్వ యంత్రాంగం, సాంకేతిక వ్యవస్థలకు ఈ మతి మరపు లేదు కదా! అందుకని గుర్తు పెట్టుకుని గుర్తు చేసాయి, నా అక్టోబర్ పే స్లిప్ లో. ‘మీరు వయసులో పెద్దవారు కాబట్టి నవంబరు లోపు దాఖలు చేయండి’ అని హుకుం లాంటి అభ్యర్ధన. మరి ఆగస్టులో దాఖలు చేసింది ఏమైంది?

తప్పదు. బ్యాంకుకు వెళ్లి ఆరా తీయక తప్పదు. మా ఇంటికి దగ్గరే. మరీ దగ్గర కాదు మరీ దూరం కాదు, యూసుఫ్ గూడా ఎస్.బి.ఐ. బ్రాంచి. పదిన్నరకు తెరుస్తారు. వాళ్లకు కాణీ ఆదాయం లేని పని నాది. పొద్దున్నే ఇలాంటి బోణీ ఎందుకని పదకొండు ప్రాంతంలో వెళ్లాను. కస్టమర్లు పలచగానే వున్నారు. సిబ్బంది కూడా మరింత పలచగా వున్నారు. మా రేడియోతో సహా చాలా చోట్ల రిటైర్ అయిన ఉద్యోగుల స్థానంలో ఖాళీలను పూరించకుండా వున్న సిబ్బందితోనే నెట్టుకు వస్తున్నారు. బహుశా బ్యాంకుల పరిస్థితి కూడా అదేనేమో!

రిసెప్షన్ అని రాసి వున్న చోట నీరజ అనే అమ్మాయి నిలబడే పనిచేస్తోంది. వెళ్లి వచ్చిన పని చెప్పాను. అందుకు సంబంధించిన పెద్ద అధికారి, చిన్న అధికారి ఇద్దరూ బ్యాంకు ఏటీఎం పనిలో వున్నారు, కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి' అన్నది చాలా మర్యాదగా.

ఇప్పుడు బ్యాంకులు వెనుకటి మాదిరిగా లేవు. కార్పొరేట్ స్థాయిలో మంచి మంచి కుర్చీలు, ఏసీ సదుపాయం. ఇంటికి పోయి చేసేది ఇదే కదా అని, అక్కడే మంచి చోటు చూసుకుని సెటిల్ అయ్యాను.

ఉన్న అయిదారుగురో, పదిమందో సిబ్బంది కూడా కాగితాలు, నోట్ల బండిళ్ళు పట్టుకుని అటూఇటూ తిరుగుతున్నారు. నాలుగో తరగతి సిబ్బంది మాత్రం వాళ్ళ స్థానాల్లో సుఖాసీనులై విశ్రాంతి తీసుకుంటున్నారు. పెద్ద అధికారి, చిన్న అధికారుల జాడలేదు.

ఈ లోపున విశ్రాంతిలో వున్న నాలుగో తరగతి అధికారి మా వద్దకు వచ్చి పెద్ద సారు రావడానికి చాలా సమయం పడుతుంది అన్నాడు, ఇక దయ చేయండి అన్నట్టు.

నేను మళ్ళీ నీరజ గారి దగ్గరికి వెళ్లాను. ‘నాకు పెద్ద పనేమీ లేదు, సర్టిఫికేట్ ఆల్రెడీ జీవన్ ప్రమాణ్ ద్వారా ఇచ్చేశాను. అదేమైంది అనే నా సందేహం నివృత్తి చేస్తే వెళ్ళిపోతాను. కాదు కూడదు ఇవ్వాలి అంటే రేపు కూడా వ్యవధి వుంది కదా, వచ్చి ఇస్తాను’ అన్నాను. ఆ అమ్మాయి ఏమనుకుందో ఏమిటో, ‘వయసు ఎనభయ్, రేపు వస్తానంటున్నాడు’ అన్నట్టు నా వైపు ఎగాదిగా చూసి, ఒక కౌంటర్ లో తలెత్తి చూసే విరామం లేకుండా పనిచేస్తున్న అనూష అనే మరో ఉద్యోగిని వద్దకు తీసుకువెళ్లి, నేను వచ్చిన పని వివరాలు చెప్పింది. ‘ముందు కాసేపు ఆగండి ఆ అధికారి రాగానే మీ పని చూస్తారు’ అన్నది కాస్తా నా మాటలతో మెత్తపడి, ‘మీ పీ పీ ఓ నెంబరు చెప్పండి’ అన్నది. కీ బోర్డు మీద వేళ్ళు టకటకలాడిస్తూ, ఎదురుగా వున్న మానిటర్ లోకి చూస్తూ ‘మీరు ఆగస్టులో ఇచ్చింది ఇక్కడ డిస్ ప్లే కావడం లేదు, రేపు వచ్చి చెప్పండి, అప్పటికి అప్ లోడ్ కాకపోతే అప్పుడు చూద్దాము, రేపు ఒక్క అయిదు నిమిషాలు వస్తే చాలు, ఈ పని పూర్తి చేస్తాను’ అన్నది అనునయంగా.

నిజానికి ఇది ఆమె పని కాదు. అయినా ఆ మాత్రం భరోసా ఇచ్చింది. బ్యాంకుల సిబ్బంది పనితీరు పట్ల నీలినీడలు కమ్ముకుంటున్న సమయంలో ఇలాంటి ఉద్యోగుల అవసరం చాలా వుంది.

నిజానికి బ్యాంకుల భయం బ్యాంకులది.

ఇవ్వాళ ముప్పయి ఒకటి. రేపు నవంబరు ఒకటిన నేను బతికి వుండాలి. అప్పుడే పెన్షన్. ఈ రోజే ఆ పని చేస్తే కుదరదు. ఏమో ఎవరు చెప్పొచ్చారు? ఏం జరుగుతుందో ?

అందుకే అన్నది, రేపు మనది కాదు.

(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: