చిన్న మనుషులు – గొప్ప మనసులు
యాదమ్మ, స్వరూప, అంకిత , వనిత
గత మూడు దశాబ్దాల పై చిలుకు కాలంలో వివిధ దశల్లో
మా జీవితాలతో ముడిపడిన వారిలో వీరున్నారు. జీతాల మీద పనిచేసిన వారే కానీ జీతాల
కోసమే పనిచేయలేదు. అందుకే కుటుంబ సభ్యులు అయ్యారు.
యాదమ్మ, సంపూర్ణ ఇంటి పనిలో సహాయకులు. స్వరూప మా పెద్ద
వదిన గారికి పెద్దతనంలో
సహాయకురాలు, అంకిత
మా మనుమరాలు జీవికకి కేర్ టేకర్, ఇక వనిత గత పదిహేను సంవత్సరాలుగా మా వలలి.
జీవితం అన్నాక కొందరు గొప్పవాళ్లు
తారసపడతారు. అలాగే
చాలామంది చిన్నవాళ్లు
కూడా మన జీవన నౌక సాఫీగా సాగడానికి తోడ్పడతారు. నా జీవితాన్ని తరచి చూసుకునే
ఇలాంటి సందర్భాలలో చిన్నా గొప్పా తారతమ్యం లేకుండా అలాంటి వారిని కూడా గుర్తు
చేసుకోవడం సముచితమని నా భావన.
తెలుగువారికి గొప్ప పండుగలలో సంక్రాంతి ఒకటి. అది
వెళ్ళిన మరునాడే కనుమ. అది కూడా పండగే. సంక్రాంతికి సొంతూరు వెడితే మర్నాడు కనుమ
కూడా అక్కడే గడిపి రావడం ఆనవాయితీ. కనుమనాడు కాకయినా కదలదు అనే నానుడి పేర్కొంటూ
ముందరి కాళ్ళకు బంధాలు వేస్తారు.
అలా ఒకసారి 2019 లో కనుమ నాడు కూడా మా ఇంట
పండగ సందడి చోటు చేసుకుంది. దానికి కారణం ఎప్పుడో పుష్కరం కింద మా ఇంట్లో పనిచేసిన
మల్లయ్య కుటుంబం.
ముప్పయ్ ఏళ్ళ క్రితం మేము మాస్కోనుంచి వచ్చి
హైదరాబాదు పంజాగుట్ట
దుర్గానగర్ కాలనీలో మళ్ళీ కొత్తగా కొత్త కాపురం పెట్టిన రోజుల్లో, మల్లయ్య
కుటుంబం మా ఇంట్లో పని చేసేది. మధ్యలో మేము చాలా ఇళ్ళు
మారాము. అయినా ఆ కుటుంబంతో మా బంధం కొనసాగుతూ వచ్చింది.
ఆ ఏడాది కనుమ రోజు సాయంత్రం ఎల్లారెడ్డి గూడాలోని
మా ఇంటికి ఇంటిల్లి పాదీ వచ్చారు. ఆటో నడిపే మల్లయ్యకు అందరూ ఆడపిల్లలే. ఇప్పుడు
అందరూ పెద్దవాళ్ళయ్యారు. పెళ్ళిళ్ళయి పిల్లలకు తల్లులు అయ్యారు. యాదమ్మ, మల్లయ్యలకు
ముగ్గురు మనుమళ్ళు నలుగురు మనుమరాండ్రు. ఎల్ కేజీ నుంచి తొమ్మిదో తరగతి దాకా
చదువుతున్నారు. మల్లయ్య ఆడ సంతానం పెద్ద పండగ సంక్రాంతికి పుట్టింటికి వచ్చారు.
అల్లుళ్ళు ఏరీ అని అడిగితే అందరిలోకి చిన్నమ్మాయి ( మా కళ్ళ ముందే పుట్టింది)
తిరుమలమ్మ (పెళ్ళిలో రూప అని పేరు మార్చుకుందట) తటాలున జవాబు చెప్పింది. ‘మేము మా
అమ్మానాన్నలను చూడడానికి మా పుట్టింటికి వచ్చాము. మా మొగుళ్ళు వాళ్ళ అమ్మానాన్నలను
చూడ్డానికి వాళ్ళ పుట్టింటికి వెళ్ళారు’ అని.
వాళ్ళందరినీ చూసి మా ఆవిడ సంతోషం అంతా ఇంతా కాదు.
ఆ పిల్లల్లో ఇద్దరు ముగ్గురు ఆవిడ చేతుల్లోనే పెరిగారు. వాళ్ళ చదువులు, ఫీజులు, పుస్తకాలు
వగైరా దగ్గరుండి కనుక్కుంటూ వుండేది. అందుకని ఆ కుటుంబానికి మా ఆవిడ అంటే
అభిమానంతో కూడిన ఆరాధన.
అంతమంది ఆడపిల్లలు గల గలా మాట్లాడుతుంటే ఆడ సంతు
లేని మేము ఎంతో సంతోషించాము. ఫోటో అంటే మొహం తిప్పుకునే మా ఆవిడ ఆ రోజు అందర్నీ
తన పక్కన నిలబెట్టుకుని నాతో వాళ్ళ గ్రూపు ఫోటో తీయించుకుంది.
ఇది జరిగింది జనవరిలో. ఆగస్టులో ఆమె లేదు. ఫోటో
మిగిలింది.
స్వరూప.
నలభై,యాభయ్ ఏళ్ళు వుంటాయి.
పేరుకు తగిన
రూపం కాదు అని మొదటిసారి చూసిన వాళ్ళు అనుకుంటారు.
కానీ ఆమె మనసు ఎంతటి ఉదాత్తమైనదో తెలిసే
అవకాశం ఒకసారి వచ్చింది.
మా పెద్ద వదిన సరోజిని గారు జీవించి వున్నప్పుడు
చేయి విరిగింది. మా కుటుంబంలో పెద్ద. ఆమెకు సాయంగా ఉండడానికి మా అన్నయ్య కుమారుడు
రాఘవ రావు ఏదో ఏజెన్సీతో మాట్లాడి ఒక సహాయకురాలిని పెట్టాడు. ఆమే ఈ
స్వరూప. మా ఇంటికి దగ్గర కాబట్టి, ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో వెళ్లి మా వదినను చూసి
వస్తుండే వాడిని.
ఒక రోజు నేను వెళ్ళే సరికి తల వాకిలి ఓరగా
వేసివుంది.
లోపల నుంచి మాటలు వినపడుతున్నాయి. ఆ గదిలో వున్న
ఇద్దరూ నా రాకను గమనించలేదు. నడిచి వచ్చిన బడలిక తీర్చుకోవడానికి ఓ కుర్చీలో
కూలబడ్డాను.
వదిన మంచం మీద దిండును ఆనుకుని కూర్చుని, ఎదుటి
మనిషి చెబుతున్న మాటలను ఏకాగ్రతగా వింటోంది.
మా వదినను మాట్లాడనివ్వకుండా, ఆమె
రెండు చేతులూ పట్టుకుని స్వరూప ఏకబిగిన చెప్పుకు పోతోంది.
నేను మౌనంగా వింటున్నాను.
“అమ్మా!
మీరు పెద్దవారు. ఎనభయ్ దాటాయని చెబుతున్నారు. మీ వయసులో సగం లేదు నా వయసు.
మిమ్మల్ని కనిపెట్టుకుని చూడమని మా యజమాని నన్ను మీ వద్దకు పంపాడు. ఆయనకు మాట
రానివ్వకుండా చూడాలి నేను. మీరేమో రాత్రుళ్లు నాకు చెప్పకుండా లేస్తున్నారు. మీ
పక్కనే పడుకుంటున్నాను. ఏమాత్రం అవసరం వున్నా నన్ను లేపండి. నేను దగ్గర వుండి
మిమ్మల్ని బాత్ రూముకు తీసుకు వెడతాను. మీరు నా కంటే చాలా పెద్ద. కానీ నాకంటికి
నువ్వు రెండేళ్ల పిల్లవే. కన్నబిడ్డ పక్కబట్టలు ఆగం చేస్తే తల్లి శుభ్రం చేయదా!
నేనూ అంతే! పక్క మీద నుంచి రాత్రి వేళ కదిలే పని లేకుండా నేనే చూస్తాను. లోగడ
కొన్నాళ్ళు ఓ ఆసుపత్రిలో ఆయాగా పని చేశాను. ఇవన్నీ నాకు అలవాటే. కాబట్టి నా మాట
వినండి. నేను ఈ పనులు డబ్బుల కోసం చేస్తున్నా, డబ్బొక్కటే ముఖ్యం కాదు. నాకిక్కడ మూడు పూటలా
అన్నం పెడుతున్నారు. చక్కగా కనుక్కుంటున్నారు. నా పనిలో ఏదైనా తేడా వస్తే ఆ పైన
దేవుడు నన్ను వదిలి పెడతాడా!
“మళ్ళీ
చెబుతున్నాను. ఈసారి అరిచి కసిరి చెబుతాను. పిల్లలకు తల్లి చెప్పదా! అలాగే నేనూ
గట్టిగానే చెబుతాను. మనసులో పెట్టుకోకండి. మీ కట్టు విప్పి, మీ
చేయి నయం అయ్యేవరకు నేను మిమ్మల్ని వదిలిపోను. తర్వాత మీ ఇష్టం. అంతవరకూ నాకు మాట
రానీయకండి”
ఇదంతా విన్న తర్వాత నాకు అక్కడ ఉండాల్సిన అవసరం
కనపడలేదు. ఎంత మౌనంగా వచ్చానో అలాగే బయటకు వచ్చేశాను. వదిన ఎలా వుందో చూడాలని
వచ్చాను. ఆమెను పదిలంగా చూసుకునే మనిషి దొరికింది.
గుళ్ళో వుండే దేవుడు మనుషుల్లో కూడా ఉంటాడు. ఈ
దేవత కొలువైన గుడి నుంచి బయలుదేరి మా ఇంటికి వెళ్ళిపోయాను.
అంకిత
ఈ అమ్మాయిని మా మనుమరాలు
జీవికకు కేర్ టేకర్ గా పెట్టారు.
అప్పటికి నా కొడుకు కోడలు ఉద్యోగస్తులు.
మనుమరాలిని చూసుకోవడానికి మా ఆవిడ లేదు.
అంచేత ఏదో కంపెనీని సంప్రదించి ఓ కేర్ టేకర్ ని
పెట్టారు. ఆ అమ్మాయి పేరు తప్ప, వాలకం నాకు ఏమాత్రం నచ్చలేదు. గాంధీ గారి
కళ్ళజోడులాంటి గుండ్రటి పెద్ద కళ్లద్దాలు. ఆధార్ కార్డు ప్రకారం వయసు 22. కానీ ఆ
పిల్ల పీలగా పద్నాలుగేళ్ళ అమ్మాయిలా వుంది.
మనుమరాలు జీవికని కనిపెట్టి చూసుకోవడమే ఆ అమ్మాయి
పని.
ఇంట్లోనే వుంటుంది కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు నా
కంట్లో పడేది. చీదరించుకున్నట్టు చూసేవాడిని.
ఈలోగా ఘోరం జరిగిపోయి మా వాడు ఆకస్మిక గుండె
పోటుతో చనిపోయాడు.
నాకు ప్రపంచం యావత్తూ శూన్యంగా మారింది. ఆరోగ్యం
దెబ్బతిన్నది. కను చూపు మందగించింది. మా కోడలు నిషా శ్రద్ధ తీసుకుని కంటి ఆపరేషన్
చేయించింది.
కొన్ని రోజులు గంట గంటకీ కంట్లో చుక్కలు వేయాలి.
ఆ పని అంకిత చూసింది. అలారం పెట్టుకుని కరక్టు టైముకి వేసింది.
ఆ తర్వాత బీపీ షుగర్ సమస్యలు. ఎప్పటికప్పుడు
మిషన్ల మీద రీడింగ్ తీసుకుని ఒక పుస్తకంలో నోట్ చేసుకుని డాక్టర్లు అడగగానే చెప్పే
బాధ్యత స్వచ్చందంగా తీసుకుంది. వేళకు గుర్తు పెట్టుకొని మందులు ఇచ్చేది.
ఈ నర్సింగ్ సర్వీసుతో ఆ అమ్మాయి పట్ల నా
అభిప్రాయం పూర్తిగా మారిపోయింది.
ఆడపిల్లలు లేని నాకు ఈ అమ్మాయిని ఆ దేవుడే పంపాడు
అని నిర్ధారణకు వచ్చాను.
అయితే ఒక విషయం చెప్పాలి.
ఇంత మొండి పిల్లను నా జీవితంలో చూడలేదు.
పాలవాడో, పేపరు వాడో వచ్చి డబ్బులు అడుగుతాడు.
‘అమ్మా
అంకితా వెళ్లి నా ప్యాంటు జేబులో పర్స్ తీసుకురా’ అంటే ససేమిరా వినదు. ‘హైదరాబాద్
లో ఉద్యోగానికి వచ్చేటప్పుడే మా అమ్మ ఇతరుల డబ్బు తాకవద్దు అని చెప్పి పంపింది’
అంటుంది.
‘నేనే
చెబుతున్నా కదా’ అన్నా వినదు. తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళు బాపతు.
ఈ కాలంలో ఇంత నిజాయితీ అరుదు.
సంక్రాంతి, దసరా వంటి పండుగలు, చీరలో డ్రెస్సులో కొనుక్కోమని
వంటమనిషి వలలికి, (అసలు
పేరు వనిత) పనిమనిషి అనితలతో పాటు డబ్బు ఇస్తే అంకిత తీసుకోదు.
'మీరు
ప్రతినెలా ఒకటో తేదీన ఠంచనుగా జీతం పదిహేను వేలు లెక్క కట్టి ఇస్తున్నారు కదా! నా
సంపాదనతోనే ఏదైనా కొనుక్కుంటాను, ఇక్కడ నాకు విడిగా పెట్టే ఖర్చు లేదు, నా
అన్ని అవసరాలు మీరే చూసుకుంటున్నారు. ఒక వేయి నేను వుంచుకుని, మిగిలింది
మా అమ్మకు జీపే చేస్తాను'
అంటుంది
ధీమాగా, ఎంతో
బాధ్యతగా.
అందుకే ఆ అమ్మాయి ముట్టె పొగరుని సహిస్తూ, భరిస్తూ
వచ్చాను. ఆమెకున్న ఆత్మాభిమానాన్ని గౌరవిస్తూ వచ్చాను.
కాంట్రాక్ట్ ముగిసింది. మనుమరాలు
కటక్ లో వాళ్ళ అమ్మమ్మ గారింట్లో వుంది. నా ఆరోగ్యం కుదుట పడింది. ఏడాది ఆఖరులో
వాళ్ళ కులదేవత పూజలు అవీ వున్నాయి, నెల రోజులు వుండను, వూరికి పోతాను అని ఏడాది కిందట పనిలో
చేరేటప్పుడే చెప్పింది. అలాగే వెళ్ళిపోయింది.
పనివాళ్ళు దొరుకుతారేమో కానీ పనిమంతులు దొరకడం
కష్టం.
తోకటపా:
మా పిల్లలలాగే అంకితకు కూడా తన ఫొటో సాంఘిక
మాధ్యమాలలో పోస్టు చేయడం అస్సలు ఇష్టం వుండదు. మా మనుమరాలు జీవికతో వున్న ఫోటోల్లో
తాను వుంటే, అది
ఎడిట్ చేసేదాకా వూరుకోదు. అంత మొండిఘటం.
కింది ఫోటో: మల్లయ్య కుటుంబంతో మా ఆవిడ నిర్మల
(ఇంకావుంది)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి