9, జనవరి 2022, ఆదివారం

దశలవారీ సంపూర్ణ మద్యనిషేధం అను సారా పురాణం – భండారు శ్రీనివాసరావు

 (Published in Andhra Prabha on 09-01-2022, Sunday, today)

తాగి వాహనం నడుపుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న తన వాహనాన్ని పోలీసులు సరిగా పట్టించుకోకపోవడం వల్ల, అది వానకు తడిసి, ఎండకు ఎండి పాడై పోతోందని, అంచేత  దాన్ని తనకు అప్పగించాలని ఆ వ్యక్తి కోర్టుని ఆశ్రయించాడు. మద్యనిషేధం చట్టం అమల్లో వున్నప్పుడు ఇది జరిగిందని, కానీ ప్రస్తుతం ఆ చట్టాన్ని ఎత్తి వేసినందువల్ల, తన వాహనం ఇంకా పోలీసుల స్వాధీనంలో వుండడం చెల్లదని కూడా అతడు వాదించాడు. కోర్టు అతడి వాదనను  సమర్ధించి వాహనాన్ని విడుదల చేస్తూ తీర్పు చెప్పింది.

మద్య నిషేధం అమల్లో వున్నప్పుడు, ఎత్తివేసినప్పుడు ఇలాంటి కధలు లెక్కకు మిక్కిలి.

అయాచితంగా లభించే ఎక్సైజ్ ఆదాయాన్ని ఏ పార్టీ అధికారంలో వున్నా, అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా ఓ పట్టాన వదులుకోవు. అయితే మద్య నిషేధం అనేది ఎన్నికలకు ముందు ప్రజలను ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకర్షించడానికి  ఎలా పనికి వస్తుందో,  అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని నడపడానికి  ఇక దానితో అవసరం లేదన్న ఎరుక కూడా రాజకీయ పార్టీలకి బోధపడుతుంది.  అందుకే నెమ్మదిగా   మద్యనిషేధం అమలుకు తూట్లు పొడవడం మొదలవుతుంది. ఎందుకంటే ప్రజాసంక్షేమ పధకాలు సరిగ్గా అమలు జరగాలంటే మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయమే వాటికి శరణ్యం. కాబట్టి అన్ని పార్టీలకి అధికారంలోకి రావడానికి మద్యనిషేధం అనే నినాదం, దక్కిన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి దాన్ని గురించి పట్టించుకోకపోవడం ఒక అలవాటుగా మారింది. ఇందుకు ఏ పార్టీ మినహాయింపు కాదని గతమే చెబుతోంది. 

కీర్తిశేషులు, సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి అయిన శ్రీ పీవీ ఆర్కే ప్రసాద్ గారు రాసుకున్న అనుభవాలే ఇందుకు రుజువు. అదేమిటో చూద్దాం.

“సర్! ఈ సారా, లిక్కర్ అమ్మటం నా అలవాట్లకు విరుద్ధం. దయచేసి ఈ పోస్టులో మరెవరినైనా వేయండి” అని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిని వేడుకున్నారు ప్రసాద్ గారు.

“బ్రదర్, లిక్కర్ మా అలవాట్లకు కూడా భిన్నమే. కానీ రెవెన్యూ తెచ్చే వారుణి వాహిని పధకం పకడ్బందీగా అమలు జరగాలంటే మీ వంటి వాళ్ళు వుండాలి. ఇది ఉద్యోగ ధర్మం. ఆబ్కారీ వేలం పాటల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచాలి. లేకపోతే కిలో రెండు రూపాయల పధకానికి వందలాది కోట్లు ఎక్కడనుంచి తెస్తాం? ” అన్నారు ముఖ్యమంత్రి రామారావు గారు. 

‘అసలేం జరిగిందంటే ..’ అనే పేరుతొ ప్రసాద్ గారు రాసిన పుస్తకంలో ఇలాంటి  కొన్ని విషయాలు ఆయన మాటల్లోనే.

“(ఈ కొత్త ఉద్యోగంలో) నాకు ఎదురైన మొదటి సవాల్ సారా పాటల ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం ఎలా అని.

“ప్యాకింగు లేని సారాని కల్తీ చేయకుండా నిరోధించడానికి నాటు సారాని కూడా బ్రాందీ, విస్కీల మాదిరిగా సీలు వేసిన సీసాల్లో  సరఫరా చేస్తే... ఈ ఆలోచన అమలు చేయడానికి ప్రభుత్వమే ఒక సంస్థని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ అనే సంస్ట కి నేను చైర్మన్ ని. సమర్ధుడు, నిజాయితీపరుడు అయిన దువ్వూరి సుబ్బారావు మేనేజింగ్ డైరెక్టర్. ఈ పోస్టులో వేయగానే నా దగ్గరకు వచ్చి తలపట్టుకుని కూర్చున్నాడు. ‘నాకు ఆ సారా వాసనే పడదు. నన్నీ పోస్టులో ఇరికించారేమిటి?” అన్నాడు.

“రైట్  కొస్చెన్ టు రాంగ్ పర్సన్ (Right question to wrong person)  సుబ్బారావ్. ఏం చేద్దాం. తప్పో రైటో ముందుకు వెళ్ళడం తప్ప మరో మార్గం లేదు” 

“అంతే! ఇద్దరం పనిలో దిగిపోయాం. ఊబిలో దిగిపోతున్నాం అనే సంగతి అప్పటికి తెలియదు.

“బాట్లింగ్ ప్లాంట్ల కోసం జిల్లాల్లో స్థలాలు సేకరించాం. బాట్లింగ్ యంత్రాలు కొన్నాం. సీసాలు కొన్నాం. వాటిని సరఫరా చేయడానికి క్రేట్లు కొన్నాం. చాలా బాగా చేశావయ్యా సుబ్బారావ్ అని అభినందించాను. సుబ్బారావు విచిత్రమైన నవ్వు నవ్వాడు. అతడి కవి హృదయం అర్ధం అయింది.

“కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు.

“సరఫరా చేసిన సీసాలన్నీ బాట్లింగ్ ప్లాంట్లకు తిరిగి రావాలి. దుమ్ముకొట్టుకు పోయిన వాటిని శుభ్రం చేయాలి. ఏమాత్రం అశ్రద్ధ జరిగినా ప్రజల ఆరోగ్యానికే ప్రమాదం. (ఆరోగ్యాన్ని పాడు చేసే మద్యాన్ని తాగేవారి  క్షేమం గురించి ఆలోచించడం చిత్రంగా లేదూ)

“ఈ ఆలోచనల నుంచి పుట్టుకు వచ్చిందే పాలిథిన్ సంచుల్లో సారా సరఫరా. ఈ ఆలోచనని ముఖ్యమంత్రి ముందు వుంచాం. రామారావు గారికి బాగా నచ్చింది. ‘అద్భుతం. అలాగే చేయండి అన్నారు.

“ఈ పధకానికి ఓ మంచి పేరుకోసం ఒకరిద్దరు పండితుల్ని పిలవమన్నారు. చివరికి మన పురాణాల్లో మద్యానికి అభిమాన దేవత, ఆదిశేషుని భార్య    వారుణి పేరు బాగుందన్నారు. ఆ వారుణిని ఇప్పుడు ప్రజల్లోకి ఏరుల్లాగా ప్రవహింప చేయాలి కాబట్టి వారుణి వాహిని అని నామకరణం చేశారు.

“ఇలా రకరకాలుగా పన్నిన వ్యూహాలు ఫలించి వేలం పాటల్లో ఆబ్కారీ ఆదాయం ఒక్కసారిగా 180 కోట్ల రూపాయలకు అదనంగా పెరిగింది.

“రామారావు గారి ఆనందానికి అవధులు లేవు. మా అదృష్టం బాగుండి నిజాయితీపరుడు అయిన అశోక్ గజపతి రాజు గారు ఎక్సైజ్ మంత్రి కావడంతో ఆ ఏడాది కాంట్రాక్టర్లు అందరికీ కల్తీ సారా శక్తుల నుంచి రక్షణ కల్పించగలిగాము. అలాగే వాళ్ళని మా ఎక్సైజ్ సిబ్బంది పీక్కు తినకుండా అడ్డుపడగలిగాం.

“అప్పటివరకు సారా తాగడం ఒక దుర్వ్యసనమనీ, ఇది నలుగురు చూస్తుండగా చేసేది, ఎక్కడబడితే అక్కడ చేసేదీ కాదన్న దురభిప్రాయంలో ఉన్న ప్రజలకి మేం చాలా ప్రోత్సాహం అందించాం. ఇందుకోసం కింది స్థాయిలో ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పల్లెల్లో పట్టణాల్లో ప్రతి వీధికి తిరిగి ప్రచారం చేసిన సందేశం ఒక్కటే.

“వా.వా. సారాని దుకాణం దగ్గరే తాగనక్కరలేదు. ప్యాకెట్ కొనుక్కుని జేబులో పెట్టుకుని తీసుకుపోవచ్చు. ఎక్కడైనా చాటుగా తాగొచ్చు”

“అంతే! రిక్షాలు లాగేవాళ్ళు, కూలీ పనులు చేసుకునే వాళ్ళు, వా.వా. సారా ప్యాకెట్లు జేబుల్లో కుక్కుకుని తిరిగారు. ‘త్రాగడం ఎంత సులభం అని ఆఖరికి స్టూడెంట్లు సైతం.

“సారా వేలం పాటలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి నన్ను పిలిచి ప్రత్యేకంగా అభినందించారు”

ఇక ప్రస్తుతానికి వస్తే..

తెలంగాణలో అంటే ఒకప్పటి నైజాం సంస్థానంలో అసలు ఎన్నడూ  మద్య నిషేధం అనేది లేదు కాబట్టి ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ సారా, మద్యం గురించి రాజకీయ వివాదాలు లేవు. 1956 లో హైదరాబాదు సంస్థానాన్ని  ఆంధ్రప్రాంతంతో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేనాటికి ఆ నాటి ఆంధ్ర ప్రాంతంలో మద్య నిషేధం అమల్లో వుండేది. ఇది 1969 అక్టోబర్ ముప్పయి వరకు కొనసాగింది. ఆ ఏడాది నవంబరు ఒకటో తేదీ నుంచి ఆ ప్రాంతంలో కూడా మద్యనిషేధం చట్టాన్ని ఎత్తి వేశారు. అప్పటి నుంచి 1995 ఫిబ్రవరి ఇరవై వరకు ఉమ్మడి రాష్ట్రంలో మద్యసేవనం, అమ్మకాలపై ఎలాంటి నిషేధం వుండేది కాదు.  ఆ ఏడాది అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ నేతృత్వం లోని టీడీపీ, ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేయడంతో తెలంగాణా ప్రాంతంలో కూడా మద్య నిషేధం అమల్లోకి వచ్చింది. విప్లవాత్మకమైన ఈ నిర్ణయం వల్ల టీడీపీ ప్రభుత్వానికి మొదట్లో మంచి పేరు వచ్చినప్పటికీ, క్రమంగా పెరుగుతూ వస్తున్న మద్యం అక్రమ రవాణా వ్యాపారం ఆ పార్టీకి ముప్పుగా తయారైంది. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో మద్యం దొరుకుతూ వుండడం ఒక కారణం అయితే, అక్రమంగా తరలించే మద్యంతో రాత్రికి రాత్రే కోట్లకు పడగలెత్తుతున్న మాఫియా మరొక కారణం. తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో ముఖ్యమంత్రిగా పదవిని స్వీకరించిన చంద్రబాబు నాయుడు మద్య నిషేధం ఎత్తి వేయడానికి చాలా సంకోచించాల్సి వచ్చింది.

ప్రచారం ద్వారా ముందు ప్రజలను మానసికంగా సంసిద్ధులను చేయడం, తర్వాత నిర్ణయాలు తీసుకోవడం వల్ల పెద్దగా వ్యతిరేకత రాదు అనేది ఆయన నమ్మకం. సబ్సిడీ బియ్యం రేటు పెంచే విషయంలో, మద్య నిషేధం సడలించే విషయంలో కూడా ఆయన అదే పద్దతి అనుసరించారు. అంచేత మద్య నిషేధాన్ని పాక్షికంగా తొలగించే విషయంలో ముందు పత్రికా సంపాదకులు, ఇతర ప్రముఖులతో  సమావేశం అయ్యారు. అందులో ఊహించని ఓ ప్రశ్న ఎదురయింది. అప్పటికే డాక్టర్ల పర్మిట్లపై మాత్రమే  మద్యం కొనుగోలు చేసే  విధానం అమల్లో వుంది. కొందరు ఎడిటర్లు దీనికి తీవ్ర అభ్యంతరం తెలిపారు. దాంతో ఆయన ఈ విధానాన్ని కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఏ రూపంలోనూ మద్యం లభ్యం కాని పరిస్థితి ఏర్పడడంతో మద్యపాన ప్రియులు తల్లడిల్లిపోయారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం దొంగతనంగా రవాణా చేసి అధిక ధరలకు విక్రయించే మాఫియా రెక్కలు తొడిగింది. కొన్ని పత్రికల్లో ఈ వార్తలు ప్రముఖంగా చోటు చేసుకునేవి. ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉండబోదని నిర్ధారణకు వచ్చిన ముఖ్యమంత్రి మధ్యేమార్గంగా కొంత సడలింపులు ఇవ్వాలని నిర్ణయించారు. మహిళా సంఘాల నాయకులు విమర్శించారు కాని అది ప్రతిఘటన స్థాయికి చేరుకోలేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటి ఏడాదిలో తీసుకున్న అతి కష్టమైన క్లిష్టమైన  నిర్ణయాల్లో ఇదొకటి.

మద్యం మాఫియాకి తోడు మద్యం వల్ల వచ్చే ఆదాయం కోల్పోవడం వల్ల రాష్ట్ర ఖజానాపై పెను భారం పడడంతో, టీడీపీ అధికారంలోకి వచ్చిన తొలిరోజునే   నెరవేర్చిన ఒక ప్రధానమైన ఎన్నికల వాగ్దానానికి తొలి ఏడాదిలోనే  చెల్లు చీటీ రాయాల్సి వచ్చింది. ఖజానా మళ్ళీ కళకళలాడం మొదలయింది. ఆ తర్వాత వచ్చిన వై.ఎస్.ఆర్ ప్రభుత్వం కూడా మద్య నిషేధం జోలికి పోలేదు. ఆ తర్వాత ప్రభుత్వాలు అంతే!

2014లో  రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ లోని  ఆయా పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలో ఈ అంశంపై హామీలను బెల్టు షాపుల వరకే పరిమితం చేసుకున్నాయి. అయితే 2019 లో జరిగిన  ఎన్నికల్లో జగన్ మోహన రెడ్డి నాయకత్వంలోని వైసీపీ,  మద్యనిషేధం నినాదాన్ని  ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చింది. అధికార పీఠం ఎక్కిన తర్వాత కానీ వాళ్లకి కూడా  తత్వం బోధ పడలేదు. నవరత్నాల భారం అలవికి మించి పెరిగిపోతూ ఉండడంతో మద్యం ధరలు పెంచడం ద్వారా కొంత మేరకు లోటు పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మద్యనిషేధం హామీని  దశలవారీ మద్యనిషేధం అమలుకు తగ్గించి, అశ్వద్ధామ హతః కుంజర అనుకుని పాలన సాగిస్తున్నారు. ఎన్నికల హామీని వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ప్రతిపక్షాలు అనుదినం చేస్తున్న విమర్శలను పంటి బిగువున భరిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ అన్నట్టుగానే, నవరత్నాల హామీల  అమలుకు వీరికీ  డబ్బు కావాలి కదా! అది ఆకాశం నుంచి ఊడిపడదు కదా! ఎవరు ఏమనుకున్నా  మద్యం మీద వచ్చే ఆదాయమే  ప్రభుత్వాలకు పెద్ద దిక్కు. (రాజకీయ పార్టీల మనుగడకు కూడా అదే ప్రధాన వనరు అనేవాళ్ళు లేకపోలేదు)

ఏడాది ఆఖర్లో, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఒకే ఒక్కరోజున  మద్యం అమ్మకాలు నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అంటే మాటలా మరి.

కాబట్టి, కావున, చివరాఖర్లో చెప్పేది ఏమిటంటే మద్యనిషేధం నినాదం అనేది అధికారంలోకి రావడానికి రాజకీయులకి  ప్రధమ సోపానం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాన్నే పట్టుకు వేళ్ళాడ్డం అంటే వారికి కుదరని పని.

‘మీరు అదే చేశారు, మేమూ మీరు చేసిందే చేస్తున్నాం’ అని సమర్ధించుకోవడం ఒక్కటే మిగిలిన మార్గం. అదే చేస్తారు. చేస్తున్నారు.

తప్పా అంటే నైతికంగా తప్పున్నర. రాజకీయంగా కాకపోవచ్చు. 

ఎందుకంటే రాజకీయం, అధికారం ఇచ్చే మత్తు ఏ మద్యం ఇవ్వలేదు.



(EOM)

 

కామెంట్‌లు లేవు: