26, జనవరి 2022, బుధవారం

కాళన్న వద్దంటాడేమో! పీవీ గారి సందేహం – భండారు శ్రీనివాసరావు

 

పీవీ  నరసింహారావు గారు ప్రధానమంత్రిగా వున్న రోజుల్లో ఓ ఏడాది ప్రముఖ కవి కాళోజీ నారాయణ రావు గారిని పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించాలని అనుకున్నారు. ప్రధానే స్వయంగా నిర్ణయిస్తే అడ్డేముంటుంది? కానీ ఆ ఆటంకం ఏమిటో పీవీ గారికే  బాగా తెలుసు. తీరా ప్రకటించిన తర్వాత కాళన్న కాదంటే.

వరంగల్ జిల్లా ఎస్పీకి వర్తమానం వెళ్ళింది. వాళ్ళు విచారిస్తే కాళోజీ ఆ సమయానికి కమ్యూనికేషన్ సౌకర్యం లేని వూళ్ళో తిరుగుతున్నారు. ఓ పోలీసు  అధికారి వెళ్లి ఆయన్ని పోలేసు స్టేషన్ కు  రమ్మన్నారు.

కాళోజీకి పోలీసులు, పోలీసు పిలుపులు కొత్తేమీ కాదు. పదమంటూ పోలీసు వెంట బయలుదేరి వెళ్ళారు.

‘వచ్చారా! పీఎం గారు మీతో మాట్లాడతారట వుండండి’ అంటూ ఢిల్లీకి ఫోన్ లైన్ కలిపారు. పీవీ లైన్లోకి వచ్చారు. కాళోజీ గారితో కాసేపు పిచ్చాపాటీ మాట్లాడారు.

చివర్లో పీవీ ఇలా అన్నారు.

“కాళన్నా! నేనొకటి అడుగుతాను, నువ్వు కాదనుకుండా ఒప్పుకోవాలి”

‘అదేమిటో చెప్పు’ అన్నారు కాళోజీ.

‘అందుకే ముందే మాట ఇమ్మంటున్నాను. నువ్వు ఒప్పుకోవాలి అంతే!’ అన్నారు పీవీ.

‘...........’

‘నీకు ఈసారి పద్మ విభూషణ్ ఇవ్వాలని నా కోరిక. నువ్వు కాదు అనరాదు అన్నారు పీవీ.

‘..........’

‘కాళన్నా! నువ్వు సమ్మతి సమ్మతి సమ్మతి అని మూడు సార్లు చెబితేనే కానీ నేను ఒప్పుకోను

‘అయితే. నేను చెప్పేది కూడా విను. నాకేదో బిరుదు ఇచ్చారని  సర్కారుపై నా విమర్శలు ఆపేది లేదు. ఇది గుర్తుంచుకో అన్నారు కాళోజి విస్పష్టంగా. 

తర్వాత ఎప్పుడో  హైదరాబాదులో జరిగిన కాళోజి సత్కారసభకు నేనూ, జ్వాలా వెళ్ళాము. ఆ సభలో  మాట్లాడుతూ ప్రధాన మంత్రి శ్రీ పీవీ నరసింహారావు ఈ విషయాలు స్వయంగా గుర్తు చేసుకున్నారు.  

(26-01-2022)

కామెంట్‌లు లేవు: