8, అక్టోబర్ 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (229): భండారు శ్రీనివాసరావు

 

నా నడక చూడ తరమా!
‘మా ఆయన నిద్ర మంచం దిగి నాలుగు అడుగులు నడిస్తే, అరిసెలు వండి పెడతాను’ అనేది మా ఆవిడ.
గతంలో ఓ పుష్కర కాలానికి పైగా రోజువారీ, కొండొకచో పూటవారీ టీవీ చర్చల పుణ్యమా అని పొద్దున్నే నిద్ర లేవడం అలవాటయింది. చర్చల అనంతరం ఇంటికి చేరగానే మళ్ళీ పడక సీను నిత్యకృత్యం.
2005 డిసెంబర్లో హైదరాబాద్ దూరదర్శన్ నుంచి రిటైర్ అయిన తరువాత ఎల్లారెడ్డి గూడాలో ఒక అపార్ట్ మెంట్ లో ఫ్లాటు అద్దెకు తీసుకున్నాము. దానిపక్కనే ఓ చిన్న గుడి.
బ్లాగు లోకంలో సంచరిస్తూ కంప్యూటర్ ముందు కూచుని కూచుని పట్టిన మెడ నొప్పికోసం, డాక్టర్ దగ్గరకు వెడితే ఆయన ఉదయం సాయంత్రం వీలు చూసుకుని ఓ గంట నడవమని సలహా ఇచ్చాడు. మెడ నొప్పికి, కాలినడకకు సంబంధం ఏమిటనే చచ్చు ప్రశ్నలు వేయకుండా, డాక్టర్ సలహా పాటించడానికి నిర్ణయించుకున్న వాడినై, ఓ మంచి ముహూర్తం చూసుకుని, మార్నింగ్ టీవీ చర్చలకు అడ్డురాని సమయాన్ని ఎంచుకుని ఇంటికి దగ్గర్లో వున్న మునిసిపల్ పార్కులో మాణింగ్ వాక్ మొదలు పెట్టాలని అనుకున్నాను.
అలా మొదలైన నా నడక, ద్వితీయ విఘ్నం వుండరాదనుకున్న కారణంగా రెండే రెండు రోజులు సాగి, మూడో రోజే ఆగిపోయింది. మా ఇంటికి పార్క్ దగ్గరే కానీ, దాన్ని చేరే రోడ్డు మీద నడవడం ఎంత గగనమో మొదటి రోజునే తెలిసింది. నడిచే వాళ్ళు కానీ, వాహనాలు నడిపే వాళ్ళు కానీ ఎవరూ రోడ్డు సెన్స్ పాటిస్తున్నట్టు లేదు. ఎవరు ఎటు నుంచి వచ్చి మీద పడతారో తెలియదు. ఏ వాహనం ఎటు నుంచి వచ్చి సర్రున వచ్చి రాసుకుంటూ పోతుందో తెలవదు. ఎదురుగా వాహనం రాదు అనుకుని జాగ్రత్తగా నడిచి వెడుతున్నా కూడా, రాంగ్ రూటులో ఎదురుగా ద్విచక్ర వాహనాలు దూసుకుంటూ వస్తాయి. అవి దగ్గరకు వచ్చేదాకా తెలవదు. పైగా రోడ్డు మీద మొనతేలిన ఎదురు రాళ్ళు. ఈ వయసులో కాలో చెయ్యో విరగగొట్టుకుంటే సానుభూతి కూడా వుండదు.
పోనీ పేవ్ మెంటుపై నడుద్దామనుకుంటే, సర్కస్ చేస్తూ నడవాలి.
జానెడు బెత్తెడు పేవ్ మెంటుపై అడ్డదిడ్డంగా పార్క్ చేసి వున్న వాహనాలు, ఇప్పట్లో ఇక్కడినుంచి కదిలేది లేదని భీష్మించుకున్నట్టు తాపీగా విశ్రాంతి తీసుకుంటూ వుంటాయి. మిగిలిన కాసింత జాగాలోనే వీధికుక్కలు తమ కాలకృత్యాలకు సర్దుకుంటాయి. చూడకుండా కాలు వేస్తే ఇంతే సంగతులు. ఈ నరకం కంటే, మెడ నొప్పే నయమనిపించింది. దాంతో లేకలేక అరవయ్యో ఏట మొదలు పెట్టిన కాలినడక వ్యాయామం కాస్తా, అలవాటు లేని ఔపోసనంలా రెండు రోజుల ముచ్చటగా ముగిసింది.
అయితే, ఈ రెండు రోజుల కాలినడక నాకో పుణ్యమూర్తిని పరిచయం చేసింది.
తెల్లవారకముందే లేచి గుడిముందు వూడ్చి ముగ్గులు పెట్టే సీతమ్మ, నా వాకింగ్ ప్రయోగంలో మొట్టమొదట పరిచయం అయిన వ్యక్తి.
అంత వయస్సులో ఇంత కష్ట పడుతున్న ఆమెను చూసి మనసు కష్ట పడింది. కానీ ముక్కూ మొహం తెలియకుండా ఏదయినా సాయం చేయడానికి తెలియని సంకోచం. వాకింగ్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు చూస్తే గుడి ముందు చిన్న పట్టా పరచుకుని భక్తులు వొదిలే పాదరక్షలు కనిపెట్టి చూస్తూ వారిచ్చే చిల్లర పైసలు తీసుకుంటూ వుండేది. ఇది సర్వసాధారణంగా కానవచ్చే దృశ్యమే. పెద్ద ప్రత్యేకత వున్న విషయం కాదు. కానీ జర్నలిస్టు గుణం ఇంగువ కట్టిన గుడ్డ కదా! నెమ్మదిగా కదిలించి విషయాలు రాబట్టాను.
చరాస్తి అనండి చిరాస్తి అనండి ఆమెకు వున్నది ఆ సంచీ ఒక్కటే. దాంతోనే సీతమ్మ గంపెడు సంసారాన్ని ఈదుకుంటూ వచ్చింది. కూలీ నాలీ చేస్తూ సంసారం లాగిస్తున్న మొగుడు రోడ్డుప్రమాదంలో కన్ను మూశాక, మొత్తం భారాన్ని తన భుజాల మీదకు ఎత్తుకుంది. పిల్లల్ని పెద్దచేసి పెళ్ళిళ్ళు చేసి సాగనంపింది. వొంటి చేత్తో కుటుంబం బరువు బాధ్యతల్ని నెట్టుకొచ్చిన సీతమ్మ బతుకు, చివరికి బతుకు బాటలో వొంటరి ప్రయాణంగా మారింది.
సీతమ్మది సూర్యాపేట దగ్గరవున్న జగ్గయ్యపేట. పొరుగూరు సంబంధమని సూర్యాపేటలో రోజుకూలీ చేసుకునే సుబ్బయ్యకిచ్చి చిన్నతనంలోనే పెళ్ళిచేశారు. తర్వాత పొట్టచేతబట్టుకుని హైదరాబాద్ వలస వచ్చారు. తేదీలు, సంవత్సరాలు సరిగా గుర్తులేవు కానీ, ఆమె చెప్పిన వివరాలప్రకారం వాళ్లు హైదరాబాద్ వచ్చి (అప్పటికి) యాభయ్ ఏళ్ళు దాటిందనే అనుకోవాలి. నాటికి ఎల్లారెడ్డిగూడాలో ఇళ్లు విసిరేసినట్టు అక్కడొకటి ఇక్కడొకటి వుండేవట.
ఆ రోజుల్లో కూలీ పనులు ఓ పట్టాన దొరికేవి కావు. పొట్టగడవడం సంగతి దేముడెరుగు, కట్టుకున్నవాడు లారీ కిందపడి చనిపోయాడు. నాలుగిళ్ళల్లో పాచి పనులు చేసుకుంటూ పిల్లల్ని సాకింది. పెళ్ళిళ్ళు అయి ఎక్కడి వాళ్లు అక్కడికి రెక్కలొచ్చి ఎగిరిపోయారు. తమ దగ్గరకు వచ్చి వుండమని పిల్లలు ఎంత బతిమాలినా సీతమ్మ, రాముడి గుడిని వొదిలిపెట్టి వెళ్ళడానికి వొప్పు కోలేదు.
వుండడానికి ఇల్లంటూ లేదు. గుడికి నాలుగిళ్ళ అవతల ఓ అపార్ట్ మెంట్ లో వాచ్ మన్ కుటుంబంతో కలసి వుంటుంది. పగలంతా గుడి దగ్గరే మకాం. ఇలాటి వాళ్ళ కోసమే అన్నట్టు ఓ చిన్న కుర్రాడు ఓ పెద్ద ఫ్లాస్క్ లో టీ తెచ్చి అమ్ముతుంటాడు. దేవుడి ప్రసాదమే పగటి పూట సాదం. రాత్రి వాచ్ మన్ కుటుంబం పెట్టే తిండికి ఎంతో కొంత ముట్ట చెబుతుంది.
సీతమ్మ లెక్క ప్రకారం జనంలో భక్తి పెరిగింది. గుళ్ళకు వచ్చేవాళ్ళు పెరిగారు. వెనక చెప్పులు కనిపెట్టి చూసినవారికి పావలా అర్ధ ఇస్తే ఘనం. ఇప్పుడు పది రూపాయల నోటు కూడా వెనకాముందు చూడకుండా ఇచ్చేవాళ్ళు ఎక్కువయ్యారు. దానా దీనా ఆదాయం పెరిగింది. ఖర్చులు తగ్గాయి. బ్యాంకులో ఖాతా తెరిచింది. కూడబెట్టిన డబ్బులోనుంచి అప్పుడప్పుడు పిల్లలకు ఎంతో కొంత పంపుతుంటుంది. దేవుడి దయ వల్ల రోగం రొష్టు లేవు. ఏ బాధా లేదు. బాధపెట్టేవాళ్ళూ లేరు.
బండెడు కష్టాలతో మొదలయిన గంపెడు సంసారం కాస్తా సంచీడు సంసారంగా మారింది. రోజులు వెళ్ళమార్చే స్తితి నుంచి రోజులు గడిచే స్తితికి చేరుకుంది. ఒకళ్ళమీద ఆధారపడకుండా జీవిస్తోంది.
‘ఇంతకంటే ఇంకేం కావాలి ?’ అనే సీతమ్మ నుంచి ‘ఇంకా ఇంకా కావాలి’ అని ఆరాటపడే జీవులు నేర్చుకోవాల్సింది ఎంతో వుందనిపించేది.
అన్ని రోజులు ఒకే రకంగా గడవవు కదా! మధ్యలో ఇల్లు మారి మరో ప్రాంతానికి వెళ్లి, భూమి గుండ్రం అన్నట్టు మళ్ళీ ఖాళీ చేసి వెళ్ళిన ఇంటికే కొన్నేళ్ళకు చేరాము. సీతమ్మ గురించి విచారిస్తే ఆమె లేదన్న విచారకర వార్త తెలిసింది.
ఇదో బాధాకర అధ్యాయం.
తోకటపా:
ఇదేదో పరాయి దేశాన్ని పొగిడి, మన దేశాన్ని కించపరచడానికి కాదు. ప్రపంచంలో అన్ని దేశాలకు భారతదేశం నాగరికత నేర్పిందని చరిత్ర చెప్పే పాఠాలు నిజమే. కానీ అది గతం. ఇప్పుడెక్కడున్నాం. అదీ ఆలోచించుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
అమెరికాలో కుమారుడి దగ్గర ఉంటున్న రోజుల్లో శాస్త్రి గారు ఒక రోజు పొద్దున ఫోన్ చేశారు. శాస్త్రి గారంటే వేమూరి విశ్వనాధ శాస్త్రి. వీవీ శాస్త్రి అంటే రేడియోలో పనిచేసేవారికి బాగా తెలుస్తుంది. స్టేషన్ డైరెక్టర్ గా సుదీర్ఘ కాలం పనిచేశారు.
శాస్త్రిగారు అమెరికాలో ఉంటున్నది దక్షిణ సాన్ ఫ్రాన్సిస్ స్కోలోని పసిఫికా అనే ప్రాంతంలో. దగ్గరలో పసిఫిక్ మహాసముద్రం బీచ్. అక్కడికి మార్నింగ్ వాక్ కోసం వెళ్ళడం అలవాటు చేసుకున్నారు. రోడ్డు పక్కన సన్నటి కాలిబాట బాగానే ఉన్నప్పటికీ దారి ఎగుడు దిగుడుగా ఉంటుందట. ఎనభయ్ దాటిన వయసులో ఆయన మెల్లగా నడిచి వెడుతున్నప్పుడు, ఎదురుగా వచ్చేవారు బాట మీద నుంచి కొంచెం పక్కకు దిగి దారి ఇస్తారట. వృద్ధులకు అక్కడి వారు ఇచ్చే గౌరవం అది. మొన్న ఒక వ్యక్తి కుక్కతో సహా వాహ్యాళికి వచ్చి ఈయనకు ఎదురు పడ్డాడట. కుక్క ముందు నడుస్తోంది. ఆ ఆసామీ దాని గొలుసు పట్టుకుని వెనకనే వస్తున్నాడట. చిత్రంగా ఆ కుక్క కూడా శాస్త్రి గారు ఎదురుపడగానే పక్కకు తప్పుకుని శాస్త్రి గారికి దారి ఇచ్చిందట. ఇది చూసినప్పుడు ఆయనకు హైదరాబాదు అనుభవం గుర్తుకు వచ్చిందట.
శాస్త్రి గారికి కృష్ణా నగర్ ఉమెన్స్ కోఆపరేటివ్ సొసైటీలో సొంత ఇల్లు వుంది. రోజూ ఈవెనింగ్ వాకింగ్ కి వెళ్ళే అలవాటు. అసలే ఇరుకు రోడ్లు. పేవ్ మెంట్లు సరిగా వుండవు. పైగా వన్ వే. వాహనాలు వేగంగా దూసుకు పోతుంటాయి. ఆటోలు అడ్డదిడ్డంగా కాలిబాటల మీదనే పార్క్ చేస్తారు. ‘కాస్త పక్కకు తీస్తావా’ అని ఒక ఆటో డ్రైవర్ ని మర్యాదగానే అడిగారట. ‘నేనెందుకు తీయాలి, మీరే దిగి రోడ్డు మీద వెళ్ళండి’ అని దురుసుగా జవాబిచ్చాడట.
కామెంటు అనవసరం కదా!
కింది ఫోటో:
అమెరికాలో ఆహ్లాదకరమైన వాహ్యాళి


2024


2004




(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: