30, ఏప్రిల్ 2022, శనివారం

మనుషుల్లో దేవుళ్ళు - భండారు శ్రీనివాసరావు

 

తల వాకిలి ఓరగా వేసివుంది.

లోపల నుంచి మాటలు వినపడుతున్నాయి. ఆ గదిలో వున్న ఇద్దరూ నా రాకను గమనించలేదు. నడిచివచ్చిన బడలిక తీర్చుకోవడానికి ఓ కుర్చీలో కూలబడ్డాను.

వారిలో ఒకావిడ వృద్ధురాలు. ఎనిమిది పదులు దాటిన వయసు. ఆవిడ ఎవరో కాదు, స్వయానా నాకు పెద్ద వదిన. పెద్దన్నయ్య కీర్తిశేషులు  పర్వతాల రావు గారి భార్య. మా ఇంటికి  అరకిలోమీటరు దూరంలో ఉన్న కొడుకు రాఘవరావు ఇంట్లో ఉంటోంది. అయిదు రోడ్లు కలిసే ఒక రోడ్డు కూడలిలో అడ్డదిడ్డంగా వచ్చే వాహనాలను తప్పించుకుంటూ రోడ్డు దాటడం ఒక్కటే ఇబ్బంది. అయినా   రోజూ సాయంత్రం వెళ్లి కాసేపు ఆమె దగ్గర కూర్చుని రావడం అలవాటు.

నేను వెళ్లేసరికి వదిన మంచం మీద దిండును  ఆనుకుని కూర్చుని,  ఎదుటి మనిషి చెబుతున్న మాటలను ఏకాగ్రతగా వింటోంది.

ఎదురుగా వున్న ఆవిడ పేరు స్వరూప. పేరు ఆధునికంగా వున్నా పల్లెటూరు మనిషి అని చూడగానే తెలిసి పోతుంది. ఆవిడ మా వదిన గారికోసం వాళ్ళ అబ్బాయి, హైదరాబాదులోని రమణాశ్రమం సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన కేర్ టేకర్. ఈ మధ్యనే మా వదిన  తూలిపడడం చేత కుడిచేయి మణికట్టు దగ్గర ఎముక  విరిగింది. కట్టు వేశారు. జాగ్రత్తగా ఉండమని, తోడు, సాయం లేకుండా నడవ వద్దని, నాలుగు అడుగులు కూడా వేయవద్దని  డాక్టరు జాగ్రత్తలు చెప్పి పంపాడు. ఇదీ నేపధ్యం.

మా వదినను మాట్లాడనివ్వకుండా, ఆమె రెండు చేతులూ పట్టుకుని స్వరూప ఏకబిగిన చెప్పుకుపోతోంది.

నేను మౌనంగా వింటున్నాను.

“అమ్మా! మీరు పెద్దవారు. ఎనభయ్ దాటాయని చెబుతున్నారు. మీ వయసులో సగం లేదు నా వయసు. మిమ్మల్ని కనిపెట్టుకుని చూడమని మా యజమాని నన్ను మీ వద్దకు పంపాడు. ఆయనకు మాట రానివ్వకుండా చూడాలి నేను. మీరేమో రాత్రుళ్లు  నాకు చెప్పకుండా లేస్తున్నారు. మీ పక్కనే పడుకుంటున్నాను. ఓ చేయి మీ వంటిమీదే ఉంచుతున్నాను. ఏమాత్రం అవసరం వున్నా నన్ను లేపండి. నేను దగ్గర వుండి మిమ్మల్ని బాత్ రూముకు తీసుకువెడతాను. మీరు నా కంటే చాలా పెద్ద. కానీ నాకంటికి నువ్వు  రెండేళ్ల పిల్లవే. కన్నబిడ్డ పక్కబట్టలు ఆగం చేస్తే తల్లి శుభ్రం చేయదా! నేనూ అంతే! పక్క మీద నుంచి రాత్రి వేళ కదిలే పనిలేకుండా నేనే చూస్తాను. లోగడ కొన్నాళ్ళు ఓ ఆసుపత్రిలో ఆయాగా పనిచేశాను. ఇవన్నీ నాకు అలవాటే.  కాబట్టి నా మాట వినండి. నేను ఈ పనులు డబ్బుల కోసం చేస్తున్నా, డబ్బొక్కటే ముఖ్యం కాదు. నాకిక్కడ మూడు పూటలా అన్నం పెడుతున్నారు. చక్కగా కనుక్కుంటున్నారు. నా పనిలో ఏదైనా తేడా వస్తే ఆపైన దేవుడు నన్ను వదిలిపెడతాడా!  

“మళ్ళీ చెబుతున్నాను. ఈసారి అరిచి కసిరి చెబుతాను. పిల్లలకు తల్లి చెప్పదా! అలాగే నేనూ గట్టిగానే చెబుతాను. మనసులో పెట్టుకోకండి. మీ కట్టు విప్పి, మీ చేయి నయం అయ్యేవరకు నేను మిమ్మల్ని వదిలిపోను. తర్వాత మీ ఇష్టం. అంతవరకూ నాకు మాట రానీయకండి”

ఇదంతా విన్న తర్వాత నాకు అక్కడ ఉండాల్సిన అవసరం కనపడలేదు. ఎంత మౌనంగా వచ్చానో అలాగే బయటకు వచ్చేశాను. వదిన ఎలా వుందో  చూడాలని వచ్చాను. ఆమెను పదిలంగా చూసుకునే మనిషి దొరికింది.

గుళ్ళో వుండే దేవుడు మనుషుల్లో కూడా ఉంటాడు. ఈ దేవత కొలువైన గుడి నుంచి బయలుదేరి మా ఇంటికి వెళ్లాను.

ఇది జరిగిన కొద్ది రోజులకే చేతి కట్టు విప్పారు.





(30-04-2022)   

29, ఏప్రిల్ 2022, శుక్రవారం

వేద సంహిత – భండారు శ్రీనివాసరావు

 చక్కటి పేరు. యండమూరి నవలల్లో కానవచ్చే పేరు.

అయితే ఈ వేదసంహిత ప్రముఖ రచయిత, విశ్రాంత ఐ.పి.ఎస్ అధికారి శ్రీ రావులపాటి సీతారామారావు దౌహిత్రి (పెద్ద కుమారుడు రాజీవ్ చంద్ర కుమార్తె). తాత మాదిరిగానే  రచనల పట్ల ఆసక్తి. చదవడంలోనే కాకుండా రాయడంలో కూడా. అందుకే పదిహేనవ ఏటనే పెన్ను పట్టింది. తొలి రచనే సీతా రామాయణం. అదీ ఇంగ్లీషులో. అదీ ఒక సుదీర్ఘ కవిత రూపంలో.

వేదసంహిత మాతామహులు టి.ఆర్,కె, జనార్ధన్, తన మనుమరాలి (కుమార్తె డాక్టర్ మాధవి కూతురు) రచనా శైలిని ఇలా వర్ణించారు:

“Veda’s poetic narration of the great epic has the speed of steadily flowing river and the fragrance of ardent devotion to detail. Its vocabulary is simple, narration is straight forward and rhythm is easy to catch”

ఈ పుస్తకం చదివిన తర్వాత అందరికీ ఇదే అభిప్రాయం కలుగుతుందని నాకు అనిపించింది.

ఒక తరం వారికి, తమ ముందు తరం వారు చిన్ననాటి నుంచి చెప్పిన రామాయణ, భారత, భాగవతాలను విని అర్ధం చేసుకునే అవకాశం లభించింది. ఈ వేగయుగంలో అది అసాధ్యం. పసితనం నుంచి ఇంగ్లీష్ చదువులు. మరి ఈ మహత్తర ఆధ్యాత్మిక  గ్రంధాలను ఈ తరం వారు, వచ్చే తరం వారు చదివే అవకాశం ఎలా?

ఈ ప్రశ్నకు సమాధానమే ఈ పుస్తకం.

అలతి అలతి ఆంగ్ల పదాలతో వేదసంహిత కూర్చిన ఈ సీతారామాయణ గేయ కావ్యానికి (English title :SRI SITARAMAYANA) స్పూర్తి, ఆమె  తాతగారు రావులపాటి సీతా రామారావు గారు తెలుగులో రాసిన సీతారామాయణం. అయితే ఇది దానికి అనువాదము కాదు, అనుసరణ కూడా కాదు. లవకుశ  చిత్రంలో శ్రీరామ సుతులు గానం  చేసిన రామాయణం మాదిరిగా కవితాత్మకంగా సాగిపోతుంది.

ఆ సినిమాలో రామాయణంలోని అరణ్యకాండ, కిష్కిందకాండ, సుందరకాండ, యుద్ధకాండల సంక్షిప్త సమాహారంగా సముద్రాల రాఘవాచార్య ఈ గీతాన్ని రాశారు. ప్రేమతో, భామతో, చెల్లీ, రోసిల్లీ, పావనీ, రివ్వుమనీ, కోసి, జేసి, సీతా, మాతా వంటి అంత్యప్రాసలతో కూడిన పదబంధాలు ఆ గీతానికి ఎనలేని శోభను ఇచ్చాయి.

అలాగే వేద సంహిత విరచిత సీతా రామాయణం కూడా.

ఒకటో పంక్తి మూడో పంక్తి, అలాగే రెండో పంక్తి, నాలుగో పంక్తి ఎబ్బెట్టుగా అనిపించని ప్రాసతో ముగుస్తాయి.

మచ్చుకు ఒకటి రెండు ఇంగ్లీష్ పద్యాలు (పద్యాలు అనవచ్చునా)

కిష్కింధకాండలో వాలి వధ వృత్తాంతంలో, వేద సంహిత ఆంగ్ల పదవిన్యాసం ఇలా సాగుతుంది.

“Sugriva and Vali were fighting strong

They fought with trees, stones, fists and feet

They both fought and fought for so long

Between them Rama could not discreet

 

Then, an idea, Hanuman got

A garland of flowers on Sugriva he set

Then who was Vali, Rama could spot

Then Rama shot at Vali without a fret

 

హనుమంతుడు అశోకవనంలో సీతమ్మ వారిని కనుగొన్న సమయంలోనే  రావణుడు కూడా అక్కడికి చేరతాడు.

He came to Sita, and harshly said

‘Sita, my promised time is to come to an end

If you don’t accept me, I shall see you dead

Whether you live or not, on your word it shall depend

 

Then Sita plucked a grass blade beside

Showed it to Ravana and then said

‘You are this when my Rama is by my side

Than to be with you, I am better to be dead

 

ఇలాంటి చిరు కవితలు, రెండు వందల పుటల ఈ పుస్తకంలో వేయికి పైగా వున్నాయి.

చిన్న వయసులో చేసిన గొప్ప ప్రయత్నం. అన్నింటికీ మించి మధురమైన తెలుగు భాషను చదివి అర్ధం చేసుకోలేని భావి తరానికి రామాయణ కావ్యాన్ని పరిచయం చేయడానికి ఇది చాలా ఉపయుక్తంగా వుంటుంది. భాష సంగతి పక్కన పెడితే, మన సంస్కృతి పసి మనస్సుల్లో  పదిలంగా వుంటుంది.

వేద సంహిత మరో ప్రయత్నం కూడా చేసింది. తమ్ముడు అద్విత్ హృదయ్ తో కలిసి ముఖచిత్రంతో పాటు చక్కని రంగుల చిత్రాలను స్వయంగా చిత్రించి ఈ పుస్తకానికి జోడించింది.

చదవడానికి వీలైన ఈ పుస్తకాన్ని చూసి, విని ఆనందించే చక్కటి ఇంగ్లీష్ సంగీత రూపకంగా కూడా రూపొందించి యు ట్యూబ్ లో పెడితే దేశ విదేశాల్లో కూడా ప్రాచుర్యం పొందుతుంది.

చక్కటి ప్రయత్నం చేసిన వేదసంహితకు ఆశీ:పూర్వక అభినందనలు.



28, ఏప్రిల్ 2022, గురువారం

వావిలేని వరుసలు – భండారు శ్రీనివాసరావు

 (కాస్త గందరగోళంగా వుంటుంది, ఇది తెలుగు నేలపై జరిగే వ్యవహారం కాదు, ఇంగ్లీష్ జోకుకు తెలుగు అనువాదం కాబట్టి ఇలా మిడికింది)

ఏకాంబరం పెళ్లి చేసుకున్నాడు. కాకపోతే అప్పటికే పెళ్ళయి విడాకులు తీసుకున్న అమ్మాయిని ఎవరికీ చెప్పకుండా గుళ్ళో పెళ్లి చేసుకుని వేరు కాపురం పెట్టాడు. ఆ కొత్త పెళ్లి కూతురు అమ్మాయి కాదు, అప్పటికే అమ్మ. ఆ అమ్మడికి ఈడొచ్చిన ఒక అమ్మాయి వుంది. పెళ్లి అయిన రోజే ఒకమ్మాయికి తండ్రి అయ్యే అదృష్టం పట్టిన ఏకాంబరానికి అతడి తండ్రి రూపంలో దురదృష్టం ఎదురయ్యింది. ఒకరోజు కొడుకును చూడ్డానికి ఏకాంబరం ఇంటికి వచ్చిన తండ్రి, సొంత కొడుక్కి సవతి కూతురు అయిన అమ్మాయిపై మనసు పారేసుకుని ఏకంగా పెళ్ళాడేసి కొత్త కాపురం పెట్టాడు. ఆ విధంగా కూతురు వరసయిన అమ్మాయి ఇప్పుడు సవతి తల్లి అవతారం ఎత్తింది. కన్న తండ్రికే పిల్లనిచ్చిన మామ అయ్యాడు. అలా ఏకాంబరం కట్టుకున్న పాత పెళ్ళాం తోనూ, అతడి తండ్రి కొత్త పెళ్ళాం తోనూ హాయిగా కాపురాలు చేసుకుంటున్న రోజుల్లో కధ మరో మలుపు తిరిగింది.

ఏకాంబరానికి సవతి కూతురు లేదా సవతి తల్లి వరుస అయిన అయిన పాత తండ్రి కొత్త భార్య నెల తప్పింది. చూస్తుండగానే నెలలు నిండడం, పండంటి పిల్లాడిని కనడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడా పిల్లవాడు మన ఏకాంబరానికి ఒక రకంగా మనుమడు. ఎంచేతంటే సవతి కూతురు కన్న తల్లికి తాను మొగుడు కాబట్టి. మరో రకంగా ఆ పిల్లవాడు ఏకాంబరానికి తమ్ముడు వరస, ఎందుకంటె అతగాడు తండ్రికి పుట్టిన కొడుకు కాబట్టి.

దాంతో ఏకాంబరం భార్య పాత్ర అమ్ముమ్మకు మారింది. దీనికి కారణం ఆవిడ కూతురే ఏకాంబరం నాన్నగారి భార్య కాబట్టి. ఈ వరస ప్రకారం ఏకాంబరం తన భార్యకు మనుమడు అవుతాడు. ఈ తికమకల నడుమ ఏకాంబరం భార్య ఓ మంచి రోజు చూసుకుని ఒక పిల్లాడ్ని కని కూర్చుంది. అతడి కన్న కొడుకే అతడి నాన్నకు బావమరిది అయ్యాడు. అంతేకాదు ఏకాంబరానికి సవతి తల్లి వైపు వరస తీసుకుంటే అతడు అతడికే తాత అయ్యాడు.

ఇలా వుండగా ఏకాంబరం ఇంటికి జనాభా లెక్కల వాళ్ళు వచ్చారు. ఆ సమయంలో మొత్తం కుటుంబం ఇంట్లోనే వున్నారు.

లెక్కల వాడు అందర్నీ లెక్కపెట్టి చూసుకున్నాడు. తరువాత ఏకాంబరాన్ని అడిగాడు. ఆ కుర్చీలో కూర్చున్న పెద్దాయన ఎవరని.

ఆయనా ! ఆయన మా నాన్న. కాదు కాదు మా అల్లుడు’

ఈ పెద్దావిడ?’

నా భార్య’

ఆ చిన్నావిడ?’

మా అమ్మాయి, కాదు కాదు మా అమ్మ’

ఈ పిల్లవాడు?’

నా మనుమడు కాదు కాదు కొడుకు’

యితడు అతడికేమవుతాడు?’

మనుమడు, కాదు కాదు బామ్మర్ది’

ఈవిడ?’

మా సవతి తల్లి కాదు కాదు కూతురు’

జనాభా లెక్కల వాడు, నీళ్ళు కూడా అడక్కుండా మూర్చపోయాడు.

27, ఏప్రిల్ 2022, బుధవారం

మారింది రోజులా! మనుషులా!

 తన రంగంలో క్రమంగా నిలదొక్కుకుని, జీవితంలో ఒక స్థాయికి ఎదిగిన ఒక కళాకారుడిని ఇంటర్వ్యూ చేస్తూ అడిగాడు విలేకరి.

జీవితంలో అనేక ఎత్తుపల్లాలు చూసారు. లేని రోజులకు, ఉన్న రోజులకు తేడా ఏమైనా కనిపిస్తోందా’ అని.

హస్తిమశకాంతరం’ జవాబు వచ్చింది వెంటనే.

లేని రోజుల్లో లేనిడబ్బు ఒక్కటే సమస్య. ఇప్పుడో డబ్బు తప్ప అన్నీ సమస్యలే”

అదెలా?”

ఆ రోజుల్లో డబ్బు లేకపోయినా మనుషుల నడుమ ఆప్యాయతలు, అనురాగాలు ఉండేవి. స్నేహితుల సంగతి చెప్పక్కర లేదు. ఎవరు ఎవరి మీద పడి తింటున్నాడో ఎవరికీ పట్టేది కాదు. ఇప్పుడలా కాదు. అన్నిటికీ లెక్కే. అవసరానికి ఎవరినైనా ఏదైనా అడిగితే ఆ అవసరం వెనుక ఏదైనా మర్మం ఉందా అనే శోధింపు ఎక్కువైంది. ఇతరుల గురించి కాదు, నేను చెప్పేది. నేనైనా అంతే! ఈ తేడా ఎలా వచ్చిందో ఏమిటో మరి!”

“.........”

రేపెలా గడుస్తుంది అనే అ రోజుల్లో రేపటి గురించిన బెంగ ఎవ్వరికీ వుండేది కాదు. ఏపూటకాపూట హాయిగా గడిచిపోయేది. వున్నవాళ్ళు, లేనివాళ్ళు వున్నదా౦తోనే గడుపుకునేవాళ్ళు. లేదనే లోటు వుండేది కాని, లేదన్న మనాది ఉండేది కాదు”

“......”

మరో విషయం చెప్పనా! కష్టాలు తెప్పించే కన్నీళ్లు కళ్ళల్లో తిరిగేవేమో కాని, మొహంలో చిరునవ్వులు మాత్రం చెరిగేవి కావు. తరాలకు సరిఅడే ఆస్తులు పోగుపడ్డాయి కానీ, ఆ నాటి సంతృప్తి కలికానికి కూడా మిగల్లేదు”

విలేకరి దగ్గర అడగడానికి ప్రశ్నలు లేవు, నోట మాటలూ లేవు.

 

26, ఏప్రిల్ 2022, మంగళవారం

టీఆర్ఎస్ ప్లీనరీ

 {Published in Namaste Telangana Daily on 26-04-2022)

 

నూతన తెలంగాణా రాష్ట్రం ఏర్పడి, ఆ కొత్త రాష్ట్రానికి నూతన ప్రభుత్వ సారధిగా టీఆర్ ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాలనాపగ్గాలు చేపట్టి మరో రెండుమాసాల్లో ఏడేళ్ళు పూర్తికావస్తున్న తరుణంలో, ఈ నెల ఇరవై ఏడో తేదీన  హైదరాబాదు నగరంలోని  హైటెక్స్ సమావేశ మందిరంలో జరగనున్న ప్లీనరీ చర్చలు, పార్టీ నాయకత్వానికీ, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశనం చేస్తూనే మరోపక్క చక్కని ఆత్మపరిశీలనకు అవకాశం కల్పిస్తాయని ఆశించవచ్చు.  ఈ ప్రతినిధుల సభలోనే కేసీఆర్ ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయినట్టు ప్రకటించడం లాంఛనంగా జరిగే మరో ప్రక్రియ. అయితే ఈసారి ఇందుకు భిన్నంగా, ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు పార్టీ పగ్గాలు పూర్తిగా ఒప్పచెప్పి, యువ నాయకత్వంలో పార్టీని మరింత పటిష్టం చేయాలనే ఆలోచనలో కేసీఆర్ వున్నట్టు సమాచారం.  కాకపొతే, ఈ ఊహాపోహలకు ఎలాంటి ప్రాతిపదిక లేదు. ఆయన మనస్సులోని మాట ఆయన స్వయంగా బయట పెట్టేదాకా ఏ విషయం మూడో కంటికి తెలిసే అవకాశం లేని రాజకీయ చాణక్యం ఆయన సొంతం. కేసీఆర్ ఆలోచనా విధానమే విభిన్నం. పరిపాలనలో కావచ్చు, పార్టీ నడిపే తీరులో కావచ్చు ఆయనది ఒక అరుదయిన విలక్షణ శైలి అని అందుకే అందరు చెప్పుకుంటారు.

ఉద్యమ పార్టీల పుట్టుక, ఎదుగుదల ఎన్నో ప్రతికూల పరిస్తితుల నడుమ సాగుతాయి. ఇందుకు టీఆర్ ఎస్ పార్టీ కూడా మినహాయింపు కాదు. సుమారు రెండు దశాబ్దాలుగా టీఆర్ఎస్ ప్రస్థానాన్ని గమనిస్తే ఈ విషయం అర్ధం అవుతుంది. ఈ  క్రమంలో చోటుచేసుకున్న అనేక పరిణామాలను ఓసారి సింహావలోకనం చేసుకుంటే ఎన్ని బాలారిష్టాల నడుమ ఈ పార్టీ బతికి బట్ట కట్టిందీ అవగతమవుతుంది.

తెలంగాణా ప్రజలకు ఉద్యమాలు కొత్తకాదు. ప్రత్యేక తెలంగాణా సాధన కోసం గతంలో కూడా పలుమార్లు ఉద్యమాలు జరిగాయి. అయితే ప్రతిసారీ అవి హింసాత్మకంగా మారాయి. సాధించింది ఏమీ లేకపోవడంతో అసలు ఉద్యమాల పట్లనే ప్రజలకు ఏవగింపు కలిగే పరిస్తితుల్లో కేసీఆర్ రంగప్రవేశం చేసి సుదీర్ఘ శాంతియుత పోరాటానికి బాటలు వేశారు. స్వల్ప సంఘటనలు మినహాయిస్తే, పుష్కర కాలం పైచిలుకు సాగిన తెలంగాణా సాధన పోరాటంలో ఎక్కడా అపశృతులు దొర్లిన దాఖలాలు లేకుండా జాగ్రత్త పడ్డారు. ముందు చెప్పినట్టు, వినూత్నంగా ఆలోచించే కేసీఆర్ తత్వం, తెలంగాణా ఉద్యమ స్పూర్తి ఏ దశలోనూ దెబ్బతినకుండా కాపాడింది. ఉద్యమజ్యోతి వెలుగులు మసిబారకుండా చూసింది. ఈ క్రమంలో కేసీఆర్ చేసిన ప్రసంగాలు, వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు ఉద్యమ తీవ్రత తగ్గుముఖం పట్టకుండా చేయగలిగాయి. ఇందుకు కేసీఆర్ అనుసరించిన వ్యూహాల్లో పార్టీ ప్లీనరీలు ఒక భాగం. ఉద్యమ తీవ్రతలో హెచ్చుతగ్గులు వుండవచ్చేమో కానీ, త్రికరణశుద్ధిగా సాగించే ఉద్యమాలు, ఆందోళనలు వైఫల్యం చెందే ప్రశ్నే ఉండదని కేసీఆర్ నమ్మకం. ఈ పరిణామ క్రమంలో టీఆర్ ఎస్ పార్టీ ఎదుర్కున్న ఆర్ధిక ఇబ్బందులు, మోసిన నిందలు అన్నీ ఇన్నీ కావు. తీసుకున్న ప్రతి నిర్ణయం అవహేళనలకు గురయింది. వేసిన ప్రతి అడుగు అపనిందల పాలయింది. అయినా కేసీఆర్ ప్రతి మలుపును గెలుపు దిశగా మళ్ళించుకుని, పార్టీకి ఎప్పటికప్పుడు నూతన జవసత్వాలను అందిస్తూ పోయారు. ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుని ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడ్డారు. దశలు దశలుగా, రూపాలు మార్చుకుంటూ సాగించిన ఉద్యమం ఒక కొలిక్కి రావడానికి పట్టిన సమయం కూడా దశాబ్ద కాలం పైమాటే. మరి అన్నేళ్ళు ఒక ఉద్యమ పార్టీ ఊపిరి పీల్చుకోవాలంటే మాటలు కాదు. సాధ్యమూ కాదు. అటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన సత్తా ఉండబట్టే కేసీఆర్ తెలంగాణా ప్రజల దృష్టిలో ఒక గొప్ప నాయకుడు కాగలిగారు. మొత్తం మీద ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నారు.

సరే ఇదొక ఎత్తు అనుకుంటే, అధికారం సిద్ధించిన తరువాత ఎదురయ్యే పరిణామాలను సమర్ధవంతంగా నిభాయించుకోవడం మరో ఎత్తు. పార్టీని చీల్చయినా సరే అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని చూసే శక్తులు పక్కనే పొంచివుంటాయి. ఏమరుపాటుగా వుంటే చాలు ఏమి చేయడానికయినా సిద్ధం అన్నట్టు వ్యవహరించే శక్తులను ఆదిలోనే కట్టడి చేసిన విధానం కేసీఆర్ వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆయన ఒక ఉద్యమ నేత మాత్రమే కాదు, చాణక్య నీతిని సయితం వంటబట్టించుకున్న వ్యూహకర్త అని ప్రపంచానికి వెల్లడయింది.

తెలంగాణా తొలి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన వెంటనే పుష్కర కాలంగా తన మెదడులో సుళ్ళు తిరుగుతున్న ఆలోచనలను ఆచరణలోకి తీసుకువచ్చే పనికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే తెలంగాణా చీకటి కూపం అవుతుందని వేర్పాటు వాదాన్ని వ్యతిరేకించిన వారు చేసిన ఎద్దేవాలను గుర్తు పెట్టుకుని, పట్టుదలగా పనిచేసి అనేక సంవత్సరాలుగా జనాలు అలవాటుపడిన కరెంటు కోతల ఇబ్బందులను మంత్రం దండంతో మాయం చేసినట్టు మాయం చేశారు. రాష్ట్రం విడిపోగానే హైదరాబాదులోనూ, ఇతరత్రా తెలంగాణాలోనూ స్థిరపడ్డ ప్రాంతీయేతరులు తమ భవితవ్యంపై పెంచుకున్న భయాoదోళనలను అనతికాలంలోనే మటుమాయం చేశారు. భగీరధ, కాకతీయ వంటి పధకాలను అమలుచేస్తూ బంగారు తెలంగాణా దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు.

అయినా చేయాల్సినది అంతా చేయలేదేమో అనే నిరాశాపూరిత వ్యాఖ్యలు అప్పుడప్పుడూ వినబడుతూనే వున్నాయి. విపక్షాలు విమర్సించక ఏమి చేస్తాయి అని సరిపెట్టుకోవచ్చు, సర్దిచెప్పుకోవచ్చు. కానీ ఆ నిరసనలు వెలువడుతున్నది విపక్షాల గొంతుకలో నుంచా, ప్రజలు కూడా అలాగే అనుకుంటున్నారా అనేది జాగ్రత్తగా గమనించుకోవడం సమర్ధుడయిన పాలకుని ప్రధమ కర్తవ్యం.

ప్లీనరీ అందుకు తగిన వేదిక కాగలదని ఆశిద్దాం.




ఎవరీ పీకే – భండారు శ్రీనివాసరావు

 (Published in ANDHRAPRABHA on 26-04-2022, Tuesday)

లార్జర్ దాన్ లైఫ్ (Larger than life) అని ఇంగ్లీష్ లో తెగ వాడేస్తుంటారు. ఈ వాక్యానికి అసలు అర్ధం మారిపోయి, ఉన్న మనిషిని ఉన్నదానికన్నా పెంచి చూపించడం అనే కోణంలో ప్రస్తుతం ఉపయోగిస్తున్నట్టుగా అనిపిస్తోంది. మనిషిలోని  గొప్పతనాన్ని  మరింత పెంచి చూపించడం అంటే ఇమేజ్ బిల్డింగ్ (ప్రతిష్టను ఇనుమడింప చేయడం) అని అర్ధం చెప్పుకోవచ్చు. ఇప్పుడు దేశంలో ఒక స్థాయికి ఎదిగిన రాజకీయ నాయకులు అందరూ ఈ ఇమేజ్ బిల్డింగ్ తాపత్రయంలో పడిపోతున్నారు. బహుశా ఇదంతా ప్రశాంత్ కిషోర్ (పీకే) మహిమ కాబోలు.

కొన్ని వారాల క్రితం ఒక వెబ్ ఛానల్ వాళ్ళు ఈ ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడమని అడిగారు. ‘ఎవరీ పీకే?  ఆయన వెనక ఎవరున్నారు?’ అనేది మొదటి ప్రశ్న.

‘ఆయన వెనుక ‘ఆయనే’ వున్నారు అనేది నా జవాబు. 

ఇంకొకరు వెనక ఉండడానికి ఆయన అల్లాటప్పా రకం కాదు. బాహుబలి డైరెక్టర్ రాజమౌళి లాగా ప్రశాంత్ కిషోర్ ఖాతాలో కూడా వరస విజయాలు వున్నాయి. ఒక వ్యక్తిని లేదా వ్యవస్థను అంచనా వేయడానికి ఈనాటి వాణిజ్య ప్రపంచంలో విజయాన్ని మించిన కొలమానం లేదు. ఆ విజేతలు పట్టింది బంగారం,  చెప్పింది వేదం. వారి మాటకు ఎదురు చెప్పేవారు వుండరు. చెప్పరు కూడా.  విజయంలో దాగున్న  అసలు రహస్యం అదే!

బీహార్ లోని  రోహతాస్ జిల్లా కోనార్ గ్రామానికి చెందిన ప్రశాంత్ కిషోర్ వైద్యుడైన తన తండ్రితోపాటు  బక్సర్ కు వెళ్లి అక్కడే స్కూలు చదువు ముగించాడు. ఆరోగ్యరంగంలో ఉన్నత విద్య అభ్యసించి అమెరికాలో ఐక్యరాజ్యసమితిలో ఎనిమిదేళ్లు పనిచేసి, భారత దేశానికి తిరిగివచ్చారు. అందరు నడిచేదారిలో కాకుండా రాజకీయ వ్యూహకర్తగా తన వృత్తిని ఎంచుకున్నారు.

మొదటి విజయానికి పునాది గుజరాత్ లో పడింది. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ  2012లో  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడో పర్యాయం ఎన్నికలను ఎదుర్కుంటున్న తరుణంలో పీకే తన వ్యూహ చాతుర్యాన్ని ప్రదర్శించి ఆయన గెలుపుకు కారణం అయ్యారు. తిరిగి రెండేళ్ల తరువాత 2014 లో బీజేపీ  తరపున ప్రధాని అభ్యర్ధిగా పోటీ చేస్తున్నప్పుడు కూడా పీకే ‘చాయ్ పె చర్చా వంటి వినూత్న కార్యక్రమాలతో దేశ ప్రజల దృష్టిలో నరేంద్ర మోడీకి ఒక ప్రత్యేక స్థానం కల్పించడంలో విశేష కృషి చేశారు. అ ఎన్నికలలో బీజేపీ సాధించిన విజయం, ఆ పార్టీ జాతీయ స్థాయిలో స్థిర పడడానికి, వివిధ రాష్ట్రాలలో అధికార పీఠం ఎక్కడానికి తోడ్పడింది. రెండు ఎన్నికలలో బీజేపీతో  కలిసి పనిచేసిన పీకే 2015 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సహాయ సహకారాలు అందించారు. అంతే! అక్కడ కూడా పీకే వ్యూహం అద్భుతంగా పనిచేసింది. అమరేంద్ర సింగ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు.  తరువాత పీకే తన సొంత రాష్ట్రం అయిన బీహార్ లో ఆ  రాష్ట్ర ముఖ్యమంత్రి    నితీష్ కుమార్ కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. అక్కడా ఆయనకు ఎదురు లేకుండా పోయింది.

‘నన్నెవ్వరాపరీవేళా’ మాదిరిగా పీకే ప్రభలు దేశవ్యాప్తంగా వెలుగులు విరజిమ్ముతున్న సమయంలో, ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన రెడ్డి నుంచి ఆహ్వానం అందింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎదుర్కోవడం, ఎదుర్కుని గెలవడం అనేవి  జగన్ మోహన రెడ్డికి చావోరేవో అనుకునే తరుణంలో, పీకే ఆయనతో జట్టు కట్టారు. అంతవరకూ సాంప్రదాయక ప్రచార పద్ధతులకు అలవాటు పడిన రాష్ట్ర రాజకీయ నాయకులకు ఈ వ్యూహకర్తల పాత్ర ఏమిటన్నది అర్ధం కాలేదు. పైగా ఈ పీకే అనే పెద్దమనిషి ఎవరో ఏమిటో కూడా చాలామందికి తెలవదు. ఎన్నికలకు ముందు జగన్ మోహన రెడ్డి ఒక బహిరంగసభలో ఆయన్ని వేదిక మీదకు ఆహ్వానించి, పక్కన నిలబెట్టుకుని  ‘ఇదిగో వీరే ప్రశాంత్ కిషోర్’ అని పరిచయం చేసేవరకు ఆయన ఎలా ఉంటాడో కూడా చాలామందికి తెలియదు. ఆ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి అఖండ, అపూర్వ ఘన విజయం సాధించడంతో, ఎన్నికల వ్యూహ కర్తగా  పీకే పేరు దేశం యావత్తు మారుమోగిపోయింది.  పీకే అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని తెలుగునాట ప్రచారంలో ఉండడం కూడా ఓ కారణం కావచ్చు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీ ఎం కె విజయానికి దోహదం చేసింది కూడా పీకే వ్యూహ చాతుర్యమే. అలాగే బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కు వ్యూహకర్తగా, మోడీ, అమిత్ షా ద్వయాన్ని ఎదుర్కుని సాధించిన విజయం కూడా చిన్నదేమీ కాదు.   

అల్లాంటి పీకే మళ్ళీ ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యాడు. కాంగ్రెస్ లో చేరి, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ విజయానికి కృషి చేస్తారని ఆ వార్తల సారాంశం. వీటికి తగ్గట్టే ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో  ప్రశాంత్ కిషోర్ ముఖాముఖి చర్చలు జరపడంతో ఈ వార్తలకు మరింత ఊతం చిక్కింది.

ఈ ప్రచారాలు ఇలా అనంతంగా సాగుతుండగానే ప్రశాంత్ కిషోర్, తెలంగాణాలో కాంగ్రెస్ ప్రత్యర్థి అయిన టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తో సుదీర్ఘ ఏకాంత చర్చలు జరపడం రాజకీయ దుమారం లేపింది. తెలంగాణా కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ఈ అంశంపై చేసిన ట్వీట్లు, రాష్ట్ర  కాంగ్రెస్ అధినేతలలో కలవరం రేకెత్తించాయి. ‘నీ శత్రువుతో స్నేహంగా వుండేవాడిని  నమ్మరాదు’ అనే కొటేషన్ ను ఆయన వరసగా ట్వీట్ చేయడం ఏ.ఐ.సీ.సీ. వర్గాల్లో కూడా చర్చకు దారి తీసింది.  

ఇలా రాజకీయంగా పరస్పరం విబెధించుకునే పార్టీలతో మంతనాలు జరపడం ద్వారా పీకే ఏమి సాధించదలచుకున్నారు అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తికరమైన  జవాబు లేదు. అయితే నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిని అధికారం నుంచి తప్పించాలనే  ఏకైక ధ్యేయంతోనే తాను పనిచేస్తున్నట్టు ప్రశాంత్ కిషోర్ పలుమార్లు  చెప్పిన విషయం గమనార్హం. అంటే మోడీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేయడం అనే లక్ష్యంతోనే ఆయన ముందుకు సాగుతున్నారు అని అనుకోవాలి. అదే సమయంలో, ‘మీకు ఒక రాష్ట్రంలో విజయం ముఖ్యమా, కేంద్రంలో అధికారం ప్రధానమా అనేది మీరే  తేల్చుకోండ’ని, కాంగ్రెస్ పార్టీకే పీకే వదిలేసినట్టు అనిపిస్తోంది.  

ఒకటి మాత్రం నిజం. పీకే వల్ల అధికార పగ్గాలు చేజిక్కించుకున్నవాళ్ళు ఆయన వల్లనే తాము విజయం సాధించామని పైకి ఒప్పుకోకపోవచ్చు. కానీ ఆయన వల్ల పరాజయం పాలయిన వాళ్ళు మాత్రం ఏదో ఒక రోజు ఆయన సాయం తీసుకోరని అనుకోవడానికి కూడా  లేదు. ఇందుకోసం క్యూలో నిలబడి వున్నా ఆశ్చర్యం లేదు. కారణం గెలుపు కోసం, అధికార పీఠం కోసం  వాళ్ళు పడే ఆరాటం, అనేక ఘన విజయాలు ఖాతాలో ఉన్న ప్రశాంత్ కిషోర్ వంటి వారివైపే అడుగులు వేయిస్తుంది.

ఎందుకంటే ఆయన పెద్ద బిజినెస్ మాన్. ఆయన ఖాతాలో ఇంతవరకు అపజయం అన్నది లేదు. (గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పరాజయం ఒకటి వుంది. అయితే తాను ఆ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదని ప్రశాంత్ కిషోర్ స్వయంగా వివరణ ఇచ్చారు)

తను చేసిన పనికి తన ఫీజు తాను తీసుకుని నిబద్ధతతో పనిచేస్తాడు.(అయితే, పార్టీల నుంచి  డబ్బు తీసుకోను అని ఈ మధ్యనే ఆయన ఒక ప్రకటన  చేశాడు) తనను నమ్ముకున్నవారికి ఫలితం చూపిస్తున్నాడు, బాహుబలి రాజమౌళిలాగా. విశ్వాసానికి విజయమే గీటురాయి.

రాజకీయ పార్టీలు కూడా వ్యాపార సంస్థలే. లాభం లేదు అనుకుంటే ఒక పైసా విదల్చవు. ఉందనుకుంటే కోట్లు వెదజల్లుతాయి.

 

ఇక ఎవరికీ పట్టని నైతిక విలువలు ఓటర్లకు మాత్రం ఎందుకు? టీవీ చర్చల్లోకి  తప్ప.

పొతే, ప్రశాంత్ కిషోర్ కు ఓ హితవాక్యం.

ఇంతవరకు పీకే ఒడ్డున వుండి పావులు కదిపి తన జట్టును గెలిపించుకున్నాడు. ఇప్పడు తనే స్వయంగా ఓ పార్టీ తీర్థం పుచ్చుకుని, గోదాలోకి దిగుతున్నారు. ఈసారి పాత్ర మారుతోంది. మారిన కొత్త  పాత్రలో జీవించడం, మెప్పించడం  అంత సులభం కాదు. ఈ పరిస్థితిలో  అయన మునుపటి మాదిరిగా విజయాలు సాధిస్తే ఆయన్ని నమ్ముకున్నవాళ్లకు మంచిదే. కానీ, పరాజయం సిద్ధిస్తే మాత్రం  దాన్ని హుందాగా స్వీకరించగలగాలి. 



(25-04-2022)