17, జనవరి 2016, ఆదివారం

ఆ తరం అంతమయింది


మెరిసే రంగురాళ్ళను, రత్నాలను కలిపి జల్లిస్తే,  జల్లెడలో మిగిలే ఏకైక మేలిమి రతన౦   ఈరోజు కన్నుమూసిన వీ.రామారావు గారు. నేటి రాజకీయుల్లో మళ్ళీ అలాంటి  వాళ్ళను చూడబోము.  ఆ ఉత్తమ శ్రేణికి చెందిన రాజకీయుల్లో బహుశా ఆయనే చిట్టచివరి వారు.
1978, 1984 లో శ్రీ రామారావు ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ కౌన్సిల్ సభ్యులుగా పనిచేసినప్పుడు రేడియో విలేకరిగా ఆయనతో నాకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. అవి చివరి వరకు కొనసాగుతూ వచ్చాయి.


రామారావు గారు సిక్కిం గవర్నర్ గా వున్నప్పుడు హైదరాబాదు వచ్చినప్పుడల్లా డార్జిలింగ్ టీ టిన్నులు తెచ్చి ఇచ్చేవారు. కుటుంబంతో కలిసి సిక్కిం రావాల్సిందని చెప్పేవారు కానీ నాకే వీలు కుదరలేదు. కానీ మా స్నేహితులు, చుట్టపక్కాల్లో ఎవరు వెళ్ళినా  సరే, ఫోను చేసి చెబితే చాలు,  వారికి అన్ని కనుక్కుని ఏర్పాట్లు చేసేవారు. హైదరాబాదు నుంచి ఫోను చేస్తే స్వయంగా లిఫ్ట్ చేసి మాట్లాడేవారు.
ఒకసారి మా కుటుంబంతో కలిసి రైల్లో రెండో తరగతి స్లీపరు బోగీలో పుట్టపర్తి  వెడుతున్నాము. మధ్యలో ఏదో స్టేషనులో ఎవరో ఎక్కారు. తీరా చూస్తే రామారావు గారు. ఆయన గవర్నర్ హోదానుంచి తప్పుకుని అప్పటికి కొద్దికాలమే అయింది.  రైల్వే అధికారి బెర్త్ ఇవ్వడం సాధ్యం కాదని అంటుంటే నేను వెళ్లి కల్పించుకుని ‘ఆయన ఎవరో మీకు తెలియదల్లే వుంది, మొన్నమొన్నటి దాకా గవర్నర్. కానీ ఆయన పదవిని వాడుకునే రకం కాకపోబట్టి మీకు తెలిసి వుండరు’ అని కాస్త డబాయింపుగా అన్నాను, రామారావుగారు ‘వద్దువద్ద’ని ఓ పక్క వారిస్తున్నా వినకుండా.
కాసేపటి తరువాత ఆయనకు వేరే బోగీలో బెర్త్ ఇచ్చారు. కానీ ఆయన మా వద్దే చాలాసేపు కూర్చుని  కబుర్లు చెప్పి వెళ్ళారు.
బీజేపీ కి చెందిన నారపరాజు రామచంద్ర రావు గారు ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేసినప్పుడు ఆశీస్సులు తీసుకోవడానికి రామారావు గారి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయనతో కలిసి నేను కూడా వారి ఇంటికి వెళ్లాను. వేడి వేడి  చాయ్ ఇచ్చి చాలాసేపు మాట్లాడారు. అదే రామారావు గారిని నేను ఆఖరి సారి కలవడం.
ఈరోజు వారు లేరనే వార్త.
ఆ తరం నేటితో అంతమయింది.

                   

కామెంట్‌లు లేవు: