2, ఏప్రిల్ 2022, శనివారం

ఏడాదిలో పెరిగిన నా సంపాదన - భండారు శ్రీనివాసరావు

 ఎప్పుడూ ఆ కంప్యూటర్ ముందు కూర్చుని టిక్కు టిక్కుమంటూ టైప్ చేస్తుంటారు, గూడలు అరిగిపోయేలా?’ (ఏమిటి ఉపయోగం? కూటికా! గుడ్డకా! సినిమాకా!) అనేది నా భార్య బతికున్న రోజుల్లో. బ్రాకెట్లో రాసినవి నా సొంత కపిత్వం.

రిటైర్ అయిన తర్వాత నేను రాస్తూ వచ్చిన వ్యాసాలను కొన్ని పత్రికల వాళ్ళు వేస్తూ వచ్చారు కానీ రచయితకు విదిలించింది ఏమీ లేదు. ఎక్కడో అక్కడ నేను రాసిన అక్షరాలకు నలుపూ తెలుపూ రంగులు అంటుతున్నాయి కదా అని నేనూ పట్టించుకోలేదు.

పొతే, నా బ్లాగుకు హిట్లు అన్ని లక్షలు అని చంకలు కొట్టుకోవడం తప్పిస్తే దాని రాతలవల్ల నాకు అంటుకున్నవి మెడ నొప్పులు, గూడ నొప్పులు మాత్రమే.

కొన్నాళ్ళ క్రితం అమెరికాలో ఉంటున్న మా అన్నయ్య కుమారుడు సత్య సాయి కష్టపడి నా బ్లాగును Google Adsense తో అనుసంధానం చేశాడు. పాత వాటిని ఆ సంస్థ లెక్కలోకి తీసుకోదట. పోనీలే అనుకున్నాను.

నిన్ననో మొన్ననో చూస్తే రెండు అమెరికన్ డాలర్లు నా ఖాతాలో పడ్డట్టు కనిపించింది. అవి నా బ్యాంకు ఖాతాకు చేరి, జీ ఎస్ టి పోను ఎంత మిగులుతుందో అది నాకనవసరం.

డెబ్బయి అయిదేళ్ళ వయసులో నా రాతల ద్వారా నేను రెండు డాలర్లు సంపాదించాను, అంతే నాకు కావాల్సింది.

నా భార్య బతికి వుంటే, నేనో మిలియన్ డాలర్లు సంపాదించినంత సంతోషపడి వుండేది.

మొగుడనే వాడు ప్రయోజకుడు కావడాన్ని మించి ఏ భార్యకు అయినా సంతృప్తి ఏముంటుంది?

ఈసారి అమెరికా వెళ్ళినప్పుడు నా మనుమరాళ్లకు నా డబ్బులతో చిన్న చాకలేట్ కొనివ్వగలను అనే ఊహే నాకు ఆనందాన్ని ఇస్తోంది.

(02-04-2021)

 

తోకటపా: ఏడాది క్రితం రెండు డాలర్లు. ఈ ఏడాదిలో పిల్లలు పెట్టినట్టున్నది. ఈరోజు చూస్తే ఆ మొత్తం అక్షరాలా ఇరవై ఏడున్నర అమెరికన్ డాలర్లకు పెరిగింది. ఇప్పటి మార్కెట్ రేటు ప్రకారం  2088 రూపాయలు (ట)   



(02-04-2022)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

మనసుకి నచ్చిన పని చేసి, దాంతో పదో పరకో సంపాదించుకోవడం ఆనందమే కదా మరి . ..
మీ డబ్బు పిల్లలని పెట్టి, అవి ఇంకొన్ని పిల్లల్ని పెట్టి అలా అలా మీ ఇల్లు డబ్బు పిల్లలతో కళకళ ఆడాలని ...
Venki