నేను మాటకారిని కావచ్చేమో కానీ వక్తను కాను.
హెచ్ ఎం టీ వీ వాళ్ళు, చాలా ఏళ్ళ క్రితం యువతలో ప్రసంగ పాటవాన్ని పెంపొందించే ఉద్దేశ్యంతో వక్త అనే పేరుతో అనుకుంటా, ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేస్తూ, అందుకోసం ఒక శిక్షణా కార్యక్రమాన్ని కూడా నిర్వహించేవారు. ఆ క్రమంలో ఒక రోజు నన్ను ఆ శిక్షణా కార్యక్రమంలో ప్రసంగించమని ఆహ్వానించారు. బహుశా టీవీ చర్చల్లో నా విశ్లేషణలను చూసి నన్ను పిలిచి వుంటారు.
మాట్లాడడం ఎలా అనే విషయంలో యువతకు అంతటి ఆసక్తి వుందని వెళ్ళేంత వరకూ నాకూ తెలియదు. అప్పుడు సమైక్య రాష్ట్రం. అనేక జిల్లాల నుంచి చాలామంది రావడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ మహా సమావేశంలో ప్రసంగించడం ఎట్లా అనే భయం కూడా పట్టుకుంది. మూడు నాలుగు వాక్యాల తర్వాత ఏం మాట్లాడాలో మరచిపోయే మతిమరపు నాది.
అంచేత ఒకటి రెండు ముక్కలు చెప్పి, మీరు ప్రశ్నలు అడగండి, నేను జవాబు చెబుతాను అన్నాను. ఏదైనా ఎవరైనా అడుగుతుంటే వాటికి చమత్కారంగా సమాధానం చెప్పడం నాకు వెన్నతో పెట్టిన విద్య, ఆ విధంగా ఆ పూటకు నా పని పూర్తి చేసుకుని, టీవీ వాళ్ళు కప్పిన శాలువా, ఇచ్చిన మొమెంటోతో బతుకు జీవుడా అని బయట పడ్డాను.
2005లో హైదరాబాదు దూరదర్శన్లో ఉద్యోగ విరమణ రోజున వీడ్కోలు ప్రసంగం చేయాల్సిన అవసరం పడింది. షరా మామూలుగా ప్రసంగ పాఠం సిద్ధం చేసుకున్నాను.
‘అందరికీ నమస్కారం...
‘జాతస్య మరణం ధృవం అన్నట్టు, సర్కారు ఉద్యోగికి ఏదో ఒకనాడు, 'ఈనాడు ' అనేది రాక తప్పదు.
‘నా వృత్తి జీవితపు చరమాంకంలో కొద్దికాలం మీతో కలిసి పనిచేసే సదవకాశం దొరికింది. పరస్పర అవగాహనకు ఈ స్వల్ప సమయం చాలకపోవచ్చు. కానీ మీ అభిమానం చూస్తుంటే ఈ అభిప్రాయం తప్పేమోనని అనిపిస్తోంది.
‘చూస్తుండగానే రేడియోలోను, ఇక్కడా ముప్పయ్యేళ్ళు చక చకా గడిచిపోయాయి. ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపూ సొలుపూ వుండదన్నట్టు కాలం హాయిగా వేగంగా దొర్లిపోయింది. వొప్పచెప్పిన పనులతోపాటు చిన్నా చితకా ఇతరత్రాలు కూడా నెత్తికెత్తుకున్నందువల్ల, చేసే పనిలో ఏనాడూ రొటీన్ ఫీల్ కాలేదు. పైగా ఏరోజుకారోజు కొత్తగా గమ్మత్తుగా గడిచిపోయింది.
‘అసూయ తెలియని పై అధికారులు, ఆత్మీయత కనబరిచే సాటి సిబ్బంది, నిజానికి ఏ ఉద్యోగికైనా ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది?
‘అందుకే, అత్తలేని కోడలులాగా అందరిలోను, అందరితోను కలిసిపోయి, కలగలిసిపోయి ఓ మోస్తరుగా అత్తెసరు మార్కులు కొట్టేయగలిగాననే అనుకుంటున్నాను.
‘అయితే ఉప్పూ, కారం తినేవాడిని కనుక, ఎప్పుడో ఒకప్పుడు, ఎవరినో ఒకరిని వృత్తి ధర్మంగా నొప్పించే వుంటాను. మాటతూలే వుంటాను. ఇలాంటి సందర్భాలలో అప్పటికప్పుడే ‘సారీ’ చెప్పేసి, మనసు కడిగేసుకోవడం నాకలవాటు. అయినా, నావల్ల మనసు నొచ్చుకున్నవారెవరైనా వుంటే మన్నించమని మనసారా కోరుకుంటున్నాను. అప్పుడే ప్రశాంతమైన ఉద్యోగ విరమణ పర్వానికి అర్ధం, పరమార్ధం.
‘నాకు ‘సరిగా’ మాట్లాడడం రాదు. ఇది నా మాట కాదు. మా ఆవిడ ఉవాచ. ముఖ్యంగా మనసు ఆర్ద్రం అయిన ఇలాటి సందర్భాలలో.
‘అందుకే మనసులోని మాటలను ఇలా అక్షరాలలో పరచి మీ అందరితో పంచుకుంటున్నాను.
‘మీ వద్ద సెలవు తీసుకునేముందు మరో మాట.
‘నిజమే! కృతజ్ఞతలు బాహాటంగా చెప్పడం చాల కష్టమే...
‘అందుకే మీ అందరికీ మరోసారి మరొక్క నమస్కారం’
తర్వాత, మరో పదేళ్లకు కాబోలు ఒక కళాశాల వార్షికోత్సవంలో పాల్గొనే ఒక అరడజను విశిష్ట, పరమ విశిష్ట అతిధుల జాబితాలో నన్ను చేర్చారు. రేడియోలో పనిచేశాడు కదా ఎంతో కొంత మాట్లాడకపోతాడా అనే నమ్మకంతో.
సరే! కారు పంపించారు కదా అని వెళ్లాను.
హైదరాబాదు ఆర్టీసీ కళ్యాణ మంటపం మందిరంలో అరోరా పీజీ కళాశాల వార్షికోత్సవం.
చాలామంది మాట్లాడిన తర్వాత నాకు అవకాశం వచ్చింది.
‘సభకి నమస్కారం’ అంటూ నా ప్రసంగం మొదలు పెట్టాను. ప్రసంగ పాఠం చేతిలో వుంది కనుక మొత్తం మీద కధ నడిపించాను. అది ఈ విధంగా సాగింది.
‘సభకు నమస్కారం అనే ఈ ఒక్క వాక్యం కనిపెట్టి నా స్నేహితుడు, సినిమా దర్శకుడు 'జంధ్యాల', సభల్లో వృధా అవుతున్న ఎంతో విలువయిన సమయాన్ని ఆదా చేసాడు. వేదికమీద వున్న పెద్దల పేర్లన్నీ వరుసగా ప్రతి వక్తా ప్రస్తావిస్తూ వచ్చే ఒక సంప్రదాయానికి జంధ్యాల ఆ విధంగా మంగళం పాడాడు.
‘సరే. విషయానికి వస్తాను. ఈ సభలో మాట్లాడమని నన్ను ఆహ్వానించిన క్షణం నుంచి నన్నో ప్రశ్న అదేపనిగా తొలుస్తూ వచ్చింది. ఇందుకు, నాకున్న అర్హత ఏమిటన్నది ఆ ప్రశ్న. రేడియోలో పనిచేసాడు కనుక ఏదో కొంత మాట్లాడక పోతాడా అన్న నమ్మకం కావచ్చు. అయితే రేడియో వాళ్ళతో ఓ ఇబ్బంది వుంది. వాళ్లకు అన్నీ టైం ప్రకారం జరగాలి. పది నిమిషాలు వార్తలు అంటే పిడుగులు పడ్డా ఒక్క క్షణం ఎక్కువ కాకూడదు, అలాగే పది నిమిషాలు దాటకూడదు. విషయం యెంత పెద్దదయినా క్లుప్తంగా చెప్పాలి. బ్రివిటీ ఈజ్ సోల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది రేడియోలో చెప్పే మొదటి పాఠం.
‘అంచేత క్లుప్తంగా మాట్లాడేవాళ్ళు ఇలాటి సభల్లో మాట్లాడడానికి పనికి రారేమో అనేది నాకు కలిగిన మరో సందేహం.
‘మాట్లాడ్డం అంటే గుర్తుకు వచ్చింది.
‘పశుపక్ష్యాదులు కూడా భావాలను పంచుకుంటాయి. కానీ మాటలతో వాటిని వ్యక్తీకరించలేవు. అయితే ఒకటినొకటి అర్ధం చేసుకుంటాయి, మాటలు రాని పాపాయి మాటలు తల్లి అర్ధం చేసుకున్నట్టుగా.
‘గుర్రం సకిలిస్తుంది. ఆవు అంబా అంటుంది. సింహం గర్జిస్తుంది. పాము బుస కొడుతుంది. అయితే ఈ చరాచర సృష్టి మొత్తంలో మాట్లాడగలిగే శక్తి ఒక్క మనిషికే దక్కింది.
‘అంటే ఏమిటన్నమాట. మాట్లాడే ప్రతిమాటా ఆచితూచి మాట్లాడాలి. ఆదీ మంచి మాట అయి వుండాలి. మంచికోసమే మాట్లాడాలి. ఇతరులని నొప్పించడం కోసం కాకుండా సాధ్యమైనంతవరకు వారిని మెప్పించడం కోసం లేదా ఒప్పించడం కోసం మాట్లాడాలి. మంచిని చూసి, మంచిని విని, మంచినే మాట్లాడ్డం వల్ల మనలో పాజిటివ్ వేవ్స్ ప్రసరిస్తాయి. శరీరం మనస్సూ రెండూ తగిన శక్తిని సమకూర్చుకుంటాయి.
‘విద్యార్ధి దశలో ఇవన్నీ మీకు ప్రతిరోజూ అనుభవంలోకి వచ్చే విషయాలే. మంచి ఉపాధ్యాయులు, మంచి స్నేహితులు, మంచి వాతావరణం ఇంతకంటే మనిషీ, మనసూ ఎదగడానికి ఏం కావాలి చెప్పండి.
ఉపాధ్యాయులు చెప్పే మంచి వినండి. స్నేహితులతో మంచి పంచుకోండి. మంచిగా మెలగండి. అప్పుడు, అలా మంచిగా ఉండడానికీ, లేకపోవడానికీ వుండే తేడా ఏమిటో మీ మనసుకే తెలుస్తుంది.
అంతేకాదు, అలా రోజల్లా పంచుకుని, పెంచుకున్న మంచిని ఇంటికి కూడా తీసుకువెళ్ళండి. ఇంట్లో కూడా అమ్మానాన్నతో, అక్కాచెల్లెళ్ళతో, అన్నాతమ్ములతో, ఇరుగూ పొరుగుతో మంచిగా ఉన్నారనుకోండి. ఇక పండగే పండగ. చెడు అన్నది దరి చేరనీయకుండా మంచినే పెంచుతూ పొతే, ఇక ఆ సమాజానికి అంతా మంచే జరుగుతుంది.
ఇందులో ఇంత విషయం వుంది కాబట్టే నాకిచ్చిన ఈ సమయాన్ని ఇందుకోసం వాడుకుంటున్నాను.
‘షరామామూలుగా యేవో కొన్ని అనుభవాలు చెప్పి, యేవో కొన్ని ఉద్బోధలు చేసి వెళ్లిపోవచ్చు.
కానీ, మాది గుంకే వయసు, మీది పొడిచే పొద్దు. మీరే సమాజానికి కావాల్సిన వాళ్ళు. మీ అవసరం సమాజానికి వుంది. నేను మాట్లాడుతోంది భావి పౌరులతోటి అన్న స్పృహతో మాట్లాడుతున్నాను. ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే వుంది. మీ చేతుల్లో మాత్రమే అది భద్రంగా వుంటుంది. సరయిన పౌర సమాజం మీవల్లనే రూపు దిద్దుకుంటుంది. అలా జరిగిన నాడు ఇక భవిష్యత్తు గురించి మాకెవ్వరికీ బెంగ అక్కరలేదు.
‘చదువుకునే మీరందరూ దీపాల్లాంటి వారు. ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తూ పొతే, ఇన్ని కోట్ల దీపాలున్న మన దేశం వెదజల్లే వెలుగులు ఎల్లల్ని దాటి, సమస్త ప్రపంచానికి విజ్ఞాన కాంతుల్ని ప్రసరింపచేస్తాయి. యావత్ లోకం ఓ విజ్ఞానఖనిగా తయారవుతుంది.
‘మరో మాట. నా పిల్లల చిన్నతనంలో, మా ఇంటికి దగ్గరలో వున్న అరోరా కాలేజీలో చదివించాలని అనుకున్నాను. కానీ నా ఆర్ధిక పరిస్థితుల కారణంగా ఆ ఆశ అప్పుడు తీరలేదు. అందుకే ఈనాడు మిమ్మల్ని అందర్నీ చూస్తుంటే నా కడుపు నిండినంత ఆనందంగా వుంది.
‘మంచి కాలేజీలో చేరారు. ఆరోరా విద్యార్ధిని అని గొప్పగా చెప్పుకునేలా మీ ప్రవర్తన వుండాలి. అంతే కాదు, పలానా విద్యార్ధి మా కాలేజీలో చదివాడు సుమా అని యాజమాన్యం కూడా చెప్పుకోగలిగితే ఇరువురూ ధన్యులే.
‘ఈ ధన్యత అరోరా కాలేజీ ఇప్పటికే సంపాదించుకుని ఉంటుందని నా నమ్మకం.
‘నా మాటలు ఓపిగ్గా విన్న మీ అందరికీ నా ధన్యవాదాలు.
‘సభకి మరో మారు నమస్కారం'
అంటూ రాసుకొచ్చిన ప్రసంగ పాఠాన్ని రేడియో వార్తల మాదిరిగా గడగడా చదివి, సభికుల హర్షధ్వానాల మద్య బయటపడ్డాను.
తోకటపా:
మరో చేదు అనుభవం చెప్పాలి.
లాంగ్ లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో, నో బడీ కెన్ సే హౌ లాంగ్ ఎగో, అన్నట్టు నేను బెజవాడ ఎస్సారార్ కాలేజీలో బీకాం చదువుతున్నట్టు నటిస్తున్న రోజుల్లో, నా మాటలు, ముచ్చట్లు చూసిన మా లెక్చరర్లు ముచ్చట పడి, వక్తృత్వ పోటీల్లో ఏదో పొడుస్తాడు అని భ్రమ పడి, జగ్గయ్యపేటలో జరిగే అంతర్ కళాశాలల వక్తృత్వ పోటీలలో పాల్గొనడానికి నన్ను ఎంపిక చేశారు.
సరే! అప్పుడు లయోలా కాలేజీలో చదువుతున్న నా మేనల్లుడు తుర్లపాటి సాంబశివరావుని తోడు తీసుకుని జగ్గయ్యపేట వెళ్లాను. పోటీలు మొదలయ్యాయి.
అణ్వస్త్రాలు అవసరమా కాదా అనేది టాపిక్.
నేను స్టేజి మీదకు వెళ్లి మైకు ముందు నిలబడ్డాను.
“సభాధ్యక్షా! సదస్యులారా!’ అని మొదలు పెట్టాను.
“ఇప్పుడు ప్రపంచ ప్రజలకి కావాల్సినవి అణ్వస్త్రాలు కాదు, అన్నవస్త్రాలు’
సమావేశంలో చప్పట్లు మోగాయి ఈ మొదటి మాటతో.
ముందే చెప్పినట్టు తర్వాత నా ప్రసంగం ఒక్క ముక్క ముందుకు సాగితే ఒట్టు.
(ఇంకావుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి