ప్రముఖ సినీ నటుడు శోభన్ బాబు జీవిత చరిత్ర పుస్తకానికి  పెట్టిన పేరు ఇది. సినీ నటుడిగా మంచి అవకాశాలు వున్నప్పుడే, ఆయన నటనకు భరతవాక్యం పలుకుతూ సినిమా రంగం నుంచి స్వచ్చందంగా తప్పుకున్నారు. చనిపోయే వరకు ఆయన దీనికి కట్టుబడే వున్నారు. 
ఆయనతో పోలిక కాదు కానీ గత కొన్నేళ్లుగా నేను టీవీల్లో రాజకీయ చర్చల జోలికి వెళ్ళడం లేదు. దీనికి ప్రధాన కారణం మా ఆవిడ నిర్మల ఆకస్మిక మరణం. అంతకు ముందు దాదాపు పుష్కరం పాటు రోజుకు మూడాటలు, ఆదివారం, పండుగలకి నాలుగాటలు అన్న లెక్కన టీవీ చర్చలతోనే కాలం గడిచిపోయింది.
కొంత తేరుకున్న తర్వాత, అంతకు ముందు నుంచి అంటే దాదాపు ఇరవై ఏళ్ళుగా   కొన్ని పత్రికలకి క్రమం తప్పకుండా  వారం వారం రాసే  రాజకీయ వ్యాసాల రచనా వ్యాసంగాన్ని మళ్ళీ తలకెత్తుకున్నాను.  కొన్ని వెబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చేవాడిని. కొంతకాలం తర్వాత వాటికి కూడా  స్వచ్చందంగా స్వస్తి చెప్పాను. కారణం ట్రోలింగు పేరుతొ ఈ మీడియాలో భయంకరంగా, అవిచ్చిన్నంగా సాగుతున్న వ్యక్తిత్వ హననం. సంపాదన పట్ల దృష్టి పెట్టకుండా, సొంత కుటుంబాన్ని పట్టించుకోకుండా, కప్పు కాఫీ కూడా ఆశించకుండా ఈ చర్చల్లో పాల్గొంటూ,  చివరాఖరులో ఇలాంటి  మాటలు పడలేక, పత్రికల్లో  రాతలకు, ఛానళ్లలో ఇంటర్వూలకు ఒకేసారి  మంగళం పాడాను.
తరువాత పత్రికల వాళ్ళు రాయమన్నా రాయలేదు. ఛానల్స్ వాళ్ళు అడిగినా వెళ్ళలేదు. 
బహుశా, నా ప్రేమ వివాహం విషయంలో తీసుకున్నట్టే,  నా జీవితంలో నాకై నేను చేసుకున్న మంచి నిర్ణయాలలో ఇదొకటి అనుకుంటున్నాను.
ట్రోలింగు చేసే వారికి నేను చర్చించే  అంశాల మంచి చెడులతో నిమిత్తం లేదు. మర బొమ్మలకు వారికి తేడా లేదు. తాము మంచి అనుకున్న దానిని మనం గట్టిగా నొక్కి చెప్పాలి. చెడు అని వారు భావించేదాన్ని మరింత విడమరచి, వారికి అనుకూలంగా  చెప్పాలి. అంతే! లేశ మాత్రం తభావతు వచ్చినా మనపై తాటి ప్రమాణంలో విరుచుకు పడతారు. ఇన్నేళ్ళుగా నాతో స్నేహవాత్సల్యాలతో మెలుగుతూ వచ్చిన ఆయా రాజకీయ పార్టీల నాయకులు సయితం మౌనంగానే వుండిపోతారు తప్ప, కనీసం ఇలా చేయకండి అని వారి అనుచరగణాలతో నోటిమాటగా కూడా చెప్పేవారు కాదు. ఘడియ తీరిక లేకుండా, గవ్వ రాబడి లేకుండా ఇక ఎందుకీ కంచి గరుడ సేవ అని నేనే తప్పుకున్నాను.  నిజం చెప్పొద్దూ, దరిమిలా దైహిక, మానసిక ఆరోగ్యాలు  రెండూ కుదుటపడ్డాయి. (సావిత్రి  గారూ! Savitri Ramanarao  వింటున్నారా?) 
జీవితం అంతా ముడిపడిన వ్యాపకాన్ని వదులుకున్న తర్వాత జీవితమే ఖాళీ అయినట్టు అయింది. రోజంతా ఖాళీనే. రిటైర్ అయిన తర్వాత ఇలా ఇంట్లో ఎక్కువ సమయం వుండే జీవితాన్ని కోరుకున్న నా సహచరి,  తన జీవితాన్నే ముగించుకుని వెళ్ళిపోయింది. ఇల్లూ మనసూ ఒకేసారి శూన్యం.  పొద్దు గడవడం, పొద్దుపుచ్చడం ఎలా అనే ప్రశ్న నా ముందు నిలిచింది.
ముందు తట్టిన ఆలోచన ఈ జీరో రచన. రెండు వందల ఎపిసోడ్లు దాటిన తర్వాత, నడిచి వచ్చిన దారి ఇంతటి సుదీర్ఘమైనదా? ఎప్పటికి తెమిలేను అనే సందేహం పట్టుకుంది.
దాంతో టీవీలో ఏ ఛానల్లో పాత నలుపు తెలుపు  సినిమా కనపడ్డా చూడడం మొదలుపెట్టి, వాటిల్లో  ఆ రోజులనాటి నా జీవన ఛాయలను వెతుక్కోవడం మొదలు పెట్టాను. అలా ఛానల్స్ మారుస్తుంటే ఒకసారి ఏదో క్రికెట్ మ్యాచ్ కనపడింది. నిజానికి నాకు క్రికెట్టు అంటే ఏబీసీడీలు తెలవ్వు. 
1970  ప్రాంతాల్లో కొత్తగా బెజవాడ ఆంధ్రజ్యోతిలో చేరినప్పుడు, కాలేజీ నుంచి తాజాగా ఇక్కడ అడుగుపెట్టాడు, ఎంతో కొంత క్రికెట్ పరిజ్ఞానం వుండక పోతుందా అని క్రికెట్ పోటీకి సంబంధించిన పీటీఐ వార్త ఒకటి  నా ముందు పెట్టి అనువాదం చేయమన్నారు. మొదటి వాక్యమే ఫర్ ది లాస్ ఆఫ్ ఫోర్ వికెట్స్ అని వుంది. క్రికెట్ మైదానంలో కనబడేవి మూడు వికెట్లు, మరి నాలుగు వికెట్లు ఏమిటనే సందేహం పొటమరించి, దాని నివృత్తి కోసం సీనియర్ సబ్ ఎడిటర్ ఉపేంద్ర బాబుగారిని ఆశ్రయించాను.
విషయం అర్ధమై ఆయన చిన్నగా నవ్వి, ‘పోనీ  లెండి, అది వదిలేసి ఇవి చూడండి’ అని కొన్ని ఇంటర్నేషనల్ న్యూస్, లియోపాల్డ్ విల్లీ, కాంగో యుద్ధం, పాట్రిస్ లుముంబా వంటి  ఐటమ్స్ చేతిలో పెట్టారు అనువాదం చేయమని. అదీ అప్పట్లో క్రికెట్ గురించి నా అవగాహన.  
ఇప్పటికి అది పెరిగింది లేదు కానీ,  చూడగా చూడగా ఆసక్తి మాత్రం పెరిగింది. క్రికెట్ గురించి నాలుగంటే నాలుగు ముక్కలు రాయడానికి అది చాలు అనుకుని అప్పుడప్పుడూ అర్ధరాత్రి వేళ మేలుకుని చూస్తూ కామెంట్లు పెడుతుంటాను. 
తోక టపా: 
మితృలు,  జేవీపీఎస్ సోమయాజులు గారు ఈరోజు ఒక ఫోటో పోస్ట్ చేశారు.  అది చూసి,
“Cricket was never my first choice. I never wanted to be a sportsperson” అంటున్న ఈవిడ ఎవరండీ అని అడిగాను, నా అజ్ఞానం, అమాయకత్వం బయటపడుతుందని తెలిసి కూడా.
ఆయన చెప్పిన జవాబు విని నాకు మతి పోయింది. భారత మహిళల జట్టుకు సారధ్యం వహించి ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీంను ప్రపంచానికి పరిచయం చేసిన మిథాలీ రాజ్. మూడేళ్ల క్రితం  ఆమె మీద ఒక సినిమా కూడా తీసారట. 
(ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి