ఈ అమ్మాయి ఎవరో చెప్పడానికి ముందు కొంచెం నేపధ్యం తెలపడం అవసరం.
1992 లో మేము మాస్కోనుంచి వచ్చేసి హైదరాబాదులో ఇల్లు వెతుక్కుంటున్న రోజులు. వెంట తెచ్చుకున్న అయిదారు సూటుకేసులు మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారి పంజాగుట్ట క్వార్టర్ లో వదిలేసాము. కంటైనర్లో వేసిన మిగిలిన సామాను, రష్యా నుంచి ఓడలో మద్రాసు వచ్చి మళ్ళీ రోడ్డు మార్గంలో హైదరాబాదు చేరడానికి రెండు మూడు నెలలు పడుతుంది. కాబట్టి ఇల్లు వెతుకులాట కార్యక్రమం కాసింత నెమ్మదిగానే సాగింది, హడావిడి లేకుండా.
మా అన్నయ్యగారి ఇంటికి దగ్గరలోనే ఇటు పంజాగుట్ట మెయిన్ రోడ్డు, అటు రాజ భవన్ రోడ్డు నడుమ దుర్గానగర్ అనే కాలనీలో ఓ ఇల్లు దొరికింది. రెండు గదులు, పెద్ద హాలు, వంట గది, అద్దె పద్దెనిమిది వందలు. మాస్కో నుంచి వచ్చే సామాను చాలా ఎక్కువ కనుక అంత కిరాయి పెట్టక తప్పలేదు.
మాస్కో నుంచి స్వదేశం తిరిగి వెళ్లి పోయేవారి కోసం పెద్ద పెద్ద కంటైనర్లు రేడియో మాస్కో వాళ్ళే ఏర్పాటు చేస్తారు. వీటికి చెల్లించాల్సిన రుసుము అతి స్వల్పం. వాటిని లిఫ్ట్ వ్యాన్ అంటారు. ఖరీదైన కలపతో చేసినవి. ఆ కంటైనర్ రోడ్డు మీద కదలాలి అంటే ఇరవై నాలుగు టైర్ల భారీ లారీ కావాలి.
చౌకగా దొరుకుతాయని కొని పడేసిన సామాను మొత్తం వేసినా పుష్పక విమానంలా కొంత జాగా మిగలడంతో, మా దగ్గర పోగుపడిన రూబుల్స్ ఇండియాలో చిత్తుకాగితాలతో సమానం కనుక, ఇంట్లో నలుగురం నాలుగు టాక్సీలు పట్టుకుని వీధుల్లో తిరుగుతూ కంటికి కనిపించిన వస్తువులన్నీ కొని దాన్ని నింపే ప్రయత్నం చేశాము. ఇంట్లో సామాను మొత్తం వాళ్ళే ప్యాక్ చేసి కింది దించి లిఫ్ట్ వ్యాన్ ఎక్కించారు. లిఫ్ట్ వ్యాన్ వెంట మరో టాక్సీలో నేను, కొంచెం కొంచెం రష్యన్ అర్ధం చేసుకుని మాట్లాడే మా పెద్ద వాడు సందీప్ కలిసి మాస్కోలో మరో కొసలో వున్న కష్టమ్స్ కార్యాలయానికి వెళ్ళాము. తీరా అక్కడకి పొతే వాళ్ళు అడిగినవి రెండే రెండు ప్రశ్నలు. ఇందులో పాలూ, పెరుగూ ఉన్నాయా అని.
మూడు నెలల తర్వాత ఇండియా చేరే లిఫ్ట్ వ్యానులో పాలూ, పెరుగూ ఎవరు స్మగుల్ చేస్తారు? ఆ ప్రశ్నకు నవ్వు వచ్చినా బయట పడకుండా మొహం పెట్టి, నియత్ నియత్ (లేదు, లేదు) అన్నాము. అంతే! వాళ్ళు స్టాంప్ వేసి రెండే రెండు నిమిషాల్లో క్లియర్ చేశారు.
మాస్కో సామాన్లు భద్రంగా మద్రాసు చేరినట్టు కబురు వచ్చింది. అప్పటి దాకా మాస్కో సామాను రేపో మాపో వస్తుందని ఇంట్లో ఏ సామాను అమర్చుకోకుండా చాపలు, జంపఖానాలతో కాలక్షేపం చెస్తూ వస్తున్న మేము, అమ్మయ్య అనుకున్నాము. నేను ఒక్కడినే మద్రాసు వెళ్లాను. అదే నేను చేసిన పొరపాటు. మా పిల్లల్లో ఒకడిని వెంట తీసుకుని వెళ్ళాల్సింది.
మద్రాసు కష్టమ్స్ గోడౌన్ చాలా విశాలంగా వుంది. ఎటు చూసినా పెద్ద పెద్ద కంటైనర్లు. వాటి నడుమ మాదే చిన్నది అనిపించింది. మేము పలానా రోజు వస్తున్నామని తెలుసు కనుక ముందే కంటైనర్ ఖాళీ చేసి కింద పరిచి పెట్టారు. నిజానికి మేము వెళ్ళే వరకు ఆ పని చేయకూడదు. కానీ మనం ఎందుకు అని అడగకూడదు.
కష్టమ్స్ తనిఖీ చేసే అధికారుల తరపున ముందు ఒక చిన్న అధికారి వచ్చి, మేము మాస్కో నుంచి వచ్చాము అని తెలుసుకుని, పెదవి విరిచాడు. మాస్కో నుంచి వచ్చే వాళ్ళ దగ్గర వాళ్ళు పట్టుకునే సామాను కానీ, వాళ్ళు కోరుకున్న వస్తువులు అంటే మద్యం సీసాలు వగైరా దొరికే అవకాశం లేదు అని పెద్దగా చెకింగ్ చేయరు. ఒకరకంగా వాళ్ళ సమయం వృధా.
ఇంతలో ఒక పోర్టరు, బయట బ్యాంకు బ్రాంచి వుంది, వెళ్లి ఒక వంద రూపాయలకు చలానా కట్టి ఆ ఫారం పట్టుకు రమ్మన్నాడు. బ్యాంకులో ఆ విండో దగ్గర చాలామంది వున్నారు. ఆ పని పూర్తి చేసుకుని వచ్చేసరికి, సామాను హైదరాబాదు చేర్చాల్సిన భారీ లారీ బయట సిద్ధంగా వుంది. దాంతో హడావిడిగా లోపలకు వెళ్లి, తొందరగా పని పూర్తి చేసుకుని రాత్రి ఫ్లయిట్ అందుకోవాలనే ఆత్రుతతో నేనున్నాను.
మాస్కో నుంచి రోడ్డు మార్గాన సోవియట్ యూనియన్ లో మరో మూల వున్న ఓడ రేవుకు, మళ్ళీ ఓడలో మూడు నెలలు ప్రయాణం చేసి మద్రాసుకు మా సామాను చేరింది. ఒక్కటంటే ఒక్క గాజు సామాను కూడా కొంచెం కూడా దెబ్బతినలేదు. అంత చక్కగా అక్కడి వాళ్ళు వాటిని ప్యాక్ చేశారు. మద్రాసులో వాళ్ళు వాటిని ఇష్టం వచ్చినట్టు నిర్లక్ష్యంగా ప్యాకింగులు విప్పి అక్కడ నేల మీద పరిచి పెట్టారు. చెకింగ్ తర్వాత మళ్ళీ ప్యాక్ చేయడం మా పని కాదంటారు. చివరికి డబ్బులు తీసుకుని ఆ పని చేసి పెట్టారు.
బతుకు జీవుడా అని బయట పడి హైదరాబాదు విమానం ఎక్కాను.
మూడో రోజో నాలుగో రోజో ఆ భారీ లారీ హైదరాబాదు చేరింది. మేమున్న కాలనీలోకి రావడానికి ఆ లారీకి ఒక పట్టాన సాధ్యం కాలేదు. మొత్తం మీద మూడు నాలుగు గంటల విశ్వ ప్రయత్నం మీద ఇంటికి చేరింది.
మాస్కో సామాను అంటేనే భారీ. అది సోఫా కావచ్చు, టీ కప్పు కావచ్చు. ఏదైనా పెద్ద సైజే. కింగ్ సైజే! వాటిని మేము అద్దెకు తీసుకున్న మొదటి అంతస్తుకు చేర్చడానికి మరో బ్రహ్మ ప్రళయం. వాటితో మా హాలు మొత్తం నిండి పోయింది.
ఆ తర్వాత తీరిగ్గా సామాను ప్యాకింగు విప్పి చూసుకుంటే మూడో వంతు సామాను గాయబ్. ఇందుకా అవసరం వున్నా లేకపోయినా బ్యాంక్ చలాన్ తీసుకుని రమ్మని నన్ను బయటకు పంపడంలో ఆంతర్యం.
మాస్కో నుంచి వచ్చే వారిలో వారు పట్టుకునే సామాగ్రి లేకపోయినా ఖరీదైన గ్లాస్ వేర్ వుంటుందని పోర్టళ్ళకు తెలుసల్లె వుంది. మాస్కోలో రూపాయి ఖరీదు చేయని వస్తువు కూడా ఇండియాలో వేలు పలుకుతుంది (ట). ముఖ్యంగా చెకొస్లవేకియా కట్ గ్ల్లాసులు, రష్యన్ నీలిరంగు పింగాణీ వస్తువులు. నిజానికి ఈ సంగతి మాకు కూడా తెలియదు. ఆ విధంగా బంధువులకు కానుకలుగా తెచ్చిన వస్తువులు అన్నీ మద్రాసు పోర్టర్ల పరమయ్యాయి. వాళ్ళు చేసిన బ్యాడ్ ప్యాకింగ్ నిర్వాకం కారణంగా మరికొన్ని వస్తువులు దెబ్బతిన్నాయి. వెంట మా వాడిని తోడు తీసుకుని వెళ్లి వుంటే మద్రాసు పోర్టర్లకు ఈ చేతివాటం అవకాశం చిక్కేది కాదేమో!
దుర్గానగర్ లోని మా ఇంటి సందు మొదట్లో ఓ గుడిసెలో కాపురం ఉంటున్న యాదమ్మ మా ఇంట్లో పనికి కుదిరింది. మొగుడు మల్లయ్యకు సొంత ఆటో వుంది. ఆ బండే వీరి బతుకు బండికి ఆధారం.
ఈ తిరుమల అనే అమ్మాయి యాదమ్మ, మల్లయ్యల కడసారి కుమార్తె. ఆ దంపతులకు అందరూ ఆడపిల్లలే. కళ, భాగ్య, సంపూర్ణ, తిరుమల అందరూ మా ఇంట్లోనే దాదాపు పెరిగారు. బిడ్డల్ని వెంటేసుకుని యాదమ్మ పనికి వచ్చేది. వీళ్ళు కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేవరకు మా ఇంట్లోనే పనిపాటులు చూస్తుండేవారు. కాలక్రమంలో మేము అనేక ఇళ్ళు మారుతూ వచ్చినా ఆ కుటుంబం మాత్రం మమ్మల్ని వదిలిపెట్టలేదు.
కళకు పెళ్ళయి ఇద్దరు పిల్లలు పుడితే వారిద్దరికీ మా పిల్లల పేర్లే సందీప్, సంతోష్ అని పెట్టుకుంది. సందీప్ ప్రభుత్వ పాఠశాలలో చేరి మంచి మార్కులు తెచ్చుకుంటూ, బాగా చదువుకుంటున్న అతడికి ఒఅ ఏడాది తెలంగాణా ప్రభుత్వం పదిహేను వేల రూపాయల స్కాలర్ షిప్ కూడా ఇచ్చింది.
మరో అమ్మాయి కుమార్తెకు మంచి సంబంధం దొరికింది. ఆ అబ్బాయికి ఏదో మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం. నలభయ్ లక్షలు పెట్టి ఫ్లాటు కొనుక్కుని ఆ గృహ ప్రవేశానికి మమ్మల్ని కూడా పిలిచారు.
మా ఇంట్లో పారాడుతూ పెరిగిన తిరుమలమ్మకు కూడా పెళ్లయింది. కూకట్ పల్లిలో ప్రభుత్వం కేటాయించిన ఫ్లాటులో వుంటున్నారు. మొగుడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు.
‘నువ్వేం చేస్తున్నావ’ని అడిగితే, ‘నేనిప్పుడు పూర్తిగా హౌస్ వైఫ్. ఇంట్లోనే వుండి నా పిల్లల మంచీచెడూ చూసుకుంటున్నాను’ అంది నవ్వుతూ.
పెద్ద ఆశలు పెట్టుకోకుండా పిల్లల్ని పెంచిన మల్లయ్య దంపతుల ఆశలపై వాళ్ళు నమ్ముకున్న యాదాద్రి నరసింహుడు నీళ్ళు చల్లలేదు. సరికదా, వారిని చల్లగా చూస్తున్నాడు. శుభం!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి