11, డిసెంబర్ 2021, శనివారం

పక్కవారికి చెప్పేటందుకే......భండారు శ్రీనివాసరావు

 

ఈనాడు అనేక వర్గాల్లో ఒక విషయం పై విస్తృత చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జాతి జనులు అనుభవిస్తున్న అనేకానేక కష్ట నష్టాలకు, వాటిల్లుతున్న అనర్ధాలకు మంచివాళ్ళ మౌనమే కారణం అన్న వాదన మీడియాలో, ప్రత్యేకించి సోషల్ మీడియాలో సాగుతోంది.

సమాజంలో మంచివాళ్ళు, ప్రత్యేకించి మేధావులు అనే బుద్ధి జీవులు (మంచివాళ్ళందరూ మేధావులు కారు, మేధావులందరూ మంచివాళ్ళు కారు అని వాదించే వర్గం ఒకటుంది. అది వేరే సంగతి) మౌనాన్ని ఆశ్రయిస్తున్నారని, ఈ వర్గాలు నోరు మెదిపి దిశానిర్దేశం చేయగలిగితే, ప్రజలను సరైన ఆలోచనాపధంలో పెట్టగలిగితే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయనీ ఈ వాదనల సారాంశం. సమాజాన్ని పట్టి పీడిస్తున్న రాజకీయ అవినీతి పట్ల స్పందించాల్సిన విధంగా మేధావులు వ్యవహరించకపోవడం వల్లనే ప్రజలు అవినీతి, లంచగొండితనం వంటి సాంఘిక రుగ్మతల పట్ల నిర్లిప్తంగా ఉంటున్నారని ఆ సారాంశంలో దాగున్న భావం.

అనేకానేక రాజకీయ అవినీతులు, అధికార దుర్వినియోగాల విషయాల్లో, విశ్లేషకులు, మేధావులు తగు విధంగా స్పందించకపోవడం వల్ల, సాధారణ ప్రజల్లో కూడా అవినీతి ఒక చర్చనీయాంశం లేదా ఒక ప్రాధాన్యత కలిగిన విషయం కాకుండా పోతోందని వాదించే రాజకీయ నాయకులు చాలామంది కనబడతారు. దానికి కారణం ఒక్కటే. ఆ ఆరోపణలు చేసేవారికి కూడా తగిన నైతిక బలం లేకపోవడమే. ఎక్కువ, తక్కువ అనే తేడాను మినహాయిస్తే, అవినీతికి ఎవరూ అతీతులు కాకపోవడమే. అందువల్లనే సాధారణ ప్రజల్లో సయితం 'అవకాశం దొరికితే అందరూ అందరే ' అన్న భావం నానాటికీ ప్రబలుతోంది. 'బర్రెలు తినే వాడికంటే గొర్రెలు తినేవాడు మేలుకదా' అంటే అది వేరే సంగతి.

ఇది జరిగి చాలా ఏళ్ళయింది. 1987 లో అనుకుంటాను అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తన బాధ్యతలకు కొంత దూరంగా లక్షద్వీప్ లో సేద తీరేందుకు సకుటుంబ సపరివార సమేతంగా విహార యాత్రకు వెళ్ళడం ఆరోజుల్లో పత్రికల్లో పెద్ద దుమారాన్ని రేపింది. ఆయన బృందంలో గాంధీల కుటుంబ స్నేహితుడయిన సినిమా నటుడు అమితాబ్ బచ్చన్ కూడా వున్నారు.



అప్పుడు నేను హైదరాబాదు ఆకాశవాణిలో పనిచేస్తూ చిక్కడపల్లిలో అద్దెకు ఉండేవాడిని. విలేకరి ఉద్యోగం కావడం వల్ల ఇంట్లో ఫోను అవసరం జాస్తి. అది మూగనోము పట్టిన సందర్భాల్లో ఫోను అవసరం వచ్చినప్పుడు, దగ్గరలో వున్న ఒక ప్రభుత్వ అధికారి ఇంటికి వెళ్ళేవాడిని. మంచి నిజాయితీపరుడు అన్న పేరు ఆయనకు ఇంటాబయటా బాగా పేరుకుపోయివుంది. ఫోను కోసం వెళ్ళినప్పుడు అయన నన్ను కూర్చోబెట్టి పిచ్చాపాటీ మాట్లాడుతుండేవాడు. ఆయన భార్య బొంబాయిలో ఉంటున్న వాళ్ళ అమ్మాయితో ఎస్.టీ.డీ. లో మాట్లాడుతుండేది. ఆ సంభాషణ తెగే దాకా నాతో ఆయన ముచ్చట్లు కూడా కొనసాగేవి. అలా ఒకరోజు ఆయన నోటి నుంచి వచ్చిందే రాజీవ్ గాంధీ లక్షద్వీప్ యాత్ర గురించిన ప్రస్తావన. రాజీవ్ విహార యాత్ర ఆయనకు సుతరామూ నచ్చినట్టులేదు. 'ఎంత ప్రధానమంత్రి అయితే మాత్రం అలా ప్రభుత్వ ఖర్చుతో, స్నేహితులతో కలిసి ఇలా విలాస యాత్రలు చేయడం ఏం సబబు' అనేది ఆయన ఆవేదన. కానీ అదేసమయంలో ఆయన భార్య అరగంట నుంచి ఎస్టీడీలో ప్రభుత్వం సమకూర్చిన ఫోనులో మాట్లడుతున్నదేమిటంటే, పోయిన పండక్కి తాను కొనుక్కున్న చీరెల రంగులూ, వాటి అంచులు గురించిన వివరాలు, వాళ్ళమ్మాయి కొనుక్కున్న కొత్త చీరెల గురించిన ఆరాలు. తల్లీకూతుళ్ళ ముచ్చట్లు ఇలా అప్రతిహతంగా టీవీ సీరియల్ మాదిరిగా సాగిపోతూ ఉండగానే, ఆఫీసరు గారి డ్రైవర్, ప్రభుత్వ వాహనంలో ఆయన పిల్లల్ని తీసుకువెళ్ళి స్కూల్లో దింపి వచ్చాడు. లోపల అడుగుపెట్టాడో లేదో అయన నాతో మాటలు మానేసి, సుల్తాన్ బజారో, ఆబిడ్సో, గుర్తు లేదు, కారేసుకు వెళ్లి పలానా దుకాణంలో మాత్రమే దొరికే ఓ వక్కపొడి డబ్బా కొనుక్కు రమ్మన్నాడు. డబ్బులు ఇచ్చిందీ లేనిదీ నేను చూడలేదు. ఆ డ్రైవర్ వెళ్ళగానే మళ్ళీ అయన రాజీవ్ గాంధీ విషయం ఎత్తుకున్నాడు. 'ఇలా ప్రభుత్వధనం ఖర్చుచేయడానికి పద్దూ పాడూ అక్కరలేదా, హద్దూ అదుపూ ఏమీ లేదా ' అన్నది ఆయన ప్రశ్న. ఆఫీసరు గారి భార్య ఫోను సంభాషణ ఇంతట్లో తెమిలే అవకాశం లేదని గ్రహించి నేనే ఏదో సాకుచెప్పి బయటపడ్డాను.

ఇలాటి సంఘటనలవల్లనేమో తెలియదు కానీ, నాలో ఒక నమ్మకం పేరుకు పోతూ వచ్చింది. 'నీతులు చెప్పడం వేరు, వాటిని ఆచరించి చూపడం వేరు' అనే విశ్వాసం నాలో బలపడుతూ వచ్చింది. 'చెప్పేదానికీ చేసేదానికీ పొంతనవుంటేనే చెప్పేదానికి నిబద్దత వుంటుంద'న్న అభిప్రాయం క్రమంగా మనసులో గూడుకట్టుకోవడం మొదలయింది.

'మా పిల్లవాడు పంచదార తింటున్నాడు ఎలా మానిపించాలి' అని ఒక తల్లి ఓ స్వామీజీని అడిగితే మూడు రోజుల తరువాత తీసుకురమ్మని పంపించేస్తాడు. ఆ తరువాత వచ్చినప్పుడు 'బాబూ. పంచదార అలా ఎక్కువ ఎక్కువ తినడం వొంటికి మంచిది కాదు' అని హితవు చెబుతాడు. 'ఆ ముక్కేదో మొన్నే చెప్పవచ్చుకదా' అన్నది తల్లి సందేహం. 'చెప్పొచ్చు కానీ, నాకూ పంచదార తినే అలవాటు వుంది. ముందు నేను మానేసిన తరువాత కదా మీ పిల్లాడికి చెప్పాలి' అంటాడు ఆ స్వామి. ఎప్పుడో చదివిన ఇలాటి నీతి కధలూ, ఇలా ఎదురయిన సంఘటనలు మొత్తం మీద నా మనసుపై చెరగని ముద్ర వేసాయి.

'విమర్శించేవారు, ఆరోపణలు చేసేవారు కూడా సచ్చీలురుగా వుండడం అవసరం. లేకపోతే వాటికి నిబద్దత వుండదు. ఒక పక్క తాము అదే పనిచేస్తూ ఇతరులకు నీతి పాఠాలు బోధించడం ఎబ్బెట్టుగా వుంటుంది. కానీ, రాజకీయ నాయకులపై అవినీతి ఆరోపణలు చేసేవాళ్ళు అతి సామాన్యులు అయితే మాత్రం వాటిని వెంటనే పట్టించుకోవాలి..

నీతికీ, అవినీతికీ నడుమ పైకి కనబడని చిన్న గీత మాత్రమే విభజనరేఖ. ఓ మోస్తరు దుర్వినియోగం కొందరి దృష్టిలో నీతిబాహ్యం కాదు. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లూ, కార్లూ ఇందుకు ఉదాహరణ.

ప్రభుత్వ అధికారుల ఇళ్ళల్లో అధికారికంగా ఫోన్లు వుండడం కొత్తేమీ కాదు. ఆఫీసు వేళల్లో కాకుండా అవసరమైనప్పుడు పైవారు సంప్రదించడానికి వీలుగా ఈ సౌకర్యం వుంటుంది. 'సెల్ ఫోన్లు వచ్చిన తరువాత కూడా ఈ ఖర్చు అవసరమా' అని ఆర్ధిక శాఖలో ఒక ఉన్నతాధికారిని అడిగితే, ఆయన నుంచి చిరునవ్వే జవాబు.

ప్రభుత్వ వాహనాల దుర్వినియోగం గురించి యెంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వెనక అంటే ఓ నాలుగు దశాబ్దాల క్రితం ఒక వారపత్రికలో వచ్చిన కార్టూన్ నాకు బాగా గుర్తుండిపోయింది.

ఒక సినిమా హాలుకు జిల్లా కలక్టర్ గారు భార్యను తీసుకుని ప్రభుత్వ జీపులో వస్తాడు. (ఆ రోజుల్లో కలెక్టర్లకు కూడా జీపులే). జిల్లా వైద్యాధికారి అంబులెన్సులో వస్తాడు. పురపాలక శాఖ అధికారి ' మీ వీధులను మురికి చేయకుడి' అని రాసివున్న చెత్త లారీలో వస్తాడు. అగ్నిమాపక అధికారి ఏకంగా గంటలు మోగించుకుంటూ అగ్నిమాపక వాహనంలో వచ్చేస్తాడు.

కార్టూన్ లో కాస్త ఘాటు ఎక్కువ ఉండవచ్చు. కొంత అతిశయోక్తి కూడా ఉండవచ్చు. కానీ ప్రభుత్వ వాహనాల దుర్వినియోగానికి ఓ మేరకు అయినా అది అద్దం పడుతోంది.

ఇప్పుడు చెప్పండి నీతులు వున్నవి ఎవరికోసం? పక్కవారికి చెప్పడం కోసమేనా!

కామెంట్‌లు లేవు: