15, జనవరి 2022, శనివారం

నన్ను కోటీశ్వరుడిని చేసిన జెమినీ టీవీ - (పాత జ్ఞాపకం) - భండారు శ్రీనివాసరావు

 

ఈ రంగుల బెడదతో  నేనూ ఓసారి ఇబ్బంది పడ్డాను. జెమినీ టీవీలో జర్నలిస్టు శాయి ఎడిటర్ గా వున్నప్పుడు ప్రతి వారం ఒక రోజు వెళ్ళేవాడిని. జెమినీ వాళ్ళు ఆ ఒక్కరోజు నన్ను కోటీశ్వరుడిని చేశారు.

దాదాపు నలభయ్ ఏళ్ళయింది కోటు వేసుకుని. అదీ మాస్కో చలికోసం.

మళ్ళీ ఇన్నాల్టికి ఓ టీవీ పుణ్యమా అని కోటు వేసుకోవాల్సిన పని పడింది. బ్లూ మాట్ నేపధ్యంలో బ్లూ కలర్ అక్కడ నిషిద్దం. మామూలుగా షూట్ చేసే స్టూడియో కాకుండా వేరే స్టూడియోలో చర్చ పెట్టడం వల్ల నేను వేసుకున్న బ్లూ కలర్ బుష్ షర్ట్ అక్కడి కెమెరా కంటికి బొత్తిగా నచ్చలేదు. అంచేత అప్పటికప్పుడు వాళ్ళ వాడ్రోబ్ నుంచి ఒక కోటు తెచ్చి నాకు కప్పారు. చలికాలం బాగానే వుంది కానీ మాట్లాడింది రైతుల ఆత్మహత్యల మీద. ఆ చర్చాంశానికి ఈ కోటు అవతారం బొత్తిగా పొసగదని నాకనిపించింది. కానీ ఏం చేస్తాం విధికి తలవంచక తప్పలేదు.

అదృష్టం ఏమిటంటే మా ఆవిడ ఇటువంటి చర్చలు బొత్తిగా చూడదు. లేకపోతే ఈ చొక్కా మార్పిడి వ్యవహారం మా ఇంట్లో పెద్ద చర్చనీయాంశం అయ్యేది. మనలో మాట. ఆవిడ ఈ ఫేస్ బుక్ వైపు కూడా కన్నెత్తి చూడదు. (చూసేది కాదు) అదన్నమాట.(15-01-2022)

కామెంట్‌లు లేవు: