పార్టీ మారినా మనసు మాత్రం మాతృపక్షం మీదనే అంటూ ఇప్పుడే ఓ టీవీలో ప్రోగ్రాం వచ్చింది. ఇది చూసినప్పుడు వెనుకటి విషయం ఒకటి జ్ఞాపకం వచ్చింది.
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు పూర్వం ఒక టీవీ
ఛానల్ చర్చలో పాల్గొంటూ బీజేపీ ప్రతినిధి వింత ప్రకటన చేసారు. తాను కాసేపు తన
పార్టీ విషయం మరచిపోయి, వైసీపీ అధికార ప్రతినిధిగా
మాట్లాడుతానని చెప్పి చర్చలో పాల్గొంటున్న మిగిలినవారినందర్నీ ఆశ్చర్య పరిచారు. టీడీపీ, బీజేపీ తగాదా తాత్కాలికమే అని, ఎన్నికల
తర్వాత మళ్ళీ ఈ రెండూ మిత్ర పక్షాలు అవుతాయని, ప్రస్తుత
కీచులాటలతో ప్రజల్ని మభ్యపెట్టి తిరిగి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తాయని
అన్నారు.
సరే! ఈ వ్యాఖ్య చర్చలో కాస్త వినోదం
పంచిన మాట నిజమే.
ఇదే విధంగా అన్ని పార్టీల వాళ్ళు పరకాయ
ప్రవేశం చేస్తూ తమ మనసులోని మాట బయట పెడుతుంటే ప్రజల్లో అయోమయాన్ని కాస్త
తగ్గించిన వాళ్ళవుతారని, అప్పుడు ఆ చర్చలో
పాల్గొంటున్న నాకూ అనిపించింది. ఆ మాట పైకే చెప్పాను కూడా.
కొసమెరుపు ఏమిటంటే ఎన్నికల తర్వాత ఆయన
చెప్పినట్టు బీజేపీ, టీడీపీ మళ్ళీ మునపటిలా మిత్రపక్షాలుగా
కలిసిపోలేదు కానీ, ఈ మాట చెప్పిన పెద్దమనిషి మాత్రం
వైసీపీ అధికార ప్రతినిధిగా అధికారికంగా మారిపోయారు.
మనవి: ఎవరీ మనిషి అని ఊహాగానాలు
అనవసరం. నాకు తెలిసి గత పదేళ్ళ కాలంలో మూడు, నాలుగు
సార్లు పార్టీలు మారిన అధికార ప్రతినిధులు వున్నారు. అధికార ప్రతినిధులుగా కొత్త
అవతారం దాల్చిన విశ్లేషకులూ వున్నారు. మారనిదల్లా ఆయా పార్టీల అభిమానులే.
Note: Courtesy Cartoonist
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి