గయలో శ్రాద్ధకర్మలు చేసిన పురోహితుల వారు అడుగుతున్నారు, మీకేది ఇష్టమో దాన్నిఇక్కడ వదిలిపెట్టండి అని.
కళ్ళల్లో నీటిపొర. ఎదురుగా వున్న మనుషులు మసగ్గా కనిపిస్తుంటే, అంతఃచక్షువులకు ఎప్పటెప్పటి సంగతులో
స్పష్టంగా కనిపిస్తున్నాయి.
చిన్నతనంలో
తనకు నెయ్యి అంటే తగని ఇష్టం. చారడు నెయ్యి అరచేతిలో పోస్తే కాని ముద్ద ముట్టేవాడు
కాదు. చిన్ని చిన్ని వేళ్ళని దగ్గరికి ముడుచుకుని, అరచేతిని గుంటగా చేసి అది నిండేదాకా
నెయ్యి పోయాలి. చేతి వేళ్ళ సందులనుంచి జారిపోయి గుంట నిండేది కాదు. మధ్యతరగతి
సంసారాల్లో ఇలా నేతివడ్డన ఎలా సాధ్యం. అయినా నేతి కోసం గుక్క పట్టి ఏడిచేవాడు. ఇది
పని కాదనుకుని చిన్న వెండి గిన్నె చేయించి అందులో నెయ్యి నింపి తన కంచం పక్కన
పెట్టేవాళ్ళు. అదేమిటో కొన్నేళ్ళకు ఆ
ఆలవాటు అదే పోయింది. నేతి మీది ఇష్టం తగ్గిపోయింది.
ఇలాగే
ఎన్నో ఇష్టాలు జీవితంలో భాగమై అవే మెల్లగా తప్పుకున్నాయి.
ఇప్పుడు
ఇన్నేళ్ళ తర్వాత ఏది ఇష్టం అంటే ఏమి చెప్పాలి?
మీరు
ఇప్పటిదాకా నాచేత నువ్వులూ,
నీళ్ళూ తర్పణాలు వదిలించిన నా భార్య అంటే ఇష్టం మాత్రం అలాగే మిగిలిపోయిందని, కానీ వదలడానికి వీలు లేకుండా ముందే ఆమె
నన్ను వదిలిపోయిందని ఆయనగారితో ఎలా చెప్పాలి?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి