13, అక్టోబర్ 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (233) : భండారు శ్రీనివాసరావు

 ముగింపుకు ప్రారంభం

‘నాన్నా, నాకో వాగ్దానం చేయండి!

‘నాన్నా,

‘ముందుగా మీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను,  మీరు నాకు హీరో. చిన్నప్పటి నుంచీ మీరు నాకు  ఆరాధ్యులు,  నాకు  ప్రేరణ. జీవితంలో మీరు సాధించిన ప్రతి విషయం గురించి నా స్నేహితులకు  చెప్పేటప్పుడు నాకు గర్వంగా ఉంటుంది. కుటుంబంలోనే కాకుండా, సమాజంలో కూడా మీరు సంపాదించిన ప్రేమ, గౌరవం అసమానమైనవి. మేమందరం గర్వపడే విషయాలు అవి.

‘అయితే ఒక మాట నేను చాలా రోజులుగా మీతో చెప్పాలనుకుంటున్నాను. మీరు అంగీకరిస్తారని నమ్ముతున్నాను. నా జీవితంలో చూసిన అత్యంత శక్తివంతమైన మహిళ, అంటే మీ భార్య, నా అమ్మ. ఆమె కళ్లలో కన్నీళ్లు చూడటం నాకు అసహ్యం. నేను భరించలేని విషయం. మీరు కొంచెం ప్రశాంతంగా ఉండి, పత్రిక తిరగేస్తూ వుంటే, ఆమె కంట్లో నీరు చిప్పిల్లే మాటలు మీ నోటి నుంచి వచ్చేవి కావేమో.

‘కోపంగా ఉన్నప్పుడు మనసులో లేని మాటలు కూడా బయటకు వస్తాయి. ఆ సమయంలో ఎదుటివారిని బాధ పెట్టడమే ప్రధాన ఉద్దేశ్యంగా మారిపోతుంది. నేను తెలుసుకున్న ఒక విషయం — కోపంలో చెప్పిన మాటలతో అసలు భావం వ్యక్తం కాదు. శాంతంగా మాట్లాడినప్పుడు మాత్రమే మనం చెప్పాలనుకున్న విషయం ఎదుటివారికి స్పష్టంగా చేరుతుంది. మీకు తెలియని విషయాలు ఏవో మీకు చెప్పాలని ఈ మాటలు చెప్పడం లేదు. మీరు నాకు గురువు. అనుభవం, జ్ఞానం, ఓర్పు అన్నింటా మీరే నాకంటే మిన్న.

‘నా ఉద్దేశ్యం ఒక్కటే నాన్నా!  మీరు మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఏదో మీరనుకున్నది కొంచెం ఆలస్యం అవుతుంది. ఇంట్లో ఏదో ఒక వస్తువు రిపైర్ కి వస్తుంది. ఎవరో చెప్పాపెట్టకుండా అనుకోని సమయంలో వచ్చి ఏదో అడుగుతారు. ఒక్కోసారి తినే తిండిలో రుచి ఉండక పోవచ్చు. కొన్ని సందర్భాలలో అమ్మ మీకంటే భిన్నంగా ఆలోచించవచ్చు. లిఫ్ట్ పనిచేయకపోవడం, విద్యుత్ అంతరాయం, BSNL లైన్ కట్ అవడం, డ్రైవర్ ఆలస్యం, ల్యాప్టాప్ లేదా ఇంటర్నెట్ సమస్యలు, రోడ్లపై ట్రాఫిక్, ఇవన్నీ జీవితాన్ని అమాంతం మార్చి వేసేంత పెద్ద విషయాలు కావు.

‘జీవితంలో నిజంగా ముఖ్యమైంది,  మనం చేసిన తప్పును అంగీకరించి, నమ్రతతో క్షమాపణ చెప్పగల ధైర్యం కలిగి ఉండటం. అలాగే ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. నాకు తెలుసు,  నా కోపం వల్ల నేనే ఎన్నో తప్పులు చేశాను. నాకు అత్యంత సన్నిహితులైన వారిని  నా మాటలతో గాయ పరిచాను. ఆ బాధ ఇంకా నా మనసులో ఉంది.

‘నాన్నా,

‘ఈ లేఖ రాయడంలో నా ఉద్దేశ్యం మీకు నొప్పి కలిగించడం కాదు. నా మనసులోని భావాలను మీతో పంచుకోవడమే. మీపై ఉన్న ప్రేమ, గౌరవం ఇలాంటి చిన్న చిన్న సంఘటనల కారణంగా ఏనాటికి తగ్గదు.

జీవితాన్ని ప్రేక్షకుడిగా చూస్తేనే దాని సౌందర్యం తెలుస్తుంది. చుట్టూ జరిగే ప్రతిదీ చూడొచ్చు, కానీ మనపై ప్రభావం చూపేది ఏది అనేది మనమే నిర్ణయించుకోవాలి.

‘నా చిన్న అనుభవం నాకు చెబుతోంది. జీవితంలో ఇతరులతో మనం చేసే వాదనల్లో తొంభయ్ శాతం తేలిగ్గా తప్పించుకోవచ్చు. ఎందుకంటే చివరికి, వాదనలో ఎవరు  గెలిచినా ఓడినా, అందులో ముఖ్యంగా భార్యాభర్తలు, తండ్రీ కొడుకుల మధ్య జరిగే వాదోపవాదాల వల్ల ఎలాంటి ప్రయోజనం వుండదు.

‘నాన్నా, మీరు ఎప్పుడూ మా కుటుంబానికి అండగా ఉన్నట్లే, నేను ఎప్పటికీ మీ వెనుక నిలబడుతాను. ఈ రోజు నేను ఉన్న స్థానం, నేను జీవిస్తున్న జీవితం  ఇవన్నీ మీరు ఇచ్చినవే!

‘మళ్ళీ చెబుతున్నాను. ఇక ఎప్పుడూ అమ్మకంట నీరు తిరిగేలా మీ ప్రవర్తన వుండకుండా చూసుకోండి. నేను కోరేది ఇదొక్కటే! అందరం కలిసి వీలైనంతగా అమ్మను సుఖపెడదాం. సుఖ పెట్టలేకపోయినా కనీసం ఆమె మనసుకు కష్టం కలగకుండా చూద్దాం. ఇప్పటికే తన జీవితంలో అధిక భాగం మన కోసమే కష్టపడింది. ఇక దానికి ఫుల్ స్టాప్ పెడదాం. కాదనకండి.

ఈ ఒక్క వాగ్దానం చేయండి చాలు.

మీ సంతోష్!

(2016 లో ఒకరోజు)

ఒక పదేళ్ల క్రితం సంతోష్ పుణేలో ఉద్యోగం చేస్తున్న మా రెండో కుమారుడు సంతోష్ మమ్మల్ని చూద్దామని హైదరాబాద్ వచ్చాడు. ఆ రాత్రి మా దంపతుల నడుమ ఏదో చిన్న విషయంలో మాట పట్టింపు వచ్చింది.

‘కోపం వచ్చినప్పుడు పది ఒంట్లు లెక్కపెట్టుకో, అసలే నీకు కోపం జాస్తి, ఎవర్ని ఎంతమాట అంటావో నీకే తెలియదు’ అనేది మా బామ్మ. పిచ్చి బామ్మ. కోపం వచ్చినప్పుడు ఒంట్లు  లెక్కపెట్టుకుంటూ కూర్చుంటారా ఎవరైనా, అందులో  ముఖ్యంగా, కోపం ముందు పుట్టి తరువాత పుట్టిన నా వంటి దూర్వాసులు. అలాగే ఆ రోజు మా ఆవిడపై మాట తూలాను, పిల్లలు ఇంట్లో వున్నారన్న సోయి కూడా లేకుండా. ఆడది ఏం చేస్తుంది. ఎదురు తిరిగి ఏమీ అనలేదు. అదే వారి బలహీనత. అదే మగవాడి బలం. కంటనీరు తుడుచుకుంటూ పిల్లలను పలకరించింది. నేను షరా మామూలే. మొండి ఘటాన్ని.  రెండు రోజులు వుందామని వచ్చిన వాళ్ళు, మర్నాడే ఈవినింగ్ ఫ్లయిట్ కు వెళ్లి పోయారు. వెడుతూ వెడుతూ నాకు రాసి పెట్టిపోయిన ఉత్తరమే మీరింత వరకు చదివింది. ఇన్నేళ్ళుగా ఈ ఉత్తరం నా వద్ద పదిలంగా వుంది. నా లోని మరో మనిషి లేచినప్పుడు, నన్ను నేను అదుపు చేసుకునే ఆయుధంగా పనికి వస్తోంది. అలాగని నేనేదో గౌతమ బుద్ధుడిగా మారిపోయాను అని కాదు. కొంతలో కొంత ప్రవర్తనను మార్చుకోవడానికి పనికి వస్తోంది. నిజానికి ఈ ఉత్తరాన్ని వాడు ఇంగ్లీష్ లో స్వదస్తూరీతో రాశాడు. దాన్ని తెనుగు చేయడానికి నేను చాలా కష్ట పడ్డాను. ఈ కాలపు పిల్లల ఇంగ్లీష్ తో నాకట్టే పరిచయం లేదు. అలాగే వాళ్లకు నా తెలుగు రాతలు అంతగా అర్ధం కావు.   

‘మీరు ఎలా జీరో అవుతారు’ అని ఈ ఎపిసోడ్స్ రాయడం మొదలు పెట్టినప్పటి నుంచీ చాలామంది అడుగుతున్న ప్రశ్న. చివర్లో చెబుతాను అని తప్పించుకుంటూ వస్తున్నాను. ఇప్పటికే 232 ఎపిసోడ్స్ అయ్యాయి. ఇంకా చెప్పాల్సిన సంగతులు చాలా వున్నాయి. ఇంత చిన్న జీవితం, ఇంత విస్తృతమైనదా అని అప్పుడప్పుడూ అనిపిస్తుంది.

ముగింపు ముందే రాయడానికి ఒక కారణం వుంది.  

ఒక వారం అయిందనుకుంటా.

తెల్లవారుఝామున నిద్రలో నేను చనిపోయాను. ఇంట్లో ఒక్కడినే. నిద్రలో కనుక ఈ విషయం ఎవరికీ తెలియదు. పొద్దున్నే పనిమనిషి వచ్చి బెల్లు కొట్టింది. రాత్రి బాగా పొద్దుపోయిందేమో నిద్ర లేవలేదు అనుకుని వెళ్ళిపోయింది. తరువాత వచ్చిన వలలి వనితకు కూడా అదే అనుభవం. మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు కూడా ఇంట్లో నా అలికిడి లేదు. ఫోన్ చేశారు తీయలేదు. మర్నాడు అనుమానం వచ్చి పక్కింటి వాళ్ళతో మా అన్నయ్య కు ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళ సందేహమే నిజమైంది. వాళ్ళ దగ్గర ఉన్న తాళం చెవులతో తలుపు  తెరిచి చూస్తే, ఏముంది పడక గదిలో  విగత జీవిగా మంచం మీద పడివున్న నేను.

ఆ రోజు తెల్లవారుఝామున నాకు వచ్చిన కల ఇది.  ఆ సమయంలో వచ్చిన కలలు నిజమవుతాయని అంటారు. కానీ అంత నిశ్శబ్దంగా, ప్రశాంతంగా  ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించడానికి అంతటి పుణ్య కార్యాలు ఏమీ చేయలేదు.

కానీ ఈ కల నాకొక సత్యాన్ని ఎరుకపరిచింది.

ఇలాగే రాసుకుంటూ పొతే ఇక నేను చివర్లో చెప్పాలని అనుకున్న విషయం చెప్పే అవకాశం వుండకుండా పోతుందేమో! ఇదేమీ డిటెక్టివ్ త్రిల్లర్ కాదు, చివరి వరకూ సస్పెన్స్ లో వుంచడానికి.

ముందు చెప్పాల్సింది చెప్పేద్దాం! తరువాత సంగతి తరువాత.  ముగింపుకు ప్రారంభం అన్నమాట.

(కింది ఫోటో)




(ఇంకావుంది)

కామెంట్‌లు లేవు: