5, డిసెంబర్ 2021, ఆదివారం

మరో రూపంలో మృత్యుక్రిమి – భండారు శ్రీనివాసరావు

 ఒమైక్రాన్ అనమంటుంది నిఘంటువు. కానీ ఒమిక్రాన్ అని డిసైడ్  చేసింది మీడియా. ఇప్పుడు ఒమైక్రాన్ అంటే మరో కొత్త వేరియంట్ వచ్చిందని పొరబడి, భయపడే  అవకాశం వుంది కాబట్టి ఒమిక్రాన్ తో నే సర్దుకుపోదాం.

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్ 19 అనే  భయంకరమైన  అంటువ్యాధి మన దేశంలో అడుగుపెట్టి మరో రెండు నెలల్లో రెండేళ్లు పూర్తవుతాయి. ఎక్కడో చైనాలో పొడసూపిన ఈ మామూలు కంటికి కానరాని ఈ  చిన్ని క్రిమి, సమస్త  విశ్వాన్ని చుట్టబెట్టడానికి పెద్ద సమయం తీసుకోలేదు.

కేరళలోని మూడు పట్టణాల్లో మొట్టమొదట  2020 మార్చి  30 వ తేదీన  ఈ కోవిడ్ వ్యాధిని గుర్తించారు. చైనా వెళ్లి వుహాన్ లో వైద్య విద్య అభ్యసిస్తున్న ముగ్గురు విద్యార్ధులు స్వదేశానికి వస్తూ వెంటబెట్టుకు వచ్చిన వ్యాధి, అతిత్వరలో భయంకర పరిణామాలకు మూలకారకం అవుతుందని అప్పట్లో వారికి తెలియదు. నిజం చెప్పాలి అంటే అసలు ఎవ్వరికీ తెలియదు.

తదాదిగా ప్రపంచంలో చోటు చేసుకున్న పరిణామాలు సినిమా రీలులా గిర్రున తిరిగాయి. 2020 మార్చి ఇరవై మూడో తేదీన దేశంలో తొలిసారి కేరళలో లాక్ డౌన్ విధించారు. అప్పటిదాకా ఈ పదాన్ని వేరే అర్ధంలో అర్ధం చేసుకోవడానికి అలవాటు పడిన వారికి లాక్ డౌన్ అమలు తీరు  అంటే ఏమిటో తెలిసి వచ్చి నివ్వెరపోయారు. ఆ తర్వాత రెండు రోజులకే విధిలేని పరిస్థితుల్లో  యావత్ భారతదేశంలో లాక్ డౌన్ విధించారు. దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ వంటి వాతావరణం కమ్ముకోవడం అదే మొదటిసారి కావడంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. నిజమే గత్యంతరం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.

ఎందుకంటే, ఈ కోవిడ్ వ్యాధి లక్షణాలు అంటే ఏమిటో తెలియదు. ఎలా వ్యాపిస్తుందో తెలవదు. నోటి నుంచి, శ్వాస నుంచి, అసలు మనుషులు ఒకరినొకరు తాకినా అంటుకుంటుందని ఇలా రకరకాల పుకార్లు షికారు చేశాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.  ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకి దిగింది. ఈ వ్యాధిని ఎలా నిర్మూలించడం అనే కన్నా, విస్తరించకుండా దీన్ని  ఎలా అరికట్టడం అనేది ప్రాధాన్యతా అంశంగా మారిపోయింది.

పెసరట్టు వేయాలంటే  పెసర పిండి కావాలి. పెసర పిండి కావాలంటే పెసలను నానబోసి రుబ్బాలి. పెసలు నానడం అనేది మనిషి చేతిలో లేదు. దానికి కొంత వ్యవధానం అవసరం. ఎంత డబ్బువున్నా, ఎంత అధికారం వున్నా పెసలని వున్నట్టుండి నానేలా చేయడం అసాధ్యం. కాబట్టి డబ్బుతో అన్ని పనులు సాధ్యం కావు’  అనే అర్ధం వచ్చే ఒక సన్నివేశం బాపూరమణల అందాల రాముడు సినిమాలో వుంది.

విస్తరిస్తున్న కరోనాని మట్టుపెట్టడం అనేది తమ ఒక్కరి చేతిలో లేదని అటు పాలకులకు, ఇటు పాలితులకు తెలిసివచ్చేటప్పటికి  చాలా పుణ్య కాలం గడిచిపోయింది. ఈ అంతుపట్టని రోగాన్ని అంతం చేసే వాక్సిన్ తయారు చేయడం అనేది ఏడాదిలోపే పూర్తి చేయడం భారత దేశం సాధించిన ఘనకార్యంగా చెప్పుకోవచ్చు.

ఈలోగా పులిమీద పుట్రలా  కరోనా రెండో దాడి మొదలయింది. మొదటిదే నయమనిపించేలా వుంది ఈ రెండోది. అసలు కరోనా గురించే జనాలకు సరైన అవగాహన లేదు అనుకునే తరుణంలో ఈ వ్యాధి గురించి రకరకాల కధనాలు ప్రచారంలోకి వచ్చాయి.

కలరా వంటి ఇతరేతర వ్యాధులు ప్రబలినప్పుడు ఆ వ్యాధి పీడితులకు బాసటగా వారి బంధుమిత్రులు వుంటారు. చికిత్సచేయడానికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు అనేకం అందుబాటులో  వుంటాయి. ఇవ్వడానికి వాక్సిన్లు, వాడడానికి  మందులు వుంటాయి. కానీ కరోనా విషయం పూర్తిగా విభిన్నం. ఈ వ్యాధి సోకిన లేదా సోకినట్టు అనుమానం ఉన్న రోగిని బాహ్యప్రపంచంతో సంబంధం లేకుండా, కుటుంబ సభ్యులను కూడా ముట్టుకోనివ్వకుండా వారిని   ఐసొలేషన్ గదుల్లో ఉంచాల్సిన పరిస్థితి. ఇన్ని రకాల  ఏర్పాట్లు చేయడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. మొదటి రెండు దశల్లో వ్యాధిని  గుర్తించి చికిత్స చేయగలిగితే ప్రాణ హానికి ఆస్కారం వుండదు. కానీ మూడో దశకు చేరుకుంటే ఇక ఆ రోగిని కాపాడడం కష్టం అన్నారు నిపుణులు. రోగి  చనిపోయిన తర్వాత కూడా సొంత కుటుంబ సభ్యులు తమ ఆత్మీయుడి శరీరాన్ని తాకలేని పరిస్థితి. సాంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించలేని దుస్థితి. ఈ స్థితి పగవాడికి కూడా రాకూడదు అని మౌనంగా రోదించిన కుటుంబాలు ఎన్నో! ఎన్నెన్నో!!

కరోనా పాజిటివ్ అని తెలియగానే సొంత మనుషులు, సాటి మనుషుల ప్రవర్తనలో నెగెటివ్ ధోరణి కనిపించడం మానవ మనస్తత్వానికి అద్దం పడుతుంది. ఈ సన్నివేశాలు అన్నీ ఎప్పుడో క్రీస్తు పూర్వం నాటివి కావు. ఏడాదిక్రితం వీటన్నిటికీ మనమే ప్రత్యక్ష సాక్షులం.

    

మిగిలిన అంటు వ్యాధులు వ్యాపించినప్పుడు బాహ్య ప్రపంచం అంతా మామూలుగానే వుంటుంది. ఆఫీసులు  పనిచేస్తాయి. దుకాణాలు, మార్కెట్లు తెరుస్తారు. రైళ్ళు, బస్సులు, కార్లు  విమానాలతో సహా అన్నీ మామూలుగా రాకపోకలు సాగిస్తాయి. ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం అతి స్వల్పంగా వుంటుంది. అదే కరోనా విషయం తీసుకుంటే పరిస్తితి వేరు. మనిషి నుంచి మనిషికి ఈ వ్యాధి  సోకే ప్రమాదం కారణంగా ఈ వైరస్ అతి త్వరితంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. అంచేత ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే స్వచ్చంద స్వీయ గృహ నిర్బంధం మినహా మరో దారి లేదు.

అందుకే, ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయే పెను ముప్పు ఓ పక్క  పొంచి ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు సాహసం చేసి లాక్ డౌన్ ప్రకటించాయి. ప్రజలు గుంపులుగా తిరుగుతూ, వారికి తెలియకుండానే ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధిని  సంక్రమింప చేసే ప్రమాదం ఉన్నందున, కర్ఫ్యూ వంటి తీవ్రమైన చర్యలను అమలు చేయాల్సిన పరిస్తితి కూడా దాపురించింది. మరో ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఈ రోగం శరీరంలో ప్రవేశించిన రెండు వారాల వరకు ఆ విషయం గుర్తించడం సాధ్యం కాదు. విదేశాల నుంచి వచ్చిన వారివల్లనే ఈ వ్యాధి వ్యాపిస్తోందని అంటున్నారు.

డాక్టర్లను, నర్సులను తాత్కాలిక ప్రాతిపదికన రిక్రూట్ చేసుకోవచ్చు. కానీ ఆక్సిజన్ ఎక్కడ నుంచి తెస్తారు. నిజానికి చుట్టూ వున్న గాలిలో ఆక్సిజన్ వుంటుంది. కానీ దాన్ని రోగులకు అవసరమయ్యే రీతిలో తయారు చేయడం, సరఫరా చేయడం  రాత్రికి రాత్రి సాధ్యమయ్యే పనా!  ఎంత అధికారం వున్నా, ఎన్ని వనరులు వున్నా, ఎంత చిత్తశుద్ధి వున్నా కొన్ని సాధ్యం కానివి వుంటాయి. వీటికి మంత్రదండాలు వుండవు. రెండో వేవ్ సమయంలో ఈ ఆక్సిజన్ కొరత వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు లెక్కలు చెప్పడం కష్టం.

భారత సైన్యంలో ఇఎంఇ అనే ఒక విభాగం వుంది. దాని ప్రధాన కార్యాలయం సికిందరాబాదు. రేడియో విలేకరిగా కొన్ని డజన్ల సార్లు ఈ విభాగం చేసే కార్యకలాపాలు దగ్గర నుండి చూసే అవకాశం నాకు లభించింది. సైన్యంలో ముందు భాగాన వుండి పోరాడే సైనికులకు అవసరం అయ్యే సరఫరాలను ఈ విభాగం కంటికి రెప్పలా కనిపెట్టి అందిస్తుంది. ఆయుధాలు, యుద్ధ పరికరాలు, వాటి నమూనాలు, అభివృద్ధి సమస్తం ఈ విభాగం ఆధ్వర్యంలో జరుగుతుంది. యుద్ధ రంగాల్లో అగ్రభాగాన నిలబడి పోరాడే సైనికులకు ఇది వెనకనుండి మద్దతు ఇస్తుంది. యుద్ధ సమయాల్లో దీని ప్రాధాన్యత చాలా వుంటుంది.

కరోనాపై యుద్ధంలో కూడా ముందుండి పోరాడే డాక్టర్లు, నర్సులు, ఇతర సాంకేతిక వైద్య సిబ్బంది, రోగులకు అవసరం అయ్యే సరఫరాలను సరిగా అందేటట్టు చూడడానికి ఇటువంటి ప్రత్యేక విభాగం ఆవశ్యకత చాలా వుందనిపిస్తోంది. ఈ దిశగా సరైన అడుగులు పడ్డాయా అంటే ఔను అని చప్పున జవాబు చెప్పడం కష్టం.

మళ్ళీ లాక్ డౌన్ మాటలు వినపడుతున్నాయి. తప్పనిసరి పరిస్థితి వస్తే తప్పదు కూడా. అయితే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకునే ముందు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోవడం అవసరం.

కిందటిసారి హఠాత్తుగా లాక్ డౌన్ ప్రకటించడం వల్ల సమాజంలో అనేక మంది, ముఖ్యంగా  రెక్కాడితేకాని  డొక్కాడని  బీదాబిక్కీ, వీధి వ్యాపారులు పలు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వలస కూలీలు. లాక్ డౌన్ కారణంగా పని దొరక్క, స్వగ్రామాలకు తిరిగి వెళ్ళడానికి రవాణా సదుపాయాలు లేక, సామాను నెత్తిన పెట్టుకుని  మైళ్లకు మైళ్ళు నడిచి వెళ్ళిన దృశ్యాలు ఇంకా జనం మనస్సులో పచ్చిగానే వున్నాయి. ఒకవేళ  లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి మరో సారి ఎదురయితే ఈసారి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని  వలస కూలీలు అందరూ  సొంత ఊళ్లకు వెళ్లి పోయేలా వారికి తగిన వ్యవధానం ఇస్తూ లాక్ డౌన్ ప్రకటించాలి. లేనిపక్షంలో. గతంలో చూసిన హృదయవిదారక దృశ్యాలే పునరావృతం అయ్యే ప్రమాదం వుంది.

సాధారణ మనుషులకు విషయాలను గుర్తు పెట్టుకోవడం సులభం కాదు. అన్ని విషయాలు దీర్ఘకాలం గుర్తు పెట్టుకోలేరు. అందుకే కాబోలు కొద్ది కాలం క్రితం కరోనాతో పడ్డ బాధలు, ఇబ్బందులు  అన్నీ మరచిపోయి నిర్లక్ష్యంగా వుంటున్నారు. కరోనా వ్యాధి సోకకుండా ఉపయోగపడే మాస్కులను ధరించక పొతే వెయ్యి రూపాయలు జరిమానాని అధికారులు ప్రకటించారు అంటే ఈ విషయంలో ప్రజల నిర్లిప్తత ఏ స్థాయిలో వుందో అర్ధం అవుతోంది.

కొద్దికాలం క్రితం తమ ఆత్మీయులను అర్ధంతరంగా పొట్టన బెట్టుకున్న ఈ భయంకర వ్యాధి వల్ల కలిగిన చేదు అనుభవాలను మరచిపోయి పెళ్ళిళ్ళు, పేరంటాలు, సినిమాలు, సభలు  అంటూ గుంపులు గుంపులుగా జనం ఒకచోట చేరడం చూస్తుంటే ఖచ్చితంగా చేసిన పొరబాటే మళ్ళీ చేస్తున్నారు అనిపిస్తోంది.

కొత్తగా కోరలు చాస్తున్న ఒమిక్రాన్ బారిన పడకుండా వుండాలి అంటే అప్రమత్తంగా వుండాలి. కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వాలు కూడా ప్రజలకు హెచ్చరికలు చేసే బదులు, లోగడ జరిగిన పొరబాట్లు పునరావృతం కాకుండా చూడాలి.

విదేశీ ప్రయాణీకులపై ఇప్పటికే అనేక దేశాలు ఆంక్షలు విధించాయి. మన దేశంలో ఇంకా తాత్సారం జరుగుతోందని అనిపిస్తోంది. నిన్న ముంబై నుంచి మాకు తెలిసిన కుటుంబం హైదరాబాదు వచ్చింది. నిలబడి ప్రయాణించడం మినహా మొత్తం విమానం అంతా ఒక్క సీటు ఖాళీ లేకుండా కిక్కిరిసిపోయి వుందట. కోవిడ్ నిబంధనలను పాటిస్తున్న దాఖలా లేదట. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంలా కాకుండా సంబంధిత ప్రభుత్వ శాఖలు కాలయాపన చేయకుండా ముందు జాగ్రత్త  చర్యలు తీసుకోవడం అవసరం.

ప్రభుత్వాల మీదనే నెపం  వేయకుండా ప్రజలు కూడా  తమ బాధ్యతను గుర్తెరిగి మసలు కోవాలి. వ్యాధిపై పోరాటంలో ప్రతి ఒక్కరు  భాగస్వాములు కావాలి.

ఇక్కడ కేంద్రమా, రాష్ట్రాలా అని కాదు, పాలకులు అందరికీ ఒకే విజ్ఞప్తి.

అనుభవాల నుంచి గుణ పాఠాలు నేర్చుకోకపోతే ఈ దేశాన్ని భగవంతుడు కూడా కాపాడలేడు.

(05-12-2021)   

కామెంట్‌లు లేవు: