‘ఇదేమన్నా బ్రహ్మ విద్యా! నేను చాలాసార్లు మానేశాను’ అనే జోకులు వింటూనే వుంటాము.
చాలా సంవత్సరాల క్రితం అప్పుడు ఆంధ్ర ప్రదేశ్ మ్యాగజైన్ సంపాదక బాధ్యతలు నిర్వహించిన కీర్తిశేషులు శ్రీ పీవీ రావు నాచేత ఈ అంశంపై ఒక వ్యాసం రాయించి పత్రికలో అచ్చు వేయించి ఓ నూటపదహార్లు అనుకుంటాను తాంబూలం కూడా ఇచ్చారు. ఏదయితేనేం అప్పుడా డబ్బులు ఓ వారం పదిరోజులు సిగరెట్ల ఖర్చుకు పనికొచ్చాయి. (ఈ రోజుల్లో అయితే ఒక పూటకు సరిపోవు)
సిగరెట్లను సిగరెట్టు మాదిరిగా తాగే మా స్నేహితులు, నా గురించి చెప్పుకునేమాట వేరు. ‘శ్రీనివాసరావు సిగరెట్లు తాగడు, తగలేస్తాడు’ అన్నది వాళ్ల థియరీ, ‘హార్లిక్స్ తాగడు తింటాడు’ అనే వాణిజ్య ప్రకటన టైపులో.
సిగరెట్లు అలవాటు కావడానికి నేను చెప్పుకునే కారణం వేరే వుంది. ఇండియాలో వున్నప్పుడు కొని తాగే అలవాటు అలవడని నేను, మాస్కో వెళ్ళేక డబ్బులు తగలేసి మరీ సిగరెట్లు తగలేయడం మొదలు పెట్టాను. దానికి కారణాలు రెండు. ఒకటి మన దగ్గర అతి ఖరీదైన సిగరెట్లు కూడా మాస్కోలో అతి తక్కువ ధరకు దొరకడం. ఉదాహరణకు 20 సిగరెట్ల ఇండియా కింగ్స్ ప్యాకెట్ కేవలం ఒక్క రూపాయి. కొన్న ప్రతిసారీ చిల్లర సమస్య రాకుండా డజనో, ఆరడజనో కార్టన్లు కొనేసేవాడిని. ఇంగ్లీష్ భాష ఎంతమాత్రం తెలియని ఆడామగా రష్యన్ సహోద్యోగులతో కాసేపు ‘మాటామంతీ’ లేని కాలక్షేపం చేయడానికి ఈ సిగరెట్లు చక్కగా అక్కరకు రావడం. దానాదీనా నా కొనుగోళ్ళు సిగరెట్ ప్యాకెట్ల నుంచి ఏకంగా కార్టన్ల స్థాయికి పెరిగడం జరిగింది.
2004లో అమెరికా వెళ్ళినప్పుడు ఒక పెద్ద సూటుకేసు నిండా మా ఆవిడ వూరగాయ పచ్చళ్ళ ప్యాకెట్లతో, మరో పెద్ద సూటుకేసు నిండా గోల్డ్ ఫెక్ కింగ్ సైజ్ సిగరెట్ల కార్టన్లతో దిగబడ్డ మమ్మల్ని చూసి అమెరికా కష్టమ్స్ వాళ్లు నోళ్ళు వెళ్ళబెట్టారు.
వెళ్లే ముందు, ముందు జాగ్రత్తగా ఎర్రమంజిల్ కాలనీలో మా క్వార్టర్ ఎదురుగా వున్న రెడ్ రోజ్ రెస్టారెంట్ దగ్గరి పాన్ షాపులో బండిల్స్ కొద్దీ సిగరెట్ ప్యాకెట్లు కొంటుంటే, ఆ షాపు వాడు ‘ఏం సార్ మీరు కూడా దుకాణం ఏదైనా పెడుతున్నారా’ అన్నట్టు నా వైపు విచిత్రంగా చూసాడు. నా మీద కార్టూన్లు వేసే స్థాయికి నేను జీవితంలో ఎదిగివుంటే అంజయ్య గారి వేలుకు హెలికాఫ్టర్ బొమ్మ ముడివేసినట్టు, నా బొమ్మకు చేతిలో సిగరెట్ తగిలించేవాళ్లేమో!
హైదరాబాదులో మా ఇల్లే ఒక పెద్ద యాష్ ట్రే. నేను ఊది పారేసే సిగరెట్లకు ఇల్లు నిర్దూమధామంగా తయారయ్యేది. మా ఆవిడ ఓపిగ్గా ఆ చెత్త అంతా పనిమనిషి చేత ఎత్తి పోయించేది.
రాత్రి పూట సిగరెట్ తాగుతూ నిద్రలోకి జారిపోయినప్పుడు తగలడి పోయిన తలగడల సంఖ్య మా ఆవిడే చెప్పాలి.
“మరి ఇప్పుడేవిటి ఇలా అయిపోయారు? ‘ఏవి తండ్రీ నాడు విరిసిన రింగు రింగుల పొగల మేఘాలు” అని మా స్నేహితులు భారంగా నిట్టూర్పులు విడుస్తుంటారు. నా ఈ దుస్తితికి కారకులు ఎవరయ్యా అంటే నిమ్స్ డైరెక్టర్ గా పనిచేసిన డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు.
దీనికి ముందు ఓ పిట్ట కధ చెప్పాలి. దూరదర్శన్ విలేకరిగా పనిచేస్తున్న రోజుల్లో ఓ రోజు తెల్లగా తెలవారక మునుపే, కప్పు కాఫీ కూడా కడుపులో పడకుండానే, జూబిలీ హిల్స్ లోని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కెమెరామన్ తో సహా చేరుకున్నాను. మిగిలిన జాతీయ ఛానళ్ళ బృందాలు కూడా బిలబిల మంటూ అక్కడికే చేరాయి.
మామూలుగా అయితే బాబుగారి ఇంట్లో విలేకరులకు రాజభోగాలు. కానీ ఆ రోజు విలేకరులది పిలవని పేరంటం. బీజేపీతో టీడీపీకి ఎన్నికల పొత్తు విషయం గురించి తేల్చడానికి ఆ రెండు పార్టీల నాయకుల నడుమ ఎడతెగని చర్చలు లోలోపల సాగుతున్నాయి.
బయట ఫుట్ పాత్ మీద చెట్ల నీడన, నిలబడి కొందరం, కూలబడి కొందరం పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటున్నాం.
ముందు జాగ్రత్త చర్యగా వెంట తెచ్చుకున్న సిగరెట్లను ఒకదాని వెంట మరోటి తగలేస్తూ, తెచ్చుకోని వాళ్లకు ఉదారంగా పంచిపెడుతూ నా మానాన నేను కాలక్షేపం చేస్తుండగా సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు. కడుపులో ఎలుకలు. మరో పక్క సిగరెట్ల పొగతో కళ్ళ కలకలు. అలా నిలబడి సిగరెట్ తాగుతూ వున్నవాడ్ని వున్నట్టుండి స్లో మోషన్ లో కిందకు వొరిగి పోతూ వుండడం వరకే గుర్తు.
కట్ చేస్తే నిమ్స్ ఆసుపత్రిలోని ప్రత్యేక గదిలో డాక్టర్ల పర్యవేక్షణలో. ఆందోళనగా నా వైపే చూస్తున్న నా భార్య. ఆమెతో పాటు నా ఇద్దరు పిల్లలు. ఇల్లు నిమ్స్ పక్కనే కనుక కబురు తెలిసి వచ్చారు.
ముఖ్యమంత్రి గారా మజాకా. జరిగిన విషయం విలేకరుల ద్వారా తెలుసుకుని హుటాహుటిన అంబులెన్స్ తెప్పించి నన్ను నిమ్స్ లో అడ్మిట్ చేయించారట. అందుకే కాబోలు కాకర్ల వారు కూడా స్వయంగా వచ్చి చూసారు. రిపోర్టులన్నీ తిరగేశారు. కళ్ళు తిరగడానికి, వొళ్ళు తూలడానికీ నా సిగరెట్లే కారణం అని ఆయన తన అనుభవంతో ఇట్టే కనుక్కున్నారు. ఆ విషయం మా ఆవిడతో చెప్పి, ‘నెమ్మదిగా ఈ అలవాటు మానిపించమ’ని సలహా ఇచ్చారు. ఇది అయ్యే పనా అని మా ఆవిడ చిన్నగా నవ్వి ఊరుకుంది.
కళ్ళు తెరిచి ఇదంతా చూస్తూ, చెవులు వొగ్గి ఇదంతా వింటున్న నేను హఠాత్తుగా ముందుకు వొంగి, ‘నేను సిగరెట్లు మానేశాను డాక్టర్ గారు’ అని ఒక బహిరంగ ప్రకటన చేసాను. ఆయన విలాసంగా మందహాసం చేసి, నెత్తి మీది వెంట్రుకలు చేత్తో పట్టి చూపిస్తూ, ‘ఇలాటి వాళ్ళను నా సర్వీసులో ఇంతమందిని చూసాను’ అంటూ, ‘అదంత తేలిక కాద’ని ఆయనే చెబుతూ, నేను తాగే బ్రాండ్ సిగరెట్ ప్యాకెట్ ఒకటి అప్పటికప్పుడే తెప్పించి మా ఆవిడ చేతిలో పెట్టి, ‘రాత్రి అందరూ నిద్ర పోయిన తరువాత నీ మొగుడు నీ మెదడు కొరుక్కు తింటాడు, ఎందుకయినా మంచి ఇది దగ్గర వుంచుకోమ్మా’ అని వెళ్ళిపోయారు.
అంతే! ఎంతయినా నేనూ పట్టుదల కలిగిన మనిషిని కదా! ఇంటికి వెళ్ళినప్పటినుంచి ఆ ప్యాకెట్టూ ముట్టుకోలేదు. అప్పటినుంచి సిగరెట్టూ అంటించలేదు.
మరో వింత ఏమిటంటే, ఆనాటి నుంచి సిగరెట్ తాగాలని కూడా అనిపించలేదు.
కింది ఫోటోలు:
(ఇంకావుంది)
1 కామెంట్:
👌👌👌
కామెంట్‌ను పోస్ట్ చేయండి