ఆరోజు శుక్రవారం. అసెంబ్లీ భాషలో UNOFFICIAL DAY అంటారు. అంటే ఆరోజు ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ తర్వాత ప్రతిపక్షాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వుండదు. (అంటే మా బోంట్లకు పెద్ద పనేమీ వుండదు).
నేను ఆ రెండూ చూసుకుని ఎదురుగానే వున్న మా
రేడియోకి వచ్చి రిపోర్ట్ ఇస్తున్నాను. ఈలోగా మంత్రి రోశయ్య గారు మా న్యూస్
యూనిట్లోకి హడావిడిగా వచ్చి, ‘చూడు
శ్రీనివాసరావ్. రేపూ,
ఎల్లుండీ (అసెంబ్లీకి} సెలవు కదా! ఖమ్మంలో మా వాళ్ళు ఏదో ప్రోగ్రాం పెట్టారు. నేను
మళ్ళీ అయిదింటికి వస్తాను. ఖమ్మం వెళ్లి ఆదివారం ఉదయం కల్లా వచ్చేద్దాం. మీ ఊరే
కదా!’ అంటూ అంతే హడావిడిగా వెళ్ళిపోయారు.
సాధారణంగా నేను మధ్యాన్నం ఇంటికి వెళ్లి
భోంచేస్తాను. ఇక ఆ రోజుకి కామత్ హోటల్లో భోంచేసి ఫోన్ చేసి మా ఆవిడకు చెప్పాను,
ఖమ్మం వెడుతున్నాను,
ఎల్లుండి వస్తాను అని. ఆవిడ ఓ జత బట్టలు ఓ బ్రీఫ్ కేసులో సర్ది, పనివాళ్లకు ఇచ్చి,
మా ఆస్థాన ఆటో డ్రైవర్ (పిల్లల్ని స్కూలుకు తీసుకువెళ్ళే ఆటో) తో రేడియో స్టేషన్
కు పంపింది.
అన్నట్టే ఆ రోజు సాయంత్రం రోశయ్య గారు మా ఆఫీసుకి
వచ్చారు. నేను ఆయనతో కలిసి కారెక్కాను.
ఊరుదాటేంత వరకు రోశయ్య గారు ఏవో కబుర్లు
చెబుతున్నారు. కామత్ హోటల్ సాంబార్ భోజనం మహిమ ఏమో తెలియదు, నాకు
మాగన్నుగా నిద్ర పట్టింది. పైగా ఏసీ కారు.
లేచి చూసేసరికి కారు సూర్యాపేట దాటింది.
నాకు సిగ్గేసింది, ఆయన ఏమనుకున్నారో ఏమో అని.
కానీ ఆయన ఇవన్నీ పట్టించుకోలేదు.
అసెంబ్లీ వర్క్ కదా అలసిపోయి ఉంటావు అని
ఊరుకున్నారు.
ఇలాంటి ఉదాత్తులతో సన్నిహితంగా వ్యవహరించే అవకాశం
ఇచ్చిన ఆకాశవాణికి నమోవాకాలు.
Bellow
Photo: Sharing Dais with Shri Rosaiah
(02-12-2021)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి