19, జనవరి 2022, బుధవారం

యూనియన్ – భండారు శ్రీనివాసరావు

 చదువుకుండే రోజుల్లో మొదటిసారి ఈ మాట విన్నాను. యూనియన్ అంటే  స్టూడెంట్స్ యూనియన్ అనుకునేరు.

ఆంధ్రపత్రికలో కాబోలు ఓ వార్త వచ్చింది. ఎల్.ఐ.సీ. (జీవిత బీమా సంస్థ)లో కంప్యూటర్లు ప్రవేశపెట్టాలనే యాజమాన్యం ప్రతిపాదన, యూనియన్ల వ్యతిరేకత కారణంగా బుట్ట దాఖలు అయిందని. అప్పటికి కంప్యూటర్ అనే పదమే తెలుగు నిఘంటువులో చేరినట్టు లేదు. ఎవరో కాని ఆ దార్శనికుడు, ఆ కాలంలోనే  కంప్యూటర్ గురించి  ఆలోచించాడు అన్నమాట. ఇనుప బీరువాల కన్నా పెద్ద సైజులో ఉంటాయని చెప్పుకునే వారు. కంప్యూటర్లు వస్తే పదిమంది పని అది ఒక్కటే చేస్తుందని, అంచేత తమ ఉద్యోగాలకు ముప్పు అని సిబ్బంది భయం. అప్పటికి కంప్యూటర్ అంటేనే తెలియదు కనుక యూనియన్ల భయం ఏమిటన్నది కూడా జనాలకు పట్టలేదు.

తర్వాత ఎప్పటికో దశాబ్దం తర్వాత, మొదటి ఉద్యోగం ఆంధ్రజ్యోతిలో చేరిన తర్వాత బీమా ఏజెంటు మాధవరావు గారి పుణ్యమా అని  నేనో ఎండోమెంటు  పాలసీ తీసుకున్నాను. పదేళ్లకో, పదిహేనేళ్లకో   మెచూర్ అయ్యే పాలసీ.  ఆ పాలసీ డబ్బులు తీసుకోవడానికి నేను  పడ్డ ఇబ్బందులు ఒకటీ రెండూ కాదు. పైగా డివిజినల్ మేనేజర్ల స్థాయి అధికారులతో మంచి పరిచయాలు వుండి కూడా నానా తిప్పలు పడాల్సి వచ్చింది. ఏ కాగితము ఒక పట్టాన దొరికేది కాదు. వెతికి పెట్టి కబురు చేస్తాం అని పంపించేవాళ్లు.

ఎవరు పాలసీ తీసుకున్నా  చిన్న వయసులో తీసుకుంటారు. ఎప్పుడో నలభయ్ యాభయ్ ఏళ్ళ  తర్వాత  పాలసీ డబ్బులు రావాలి. అప్పటిదాకా ఆ పత్రాలు పదిలంగా వుంచుకోవాలి. ఈ ప్రయాస లేకుండా ఆయనెవరో కంప్యూటర్లు అంటే ఆ ఆలోచన పడనివ్వలేదు. కాలక్రమంలో ఏం జరిగింది? ఇప్పుడు ఆ  సంస్థలో అన్నీ కంప్యూటర్లే. చకచకా పనులు జరిగిపోతున్నాయి.

అది ఏ సంస్థ అయినా  దాని  వినియోగదారులు తమకు దొరికే సేవలు గురించి ఆలోచిస్తారు. అక్కడ  పనిచేసే ఉద్యోగులు సంస్థతో  పాటు తమ గురించి కూడా అలోచిస్తుంటారు. సహజం కూడా.

ఒకప్పుడు హైదరాబాదు నుంచి రైల్లో వైజాగు పోవాలంటే రిజర్వేషన్ నేరుగా చేయించుకోవడానికి వీలుండేది కాదు.  చార్టులో పేరు రాకపోతే ఇంతే సంగతులు. కంప్యూటర్ల ప్రవేశంతో ఇప్పుడు దేశంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా టిక్కెట్టు కొనుక్కోవచ్చు. ఇలాగే ఎన్నో రంగాల్లో కంప్యూటర్లు మనిషి జీవనంలో వున్న సంక్లిష్టతలను బాగా తగ్గించివేసాయి.

అయితే,  ఒకానొక కాలంలో వీటికి ఉద్యోగ సంఘాల నుంచి గట్టి వ్యతిరేకత ఎదురయిన సంగతి బహుశా ఈ కాలపు సంఘాలవారికే తెలియకపోవచ్చు.

నేను పుష్కరం క్రితం యాక్టివ్ జర్నలిజం నుంచి బయట పడ్డాను కాబట్టి  బ్యాంకుల్లో ఇప్పటి పరిస్థితి పట్ల అవగాహన లేదు.

ఓ పాతిక ముప్పయి ఏళ్ళ క్రితం ప్రభుత్వరంగ  బ్యాంకుల్లో యూనియన్లదే రాజ్యం.

రేడియో విలేకరిగా నాకు అనేక బ్యాంకుల యూనియన్ నాయకులతో సన్నిహిత పరిచయం వుండేది. అలాగే బ్యాంకు యాజమాన్యాలతో కూడా. అంటే అత్యున్నత స్థాయి అధికారులు అన్నమాట.

ఈ నేపధ్యంలో  మా కుటుంబానికి బాగా దగ్గరైన వారి నుంచి ఆర్డర్ లాంటి అభ్యర్ధన వచ్చింది. వాళ్ళ అబ్బాయికి కొత్తగా పెళ్లయింది. అతడికి హైదరాబాదు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదులో ఉద్యోగం. అతడ్ని చేసుకున్న అమ్మాయికి కూడా అదే బ్యాంకులో ఉద్యోగం. కాకపోతే ఎక్కడో సుదూర గ్రామీణ ప్రాంతంలో. ఆ అమ్మాయిని కూడా హైదరాబాదుకు బదిలీ చేయించాలి. అదీ నా మీద పడ్డ భారం.

ఒకరోజు గన్ ఫౌండ్రీ లోని  బ్యాంకు హెడ్ ఆఫీసుకు వెళ్లి   మేనేజింగ్ డైరెక్టర్ ని కలిసాను. కాఫీ బిస్కెట్లు తెప్పించి మర్యాద చేస్తున్న ఆ పెద్దాఫీసరు, నా అభ్యర్ధన సంగతి  తెలపగానే కొంచెం అనీజీగా ఫీలయ్యారు. నన్ను వెంటబెట్టుకుని వెళ్ళిన బ్యాంకు పీఆర్వో  నన్ను బయటకు తీసుకువచ్చి, ఎండీకి చెప్పారు కదా! ఏదో విధంగా పని జరుగుతుంది లెండి అని హామీ ఇచ్చాడు. ఇస్తూనే  ఒక సలహా చెప్పాడు. బ్యాంకుకు రోడ్డు అవతలే యూనియన్ ఆఫీసు వుంది. ఎందుకైనా మంచిది, ఇక్కడి దాకా వచ్చారు కదా, వారి చెవిలో కూడా ఒక మాట వెయ్యండని  కర్ణుడి జన్మ రహస్యం నా చెవిలో ఊదాడు.

యూనియన్ నాయకులతో నాకు మంచి పరిచయం వుంది కానీ అసలు తాళం చెవి వారిదగ్గర వుందని అప్పటిదాకా నాకు తెలవదు. వెళ్లి కలిస్తే, వాళ్ళు అయ్యో ఇదెంత పని, ఇందుకోసం ఇక్కడి దాకా రావాలా అంటూ ఏదో ఫైలు చూసి ఆ అమ్మాయి మెంబర్ షిప్ తీసుకున్నట్టు లేదు, ఆ మాట చెప్పండి ఆమెతో. వచ్చే బదిలీల్లో తప్పకుండా అవుతుంది. ఆర్డర్ రాగానే ఫోన్ చేసి నేనే చెబుతాను అన్నాడు ఆ నాయకుడు. అన్నట్టే ఆ బదిలీ జరిగింది. ఆమె సభ్యత్వం తీసుకున్నదో లేదో తెలియదు. పని అయినందుకు నేను ఎవరికి కృతజ్ఞత చెప్పాలో తెలియలేదు. ఒక విషయం మాత్రం తెలిసింది. బ్యాంకు ఉద్యోగుల బదిలీల్లో యూనియన్లదే చివరి మాట.

అలాగని యూనియన్ల మీద నాకు చిన్న చూపేమీ లేదు. ఉదాహరణకు గ్రామీణ బ్యాంకుల్లో పనిచేసే సిబ్బందికి పేరెంట్ బ్యాంకు సిబ్బంది, అధికార్లతో సమానంగా జీతాలు పెరగడానికి, పెన్షన్ సౌకర్యం  ఏర్పడడానికి కారణం ఆ బ్యాంకుల  యూనియన్లు దశాబ్దాల పాటు చేసిన న్యాయపోరాటం అని  నాకు బాగా తెలుసు. వారి పేరెంటు బ్యాంకు స్టేట్ బ్యాంకులో పనిచేసే వారికన్నా ఎక్కువ పెన్షన్ వాళ్ళు  పొందుతున్నారు అంటే నమ్మడం కష్టమే. ఇదంతా యూనియన్ల చలవే. 

(19-01-2022)      

కామెంట్‌లు లేవు: